కాల గణన

మహాభారతం – శాంతిపర్వం :

 కాల గణన గురించి ధర్మరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా భీష్మ పితామహుడు : వేదవ్యాసుడు తన కుమారుడైన శుకునకు వివరించిన క్రమాన్ని ఈ విధంగా తెలిపాడు                                     

                                పజ్జేనిమిది రెప్ప పాట్లు – ఒక కాష్ట

                                ముప్పై కాష్టలు            – ఒక కళ

                              మూడు వందల అరవై కళలు  – ఒక ముహూర్తం

                                ముప్పై ముహుర్తాలు – ఒక అహోరాత్రం

                                ముప్పై అహోరాత్రాలు  – ఒక మాసం

                                రెండు మాసాలు               – ఒక ఋతువు

                                ఆరు ఋతువులు    – ఒక సంవత్సరం

                        మూడు ఋతువులు  – ఒక ఆయనం – ఉత్తరాయణం/ అగ్ని/శుక్ల పక్షము   &

                                                                            దక్షిణాయనం /ధూమం /కృష్ణ పక్షము

                   “విద్వాంసులైన ” మానవులకు ఒక నెల  – పితరులకు ఒక రోజు

( ఇక్కడ “విద్వాంసులైన ”  అనే పదం వాడటాన్ని గమనించాలి. “రెప్పపాటు” తో మొదలైయ్యే కాల గణనం – సామాన్యులకు , విద్వాంసులకు – వేరుగా ఉంటుందని భావన చేయవలసి ఉంటుందేమో )

  మానవులకు ఒక సంవత్సరం  – దేవతలకు ఒక రోజు

 కృతయుగం   – 17,28,000    మానవ సంవత్సరాలు  – తపస్సు స్వభావంగా  కలిగి ఉంటారు

  త్రేతాయుగం  – 12,96,000       మానవ సంవత్సరాలు  – శ్రేష్టమైన జ్గ్యాన స్ఫూర్తి  స్వభావంగా

  ద్వాపర యుగం –  8,64,000     మానవ సంవత్సరాలు –  యగ్యం  స్వభావంగా

కలి  యుగం – 4,32,000 మానవ సంవత్సరాలు –  దోషాచరణము  స్వభావంగా  కలిగి ఉంటారు

  4  యుగాలు కలిస్తే   – ఒక మహాయుగం

                                          1000+1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు, రాత్రి

యుగం ఆద్యంత భాగాలను – సంధ్య – సంధ్యాంశము – అంటారు. So,

                 కృతయుగం   – 1,44,000    మానవ సంవత్సరాలు సంధ్య – సంధ్యాంశము

      త్రేతాయుగం  – 1,08,000       మానవ సంవత్సరాలు  సంధ్య – సంధ్యాంశము

      ద్వాపర యుగం – 72,000     మానవ సంవత్సరాలు  సంధ్య – సంధ్యాంశము

    కలి  యుగం     –   36,000     మానవ సంవత్సరాలు సంధ్య – సంధ్యాంశము

My understanding : 

ఈ సంధ్య సంధ్యాంశాలు మొత్తంలో సగభాగం – సంధ్య & సగభాగం సంధ్యాంశముగా తీసుకుంటే మొత్తం కలియుగ కాలం 4,32,000లో  18,000 + 18,000 =36,000 సం||యుగసంధి కాలంగా స్వీకరించాలి.

 యుగం నాలుగు పాదాలుగా భావిస్తారు. కనుకనే – సంకల్పంలో ” కలియుగే ప్రధమ పాదే” అనటం వింటుంటాము. కలియుగం మొత్తాన్ని 4భాగాలు చేస్తే – మొదటిపాదం 1,08,000 మానవ సంవత్సరాలు అవుతుంది . శ్రీ కృష్ణ జననం  5,110 సంవత్సరాల పూర్వం అన్న కధనం ప్రకారం – మనం ఇంకా యుగసంధిలోనే ఉన్నాం అనుకోవాలి.  కృష్ణ జననం కలియుగంలో అయ్యే అవకాశం లేదు కనుక, అవతార సమాప్తి నుంచి లెక్కించాలి. కృష్ణఅవతార ఆయుఃప్రమాణం 125 సంవత్సరాలుగా చెబుతారు. కనుక కలి ప్రవేశం జరిగి 5000 సంవత్సరాలు కంటే ఎక్కువ కాదు.

