ఎవరిది

ఎవరను నే నిట కేగితి? ఏపని పూనగ వచ్చితి?
ఏసీమను విడి వస్తిని? ఏ సీమకు జననెంచితి?

ఎవరను నే నిట కేగితి? ఏపని పూనగ వచ్చితి?
ఏటికి తగిలితి తనువును? ఏటికి ఇది నేనని ఎంచితి?
ఏ వాసపు వాసనలను వదిలింపగ తనువొందితి?
ఏపంతము చెల్లించగ చెల్లని చెలుముల జేరితి?
ఏ సుంకపు సరి లెక్కలు సరిజేయగ ఇట జేరితి?

ఎవరను నే నిట కేగితి? ఏపని పూనగ వచ్చితి?
ఎవరది నా మది లోపల పలుకులు పంచుచు తిరుగును?
ఎవరది నను పలుమారులు పంతము లాడగ పలుకును?
ఎవరది నను ఓరిమితో నెమ్మది నొందగ తెలుపును?
ఎవరది దీనను నేనని దయజూచుచు మన్నించును?

ఎవరను నే నిట కేగితి? ఏపని పూనగ వచ్చితి?
ఎవరది నను కవ్వించుచు పలు తీరుల ఉసిగొల్పును?
ఎవరది నా కన్నులలో కదలక నిలబడి జూచును?
ఎవరది వీనుల జేరిన పలుకుల వివరంబుల నెంచును?
ఎవరది నా గళమందున నాదముగా నడయాడును?

ఎవరను నే నిట కేగితి? ఏపని పూనగ వచ్చితి?
ఏమెరుగగ తరలిరి ధరణికి తాపసజన సందోహము?
ఏమెంచుచు సురవాసులు తనువందుదు రీ తలమున?
ఏమోహము మాపంగా మాధవుడీ పురము నడచు?
ఏ కామము కామాంతకు కన్నుల గట్టగ జేయును?

ఎవరను నే నిట కేగితి? ఏపని పూనగ వచ్చితి?
ఏ నూపుర నాదముకై జగములు పలుమారు వెదకు?
ఏ నాదము వినినంతనె వేదన యదబాసి వెడలు?
ఏ అలికిడి అలజడులను అంతపు దారుల నడుపును?
ఏ వెలుగులు వెన్నెలలై వాసపు వాసన బాపును?

ఎవరను నే నిట కేగితి? ఏపని పూనగ వచ్చితి?
ఏ బదులెగని ప్రశనలు పలికిన ఫలమేమిలలో?
ఏమరుపెరుగని వాడిని మరువక నెంచేదెటులో?
ఏ మోదము నొందగోరి రోసిన రోదన నలిగెద?
ఏలిన వాడీ పిలుపుకు ఓయనకుంటే తగునా?
ఎవరను నే నిట కేగితి? ఏపని పూనగ వచ్చితి?
ఎసీమను విడి వస్తిని? ఏ సీమకు జననెంచితి?

Leave a comment