పూజ

                                                                                    పూజవైనపు వివరమెరుగను - మంత్ర తంత్రము లెరుగను,
నిలిపి మనసును నిండుగా నీ జాడ తెలియగ తెలియను!

 తీరుతెలియని తనువు తీరును - తీర్చ తీరుల నెంచితీ, 
 తగిన దండన నందజేయుచు - నిన్ను గొల్చుట నేర్పితీ!
 చంచెలంబగు చూపు దారులు - నిలువరించగ నెంచితీ, 
 రెప్పతలుపులు మూసి చప్పున- మరలు మార్గము నేర్పితీ!

 గాలి తరగల తేలుచు నా వీనులందిన నాదము, 
 మోహమై మది మందిరంబున మంతనాలను రేపునే, 
 మూయతలుపులు లేని వీనులు వేదనెంతగ నొందినా, 
 నాద ఘాతము నిలవరించెడి తీరు సుంతైనెరుగదే!

 వేదనాధుని ఇంతి వాహన మందు దారుల నందుచూ, 
 గంధమై నీ ఆరగింపులు ముదముతో మది జేరునే,
 నిలువరింపక మనసు దానికి రుచుల రూపమునిచ్చునే,
 ఏది దారయ నిలువరించను నాసికా విధి బాధను?

 మదిన పుట్టిన రుచులు మన్నన ఇంచుకేనా ఎరుగవే,
 జిహ్వజేరుక సందడించుచు రుచిని కలవర పరచునే, 
 నామమై నా నాల్క పలికెడి నాదమందున తడబడా, 
 లోపమాయెని విన్నవించుచు కాలమంతా గడచునే!

 తండ్రివై నీవంద జేసిన తనువు తుంటరిదందునా?
 అదుపునొల్లని ఇంద్రియంబుల బుద్ధిలోపమనందునా?
 ఉనికియై ఉఱ్ఱూతలూగే మనసు వైరని ఎంతునా?
 వాదమేలయ వేతల దీర్చెడి దారి నీ వెరిగించగా!

 శృంగారమమరిన వన్నెకాడవు జగము గాచెడివాడవె,
 మేలు మేలని నాడు నరునికి బోధజేసిన వాడవె,
 ఇంద్రియాణాం మనస్సోస్మని జాడ తెలిపిన వాడవె,
 తగున నీకిటు ఇడుములెంచగ తల్లడిల్లెడి నరులను? 

 దొంగాట మానుక నెమ్మదొందగ తరుగు గాదయ దేవరా,
 చిక్కి నీకిక చెదరకుందును గెలుపు లన్నీ నీవెగా,
 చిక్కుదారుల చక్కజేయగ చేరి నిను నే కోరను,
 కొలువగా నీ సన్నిధానపు కొలువు నీయర దయగని!

 పూజవైనపు వివరమెంచని పూజలను నే జేయగా,
 నెమ్మదించిన మనసు కమ్మగా నీదు జాడల తెలుపగా! 

హక్కు

     
         పూజ జేసితినంచి వరమీయ వద్ద,
         దానమిచ్చితినంచు దయ చూడవద్దు,
          జనకుడవు నీవయ్య జనని ఈ జగతి,
          తనయుండనౌ నేను వెలితొంద తగునా? 

         విరివనంబుల నిచ్చి విరితూపు లిచ్చి,
          అనువుగా లయనొందు మధురూహలిచ్చి,
          విరులన్ని నీవంచు పూజకే విరులంచు,
         విరస నియమములుంచి వేదించ తగునా?

         నింగి జాబిలినిచ్చి జిలుగు తారలనిచ్చి,
         తెలిమబ్బు తెరచాటు దోబూచులాడించి, 
         మౌనంపు వేళ ఇది మరలు నీవనటంచు, 
         నిదుర బిగి కౌగిళ బిగియించ తగునా? 

          వివిధ శోభల తూగు వసుధ నెలవైనా,
          కనువిందు సేయగా పలు శోభలున్నా,
          కుడుపు కోర్వని తనువు తగులు ధ్యాసొక్కటే,
          కడతేరి తరి దాక కుడువుమన తగునా? 

         రమ్యమైనీ జగతి రచియించి మురిసేవు,                                                                                                                       
         జీవజాలము నెల్ల ప్రభవించి మురిసేవు, 
         సరిజోడుతో నీవు సావకాశము నొంది, 
         సంతు తిప్పల బెట్టి  పరికింప తగునా?