              ఈ  యుగ సంధి కాలమే ఇంకా  13,000 వేల సంవత్సరాలు ఉన్నది. సంపూర్ణంగా కలి ప్రవేశించినపుడు – దోషాచారమే ధర్మంగా విరాజిల్లుతుంది . అందుకేనేమో – కలియుగంలో సదాచారం, దయా , ధర్మం – కేవలం భావనచేత పుణ్యఫలం లభిస్తుంది అని ఋషివాక్యం .                                                               

               నారాయణ నారాయణ నారాయణ     

సుప్రభాతం

సుప్రభాతంబిదే సురలోక వంద్య ,
సుప్రభాతంబిదే సిరిమానో భాసా ,
సుప్రభాతంబిదే గోపాల బాలా ,
సుప్రభాతంబిదే గోదార్చితా హరి !!

సుగుణాభి రాముడని – సీతా మనోహరుడనీ,
కౌసల్య తనయుడని – కరుణా సముద్రుడనీ,
దశరథాత్మజుడనీ – దశకంఠ హారి యని,
ధరణి నడచినయట్టి నారాయణునికిదే –
సుప్రభాతం – సుప్రభాతం || సుప్రభాతంబిదే సురలోక వంద్య ||

గోపాల బాలుడని – గోపికా లోలుడని,
సురవైరి హారియని – సున్దరాకారుడని ,
దాసాను దాసుడని – ద్వారకాధీశుడని ,
గీతామృతమునొసగు గోలోకవాసికిదే –
సుప్రభాతం – సుప్రభాతం || సుప్రభాతంబిదే సురలోక వంద్య ||

కలి కలుషహారియని – కరిరాజ వంద్యుడని ,
తిరుమలాధీశుడని – తిరునామ పూజ్యుడని ,
వడ్డి కాసుల నెంచి పాలించువాడని ,
కన్నె గోదార్చనకు వరుడైన విభునికిదే –
సుప్రభాతం – సుప్రభాతం|| సుప్రభాతంబిదే సురలోక వంద్య||

సుప్రభాతంబిదే సురలోక వంద్య ,
సుప్రభాతంబిదే సిరిమానో భాసా ,
సుప్రభాతంబిదే గోపాల బాలా ,
సుప్రభాతంబిదే గోదార్చితా హరి !!

 కాలం

       మహాభారతం శాంతి పర్వం :భీష్ముడు ధర్మరాజుతో : తన ఐశ్వర్యాన్ని పోగొట్టుకుని వేరే జన్మలలో సంచరిస్తున్న బలి చక్రవర్తి ఇంద్రుడి ప్రశ్నకు : యగ్యాలు, వ్రతాలు నిర్వహించటం , శీలవంతుడై జీవించడం వంటి విషయాలు కాలగతిని మార్చలేవు . కాలగతికి అవి కారణాలు కాజాలవు  అని సమాధానం ఇచ్చాడు.

కాల గతులే గతులు – శూలికైన తమ్మిచూలికైనా !

రూపు గట్టిన పురుషుడందె కన్నియ రూపు,

రూపమెరుగనివాడు అంబికా పతి ఆయె !

కాలు మించినవారు కానరారు వినరారు ,

కాల గతులే గతులు – శూలికైన తమ్మి చూలికైనా !!

కశ్యప ప్రజాపతి భార్యలు – దితి , అదితి .

దితి – సంతానం దైత్యులు                                                

అదితి : సంతానం అమరులు / దేవతలు 

 ప్రహ్లాదుడి మనుమడైన బలిచక్రవర్తి ని అణిచి – ఇంద్రుడికి సింహాసనం ఇచ్చాడు శ్రీమహావిష్ణువు

దితి తపః ఫలముగా  ఉదయించినా రాజు ,   

అదితి సంతును కూల్చి అమరలోకము మెట్టి,

విబుధ జన సేవలను ఎంతగా చేసినా,

సురలోక వంద్యున్డు మన్నించ లేదే!!

