భవదీయు బ్రోవవే !

లోచనంబుల మాటు ‘ఆలోచనవు’ నీవు,
ఆలోచనలు చూచు లోకంబులును నీవు!
లోకాల లోనున్న ‘కాల’ రూపుడ వీవు,
కనికరంబున కనగ కినుకేలనైయ్యా!

మాట మాటను మసలు నాదంబు నీవు,
నాదాన నర్తించు భావ మంజరి నీవు!
భావమందిన పలుకు మంజీరలయలందు,
లీలగా నర్తించు నటరాజు – నీవు!!

జిగిబిగిగ వడి వడిగ కదలు పదములనంటి,
కదిలి కరిగెడి కధలు అల్లునది నీవు!
అల్లికల బిగిలోన బిగిసి విలవిల లాడు,
వింత కధలను నీవే కడతేర్చరాద!

చేరి నిను సేవింప సంకల్పమును నీవు,
సంకల్పమును నడుపు చేతనవు నీవు,
చేతనందలి చెరిత చలనమును నీవే,
చేదుకొని చెరబాపి దరిజేర్చారాదా !!,

సాధు సంగా ! నేను “నేన”న్న వాడెవడు?
సావధానము నొంది సరకొంది వివరించు,
వివరమెరిగిక ముందు నేనెరిగినా ఉనికి ,
నీ ఉనికిలో కరుగు తరి తెలుపరాదా !!

ఏ భావములు పండి భావించితో నిన్ను!
భవతాప భయదూర దరిజేర్చుకో నన్ను!!
భవరోగా సంహార సరగుజేయుటమాని ,
భవ పాశముల నరికి భవదీయు బ్రోవవే !!!!!!

అంతా–తానె

ఆది ముందర వాడు – అంతమావల వాడు,

ఆద్యంతముల నడుమ అలముకున్నది వాడు ,

ఆనుపానుల నెరిగి జగతి నడిపెడి వాడు,

ఆనవాలుగ తానె జగతి నిండిన వాడు!!

ఆదమరచి తెలివి  తెలియ జేసిడి వాడు,

తెలియ జేసిన తెలివి తరల జేసెడి వాడు,

తెరిపైన తెలివైన తగిలి తెలిపెడి వాడు,

తరలి పోయెడినాడు తరలజేసెడి వాడు!!

నమ్మి కొల్చిన గురువు – గురుతు తెలిపిన దారి,

తెలివిలో పదిలముగ పదిల పరచెడివాడు!

పదునైన తరుణాన తగిలుండి తెలివందు,

తెలియ నెన్నిన తీరు తెలియజేసెడి వాడు!!

కలత నెరుగని వాడు కొలత కందని వాడు,

కలనైన ఇలనైన కలిగుండకల వాడు,

కలిగుండినాగాని కనుల గట్టనివాడు ,

ఉనికిగా ఉరమందు తెలియునది వాడు!!

నిన్న రేపుల మధ్య కుడి ఎడమ మధ్య,

నింగి నెలల మధ్య ప్రతి జంట మధ్య!!

మాలిమై మేలిమై మౌనాన ఒదిగుండి,

కరిగిపోయిన ఉనికి కిలిగుండు ‘వాడు’!

అట్టివానిని తెలియు తెలివి నందగజేసి,

ఆదరంబున నాదు అరమరలు సరిచేసి,

అందించినా తెలివి అనుభవింపగజేసి,

ఆదరించెడి ‘వాడు’ నను బ్రోచుగాక !!   

ఎక్కడో దూరాన

ఎక్కడో దూరాన ఏ కొండకొమ్మునో
కొలువుంటివని తలచి ఎలుగెత్తి పిలిచేను!
పిలుపు లో నాదమై నడయాడు నీవెయని,
ఎరిగి అచ్చరువొంది -మౌనమొందితి నేను!!

మౌనమందున జేరి మంతనంబులు సలిపి,
వివరమేదో నాకు వివరించనెంచేటి,
నిలకడెరుగని మనసు మధనంబు నీవెయని ,
ఎరిగించగానెవరో విస్తుపోయితి నేను!!

ఎరుక నేనని ఎంచి ఎరుగనెంచితి నిన్ను,
ఎరుగు తీరుల నెరుగ యోచనందుచునుండ,
యోచనందున నిలిచి యోచింపజేయు’నది ‘ (యోచింప చేయు ‘అది’)
‘నీవే’ యనెరిగింప – చెలితనైతిని నేను!! చెదరి చేతనలన్ని!!

