మనో మధుపము

ఈ రోజు తారీకు 02022022 🙂

మధుపమంటీ మనసు మధురసంబులు గ్రోల,
విరిబంతులను కనుచు వనుల తిరిగేను!
ఎంచి ఎంపిక జేసి కోరి కుడిచిన మధువు,
మనసు కోరిన రుచుల కుడుప తగవాయె!!

నంద నందను తలపు మదినిండ నిండగా,
నవ్వులారగబోసె కొమ్మకొమ్మన విరులు,
మొలక నవ్వులనొలుకు నవ్య తేనియ కడువ,
నిండదే మధుపంబు మనసు ఎందులకో!!

నెలరాజు నగుమోము వెలిగించు కన్నులతొ
మురియు కలువల కనుల ఒలుకు వలపుల తేనె,
కొదువ కొంచెము లేక విందులెంతో జేయ ,
నిండదే మధుపంబు మనసు ఎందులకో!!

కమల బాంధవు తలపు తనువెల్ల మొలవంగ,
అరుణ కాంతుల వెలుగు తన కనుల మెరవంగ,
మదిపొంగినా మధువు ప్రతి చినుకు గ్రోలినా,
నిండదే మధుపంబు మనసు ఎందులకో!!

రతి వల్లభుని పదము నడయాడు తరినెల్ల ,
రాగమొందిన విరులు ఒలికించు మధురిమలు,
తనియారగా కుడిచి కడుపు పొంగినకూడ, 
నిండదే మధుపంబు మనసు ఎందులకో!! 

 మనసు నిండెడి మధువు కనలేని మధుపంబు,
 అల్లార్చి రెక్కలను అలసి సొలసిన వేళ,
  పంకజంబుల పంక్తి పోలినొక పదముపై,
 ఒరిగె నెమ్మదినొంద తరుగ మది తపన!!

  ఏపూర్వ పున్నెముల పుంతలే పొంగెనో,
   ఏ నింగి దేవతల దీవెనలు పండెనో,
  మధుపమంటా మనసు ఒరిగినా చరణంబు,
   ఆదరించందించె అరుదైన మధువు!!

    రాధికా నయనములు గ్రోలేటి మధువు,
    నిస్సంగు లనుదినము సేవించు మధువు,
     రుచినెరింగిన వారు విడలెని మధువు,
    గురుచరణ పంకజపు నిజనామ మధువు!!   

     మధుపమంటీ మనసు మధువనుల జతమాని,
     గురుపాద పంకజపు గంధమును గ్రోలుచూ,
      మనసు నిండని క్షణము మరి ఎన్నడెరుగకే,
     నిత్య సంతసమంది నిలకడెంచేను !!                                                                  

      అట్టి మధువును మీరు  అందరే నేడు,
      తనియార సేవించి తమకమున మనరే!

Leave a comment