28th 2023

ఆగస్టు 27రాత్రి 65 సంవత్సరాల క్రితం నాయీ శరీరం తెనాలి లో భూమి మీద safe landing అయింది .. అప్పటి నుంచి పెరిగి పెరిగి ఇప్పుడు ఇంత పెద్దది అయింది , ఇంకా ఎంత పెద్దది అవుతుందో ….

చెదిరి పోవని కలలు చిగురు తొడగని కలలు ,
సమయ సాగర గతుల సొగసు సోయగమందు ,
సుతిమెత్తగా ఒదిగి సుడులెన్నో సృజియించి ,
ఒదిగిపోయిన గురుతు తనువు వయసుగ మారె !!

అందబోయిన బలిమి ఆదరించని కలిమి,
అడుగడుగు ముందడుగు ఎరుకలేనీ నడక ,
నిలకడెరుగని పరుగు నెమ్మదించని మనసు ,
అలుపు దీరగ ఒదిగి తనువు వయసుగ మారె !!

కనుల మాటున దాగి తొంగిచూసే వాడు,
చూపుగా నాకనుల కొలువుదీరెడి వాడు ,
చూపాను ప్రతిమలను తేలియజేసెడి వాడు ,
అలసి సొలసిన తీరు తనువు వయసుగ మారె !!

తోడుతెచ్చిన ముంత తరిగెనో పెరిగెనో,
ఎరుక తెలిపెడివారు ఎన్నగా కనరారు !
ముంత భారము దీర్చ మరులెన్నొ జతజేసి,
మరువ నెంచని స్మృతులు తనువు వయసుగ మారె !!

తీరు ఆయువు జేరి పెరిగి పోయెను వయసు,
తీరనేలేదాయ తనువు తలచిన కలలు ,
చింకి తనువున జేరి చింతించు వాడొకడు ,
చీకు చింతా లేక కునుకు మరుగున ఒరుగు!!

ఉలికిపడి ఏనాడో నిదుర మానును వాడు,
తనువు తలుపులు తీసి తనదారి తరలేను,
గూడు చెదిరిన నేను గుబులుగొని గతిలేక,
తోడు నడతును వాని నేడైన రేపైన !!

భువిన నడచిన నాడు నన్ను సాకిన వారు ,
తనువు తోడుగనుండి చెలిమి పంచిన వారు,
తపోప్పు తలుపకే తగిలి యుండిన వారు
తరలిపోయే నన్ను తలచి వగతురో ఏమో!!

వగువగా పనిలేదు వేరుదారులు మనవి,
మనవి చేతును మీకు పలుమారు ప్రియమార ,
గూడు చెదిరిననాడు చేరు గూడులు వేరు,
వింత లోకపుతీరు తెలిసి మసలుటె మేలు !!

అదో – ఎదో

నేను ఈ కవితని 1980 లో రాసుకున్నాను …. మా పెద్ద తమ్ముడికి ఎందుకో ఇది చాలా నచ్చింది. నిజానికి ఈరోజు ఇది దొరకడానికి వాడే కారణం . అక్కడక్కడా రాసిన కాగితాలన్నీ వాడు జాగ్రత్త చేసాడు,

చేతిలోని గాజుబొమ్మ – అడిగినప్పుడిచేస్తే – అదోరకం !
చేయిజారి నేలకొరిగి చితికి ముక్కలైపోతే – ఎదోరకం !!

విచ్చుకున్న విరిబాలలు – పిలచి విందునిస్తుంటే – అదోరకం!
కొసరి కసిరి తుమ్మెద తా – పూతేనియ గ్రోలుతుంటె – ఎదోరకం !!

మాయలోని మర్మమెరిగి – మూగవోలె మిన్నకుంటే – అదోరకం!
ఈలోకపు పరుగువెంట -ఉరకలేక ఊరుకుంటే – ఎదోరకం !!

సత్తులోని మహిమనెరిగి – కర్మలాచరిస్తుంటే – అదోరకం!
ప్రతీక్షణం ఫలం తలచి – కర్మలు నెరవేర్చుతుంటే – ఎదోరకం!!