చేతనందున చిందు చేతనత్వము నీవు!
పలుకులందున కులుకు కమనీయ నాదమువు!
ఎరుకవై ఎరిగించు ఎరుక యంతయు నీవె!
ఎరిగించు’నది’ ఎరిగి మోదమొందగ నీవే!!

చేతనై – నాదమై- యోచనై – ఎరుకవై,
దిశ దిశన దశ దిశల నిండున్న ‘అది’ నీవు,
అంతరంగము నీది- అచట స్పందన నీది,
సందు లేదయ ‘నాకు’ సందడేదో నెరప!!

ఉనికెరుంగని ‘నేను’ బేలనైతిని నేడు,
బెదరి చెదిరిన ‘నాదు’ బెరుకు మాపుము ఇపుడే!
నా యునికివై నీవె యురమందు మనుచుండు,
ఎరుకెరుంగని ఎరుక ఇకనైన మరలించు!!

                                       

నీట ముంచినవాడు

నీట ముంచినవాడు – రేపెన్నడో ఎపుడో ,
పాల ముంచకపోడు – చింత తీర్చక పోడు!
చిగురంత ఆ ఆశ – అనుదినము చిగురింప,
చేరి చెంతనేయుండి – చెలిమి పంచకపోడు!!

నీట ముంచినవాడు – వేడుకేదో పొంద,
గట్టు నంటుక నిలిచి – గమనించులే నన్ను!
మునిగి గుటకలువేయ – వేదనొందెడి నన్ను,
నిముషమైనా విడక – వెంట జంటగ నుండు!!

ఏమేమి తీరులివి – ఏమి ఎరుకను తెలుపు?
తలపు లోపలివాని – తలపు తెలుపగబోదు !
తెరపి నొందెడితావు – తరచి తెలియగ లేను,
తగిలియుండెడి తెలివి – తోడుండి కలిగించు!!

అనిలుడలిగిన నాడు – ఆదరించునో ఏమో !
మునక మునకన మనసు – మరుగెంచినా గాని,
తనువు ఓరుపు తరిగి – తలుప మరచినగాని ,
కొలువ దిక్కగువాడు – కరుణ నెంచక పోడు !!

పాల్కడలి పాలకుడు – పంతమెరుగని వాడు,
పోరినా కోరినా – చేరదీసెడి వాడు!
ఆదరంబేగాని ఆదమరువడు వాడు!
అందనెంచును నన్ను – ఎన్నడో ఒకనాడు!!

పాల ముంచకపోడు – చింత తీర్చక పోడు!
చిగురంత ఆ ఆశ – అనుదినము చిగురింప,
చేరి చెంతనేయుండి – చెలిమి పంచకపోడు!!

అక్రూర వరద

అక్రూరుడు బలరామ కృష్ణులను మధురకు తీసుకుపోవటానికి గోకులం వొచ్చి , కంసుని సందేశాన్ని విన్నవించాడు. నందుడు ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేయమని, పరివారాన్ని ప్రయాణానికి  సిద్ధం కమ్మని చెప్పి, ఆ రాత్రికి విశ్రమించి, ఉదయం బయలుదేరమని చెప్పాడు. నందునింట కృష్ణపరమాత్మ తో ఒక పూట గడపగల తన భాగ్యానికి ఎంతగానో మురిసిపోయాడు.ఆ మనోభావం భావించటానికి చేసిన ప్రయత్నం

పర్యంకమగు వాడు శైయ్యపై తోడుండ,

                          పురమునేలెడివాడు పవళించె నిపుడు!

                          నీరజాక్షుడు వాడు ఏ లీల తలపోసి ,

                           చిరునవ్వు చంద్రికలు ఒలికించె నిపుడు!

                         శిఖి పింఛ చామరము వీచు తల్లుల పాట,

                         అలనాటి లీలలను జోలగా పాడగా,

                         ఆలకించుచు తానె ఆనందమందుచు,

                         చిగురు వెన్నెల చిలుకు చిరునగవు పరచెనో! 

  కుంతలంబులు కదిలి కర్ణమందున జేరి,

                        వింత వింతలు ఏవో వివరించెనో నెమో!

                        కాలుడందగజేయు వివరముల వైభవము,

                         వనజాక్షి కెరిగించి వసతి నొందేనో!!

                     

  విందుగా ఆ మోము వీక్షించు వసతాయె,

                       వివరమేదను శంక సరిదారి కాదాయే !

                       కనికరము గొనలేని కనురెప్ప పాటులను,

                       పంతాన పలుమారు నిలువరింతును నేడు !   

