తీయ నిధి

మూయనెరుగని రెప్ప కన్నులు కాంచగలవే కలలను,
వేకువై వెలుగొందు వైనపు వైభవంబుల వెలుగును,
తొలగించి తెరలను తొంగిచూచే తుంటరాటల తీరును,
మరుగు గోరుచు మదిని జేరే మాధవుని మధురూహను!

రాసలీలకు ఊపిరూదే నిండు జాబిలి వెండి తళుకులు,
రాధికా పతి ఊపిరందుక ఊరడించే మరళి పాటలు,
రాగమందే ఆలమందలు వాని వెంటన గొల్లపడుచుల,
ఉనికి నెంచక ఉషాకన్నియ కన్నులేమని విరియునో!

నల్లవాడా గొల్లబాలుని సాదరంబున జేరి వేడగ,
ఒంటిగా తా తరలువేళల నీడజాడలు వెంటవిడువగ,
వేగపడి యా కమలనాధుడు మరుగుజేరక మానునా?
వెలుగు విందుల సంబరాలీ మనసు వేదన దీర్చునా?

గృంకిపోనా పొద్దుపొడుపున పొన్నరెమ్మలు నవ్వవా?
కొమ్మలూయలలూగు మాధవు మరగు జేయక మానునా?
పూల తేనులు తాగు తుమ్మెద తూల కెరుగగ గల్గునా?
మాపుజాడల వేడుకొనుచూ వెదురు గుబురుల చేరదా?

మరపు లెరుగని తెలివి కలిగిన తాళునే ఈ జగములు?
తామసుల సరి ఆడకుంటే మనసు మాధవునెంచునే?
మధుర భావము మరలిరావలె మరల మరలా మనసుకు,
తెరల మాటున మాటువేసిన మాధవుని మధురూహతో!

భీతి నొందకు భావుకా ఈ మాటువేసిన నీడకి,
నీడనంటిన నీరజాక్షుడు నిన్ను జేరడి తరియది,
వాలు రెప్పల వాకిలందున వేచియున్నా పెన్నిధి,
పంతమెరుగక పట్టినీ జత పొందియాడే ఘడియది!

వల్లభుండా వాసుదేవుడు వీడి నా జత వెడలునే,
వెన్నెలాటల వేడుకందక ఉనికి వీడగ నెంతునే,
మరలి మరగున జేరి నేనా మాధవుని తలపోయనా?
మధుర భావపు భారమందున మరల మరలా మనుగనా?

జ్ఞానము గొప్పదే – భక్తి తీయనిది, తీరనిది – నిధి

One thought on “తీయ నిధి

Leave a comment