వారణాసీ విభుడ

కాశీ లో పరమేశ్వరుడికి అభిషేకం చేసుకున్నప్పుడు – చదివాను

2023 – గంగా పుష్కరాలు

భిక్షమందిన బువ్వే – రుచుల నైవేద్యంబు ,
చితిమంట చిటపటలె – వేద గానపు లయలు,
వైరమెరుగనివాడ వారణాసీ విభుడ,
బ్రతుకు వెరపును మాపి – మము మనుపు మయ్యా !!

వందనంబిదె నీకు – మునిగణార్చిత వరద ,
వందనంబిదె నీకు – కైలాస నగ వాస,
వందనంబిదె నీకు- గౌరీ మనోహారా ,
వందనంబిదె నీకు- గిరికన్య సేవితా,
వందనంబిదె నీకు- గణరాజ వందితా, వందనంబిదె నీకు- ఫణిరాజ భూషణా ,
వందనంబిదె నీకు- సురసేన పతి వినుత,
వందనంబిదె నీకు- నందీశు వల్లభా ,
వందనంబిదె నీకు- ప్రమథగణ సేవితా,
వందనంబిదె నీకు- సురవైరి సన్నుతా,
వందనంబిదె నీకు- సురగంగ సేవితా ,
వందనంబిదె నీకు- నాట్యకళ నాయకా ,
వందనంబిదె నీకు- భవజలధి తారకా ,
వందనంబిదె నీకు- భవపాశ నాశకా ,
వందనంబిదె నీకు- భువనైక పోషకా ,
వందనంబిదె నీకు- అంబికా వల్లభా ,
వందనంబిదె నీకు- ఆద్యంత రూపకా ,
వందనంబిదె నీకు- త్రిపురాంతకేశ్వరా ,
వందనంబిదె నీకు- త్రిజగన్మోహనా ,
వందనంబిదె నీకు- తిమిర సంహారకా ,
వందనంబిదె నీకు- తమసోల్లాసకా ,

వైరమెరుగనివాడ వారణాసీ విభుడ,
ఆనంద పురవాస అమిత సుఖ దాతా,
అన్నపూర్ణా వినుత జంతుజన పోషకా ,
బ్రతుకు వెరపును మాపి – మము మనుపు మయ్యా !!

గోపికా వస్త్రం

భాగవతం లో “గోపికా వస్త్రాపహరణం ” అనే లీలా – అస్లీలత అని నేను భావించే దాన్ని. ఈ మధ్య వచ్చిన ఒక ఆలోచన ఆ భావాన్ని మార్చివేసింది . అది .” శరీరం అనే వస్త్ర వైభవాన్ని త్యజించడం వల్ల భగవానుడు ప్రసన్నుడు అవుతాడు ” . ఈ భావంతో ..

సురలోక వాసుడా సున్దరాకారుడే,
గతియనెరింగిన మేము ముదమార గోలిచేము ,
వానె పతిగా బడయ జనని గౌరిని గొలువ
మెచ్చడే మా పూజ పురమేలు వాడు !

రేరాజు నడిచేటి గగన తలముల రంగు ,
దినకరుని కిరణాలూ మరలుటెరుగని రంగు,
ఫాల నేత్రుని గళము కోరి పొందిన రంగు,
మేని రంగగు వాడు మేదినీ పతి వాడు !!

కలువ రేకులు తామె రూపు నేర్చిన కనులు,
కామ జనకుని ఇంతి కొలువుతీరెడి కనులు,
చెంద్రికలు చెలువారా చిందులేసెడి కనులు,
కలిగున్న కోమలుడు – కామాక్షి పతివాడు!!

మోవి కదుపకె నగవు చిందించగల వాడు,
మోవి మురళిన మోపి మోదమొందెడివాడు,
మోహనా యని పిలువ మదినేలు మొనగాడు ,
మదన జనకుడు వాడు – వైకుంఠ పతివాడ!!

సురవైరులను ద్రుంచు సున్దరాకారుఁడు,
సరస శృంగారాల సూత్రధారుడు వాడు,
తలపె తారకమంచు తగిలి యుండెడి వాడు,
జగము తలచిన వాడు – జగదాధిపతి వాడు!