శుక శౌనకులు మునులు కనలేని  నగవు,

                       నారదాదులు కనగ తపియించు  నగవు,

                       నగరి గెలిచినవారు కననెంచు నగవు,

                      ఆరబోసెను వాడు అందగా నిపుడు!!

                   

    భాగ్యమేమని యందు నా పూర్వజులది,

                       యదుకులంబున నన్ను జయింపజేయ!!

                       పూర్వ పున్నెములెన్ని- రాసులను గూర్చి,    

                       కంసుడంపెను నన్ను  ఈ  భాగ్యమంద !!

తామసులు వైరమున చేరవొచ్చినగాని

                       చేరినాడనివాని చేరదీసెడి కరుణ,

                       కోరి కైయ్యాము నెరపు  అహమందువాడైన,

                        కోరినాడని కోరి సంగమిచ్చేడి కరుణ! 

                       

చేరవొచ్చేడి వార చేరదీయుటెగాని , 

                       తొలగి పంతము లాడ తగని కరుణ! 

                        కాఠిన్య మెరుగనా నిండైన కరుణతో,   

                     దుడుకు లీలలు నెరప ఎటులోర్తునో ఏమో!!

 పాల్కడలి పొత్తిళ్ళ ఒదిగి పెరిగిన కన్య,

                       సోము సోదరియైన సుకుమార ముదిత,

                       ప్రియమార పలుమారు సేవించు పాదములు,

                       కరకు రక్కసులణనచ కంది అరుణిమనొందె !

                     

 పంకజంబుల బోలు పద్మాక్షు పాదములు,

                      ఆలమందల వెంట నడయాడ నొచ్చునని ,

                      పదమాను ప్రతి తావు పులకాంకులను బోలు,

                      లేత పచ్చిక మడుగు  పుడమి మొత్తగ పరచె!!     

అడుగడునా విరులు అందుమో మమ్మంచు,

                      అర విరిసి మధుపముల మరుగుగా జేసే!

                      లేగలందక ముందే అందుమో క్షీరమని,

                      ధేనువులు పలుమారు నిను కుడిపి మురిసే!

                    

   వ్రజ వాసులేనాడు ఏ నోము నోచిరో ,

                       దివ్య చరణములాడు తావులను నడయాడ!

                        సంగులై సరసమున  ఆ సంగతొందగా ,

                        తోయజాక్షుని తోడి జతగూడి కుడియగా!           

వారి వైభవమిపుడు వంతు నొందితి నేడు,

                       ఆ దివ్య చరణాల కనువిందుగా గాంచ!

                       ఖగవైరి పానుపున పవళించు శ్రీపతిని,  

                       కనుల భాగ్యము పండ కనియెదను నేడే!

                     

నందబాలుని నేను గొంపోవ ఓస్తినని

                       కలత చెందిన పల్లె నిదుర మానేనో ఏమో !

                       గొల్ల పలుకుల చినుకు రేయంత నిండే ,

                        అణగిపోవని సడులు పురమెల్ల  నిండే!

  జాములెందుకో  నేడు జాగరూకతలేక ,

                      రెప్పపాటున కరిగి కదలిపోయెను చూడ!

                      లేగమువ్వలు కదిలి  గానమేదో పలికె ,  

                      గొల్లలందెలు చల్ల సడులతో జత గూడె!!

                     

పూర్వసంధ్యల పలకరింపులు -పాల కుండన  చిందు ధారలు 

                       మేలుకొమ్మను విన్నపంబులు -మంగళంబను వాద్య నాదము

                        మెలి అత్తరు చందనంబులు – కుర్చీ చాదిన నూత్న గంధము

                        అవిసి దండలు అగరు ధూపము – కింకిణీరవ సంగతంబులు ,

                       తరుణమాయిక తరలవలెనని కరుణ నెన్నక కబురునంపెను!

కటిక కాలము నిలకడెరుగదు – నిలువరించెడు తీరులెరుగను,

                        పల్లె వాసుల పలకరింపున – మధుర భావము మరుగు జేరెను!

                        చలువ తెరలను అమరజేయుచు-తేరు తీరును చక్కదిద్దుచు

                        అన్నదమ్ముల ఆసనంబున కొసరి వసతిని కొంత కూర్చుచు !

                       

తేరు గమనపు తరుణమందున – నంద సుందరు తీరుగాంచక,

                        వాని శోభలనంది మురిసెడి – వనుల గాంచుట ఏమిభాగ్యము?

