ఉదయ ఉపచారం

తొలి వెలుగు ఛాయలట ఉదయాద్రి నంటాయి,

తెలి మబ్బు తరలితా ముసుగుగా అమరింది,

నిదుర కన్నుల మాటు కలల వైభవ మందు,

నినుగూడి మురిసేటి జగము దయగనమంది!

మయుడు కల్పన మరచి మైమరచు రీతిలో,

తరువు తరువున విరులు వన్నెలమరాయి,

దివి గంగ చినుకులను హిమబిందు జల్లులో,

క్రీడించి తమ శోభ నినుమడించాయి!

విరుల నెరుగని తరువు పత్రగుఛ్చపు శోభ,

దివి రాజు ధనుసుతో సరితూగుచుంది,

కెంపు మాలల గుంపు ఉదయాద్రి పైజారి,

తరళముల చెక్కిళ్ళ నొదిగిపోతోంది!

మాతృస్తన్యము వీడి మనలేని పసి పగిది,

ఊహ దొంతరలందు అమరున్న నీతలపు,

రెప్పమాటున మసలి మరిపెమొసగు ననంచు,

మంచు దుప్పటి క్రింద పసి పచ్చికమరింది!

తొందరెందుకు నీకు వెలుగు కిరణమునమర?

తొలుత తొలుగగ జేయు తిమిర వైభవమును,

విభుని వైభవ మెరుగు ధరణిచందము నేడు,

మనసు ఊర్పుల కూర్పు కూరిమమరించు!

వన్నెతరగని వెలుగు వైభవపు వెలుగు,

జీవమిచ్చే వెలుగు జగమేలు వెలుగు,

వాడిశరముగ విధిని వేటాడు వెలుగు,

నాటుమో నాతనువు తరియించునటుల!

Leave a comment