మరుగుజ్జు యైబుట్టి మహిమ లెన్నోజూపి,     

అగ్రజుడె అధికుడని దితిపుత్రు నణగించి ,

యశము గాంచినవాని ఏమంచు మన్నింతు?

 కాల  గతులే గతులు ఏ కాలమందైన ,  

కటిక సత్యమనెరిగి మౌనమొందికను!!  

స్వర్గం లో ఉన్న పాండురాజుకి ” రాజసూయం” చేయటం వల్ల బ్రహ్మ లోక ప్రాప్తి కలుగుతుంది అని తెలిసి , నారద మునీంద్రుడి ద్వారా ధర్మరాజుకు “రాజసూయ యాగం” చేయవలసిందిగా కబురు పెట్టాడు. రాజసూయ యాగం వలన అపారమైన జన నష్టం జరుగుతుంది అని తెలిసీ, తండ్రి కోరిక మేరకు ధర్మరాజు ఆ మహా యజ్జ్యం చేసాడు

 బ్రహ్మ లోకము బడసి  భాసించవలెనంచు    

 వ్యాసనందను మదిన మొగ్గతొడిగిన కోర్కె ,

 విస్తరించొకనాడు కురుక్షేత్రము పొంగ ,

 కులము కూలెడి రణము రగిలిపోలేదా !

 ధర్మ రక్షణ యంచు ధాత్రీ మనోహరుడు,   

 ధర్మనందను ననుజు రధసారదై నిలిచి ,

కులము కూల్చెడి రణము నడిపించే లేదా!

కాల గతులకు తగిన కారణంబెరుగంగ,

తగదు నీకని తెలిసి మౌనాన మనము !!  

జప యజ్జ్య హోమాల శోభిల్లు భారతము,

రామ పాదము సోకి రంజిల్లు భారతము,     

మురళి మధురామృతము గ్రోలినీ భారతము ,

ఇనుప గొలుసుల నలిగి తెగటార లేదా !!

 కాలమంటని వాడు కాల అంబుధి  తేలి,  

 కలల ఊయల ఊత ఊరడిల్లుచు తనూ,

 ఉదయించు ఊహలకు ఉల్లాసమును పెంచ,

 ఊదునేమో గతులు కాల నర్తనకు !!

 ఊపిరందిన కాలుడుప్పొంగిపోవా!!

మాయకవ్వలి వాడు కాల వంద్యుడు వాడు,

నెపము లేకనె జగము లూహించు వాడు ,    

నేరమేమని నాది నగుబాటు జేసేను,

కాలు పదముల నలిగి వీగిపోవగ నేను !!

 వాహినై పరవళ్ల పరుగు తీసెడి  జాణ,

నూత్న రచనలు మొలువ నిన్న చెరిపెడి బాల,

నిత్య  యవ్వని తాను భూత భవితలు లేవు,

ఊహ ఉల్లాసాల ఉద్యానవని ఆమె !!

ఉప్పెనై ఉప్పొంగి పురము మించిన వేళ,

నియతి చేతల చితికి చెరిత సమసిన వేళ,     

పురము సోహాపు లయల సోలిపోయిన వేళ ,

కాల ఝుంకారాలు కుల పద్మముల చీల్చి ,

పురమూలమును జేరి భీతిగొలిపెడి వేళ!!

ఉదయించదా  లేత కరుణ కిరణంబొకటి ,

ఊహలుదయించేటి అవ్వాని ఉరములో !

ఏకాంత వాసమున విసుగుగొని  వేసారి 

ఉబుసుపోకకు తాను అల్లనెంచిన జగము, 

అల్లకల్లోలమై లయల లయమాయెనని!!

నగధరా వేగపడి నన్నేలు ఈ క్షణమే ,

కాల పద ఘటనమున నలిగి వీగకముందే!

