తక్కెడ

తూనికెరుగని తక్కెడదిగో తుకామేయగ తరలిరండని ,

తూకమేసెడి మేటి సరకుల విలువ వివరము అడుగనన్నది !!

గుండె గుప్పెడు మనసు చారెడు బ్రతుకు మూరెడు ఆశ బారెడు ,

విసుగు వీశెడు వెరపు అడ్డెడు వంకలెరుగని వలపు తట్టెడు ,

భావభారపు మోపులెన్నో మోసి మోసిన మనసు అలసట ,

ఆదరంబున  తగిన తూనిక కొలతతో ఎరిగింతునన్నది !!

తల్లి ప్రేమను తరుణి ప్రేమను తూకమేసెడి వసతి కలదని,

తనయు ప్రేమకు తగిన అర్ధము అందజేసెడి  కొలత కలదని ,

పసుపు కుంకుమ కుమ్మరించెడి చెలుని ప్రేమను  తూచితెలిపెడి

వసతి వీలును కలిగి యుంటిని – అంది సంతసమొంద మన్నది !!

భారమెంచని  కడుపు తీపిన భాగమెంచని తోడు భారము ,

లోతు తెలియని గుండెలో ఏ లోతులో మరుగొంది ఉండెనో ,

బ్రతుకు భారము మోయు రెక్కల సారమెంతయో తెలియజేసెడి,

సాధనంబులు కుర్చీ వేచితి – చేరి తూనిక నెరుగుమన్నది !!

కాల గమనము కొల్లజేయని కునుకు మరచిన కంటి పాపలు,

తప్పటడుగుల తూలు తనువులు తీరుగా తగు దారులందగ,

విధి విధంబుల వీనులందున విన్నవించిన విన్నపంబుల ,

సారమంతయు తూచి తెలుపగ – తెలిసి తీరికనోందు మన్నది !!

నేటి నడతల నిలవరించెడి నాటి నీతుల ఊట తేనెలు ,

తేట తేనియ కుడిచి కడిమిది పంచి మురిసెడి దొడ్డతనములు ,

దోచి దాచిన కండ చక్కర గండు చీమలు కుడుచు తీరులు,

వాటముల నిట వివరమెంచుచు సరిగ తూచెద తెలియు మన్నది !!

బ్రతుకు బాటన దిగుడు ఎచ్చుల ఉచ్చులో తా నలిగిపోతూ ,

ఆదుకొమ్మని చేదుకొమ్మని లోని గొంతుక గుల్లచేసుక ,

గోడు గోడును తల్లడిల్లెడి పుడమివాసుల భీతి భక్తిని ,

భవుడు మెచ్చెడి తూనికన తా తూచి  తెలిపెద తెలియు మన్నది !!

 కాటివాకిట రాలిపోవక తోడు నడిచెడి కర్మ దొంతులు,

కడుపు కట్టుక కావరమ్మని కోరి చేసిన పూజ మూటలు ,

విసిగి బడలిక బాపుకొనగా తూలనాడిన మాట తూటలు,

తూకమింతని  తెలిసి మసలగ  తెలియ రమ్మని తెలిపె తక్కెడ !!

ధర్మ దేవత ధారణందున మసలు తూనిక తూకమేమని ,

కాలగతులను కలుగజేసెడి కనుల కదలిక తాళమేమని ,

కాళీ కాలిన అణిగి నలిగెడి వైరి వైనపు వివరమేమని ,

తెలియ గోరిన తెలియజేసెద – తరలి రండని తెలిపె తక్కెడ !!

తూనికెరుగని తక్కెడదిగో తుకామేయగ తరలిరండని ,

తూకమేసెడి మేటి సరకుల విలువ వివరము అడుగనన్నది !!

2 thoughts on “తక్కెడ

Leave a comment