శ్రీలక్ష్మి కళ్యాణ వైభవం

క్షీరాబ్ధి పుత్రికా శ్రీలక్ష్మి కల్యాణ వైభవంబును మదిన చింతించ రాదా!
దేవాధి దేవుడా పద్మానాభుని మాయ ముదితగా నడయాడి మనువాడు గాధ!

దేవతలు దానవులు ఒకరి తోడుగ నొకరు మిత్తి మాపెడి మందు నందగోరి,
వైరంబు విడనాడి వాసుకిని అమరించి మన్ధరే కవ్వముగ చిలికిరట సుధను,
చినుకులై వెలివడ్డ వింత సంపదనెల్ల వాదులాడక వారు పంచుకొను చుండ,
ఉదయించె నొక ఇంతి పద్మాసనై తాను మితిలేని లావణ్య లలితంపు తన్వి!
||క్షీరాబ్ధి పుత్రికా శ్రీలక్ష్మి కల్యాణ వైభవంబును మదిన చింతించ రాదా||

  1. సకల భూషణయుక్త భద్రగజముల జంట మందాకినీ సలిల కుంభములతో,
    అభిషేక సేవలన సేవించుచుండగా తరుణ కాంతుల తేట తెరలు మెరయ,
    వివిధ భూషణ భూష వైభవాన్విత దేవి వెలుగు చల్లని లేత నగవుతోన,
    మేలి బంగరు రంగు మెరపులద్దిన యట్టి తనుకాంతి దీపింప కనుల గట్టే!
    ||క్షీరాబ్ధి పుత్రికా శ్రీలక్ష్మి కల్యాణ వైభవంబును మదిన చింతించ రాదా||
  2. ఆదిగా నాదమై ప్రభవించినా తల్లి ఆనందముకు తానె అనరైన తల్లి,
    తొల్లి జగముల తమసు తొలగించు తళుకుగా మెరిసి మేలెంచినా మేటి తల్లి ,
    చెలగు చేతనయగుచు చిగురించి నడయాడి మేల్కొల్పి ముజ్జగము లేలు తల్లి,
    తరలి నేడుదయించె కనకాంగిగా తాను పండగా పున్నెములు పాల్కడలి నుండి!
    ||క్షీరాబ్ధి పుత్రికా శ్రీలక్ష్మి కల్యాణ వైభవంబును మదిన చింతించ రాదా||

3.దుర్గతుల దునుమాడు దుర్గయైనా తల్లి నారాయణిగ రణము రాణించు తల్లి,
కాళికా శాంకరీ కౌమారి బ్రాహ్మిగా కదలి అసురుల మదము నణగించుతల్లి,
లలితయై లాలించి చెండికై దండించి కాళరాత్రిగ తానె గ్రసియించు తల్లి,
సంతు శ్రమ శమియించు సమయమాయేనంచు శతశోభయై తానె ఉదయించెనేడు!
||క్షీరాబ్ధి పుత్రికా శ్రీలక్ష్మి కల్యాణ వైభవంబును మదిన చింతించ రాదా||

  1. మోహమిచ్చిన తల్లి సంతు శ్రమనొందగా సావకాశము మరచి తొందరించి,
    శమదమంబుల సీమ నెంచమరచిన విభుని మురిపాన దరిజేరి మేలుకొల్పా,
    వేల్పులందరుగొల్వ కనకాసమునంది పలువిధంబగు సేవలంది మురిసి,
    దేవేంద్రుడిచ్చినా నల్లకలువల మాల కరమంది కదిలేను కనువిందుకాగా!
    ||క్షీరాబ్ధి పుత్రికా శ్రీలక్ష్మి కల్యాణ వైభవంబును మదిన చింతించ రాదా||

1.ఉనికెరుంగని వాడు ఉనికంది నిలచెనట సురకార్యసారధ్య లీల నెరపెడివాడు,
లీలా వినోదుడా క్షీరమధనపు కేళి ముదముతో మదినెంచి మురియువాడు,
మోదఖేదములన్న భేదమెరుగనివాడు ఖేదముకు మోదముకు ఉనికైనవాడు,
కామ జనకుడు వాడు కామమెరుగనివాడు కామింపదగు ఉనికి కలుగువాడు,
||జగదేక మోహనుని వివిధ వైభవమెంచి మోదించు సిరినిపుడు మదినెంచ రాదా||