కాల నర్తన వడికి ఒడిలి ఒరగకముందే !!

కమ్మి కాలుడు నన్ను కబళించి కొనముందే!!  

 

వసతి

ఈ భూమికి వచ్చే ప్రతి జీవికి తగిన వసతి కలిగించి గౌర వీస్తుంది భూమి . ఆ వసతి కేవలం ఈ భూమికే పరిమితం. అది ఏ నాడు సొంతం కాదు. భూమి అన్నింటిని recycle చేస్తూనే ఉంటుంది, దానికి తరుగు లేదు, పెరుగుదలా లేదు.

నీదికానీ వసతి తగిలించు బంధాలు ,
బంధనాలై నిన్ను బాధించుచున్నా,
మరలనెంచని మనసు మారాము నాలించి ,
మరచి మాధవు నీవు మననెంచ నెలా ?

అచ్చరలు కిన్నెరలు అమరేంద్ర పాలితులు ,
అలక అలుపులు దీర విడిది నెంచెడి నెలవు,
సుడులు తిరుగుచు తాను సూర్య చంద్రుల వెంట ,
పరుగు నెచటికో తాను పయనించు నెలవు !!

చేరవచ్చెడి వారి నాదరించగ తాను ,
తన తనువు చీల్చుకొని వసతిచ్చు నెలవు,
కొలువుండు కాలాన తన సోయగములన్ని ,
కొసరి కుడుపుచు మరుల నందించు నెలవు!

కొలువున్న ప్రతివారు కొలువు సొంతమనెంచి ,
వసతి వన్నెల తరుగు తలపోసి వగియగా ,
వాగువగా పనిలేదు కొండిదే కొత్తదని,
తలపులకు తగు వసతి మలచిచ్చు నెలవు !!

సుంకమడుగగబోదు సుంతైన నిన్నెపుడు ,
మారు వసతుల నొసగ విసుగొందబోదు !
సాటి వసతులవాని వైరి యని తలపోసి ,
వసతి కూల్చినగాని వైరమెంచని నెలవు!

ఆదరం బెంచి నిను ఎంత మన్నించినా,
తన తనూ రేణువుల తెగనాడదీ నెలవు!
పలుకరించే వారు పలుకనెంచనివారు,
తమ వసతులకువారు పరిమితంబగువారె!!

ఎంత చేరువ యైన పొరుగువారే వారు,
తమ వసతి సీమలను ఏనాడు విడలేరు,
కల్లలగు బంధాలె బాంధవ్యములనెంచి ,
చింత చెరసాలలన చేరుటెంచెదవేల !!

త్రిగుణ శృంగారాల మరగి మురిసే మనసు ,
వసతి జారిన నాడు ఒంటరై మిగిలేను,
మారు వసతుల జేర మందలించును నిన్ను,
మరలు దారుల దారి దరికైనా పోనీదు!!

మరలిపోవలె నీవు నేడైన రేపైన,
నెలవు కాదిదినీది తోడు లేరెవరిచట,
ఆనాటి నీ తోడే ఏనాటికిని జోడు
మనసు లాలన జెసి మరలించ తగదా!!

నీది కానీ వసతి తగిలించు బంధాలు ,
బంధనాలై నిన్ను బాధించుచున్నా,
మరల నెంచని మనసు మారామునాలించి,
మరచి మాధవు నీవు మననెంచనేల ?

కార్తీక మాసం 2023

గౌరీ మనోహర గంగా జటాధరా – హిమగిరి వాసా శంకరా !
వేడగ నీదరి చేరెడి వరాల – వేడుక దీరగ కూరిమి కురియర!!
గౌరీ మనోహర గంగా జటాధరా – హిమగిరి వాసా శంకరా !