         నీ పాలులో కొంత పంచీయమన జాల,
          నీ సాటి నేకూడ శయనింతు నన జాల,
         తల్లి లాలన కొంత తండ్రి తమకము కొంత, 
         కలబోసినా సొగసు నేనొంద తగనా?

        సంతనుచు చాటేవు చౌక గాదయనీకు,
        అనుదినము నీ సంతు యాచించ నిన్ను?
        పూజ దానములంది బదులిచ్చు పనిమాని,
       పుణికి మురిపెము కుడుప మము జేర రాదా!

నడక తోడు

కరుణ నిండిన చూపు తోడుండవలె గాని,
కరుకు దారుల నడక పరుషమన జాలా!
పాల్కడలి ఉయ్యాల జంపాల ఊపుతొ,
లయనొందు తోడుండ నడచినే రానా!

దుడుకు నటనలవాడు నగమంది ఆడినా,
అమ్మతోడుండునని నే నెరుగ లేనా!
ఆడితప్పని రాజు ఆనతందిన రేడు,
అడవి నడచిన నాడు తోడు వీడేనా?

ముని మౌన భవాలు భావించె నిన్నంచు,
నడచి కాననలందు కరుణించలేదా?
కదలలేనొక ఇంతి పలుమారు తలపోయ,
కలత తీర్చిన నిన్ను జగమెరుగలేదా?

తోడు నీవని నమ్ము మీరాకు సఖుడవై,
సక్కుబాయిని గాచు చేదోడు చెలుడవై,
సూరదాసుని కంట నడయాడు చూపువై,
నాడు నేడని లేక జత నుండ లేదా?

సురలైన నరులైన ధరనేలు దొరలైన,
సంగరహితులనెంచు ఘన యోగులైనా,
జంటనాగుల పురపు వసతొంద వలెనన్న,
 తోడీయమని నిన్ను పలుమారు వేడరా?

ఆ తోడు నా తోడు విడివడని తోడుగా,
వెన్నంటి నా వెంట నడచి రావలెగాని,
కటిక కంటకమైన కాననంబైనా,
కొదవొందనా జతను కని మురియలేనా?

కరుణ నిండిన చూపు తోడుండవలె గాని,
కరుకు దారుల నడక పరుషమన జాలా!
పాల్కడలి ఉయ్యాల జంపాల ఊపుతొ,
లయనొందు తోడుండ నడచినే రానా!

ఓటినావ

ఓటినావిది నేరకెన్నితి నేరమెంచకు గురువరా!
నాటిచేతల ఫలము సైపగ ఓరిమింతయు లేదయా!
చేటుకాలము దాపునుందని తలచి వగవగ నెంచెదా,
ఎంచి నీ పదమందు దారుల ఎంచనే నెపుడెంచదా?

    నింగి చెందురునంద నెంచిన సంద్రమందున నడకయా!
    ఆటుపోటుల పాటుగాచెడి లంగరిందున లేదయా!                                                                                                                  
   నిలకడెరుగక అలల వాలున ఊయలూగెడి నడతయా!
   నదురు బెదురుల బాపు వైనము ఎరుక తెలిసేదెపుడయా?

   పందెమేయుచు పరుగు తీసెడి పిల్లగాలుల నెలవయా!
   గాలిసందడి నదుపు జేసెడి తీరుతెన్నులు లేవయా!
   గాలివాటమె నుదుటిరాతని నీరసించెడి నడతయా!
   నలిగి మలిగెడి మనసునోర్పును నింపు దారెపుడెంచెదా?

  దారిలేనీ జగతి దారులనంటి నడచెడి నావయా!
  దరికి జేరెడి దారి నడిపెడి వైనమేదిట లేదయా!
  నడచు దారుల దీన దశలన మోదమించుక లేదయా!
  గురినెరింగెడి గురుతులందెడి గడియలెన్నడు గాంచెదా?

   చుక్కాని నీవై చేటుదారుల దాటు వైనము జూపరా!
   గాలివాటపు పోటుమాపెడి చాపవై తెరపీయరా!                                                                                                                 
   లంగరై నా నావ నడతను నిలవించగ నెంచరా! 
   ఓటినావకు నావికుడివై మేటి దారుల నడుపరా!
           