పరమగతి యగువాని పతిగ బడయగ నెంచి,
పలుక నెంచితి మెన్నొ పుణ్య పదముల పదులు,
విభుడు మెచ్చెడి విధము విబుధజనులెరిగింప,
ఎంచి మదినెంచుకుని కొలువ నెన్నితిమయ్య!!

జగతి వలువలనల్ల ఆనతందిన వారు ,
పద్మసంభవు వలన తీరు తెలిసిన వారు,
పాంచభౌతిక వలువ పలు తెఱంగులనల్లి ,
భావ పంచకమందు ముంచి పంచెడి వారు!!

సుందరంబగు వలువ – సుకుమారమౌ వలువ,
సోయగంబుల సొగసు సంతరించిన వలువ,
పూజలర్చన లంచు పలుతెఱంగుల నలిగి,
పుణ్య తీర్థములంచు పులకించు వలువ!!

దానమందెడి వలువ – దానమిచ్చెడి వలువ,
దాక్షిణ్య దయలంచు పరితపించెడి వలువ,
సిరి వసించెడి వలువ – జేష్ఠ మెచ్చిన వలువ,
కట్టి విడిచితిమయ్య కరుణ నొందగ వాని!!

వాడు మెచ్చెడి వలువ నిఖిలమందేదయా?
ఆదరంబున తెలుపు వాని జేరేడి తెరవు!
మన్ననెరుగనివాడ మహనీయ వందితుడు?
మన్నింపగా తగదె మా మనవి నిపుడు!

విన్నపంబుల పంక్తు లాలించి పండితులు ,
ఎరుక జేసిరి వారికెరుక కలుగంగా!

దేహినందెడి వాడు దేహాల గొనబోడు ,
దేహ భావపు గతుల దరివాడు జనబోడు!
మానవమానముల వలువలన్నియు వీడి,
కరుణ వలువలు కట్ట కరుణించు వాడు!!

ఎరుకగొన్నా సతులు మతి మంతులైరపుడు,
వినయ సంపద విరియ వేడినారపుడు!!

శరణంచు చరణాల కొలువు జేతుము మేము ,
చెరణ యుగళము మదిన తలచి మనియెద మేము ,
తనువు మోహము మాని తరలాక్షు తలపోసి,
తగిలియుందుము మేము సోహమందున వాని!!

ఎరుక నొందితిమయ్య ఎరిగించగా నీవు ,
దేహి నందుటే గాని దేహాల గొనవంచు
దేహ భావములన్ని దహియింపగా మేము,
దరహాస హవనాన హవిసు లైతిమి నేడు !!

విడువబోకిక మమ్ము – విబుధజన పోషకా !
వినతులందుము మావి – వైరజన నాశకా!
పొన్న కొమ్మల కొలువు పొందికగ అమరేవు ,
అందుమిక మా ప్రణుతి ఆదరముతోనా !!



పలుకు

పాప పుణ్యపు దొంతి పలుమారు లెక్కించి ,
పోగల నేలే నీవు మనసా !
పరసువంటీ పలుకు పలుక నెంచగ నెంచ,
దొంతి నంతము జేయు మనసా !!
పలు పున్నెములు పండ పుడమి నడచితివంచు,
పలికిరే పండితులు మనసా !!
పుడమి నడిచే తనువు తలుపదే ఆ సుఖము ,
వెతలె పున్నెపు ఫలమ మనసా !!

వేదాలు వడపోసి తేర్చి సారము కూర్చి ,
వొడకినారొక పంక్తి మనసా !
దాని మనసున నెంచి పలుమారు చింతింప ,
చింత లన్నియు దీరు మనసా !!
చింత దీర్చెడి పలుకు పలికించు వానికై,
కలవరించకు వెర్రి మనసా !
నీ పలుకులో జేరి పలికించగా తానె,
పలుమారు పలికేను మనసా !!

పలుకులో దాగున్న పరశువును గురుతెరిగి,
పదిలముగ పలుకవే మనసా !
పాప వాసినియైన పుణ్య పోషిణియైన ,
పలుకులో పొదిగుంది మనసా !!
పలుకులో దాగున్న పరమాత్మ ఎవరంచు ,
ఖేదాన మునుగాకే మనసా !
పలుకు రూపముగట్టు నాదమే వాడన్న ,
నిజము నెరుగవే నీవు మనసా !!