తూలిన తనువుల సమిధల హోమము – వాసపు వాకిట వేడుక యాగము ,
కనవచ్చిన నీ దాసుల దయగని – పిడికెడు కచికల కొనిపోమ్మందువా ?
|| గౌరీ మనోహర గంగా జటాధరా – హిమగిరి వాసా శంకరా !||

సురలసురులు గొన వెరచిన గరళము – విందుగ పొందిన వేదవిహార ,
వెరపును బాపగ వేడెడి వారకు – పంక్తిన నీవదే పంచగ నెంతువా ?
|| గౌరీ మనోహర గంగా జటాధరా – హిమగిరి వాసా శంకరా !||

నాగాభరణము లురమున ఆడగ – కాలుని గతులకు జాతయగువాడా ,
నానా ఇడుముల మడియగ వేడిన – ఫణి హారములనే కానుక నిత్తువా?
|| గౌరీ మనోహర గంగా జటాధరా – హిమగిరి వాసా శంకరా !||

శివ శివ శివ యన శుభములు కురియర – శరణని వేడిన కరుణను జూడరా ,
మన్మధు గాంచిన కంటను గాంచకు – అనరులు బాపిక ఆదరమెంచర !
గౌరీ మనోహర గంగా జటాధరా – హిమగిరి వాసా శంకరా !
వేడగ నీదరి చేరెడి వరాల – వేడుక దీరగ కూరిమి కురియర!!
గౌరీ మనోహర గంగా జటాధరా – హిమగిరి వాసా శంకరా !

నాటి కవిత – లోని లోకం

ఈ కవిత 1980 ప్రాంతంలో రాసుకున్నది , math notebook చివరి page లలో రాసుకున్నది. ఆ పుస్తకం జాగ్రత్త చేసేడు నా పెద్ద తమ్ముడు … జీవితంలో నేను ఎంత ఎదిగానో ఎదో ఒక రోజు చూసుకుంటాను అనుకున్నాడేమో ..

కనిపించే ఈ లోకం – కనిపించని ఆ లోకం,
కలలోనే కవ్వించే కమ్మనైన సుమ రూపం,
నాలోనే ఒదిగుందట – ఎదిగిందట నాలోనే !!

కమలాలకు ప్రాణమిచ్చు – కమల విభుని (భవుని) పసి రూపం ,
కమలాసన మందు నిలచి ప్రాణమిచ్చు పతిరూపం,
కమల నయనుని మోము వెదజల్లెడి దరహాసం ,
( కమలాక్షుని ముఖబింబము వెదజల్లెడి దరహాసం ) ,
కమల హాసముతోన భాసించెడి ఆ తరుణం –

ఒదిగుందట నాలోనే – ఎదిగిందట నాలోనే !!

కలువ కన్నులలోన ప్రతిఫలించే వాడు ,
నిసి రాత్రి కొలనులో ఆటలాడే వాడు,
జిలుగు తరాల వెంట పరుగు తీసేవాడు ,
జగములను లాలించి నిదురపుచ్చేవాడు !

 నాలోనే ఉండేనట  - నాలోనే  ఎదిగేనట !!

దేవతలు దానవులు – అమరులై నచ్చరలు,
రూపు దాల్చిన వారు – రేపు తెలియని వారు,
యోగ భోగములన్ని సన్యసించిన వారు,
ముని పుంగవుల మనసు భావించు రూపాలు !!

ఒదిగున్నవట లోన – ఎదిగెనట నాలోనే !!

విడిది

నిలుకడెరుగని జగతి రహదారి తీరాన,
నిలువగా నీకింత నీడనిచ్చేనంచు,
అలసిపోయినవేళ అతిథివై చేరేవు,
ఆదమరువకుమోయి అర నిముషమైనా!!

నీటి నురుగుల బొమ్మ – నిలువెత్తు బొమ్మ,
గాలి నడయాడగా నడిచేటి బొమ్మ!!

అవధిలేనాకాశము తన కొంగులో గట్టి,
మెరిసేటి సెలయేటి దరహాసముల కొమ్మ!
ఎదనిండ ఆకాశపు నునుపు చెక్కిళ్ళలో ,
తన సోయగములెంచి మెరిసేటి రెమ్మ !!