     నాటిమూటలు నీటిపాలౌ బాటలో నను నడుపరా!
      నేడు నిజమై నిలకడొందగ డెందమున నెలవుండరా! 
       ఎంచనాదను దేదిలేదను ఎరుక నిండుగ నింపరా!
        ఓటిదైనా మేటిదైనా నావనీదని ఎంచగా!

తెరుపు – మరుపు

తెల్లవారిన వెలుగు సందడి తట్టిలేపిన మేలుకొల్పుకు,
చెదిరి కలలిక కనులు విప్పితి కటిక చీకటి తొలుగగా!
వెలసిపోయిన వన్నెచిన్నెల కలల తలపులు తోచగా,
హాసరేఖలు మొలచి మోమున మురిపెమెంతో నిండగా!

                తోటివారట సాటివారట నమ్మి నడచిన బంధుజనులట,
               పంతమేదో పొంతనేదో పొదిగి అల్లిన చిక్కు వలల లో, 
               అల్లిబిల్లిగ ఆడుకొనుచూ  అదుపు మరచిన ఆదరంబున,
               సొంతవారని వీడబోమని నమ్మబలికిన చెలిమి బాసలు,
               రెప్పమాటునె మిగిలిపోయెను రేయిగడచిన వేళలో! 

|| తెల్లవారిన వెలుగు సందడి తట్టిలేపిన మేలుకొల్పుకు,
చెదిరి కలలిక కనులు విప్పితి కటిక చీకటి తొలుగగా! ||

కనుల నిండిన ఆదరంబున కబురు తెలిపే కన్నకూనలు,
కనులు పండగ కంటిమంటూ కలువరించే కన్నపేగులు,
కటిక చేతల కబులురులెన్నో కూర్చి పేర్చిన కొలువు దారులు,
వాటమిదియని వొదిగి ఎదుగని వెన్నునిమిరిన తోటి చేతలు,
జాడవీడకె కరిగిపోయెను కనులు వీడిన వేళలో!
|| తెల్లవారిన వెలుగు సందడి తట్టిలేపిన మేలుకొల్పుకు,
చెదిరి కలలిక కనులు విప్పితి కటిక చీకటి తొలుగగా! ||
నేటి నిజమిది నాటినిజమది ఏది నిజమని నమ్మెద?
నమ్మదగినా మర్మమేమని నమ్మి ఎవరిని ఆడిగెదా?
ఎదిగి ఎరిగిన వారు నమ్మిన మనసు మర్మము నెరుగగా,
మాయపొంతన పొందుదారుల మనుగడెంచగ మాననా!
రెప్పమాటునె నిలచు వానిని ఎరిగి కన్నులు నిండగా!
తెల్లవారిన వెలుగు సందడి తట్టిలేపిన మేలుకొల్పుకు,
చెదిరి కలలిక కనులు విప్పితి కటిక చీకటి తొలుగగా!
వెలసిపోయిన వన్నెచిన్నెల కలల తలపులు తోచగా,
హాసరేఖలు మొలచి మోమున మురిపెమెంతో నిండగా!

గమ్యం

మరలి ప్రాణము మనసు జేరెను – ఉనికి ఆయెను ఇంద్రియంబులు,
మాటువేసిన వేటగానికి వేటయై మరుగాయె మనసును!
మంతనాలిక చెల్లినాయని తరలిపోయిరి తోటి మనుషులు,
మిలుగు అస్థికలంద గోరుచు వేచి చూచెను క్షుద్రజీవులు!

                           ఏమి కూడెను ఏమి తీరెను ఎరుకగొనగా తరుణమాయని, 
                           మన్ననించుక జూపజాలక తొందరించిరి కాల భృత్యలు!
                           ఏమి వీడితి ఏది వీడితి వివరమింకను ఎరుగకుంటిని,
                           ఏలనో స్మృతి సందడించుచు వింత భావన కుడుపజొచ్చెను!

  స్వాగతించిన తల్లిదండ్రులు సరసమాడిన సాటిదోస్తులు, 
  పాటలంటూ పాఠమంటూ పథము జూపిన పాఠశాలలు,
  బ్రతుకు తీరిది బ్రతుకుమంచు దిశను చూపిన ఒజ్జవేల్పులు,
  కరిగి ఊహల నీడలై నిసి వీధులంబడి తరలిపోయిరి! 