2.కారణంబగు వాడు కార్యంబునగువాడు కార్యకారణ లీల కారణంబగువాడు,
వెరపు మాపెడివాడు వెరపెరుంగనివాడు వెన్నతో వేదనను వెడలించువాడు,
భావింపగా తానె బోధింపగా తానె పలుకులై పలుమారు పలుకువాడు,
పలుక నేర్వని మనసు పలుకనెంచే పలుకు పలుకకే ఆలించి బ్రోచువాడు,
||జగదేక మోహనుని వివిధ వైభవమెంచి మోదించు సిరినిపుడు మదినెంచ రాదా||

3.బ్రోవనీవేయన్న భవబాధ వారింప బహురూపియై ధరణి నడచువాడు,
కడలి జొచ్చిన అసురు కడతేర్చగా తాను సూకరంబై ధరను గాచువాడు,
పాహి పాహీయన్న కరిరాజు గావగా ఉన్నపాటున తరలు కరుణవాడు,
కావరావేయన్న పాంచాలి పిలుపువిని అన్నవస్త్రములిచ్చు అన్నవాడు,
||జగదేక మోహనుని వివిధ వైభవమెంచి మోదించు సిరినిపుడు మదినెంచ రాదా||

  1. అలుపెరుంగక తలచు సురవైరి సుతుగావ నారసింహుగ అసురుగూల్చువాడు,
    అడవిదారుల నడచి నమ్మికొలిచెడివారి చేటుబాపెడి చేవగలుగువాడు,
    దానమందిన అడుగు గగనమంతానింపి దనుజు నణచిన ధీరధరుడువాడు,
    రూపులన్నిట తానె అనురూపియైయుండి అలుపెరుంగక ఆటలాడువాడు,
    ||జగదేక మోహనుని వివిధ వైభవమెంచి మోదించు సిరినిపుడు మదినెంచ రాదా||

1.హాసరేఖలు మొలచి వదనాన వెలుగొంద వంగి వనితను జూసె వల్లభుండు,
బహురూపియౌ రమణి రమ్యరూపపు వెలుగు గాంచి నెమ్మది నొందె సూత్రధారి,
కరుణ కొలనగు కనుల ఒలికించి చినుకులను చిలికే కోమలిపైన కనికరాన ,
నునుసిగ్గు భారాన వాలు చెలి రెప్పలన మౌన సందేశంబు జాడనుంచె!
||క్షీరాబ్ధి పుత్రికా శ్రీలక్ష్మి కల్యాణ వైభవంబును మదిన చింతించ రాదా||

2.లీలావినోదుడా మోదించు తరిగాదు ఖేదాన మునిగేను జగములెల్లా,
దరిజేరి వివరింతు సంతుబాధలనెల్ల మెల్లగా నీ మనసు మన్ననెంచా,
పూర్ణరూపుడ వీవు పలుమారు నినుజేరు పూరకంబును నేను పుణ్యచరిత,
ఆదరంబెంచి నను అందుమీ వరమాల మనసుజేరగ నీది మరలినేను.
||క్షీరాబ్ధి పుత్రికా శ్రీలక్ష్మి కల్యాణ వైభవంబును మదిన చింతించ రాదా||

3.జీవమై జగములకు ఊపిరూదే తల్లి తొల్లి జగముల తానె కన్నతల్లి,
త్రిపుర నాయకి ఈమె తిరు పాద మంజీర సవ్వడందగ అడుగు లేసెనపుడు,
ఋగ్యజుస్సామములు సరి నుతుల నుతియింప యక్షగానము దాని తోడుకాగ,
వరమాల నందించి భువనైక మోహనుని వరియించి వక్షాన కొలువుదీరె!
||క్షీరాబ్ధి పుత్రికా శ్రీలక్ష్మి కల్యాణ వైభవంబును మదిన చింతించ రాదా||

4.సంతసించిన సురలు కుసుమాలు కురిపించి జగదేక నాయకుని కొలిచిరపుడు,
కోరికొలిచేవారి కనికరంబున జూచి కాచు చల్లనితల్లి సంతసింపా!
శుభకరంబైనట్టి శ్రీలక్ష్మి కల్యాణ చరిత మనమున నెంచి మురియుజనుల,
సాదరంబుగ తానె కొలువుండి పోషించి విభుని కొలువందిఛు సకలసాక్షి!

క్షీరాబ్ధి పుత్రికా శ్రీలక్ష్మి కల్యాణ వైభవంబును మదిన చింతించ రాదా!
దేవాధి దేవుడా పద్మానాభుని మాయ ముదితగా నడయాడి మనువాడు గాధ!

🌺

One thought on “శ్రీలక్ష్మి కళ్యాణ వైభవం

Leave a reply to Varalakshmi Cancel reply