                        వాణి నాధుడు నేడు దయగొని – వింత చూపులనీయరాదా  !                         

వసతిగా నా వెన్ను వెంబడి కనుల కొలనులు కూర్చరాదా!!

ధరణి నాధుడు దయనుగొనినను దరిని జేర్చగ నెంచునో!

                        వైరి కపటపు విన్నపంబుల కబురు తెస్తిననలుగునో!!

                        మాధవా! మధుకైట భంజన! మనసునేలుము  చెలిమితో,

                        చెల్లజేయుము కుటిల కర్మలు కుర్చీ నీ దయ ఇంపుగా !!

గోవింద పట్టాభిషేకం

భాగవతం : గోవర్ధన గిరిని గోపాలుడు ఎత్తి పట్టి, ఇంద్రుని కోపం నుంచి తనను నమ్మిన వారిని రక్షించటం. ఇక్కడ ఇంద్రియములకు ‘గోవు’ అనికూడా అర్ధం చెప్పుకుంటూ, ఇంద్రియ శాసకులైన దేవతల నుంచి, గోవిందుడు రక్షించును , అని వివరిస్తున్నారు. గోవిందుని నమ్మి , ఆయన రక్షణ పొందిన గోపాలకులను బాధించలేని ఇంద్రుడు, ‘గోవర్ధన గిరిని ఎత్తిన గోపాలుడిని’ “గోవిందా” అని సంబోధించాడు. ఆ గోవిందునికి దేవేంద్రుడు సమర్పించిన అభిషేకమే “గోవింద పట్టాభిషేకం”

   నాకమేలెడి వాడు తన ఆలితోకలసి,

                            పరివారములు ఎన్నో వెన్నంటి  నడువంగ,

                            వైభవంబును గొనక వినయంబు బూనుచు,

                            నంద బాలుని పదములంటి  మ్రొక్కేను!!

                           గొల్ల గండడు వాడు క్రొవ్వినాడనుకొంటి,

                           దేవ కార్యము సలుప మన్ననెరుగడనంటి 

                           గొల్ల పల్లెల శోభ హరించనెంచితిని,

                           హరి హరీ నను గావు హరియించి అహము!!

 గోవు గాయగ నీవు గోలోకమును వీడి,

                           గొల్ల పల్లెల జేరి గోపాలకుని వోలె ,

                           ఆల మందల వెంట ఆడుటెరుగక నేను,

                           విర్రవీగితి నయ్యా – తప్పు గాయు !!

                          దితి సంతు దునుమాడి ధరణి గాచిన వాడ,

                          మూపుపై మంధరను నిలువరించిన వాడ,

                          లోకమెల్లను లోనే కలిగియుండిన వాడ,

                           గిరిని గొడుగుగ జేయ భారమగునే నీకు?

  బాలుడని తలపోసి భ్రమల నేనుండఁగ,

                           నమ్మియుంటిరి నిన్నే ప్రేమ మీరగ వీరు, 

                          ఇన్ద్రియంబుల నేలు ఇంద్రుండనని హెచ్చి,  

                           ఇంద్రాది పతివైన నీ మహిమ  కననైతి!! 

                          మన్నించి నా తప్పు ఆదరించుమనంచు,

                          దివి దేవతల రేడు దీనతన వేడగా,

                           మంద గాచెడి వాడు మందహాసముతోన,

                          సమ్మతంబును తెలిపే పురజనులు మురియా!!

మణి ఖచిత ఆసనము మక్కువతో అమరించి,   

                          దిక్కులన్నియు దివ్య శోభలతో సవరించి,

                        పుష్పబాణుని పిలిచి వనినేలగా తెలిపి,

                           వేయి కన్నులవాడు వైభవము నెరపే!!

                     

            యక్షులును కిన్నెరలు గంధర్వ గాయకులు,

                          తుంబురుడు నారదుడు వేదాంగ రూపములు,

                           దిక్కు లేలెడివారు ముల్లోకముల విభులు,

                           మునులు మున్నగువారు సేవించిరపుడు!

అమర సీమన నిలిచి వీక్షించు వారొకరు,

                           అరుదైన కానుకల నర్పించువారొకరు,

                           సుకుమార కుసుమాలు కురిపించువారొకరు,

                           గోవిందు వైభవము వివరించువారొకరు !!

                          దేవలోకపు వనులు వీడి తరలిన వనులు,

                           సురలోక గోష్ఠములు వీడు  సురభుల మంద,

                          అడుగిడిన వ్రజభూమి ఇల నాకమునుపోల,

                           వైభవంబందేను వైకుంఠ విభుడు !!!      