నాద రూపమే పలుకు నారాయణుని ఉనికి ,
ఎరుక గోని పలుకవే మనసా !
వాని రూపము సోకి పరసువాయెను పలుకు ,
పలుకు మహిమెరుగవే మనసా !!
పాప పుణ్యపు దొంతి తుంచ గలిగిన పలుకు ,
పలుక నెంచవే నీవు మనసా !
పలుకు పలుకున వాని పుణ్య రూపము నెరిగి ,
ప్రేమతో పలుకవే మనసా !!

**

లోని వాడు

నాది నాదనువాడు లోలోనే ఉన్నాడు – వాని ఉనికెరుగవే మనసా ! 

వాసమందున నిలచి వాసనల నెరపేను – ఉనికి మాపగ నీది మనసా  !!

                                              నీ ఉనికి మరపించు మనసా !

ఉనికి నీవని తెలిపి ఉత్సాహపరచేను – ఉల్లాస పడబోకు మనసా !

ఉనికి మాసిన నాడు నీతోడు విడనాడి -ఊరేగి పోయెను మనసా !!

                                                ఒల్లడే నీ జంట మనసా !!

పాప తాపమటంచు పలుమారు వగచేవు – పాపమెవరిది ఎరుగు మనసా !

వాసనల నెలవైన వాని సొంతమే గాని – నీకు సోకదె ఏది  మనసా !!

                                              పోగలగా  పనిలేదు మనసా !!

 నాటి తలపులు నాటి ఉరించ నెంచేను – ఉల్లాస పడబోకు మనసా !

 మలిగి పోయిన నేడు మరిఎన్నటికి రాదు – నెమ్మదింపుము  నీవు మనసా !!

                                                    మౌనాన మననెరుగు మనసా !!

నేటి జాడల నీడ రేపు జేరునటంచు – గుబులు రేపును నీలో మనసా ,

 కాల కాంతకు లేదు రేపన్న ఒక తలపు – గురుతెరుగవే వెర్రి మనసా !! 

                                               నెనరు గొని మురియవే మనసా !!

ఎరుపు తెలుపుల మధ్య ఎన్నదగు నీవంచు – ఎరిగించునే నీకు మనసా !

రంగులద్దిన జగతి రమిఇంచు రంగోకటే  – ఎరుక గొని రమిఇంచు మనసా !!

                                                ఏమరక  నుండవే మనసా !!

రంగవల్లులు కరిగి రంగరించిన రంగు – రుచినెరుగవే నీవు మనసా !

లోనున్న వాడొకడు లోకమేలే వాడు – యమున ముచ్చట దీర్చు మనసా !! 

                                             యమ పాశమును  తుంచు మనసా !!

లోకమేలేవాడు లో లోని వాడేయని – ఎరుక మరువకు నీవు మనసా!

                                           మరపు ఎరుగక నుండు మనసా !!

5th May 2023 నేను కాశి లో వకుళ సహాయంతో ఒక లలితా ఉపాసకుడిని దర్శించుకోడానికి వెళ్ళాను. ఆయన శ్రీ లలితా పరమేశ్వరి దర్శనం పొందినారుట. ఆ దేవిని దర్శించినప్పుడు ఆ తేజస్సుకు ఆయన ఒక కన్ను కాలిపోయింది .(ట ). ఆయనకు ఇప్పుడు ఒక్కటే కన్ను. ఆ మహానుభావుడు నన్ను చూసి ,” పో దూరంగా వెళ్లి పో , అడవిలో లోపలికి వెళ్లి పో , మళ్ళీ తిరిగి రాలేనంత దూరంగా వెళ్లి పో ..”
అని , ఇంకా అలాగే చాలా మాటలు అన్నాడు. నేను ఏంచేయను ….తల్లి
కరుణ కొలనగు కనులు కలిగున్న నా తల్లి ,
కఠిన పలుకుల పంక్తి పలికింప తగునా !
కాల రూపివి నీవు కాల వాహిని నీవు ,
వేడల జేయవే నాదు వేదనల పుంత !!