నీటి నురుగుల బొమ్మ – నిలువెత్తు బొమ్మ,
గాలి నడయాడగా నడిచేటి బొమ్మ!!

రవి కిరణ కణికలను రవ్వలన్నీ దూసి ,
లోనున్న ఆకాశపు లోగిళ్ళలో నింపి ,
ఉడికించి ఊరించి చిరుగాలినురికించి,
పొంగి పంతములాడు పసలేని బొమ్మ !!

నీటి నురుగుల బొమ్మ – నిలువెత్తు బొమ్మ,
గాలి నడయాడగా నడిచేటి బొమ్మ!!

తనది తానను తలపు తనువంత నిండగా ,
బంధాలు వైరాలు బహుళమై పొంగగా ,
ఆటుపోటుల ఆట అలుపెరుంగక ఆడి,
అణిగిపోయొకనాడు నీటమునిగే బొమ్మ !!

నీటి నురుగుల బొమ్మ – నిలువెత్తు బొమ్మ,
గాలి నడయాడగా నడిచేటి బొమ్మ!!

నికడెరుగని జగతి నిలువనెన్నగబోకు,
సావధానమునొంది సరిదారి శోధించు ,
తరలిపోయెడివారు తండోపతండాలు ,
జగతి నిలుపగబోదు జాడలొకరివియైన!!

తుదిలేని పయనాన తరలనెంచితివేలో,
తరలగా ఇచటేమి దారి జాడలు లేవు,
లోనున్న నీ అహమె ఆది వెలుగనియెంచి ,
కనుల నింపుక నీవు నీదారి నల్లుకో !!

తుదిమొదలు లేనట్టి వింతైనదీదారి ,
నడకెంత నడిచినా తరిగిపోదీదారి ,
అలసటోందుట మాని నిలకడెంచితివేని,
తనకు తానే తరిగి తుది జేర్చునీదారి !!

నిలువరింపుము ఓయి భవ బాటసారి ,
నీలోని నిటలాక్షు ఉనికి నెరుగంగా!
పూరకంబువు నీవు పరిపూర్ణుడట వాడు ,
పయనమెచటికి ఇంక పొందగానేమి ? .

సవిత మది పలుకు

ఈ కవిత నేను డిగ్రీ చదివే రోజులది (1970-80) అయుండాలి. ఆ పుస్తకం ఆఖరి పేజీ లో ఉంది. ఈ పాత కవితలు చూసినప్పుడు , మా తమ్ముడు వీటిని ఎందుకు నా పుస్తకాలు వెతికి వెతికి వీటిని జాగ్రత్త చేశాడా , అనిపిస్తుంది. ఆ కవితలు నేను ఎదగ లేదు అని నాకు చెబుతున్నట్టు అనిపిస్తుంది ……

 సవిత మదిలో పలుకు తేట పలుకుల వాడ,

        నీ పలుకు పూమాల తుమ్మెదను ననుజేయి !!

కలుష హారిణి యైన గంగా స్రవంతి లా ,

నాకల నంటేటి  హిమవన్నగంబు లా ,

వెన్నెలకు పొంగేటి కడలి హృదయంలా ,

మన్మధుని కౌగిటిన మెరిసేటి వానిలా  !

సవిత మదిలో పలుకు తేట పలుకుల వాడ,

        నీ పలుకు పూమాల తుమ్మెదను ననుజేయి !!

శంకరుని గళములో పలికేటి సృతులలా, ( సృతులు : శబ్దములు/అక్షరాలు )

గోపబాలుని పెదవి పలికించు మురళిలా ,

శ్రీ శారదా దేవి మీటేటి వీణలా ,                

( మహతి పలికెడియట్టి మధురంపు స్వరములా )

పద్మాసనుని ముఖము పలుకు వేదములా!!

సవిత మదిలో పలుకు తేట పలుకుల వాడ ,

                          నీ పలుకు పూమాల తుమ్మెదను ననుజేయి ()

        మాతృ వాత్సల్యముతో  లాలించు తల్లిలా ,

        సత్ప్రవర్తన నేర్పి పెంచేటి తండ్రిలా ,

        జ్ఞాన దానంబిచ్చి దీవించు గురువులా ,

        బ్రతుకు బాటన తోడు నిచ్చేటి  ప్రియుడిలా !

