జారిపోయినదొకటి జతజేరునుంకొకటి,
నడిమినున్నది యొకటి ఏలుకోనగా నేను!
దొరలి పోయినవెన్నో దొంతులై మిగిలేను,
చెంతనుండిన దాని తనియార నే కందు!
చిత్రమైనీ చినుకు తన మహిమ కనమంది,
చేవ గలిగిననేని నాకముల కనుమంది,
అలనాటి సాధనల సారాలు పూరించి,
తన జతగ తారలను దాటుకుని చనుమంది!
చెరితెంత ఘనమైన పరువాల పరుగైన
తలుప తీయనిదైన తగని వేదనయైన
కనులు చెదిరే కలల కోవెలల కొలువైన
తన ఉనికి నెరుగుండు నిలకడే సాకంది!!
విలువైన “ఈ”క్షణము “అది”గ మారక మునుపె,
తలపులును యోచనల తగవు తరీరక మునుపె,
జలతారు మెరుపంటి మురెపెమైనీ క్షణము,
విలువెరిగి వర్తింప వివరమును గొనుమంది!!
దేహభారము తీరి నడిచేటి ఆ క్షణము,
కొత్త లోకపు వెలుగు కనుల కప్పే క్షణము,
అది లేక ఆదిగా మొలచినా ఒక క్షణము,
ఎరుగున్న ఎరుకంత ఏమరిచినా క్షణము,
బ్రతుకంత భవితగా మార్చగల ఆ క్షణము,
భ్రమలు నిండిన జగము తొలిగుండినా క్షణము,
భావముల ఉప్పెనల ఊపిరాగిన క్షణము,
గురువులును వేల్పులును మౌనమొందిన క్షణము,
నాదములు వేదములు మూగబోయిన క్షణము,
గురుతెరిగి చెరియింప గురువు తెలిపిన క్షణము,
ఏమి తలతునొ నేను నేనైన తొలి క్షణము
మౌనమందలి తలపు నా మనసు తలుపగా,
చిలికి మౌనపు కడలి మొలువదే ఒక తలపు,
మౌనమే పలుకైన మహనీయు దరిని నే జేర!
జారిపోయినదొకటి జతజేరునుంకొకటి,
నడిమినున్నది యొకటి ఏలుకోనగా నేను!!!!!