విన్నపంబులు వినగ రమ్మంచు పిలుతురని,
కనులు మూసుక నిదుర నటియింతువేమో!
వెన్న తిందువు రారా ! రాజీవ లోచనా!
చల్ల కుండలు నిన్నె కలువరించేను!
ఆలమందలు నిన్ను మరిమరీ పిలిచెనని,
అలసి నానని నీవు తొలగుందువేమో!
లేగ లెరుగని గుమ్మ పాలు నీకిమ్మంచు,
గంగి గోవులు పితికె కడవ పొర్లంగా !
యమున పై నాడేటి పిల్ల గాలులు నిన్ను,
పలుమారు పిలుచు నని మలయింతు వేమో!
వెదురు వేణువు జేరి పలుక నేర్చిన గాలి,
రాధ ఊపిరినందె నిన్ను జేరంగా !
(మలయించు : తప్పించు)
గొల్లకాంతలు నిన్ను గారవింపగ నెంచి,
గోవింద యని పిలువ మాటు నొందేవో!
చద్ది సర్దిన ముంత అరుగుపైనే ఉంది,
అందుకుని పొమ్మంచు కబురు పంపేరు!
పాల్కడలి పరుపై పవ్వళించె తండ్రి,
జగమెల్ల నిండినది నీ ఉనికెగాదా!
నిన్ను తలచెడి వారు నీవుగాకింకెవరు?
అంబుజోదర పరులెవరు నీకు?
విన్నపంబులు వినగ మరుగేలనైయ్యా !
వృషభాను పట్టి నీ దారిచూసెను !!
🪷
చాలా బాగుంది
LikeLike