 సవిత మదిలో పలుకు తేట పలుకుల వాడ ,

                       నీ పలుకు పూమాల తుమ్మెదను ననుజేయి ()

         ప్రళయ తాండవమాడు నటరాజు పాదముల,

         యుగసంధి వేళలో కనువిప్పు క్రియలలా ,

         కల్లోలమును రేపు వికృతలోచనలలో ,

          సద్బోధనల జేసి దరిజేర్చు విభునిలా !

                             సవిత మదిలో పలుకు తేట పలుకుల వాడ ,

                             నీ పలుకు పూమాల తుమ్మెదను ననుజేయి ()

        జగదాంబ మదిలోని పూర్ణస్త్రీత్వములా ,

       సత్వ భాసితమైన సత్య తేజములా ,

        జగదేక తేజమగు స్వచ్ఛ ప్రణవములా ,

       గుణరహితమైనట్టి పరమాత్మ గీతిలా !!

                              సవిత మదిలో పలుకు తేట పలుకుల వాడ ,

                              నీ పలుకు పూమాల తుమ్మెదను ననుజేయి ()

గాలిపటం

నీలి నింగిన సాగి మబ్బు గుబురుల దూరి ,
యశము గాంచితినంచు ఉప్పొంగి ఎగిరేను,
దారి తెన్నులు లేని గగన తలముల తరలి,
తొలుత లేనొక దారి పరుగు పరుగున సాగు!!

జిలుగు పటమును నేను గాలిపటమును నేను!!

అంచులేనంబరపు తళుకు తీరములన్ని ,
తనపాద ముద్రతో తరియింప చేతునని ,
నింగి ముంగిట తానె గురుతులెన్నో నింపి ,
రంగవల్లుల జిలుగు రచియింతునని ఎంచు !!

జిలుగు పటమును నేను గాలిపటమును నేను!!!

జిలుగు పటమును నేను గాలిపటమును నేను,
నీ చేతి సూత్రమున నాగతులు గలవన్న ,
ఎరుక ఏమరినేను ఏదారి తిరిగినా ,
విడువబోకాయ నన్ను ఏమరిచి ఎపుడైనా!!

గర్వించి గగనాన సంచరించే వేళ,
నాదన్ను నీచేతి దారమని మరిచేను,
కవ్వించు పంతాల కసి మిసిమి నొందగా ,
వెన్నంటినా ఊత విడువగా నెంచేను!!,

కలువ కన్నుల వాని కరుణ కాసారమున,
తగిలి మెలిగెడి వసతి బంధమని తలపోసి,
వీడి వెడలగ నెంతు మోహమాయను చిక్కి,
క్రుంగనీకయ నన్ను నీకరుణ బరి నుంచి !!

చెలిమి వీడకుమయ్య చెపల చిత్తము నాది,
చెంత చేర్చుక నన్ను చెలువార సవరించి ,
ఎరుకపరచవె నాదు ఏలికవు నీవెయని ,
ఏమరచినానేను ఏమరక యుందువని !!

జిలుగు పటమును నేను గాలిపటమును నేను,
గగన తలమున సాగ నీ యూతే నిక్కమను,
నిజము మరచిన నేను భ్రమల తేలినగాని,
భ్రమల భోగమునందు నను వీడి జనబోకు !!

జిలుగు పటమును నేను గాలిపటమును నేను!!!!!

పూవు లేని పూజ

పూవు లేనీ పూజ – పదములల్లిన పూజ ,
మనసు మౌనమునుంచి మొలచినీ పూజ ,
పలుమారు తలపోయ తరుగుటెరుగని పూజ ,
తలుపవే మన్నింప ముని మనోరమణా !!

మనోవీధిన మెదలు నీ భావ సంగతులే
ఆవాహనంబంచు అరుదెంచ మందు !
భావాల పాదులే (నీకు) కనకాసనంబంచు ,
అర్పించి నిను వసతి కూర్చుండమందు !!