వల్లమాలిన దారి వెడలినా నేనంచు ,
మిన్నకుండుట నీకు మోదంబు నిడునా !
దారులన్నియు నీవే – దరి జేర్చగా నీవే ,
ఎదురేగి నన్నంది బెదురు బాపమ్మ !!

నడక నేర్చితి నంచు నడిదారి విడనౌన ,
జతమాని ఈజగతి నడువ నంపేవా !
మిధ్య జగతివి నీవే – ఆవలయు నీవే ,
ఆదరము అమరింప ఆలసము తగునా !!

కరము కరమున జేర్చి వందనము నే జేతు ,
పెదవి కదులగ నేను నామంబు పలికేను ,
మాటునున్నా మనసు మలిదారి నుందంచు ,
మోమాట మెంచకే నా పూజ మన్నింప !!

విన్నపంబుల పుంత విందు జేతును నీకు ,
దుడుకు లోకపు కథల కలశమిత్తును నీకు ,
వేదనల వెల్లువను వింజామరన్వీ తు ,
నిలకడెరుగని మనసే నీ శయ్య నీ జేతు !!

వాసి తరుగని నగవు పలుమారు నొలికించు ,
దారి జేసుక నన్ను దరిజేరి దయనేలు !
దురిత దూరవు నీవు దుందుడుకు సుత నేను ,
కినుకగొన్నిక నన్ను కరుణించువారెవరు !!

తరలిరా ఓ తల్లి తరళాయతాక్షి ,
తరుణమాయెను నేడు తెరలు తోలుగంగా !
తిమిరంపు పుంతలన తగిలి నలిగేము ,
ఒడుపు జేసీక నీవె ఒడి జేర్చు కోమ్మా !!

                              
                                
                               
                                
                              
                                   

ఏమి సేతురా లింగా?

ఏమి సేతురా లింగా? ఏమీ సేతు?
తుంటరాటలు మాని తీరుగ,
నీదు పూజలు చేతమంటే,
తీరుతెన్నులు తెలియదంటూ,
మనసు చిందులు వేసెనే!!
ఏమి సేతురా లింగా? ఏమీ సేతు?

నిలకడెరుగని కాలమందున,
నిలచి నిన్నర్చింత మంటే,
నిలకడెరుగని మనసు నాతో,
కసిరి కయ్యమునాడెనే!!
ఏమి సేతురాలింగా ? ఏమీ సేతు?

నిన్న మొన్నటి చేటు మాటలు,
చెరపి నిను నే చేరబోతే,
చేటు మాటల చాటు నీడలు,
కోటలై నను కమ్మివేసెను!!
ఏమి సేతురా లింగా? ఏమీ సేతు?

వెలుగులణిగెడి సంద్యలో నిను,
శరణు శరణని వేడబొతే,
తొందరొందిన కాల రూపుడు
కరకు పాశము విసిరెనే!!
ఏమి సేతురా లింగా? ఏమీ సేతు?

అంబ తోడుగ ఆడినాటకు ,
ఆనవాలుగ మొలచినానట,
ఆట చాలని తోడు తొలగితె,
నాకుదిక్కెవరయ్య లింగా?
ఏమి సేతురా లింగా? ఏమీ సేతు?

మొదలు మోసము చివర శూన్యము,
నడుమ మాగతి మాయ మగ్గము,
నేరమిదియని నెయ్యమిదియనని,
ఎంచ నేరక పొరలుచుంటిని!!
ఏమి సేతురా లింగా? ఏమీ సేతు?

ముందు వెనుకలు వెలుగు నీడలు,
హెచ్చుతరుగులు జగతి జంటలు,
మరపు తెరపుల మధ్య నలుగుచు,
నీవె నేనని మరచి మలిగితి !!
ఏమి సేతురా లింగా? ఏమీ సేతు?

మరచినానని తొలగియుండకు,
మరపు మాయగ తరలి జేరుము,
తల్లి తండ్రియు తోడు నీవని,
తలపు నీవై మనుపకుంటే !!
ఏమి సేతురా లింగా? ఏమీ సేతు?