  సాటి వాడను తలచు గోపాల బాలుఁడు,

                          గోవిందుడను ఎరుక పురమెల్ల వ్యాపింప ,    

                          సంభ్రమాశ్చర్యాల మునిగి గోకులమంత,

                           వన వైభవమునందు తమ వంతు చేర్చే !!

                          నాటి ఆటలలోని వింతలన్నియు తలచి,

                           వివరమేదో ఎరిగి వివరించువారొకరు!    

                          ఒడిన ఆడినవాడు దేవాధిదేవుడని,

                          తెలిసి తమ భాగ్యమని మురిసెనింకొకరు!

                           సందియంబులు దీరి తెరిపి గలిగినదంచు,

                           తన మనంబున పొంగు మందలోనొకడు!   

గోవిందుడా వాడు! గోపాలుడనుకొంటి,

                          కొంటె చేతలనలసి కోపగించిన నన్ను,

                          ఏమంచు తలంచునో! చిబోయి అలుగునో!

                           నేరకెంచితినయ్యా నెనరుంచి మన్నించు,

                          మనసునెంచకు నన్ను మలినసంజాతనని,

                          అని మనమునే తలచు మౌనాన ఒకరు!!

                           నందు భాగ్యము తలచి ఉప్పొంగువారొకరు,

                           నందునంగన జేరి పొగడువారొకరు,

                           ఏపూజ ఏనాడు ఏరీతి జేసితిమో ,

                           దేవదేవుఁడిలను మన ఇంట జేరెనని,      

                      ఉల్లాసమున మునిగి ఊరడిల్లొకరు !!    

గోవర్ధనము నెత్తి గోకులము    కాపాడి,   

                             సురనాయకుని నుతులు లీలగా గైకొనుచు,

                             నిజరూప ఛాయలను తగువారికెరిగించు,

                             నీరజాక్షిని కథను భావించి ఆలించి,   

                           ఆనంద మొందరే మనసార జనులు !!!    

                                                                    

చెలిమి

నెలరేడు కురియనా అరుదైన సుధలు,
ఋతురాజు అందనా గంధాల గనులు,
కొసరి కుడిపెడి బలిమి నిండైన చెలిమి,
కలిమి కురియని మేటి సంగమిదె భువిని!

తరుగైన మెరుగైన తగిలుండు బంధంబు,
భారమెంచక బంధ భయము బాపెడి మందు!
విల్లు విడిచిన చెలుని చింతలన్నియు దీర్చి,
వన్నెకెక్కగ జేయు – చెరగ నేర్వని చెలిమి!!

పొల్లు గాయని అన్న భీతిగొలుపగజేయ ,
ప్రాణ భయమున పొల్లు కపివరేణ్యుని గాచి,
ధరణి నడచిన రేడు నెరపె ఆ బంధమును,
సంగ సౌరభ మహిమ – మహిన చాటిన చెలిమి!!

చిననాటి చెలికాడు చేరవొచ్చిన నాడు,
చేరి చెంతన జేర్చి – నాటి మాటలు తలచి,
మన్నించి మన్నించి మన్ననలు కురిపించు,
తారతమ్యపు సీమ తలుపు నేరని చెలిమి!

ఆగంధ మించుకై నెరిగి యుందము నేడు,
ఆ బంధ బలిమిగొని భాసింతమిక ముందు,
దేవ దేవుడు తానె తెలియ జేసిన తరిని,
తగిలి యుందము మనము తనువున్నవరకు!!

.

                  
                 
                
               

గోవు గాచినవాడు

గోవు గాచినవాడు – కావడే నన్ను,
మాయకవ్వలి వాడు – కావడే నన్ను!
ధరణి నేలెడి వాడు- కావడే నన్ను,
విబుధ వినతుడు వాడు – కావడే నన్ను!!

కరిని గాచిన వాడు – కావడే నన్ను,
ఫణుల నాడెడి వాడు- కావడే నన్ను,
శేష శయనుడు వాడు – కావడే నన్ను,
శేష మెరుగని వాడు – కావడే నన్ను!!

గుణము లెరుగనివాడు – కావడే నన్ను,
మంగళాంగుడు వాడు – కావడే నన్ను!
మురళి నూదెడి వాడు – కావడే నన్ను,
నాద రూపుడు వాడు – కావడే నన్ను!!

