తరలు కాలంబాయె తరలింప వస్తిమని – దూతలిచ్చట వచ్చి నిలచినపుడు,
దొరుకదేమో నీదు తోడన్నభయముతో – నిగిడి నీరసమొంది మరుగునపుడు ,
గట్టిగా నా చేయి పట్టినడిపెద నంచు – ముచ్చటైనొక మాట చెప్పరాదా!
గొల్ల పల్లెల లోన పిల్లలాటల నాడి – పెక్కు రక్కసి మంద నణచినపుడు,
తోడు ఆడినవారు తరియించు తీరులను – తేట తెలుపక నీవు తొలగినావు!
తెలియగోరిన వారి తలపులందుదయించి – తపియింపగా జూసి మురిసినావు,
తుంటరాటలు నీకు – తగని వేదన మాకు – ఆదరింపుము మమ్ము అండజేరి!
నగుమోము కనులార గాంచు గోకులమంత – నారాయణా యంచు పిలువలేదు,
కంసుడంపగ వచ్చి మాటేసినసురుండు – మధవా యని నిన్ను పొగడలేదు,
రచ్చజేసెడి వారలేరీతి తగునంచు – రమ్యమగు నీ నెలవు నొసగినావు?
లీల మోదము నీకు – తగని వేదన మాకు – ఆదరింపుము మమ్ము అండజేరి!
అమ్ములెరుగని విల్లు అలవోకగా బట్టి – వెదురు నాదపు శరము యెదన నాటి,
మోహపాశము ద్రుంచి మోహాన ముంచితివి – మధుర కేగెడి నాడు పల్లెవిడిచి,
పాతకంబుల రొంపి హరియించు హరివంచు – పలుక నేర్వని మమ్ము పలుకరించి,
పలికించి నీ పలుకు -పురము ఒరిగెడి నాడు – ఆదరింపుము మమ్ము అండజేరి!