పూవు లేనీ పూజ – పదములల్లిన పూజ ,
తలుపవే మన్నింప ముని మనోల్లాసా!

పాప పుణ్యపు చింత పలుమారు తలపోయ
పొగిలి మనసున పొంగు చినుకులన్ని,
కలశమందున జేర్చి పాద్యమిదె గోనుమంచు
నీ పాదముల యందు కుమ్మరింతు !!

పూవు లేనీ పూజ – పదములల్లిన పూజ ,
తలుపవే మన్నింప ముని మనోల్లాసా!

ప్రేమ నిండిన పలుకే సురగంగ చినుకంచు ,
అర్ఘ్యమని నీ కరము సేవించు కుందు,
మమత నిండిన ప్రేమ ఆ పలుకులో నిండ,
ఆచమన తీర్ధమని నీకు అర్పింతు !!

పూవు లేనీ పూజ – పదములల్లిన పూజ ,
తలుపవే మన్నింప ముని మనోల్లాసా!

ముసురు మోహపు పొరలు పెకలించి పలుమారు
వసతి వస్త్రమనెంచి వొసగేను నీకు !
మనసు చిలికే కళలు పన్నీటి కడవలని,
అభిషేక స్నానమున కర్పింతు నీకు !!

పూవు లేనీ పూజ – పదములల్లిన పూజ ,
తలుపవే మన్నింప ముని మనోల్లాసా!

మలిగిపోయిన కలల కాటుకను అందించి,
మొగ్గ తొడగని ఆశ అగరు గంధమునిచ్చి ,
మొలక ఉహల మంచి ముత్యాల సరులిచ్చి,
శృంగార మమరింతు సిరి మనోల్లాసా !!

పూవు లేనీ పూజ – పదములల్లిన పూజ ,
తలుపవే మన్నింప ముని మనోల్లాసా!

చెదరి పోవని కలలు, చేరవచ్చే కలలు,
చిగురు చిగురున వగపు చిందించు కలలు,
నదురు బెదురూ లేక కవ్వించి కవ్వించి,
కనుల గట్టకె తొలగి కరిగేటి కలలు !

చేరి చెంతన నిలిచి చెలిమి చేసే కలలు,
చేజారి జాలిగా అనునయించే కలలు,
అందజేసెడి తళుకులద్ది చేసిన నగలు ,
అందముగా అమరింతు ఆనంద నిలయా !!

పూవు లేనీ పూజ – పదములల్లిన పూజ ,
తలుపవే మన్నింప ముని మనోల్లాసా!

ఉనికే ఉల్లాసముగ ఉరేగు భావాలు,
నాడు నేడుల మధ్య నలిగేటి భావాలు,
పడుగు పేటగ నేసి పట్టు వలువగ జేసి,
అర్పింతు నే నీకు వసుధజన పోషా!!

పూవు లేనీ పూజ – పదములల్లిన పూజ ,
తలుపవే మన్నింప ముని మనోల్లాసా!

నీ ఉనికిగా నాకు సంతరించిన వన్ని,
నైవేద్యముగ నీకు అర్పింతునయ్యా !
నీ వైరి నాలోన చాటు మాటున దాగి,
రగిలించు తామాసపు హారతిని గొనుమా !!

పూవు లేనీ పూజ – పదములల్లిన పూజ ,
తలుపవే మన్నింప ముని మనోల్లాసా!

నిత్య సంతుష్టుడవు నీకేమి తరుగయ్యా ,
నీదె నీకర్పించగా తెరవీయ వయ్యా !!
ముని మానసోల్లాస మరుగేల నయ్యా,
మారాము చాలించి పూజందు మయ్యా !!

పూవు లేనీ పూజ – పదములల్లిన పూజ ,
మనసు మౌనమునుంచి మొలచినీ పూజ ,
పలుమారు తలపోయ తరుగుటెరుగని పూజ ,
తలుపవే మన్నింప ముని మనోరమణా !!