రేపల్లె బాలుడు వాడు – కావడే నన్ను,
రాస లోలుడు వాడు – కావడే నన్ను,
రమ నేలు పతి వాడు – కావడే నన్ను,
ముని సంగుడగు వాడు – కావడే నన్ను!!

                                  
                                  
                                  

నారసింహుడు

నారసింహుడు : నరసింహావతారము ధరించిన విష్ణువు.

 భక్త పరాధీనుడైన భగవంతుడు, భక్తుని కోరిక తీర్చటానికి ఏమైనా చేస్తాడు – అనటానికి, నరసింహ రూపం ఒక నిదర్శనం. జన్మ జన్మల ఎడబాటు ఓర్వలేమని, శాపవశాన సంక్రమించిన జన్మములందు వైరులుగా ప్రవర్తిస్తున్న తమని , సంహరించి దరి జేర్చుకోమని – జయ విజయులు చేసిన విన్నపాన్ని, స్వామి మన్నించక మనగలడా!

దుందుడుకు దితిపట్టి దుడుకు చేష్టలు మాప,
తానె కొమరుండాయె వైకుంఠ వాసుండు!!
కరుణ కురుయుటె కానీ కాఠిన్య మెరుగనా
కమల లోచనుడాయె వింతనరుడు!!

ఎడబాటు ఓపనా విజయుండు జయుడును,
చేరదీయుము మమ్ము చెరిత చెదరగజేసి,
మనలేము నినువీడి నీరజాక్షా యనుచు,
మొరలిడిన మొరనేల మరచునా విభుడు!

సాధు సజ్జనులందు వసియిన్చువాడంచు,
రక్షకుండై వాని వెన్నంటు వాడెయని
వారినిడుములు బెట్ట ఓపలేడని తెలిసి,
కవ్వించు తన భక్తు- మన్ననెంచడె వాడు!

గండు రూపమెగాని గుండె నవనీతంబు,
తుంటరైనా బంటు తరలింప జేయుటకు,
ఏ తావు నే పగిది ఏ మంచు తలచినా,
చేరి చెర బాపంగా అణువణువునా నిండె !!

వైరి భావన నెంచి పలుమారు తలపోయు,
తనబంటు తలపులన తగిలె తరుణముకోరి,
సంగంబు విడలేక తనయుడై సన్నిధిని,
దిన దినము అందించి ఆదరము నెంచే!!

మాయ మాటున జేరి మారాము మరిగినా,
పట్టి పట్టును మాన్ప పన్నగాధీశుండు,
వింత బొందినజేరి మారాము చెల్లించి,
చెమితో ఒడిజేర్చి లాలనను ఎంచే!!

నారసింహుడు వాడు కర్మఫలం చోరుఁడు,
చేరి ఇడుములు బాపు ఇలనడచు దేవుండు,
పిలిచినా తలచినా చింత తీర్చెడివాడు,
తనువు తరియింపఁగ తలుపరే వాని !!

శ్రీ లక్ష్మి నరసింహ చరణారవిందములకు భక్తితో

                             
                         
                       
                         
                        
                      
                     

                                   శ్రీ లక్ష్మి నరసింహ చరణారవిందములకు భక్తితో 

రామ రామ రామ రామ

రామ రామ రామ రామ – రామ నీలమేఘశ్యామ
రాఘవ రఘునన్దనా – అరి భంజనా – మము కావగ రారా !!

వానరులు నీ నామము నందగ – వివరమెరిగిన నారదు లాయిరి,
(నారద : పరమాత్మ జ్ఞానవిషయము ఇచ్చువాడు)
నీదు కార్యము నడచు బాటన – నిలిచి నీ పురి వాసులయిరి!
వారి సంతతి వారమే నయ – వివరమెరుగని మనసువారము,
నీదు నామాపు రుచిన మునిగెడి రచన మా మనుగడన చేయరా !!
రామ రామ రామ రామ – రామ నీలమేఘశ్యామ
రాఘవ రఘునన్దనా – అరి భంజనా – మము కావగ రారా !!

నామమందున నిన్ను గాంచిరి – కనుల గాంచాకె విబుధులెందరో,
పాద ధూళిన పావనంబై – గౌతముని సతి నాతి ఆయెను!
రాతి కఠినత సాటి ఎరుగని బండ మనసుల నుద్ధరింపగ,
రస నాడివై మా తనువు నాడుల నడయాడి రయమున చేదుకొనరా !!
రామ రామ రామ రామ – రామ నీలమేఘశ్యామ
రాఘవ రఘునన్దనా – అరి భంజనా – మము కావగ రారా !!