ఇంద్రియంబుల శోభ ఇందీవరాక్షీ – విదితముగ వివరించు విధి వైభవమును,
వీనులందున జేరి వినుమమ్మ తల్లీ – స్పురియింప జేయుమా శుద్ధ సారమును!
వదనమందలి వాక్కు – వాక్కులో భావంబు – భావమందలి బోధ – మూలమగు జననీ,
కలుగ జేయుము నీదు కమనీయ కల్పనల – కలుగజేసెడి రవళి – నందు భాగ్యమును!
కంటి పాపన వెలుగు – చూపులో గమనింపు – గమనమందలి గురుతు నీవె తల్లీ!
గురుతులో నీ జాడ నిలకడగ నిలుపుకొని – నీ ఉనికినెరుగ గల గురుతునిమ్ము!
తనువు చేశ్టలయందు చేతనత్వము నీవు – చేతనత్వములోని కారణము నీవు,
కారణపు కుదురులో కూడున్న విధిఛాయ – నీ ఛాయగా నెరుగు భాగ్యమిమ్మమ్మా!
శరదిందు శేఖరుని శుద్ధకౌముది యందు – తేలియాడెడి తేట తళుకు తారా!
తెలియజేయుము నేడు నీ నాధు కాంతులకు- కారణంబౌ విభుని వెలుగు కారణము!
కారణంబుల మూల కారణంబైనట్టి – కారణము నెరుగనో కారణంబా!
ఏతీరు నెరుగొందు మీ వింత కారణము- విధి వర్తనముకేది కారణంబు?