ఏమి సేతురా లింగా? ఏమీ సేతు?

నాటి నీడ

నాటి నీడల తోడు నేటికిని విడవాయె
నేనేమి సేతురా రంగా!
నేటి వెలుగుల వాక వానిగెలువగ లేక,
చినబోయి చితికేను రంగా!

నాకు దారేదింక రంగా – దరినుండి నడిపించు రంగా!!

పురిటి వాకిలి నుండి నడిచేటి ప్రతి అడుగు ,
వల్లకాటికి చేర్చు రంగా!
వల్లమాలిన మనసు నదురు బెదురూ లేక,
కల్లదారుల దూరు రంగా!
సరిదారి మరపించు రంగా!!
నాకు దారేదింక రంగా – దరి నుండి నడిపించు రంగా!!

జారిపోయే తనువు జాము జాముకు పెరిగి,
ఆకలని అరిచేసు రంగా!
అంతరంగాకలిని కలి మింగి కసిరేను,
గెలువ దారేదింక రంగా!
గురిదారి నెరిగించు రంగా!!
నాకు దరినెరిగించు రంగా!! దరి నుండి నడిపించు రంగా!!

ముక్కంటినుడికించి బుగైనవాడొకడు,
మిగుల సందడిజేయు రంగా!
తరియించు దారులకు తానె తారకమంచు,
తనువంత మెసలేను రంగా!
సంతు సంబరమంచు రంగా!!
నాకు దారేదింక రంగా! దరినుండి నడిపించు రంగా!!

జగతి భావన జేసి జోలలూగే నీవు,
జాలి మరచేవేల రంగా!!
రూపు గట్టగ నీదు భావభారమునందు,
నీ సంతు నలిగేను రంగా!
నిదుర మానుము ఇంక రంగా!!
దరినుండి నడిపించు రంగా!! దయనేలుమో మమ్మురంగా!!
దరినుండి నడిపించు రంగా!! దయనేలుమో మమ్మురంగా!

ఏ పాదమల భక్తి

ఏ పాదమలు భక్తి పూజించగా నెంచి,
మధుర ఊహన శిరము మెల్లగా నొంచి,
చేరబోవగ నేను ఆ పాద యుగళమును,
విరిబూసె నా మనసు మకరంద వనము!!

ఆ పాద సోయగము పొగడగా నే తగునే,
పాద నఖముల వెలుగు వెన్నెలల మించె,
చిలికి చల్లని సుధను చిదిమెనే వెతలు,
చేరి మనసును తట్టె మదికలువ విరియా!!

కోరి వెన్నెల తిన్నె కొలువు నే నున్నా,
కలువ కన్నెల జంట కొసరి నే నున్నా,
శ్రీలక్ష్మి జతపుట్థి సుధను పంచెడివాడు,
వన్నె చెదరని వెలుగు వాకలే కురిసినా!

విరియలేదే నాదు మది కొలను కలువ,
కనురెప్ప కొఁతైన కదిలింప నెంచదే!
ఏ తలపు పులకింత తలపోసెనో నేడు,
విరిసెనే నా మనసు కలువ కొలనెల్లా!

పాదముల జేరేను నా శిరసు వంగి,
విరిసె మది కమలంబు కనులనే మూసి,
ఆ కలువ కన్నులలో నిండినా రూపు,
రూపు గట్టెను ఎదుట ఏమందు నేను!!

చేరు చింతల దునుము చింతామణీ నెలవు
కరుణ కాసారంబు కమనీయ మధు వనము,
కాలమందున నలిగి కలలు చెదిరిన కనులు,
రెప్పపాటును మరచి రమియించు పురము!!

వందనంబున వంగి వరియించె నా మనసు,
వంతపాడెను తనువు పంతమాడుట మాని,
వన్నె తరగని పురము వాకిళ్ళు తెరచుని,
ఆదరంబున పిలువ ఆలసింపవ తగునా!!

ఏ పాదమలు భక్తి పూజించగా నెంచి,
మధుర ఊహన శిరము మెల్లగా నొంచి,
చేరబోవగ నేను ఆ పాద యుగళమును,
విరిబూసె నా మనసు మకరంద వనము!!