                        కణము కణనమును కూడగట్టుక కూర్చుకున్నా మిన్నదేహము, 
                        కణము యొక్కటి మచ్చుకైనా మిగులు టెంచక చెల్లిపోయెను, 
                        రేయి పగలని రేపు మెరుగని అలసటెంచక కుడుపు మానుక,
                        కూడబెట్టిన కాసులన్నీ - చెల్లి చీకటి నీడలాయెను!

    ఏమి నేర్చితి నేమి కూర్చితి తీర్చి ఏమిపుడేగుచుంటిని?
    ఊహలివి యని కల్లలివి యని కొంత మనసున ఎంచినా,
    కల్లగానిది కానజాలక కలల వాలున కడలి నీదితి , 
    తీరమిది యని తీరికిదియని ఎంచు తరి ఇదనెంతునా?

                            కాలకింకరు లెంచి నన్నిక కమలనాభుని జేర్తురా?
                            తెరచి కన్నులు కమల నెత్రుని కన్నులారగ జూతునా?
                            వన్నెచెదరని వన్నెకాడట వాడుటెరుగని నగవువాడట,
                            వాలుకన్నుల వారిజాక్షిని ఉరమునందిన  అందగాడట,
                            వేద వనితల నిత్యపూజలు విడువకందెడి ఒజ్జవాడట,
                            మునివరేణ్యుల మౌన నాదపు సారమందెడి సూరివాడట, 
                            విడచి ఏలిటు వెడల నెంచితి -వివరమేమని తెలుపునో!
                            తరలి నేనిక మరలబోనని విన్నవింతును తీరుగా,
                            విడువ బోకిక విభుడవీవని వేడుకొందును మెల్లగా!

రక్ష

కాళి రక్షగు నీకు – కైలాస పతి రక్ష,
కామ జనకుడు రక్ష – కామాక్షి రక్ష,
కార్తికేయుడు రక్ష – మోదక ప్రియు రక్ష,
కాలమంటని కరుణ అడుగడుగు రక్ష||

 పద్మనాభుడు రక్ష - పద్మాక్షి రక్ష,
 పంకజాసను రక్ష -  ధవళాంగి రక్ష,
 ప్రమాధిపతి రక్ష -  పరదేవి రక్ష,
 పరమ పితయగువాని అడుగడుగు రక్ష||

 ఫాల నేత్రుడు రక్ష - పరమాత్మ రక్ష,
 పాల్కడలి నేలేటి - పరమేశు రక్ష,
 పాప నాశిని రక్ష - పవనాత్ము రక్ష,
 పాంచాలి రక్షకుని అడుగడుగు రక్ష||  

 రాకెందు ధరు రక్ష -  రమాపతి రక్ష,
 జగమేలు జనకుడా శ్రీనాధు రక్ష,
 ఆనాటికానాడు ఏదారి నడచినా,
 నడచి తోడుగ నిన్ను రక్షించు గాక||

మనవి

గోపాలబాలుడు గానలోలుడు – గోపమానస చోరుడు,
సురవైరి అన్నెపు చోరుడు – ఆ నంద గోపుని బాలుడు!

సుడితిరిగి గాలై వీచినా – పెను ధేనువై దరిజేరినా,
కమలాసనుండే చోరుడై తన సాటివారిని దాచినా,
గోపకాంతల గోరుముద్దలు కుడుచు ముచ్చట మానడె,
సంకటంబుల బాపు చేతల తీరులో వెనుకాడడే!
||గోపాలబాలుడు గానలోలుడు – గోపమానస చోరుడు,
సురవైరి అన్నెపు చోరుడు – ఆ నంద గోపుని బాలుడు||

పసిపాపడని లాలించు తల్లుల తీపి ముచ్చట దీర్చుచూ,
తనరాకకై తపియించు వారల శాపపాశము బాపునే,
గొల్లవాడల నాడుచూ తన లీలలెన్నో చూపుచూ,
మంతనాలన గోపమనసుల నంద ధామము చేర్చునే!
||గోపాలబాలుడు గానలోలుడు – గోపమానస చోరుడు,
సురవైరి అన్నెపు చోరుడు – ఆ నంద గోపుని బాలుడు||

ఆ నందబాలుడు ఆడినావని – ఆదమరచెను నేడిక,
అరుదైన ఆ సడి ఉడిగి దాగెను నేటి సందడి చాటున,
అంది అసురులు విందుగా భువినేలుచున్నా ఉలకడే,
అవని వాసుల మనసు మాటున ఒరిగి జోలలు మానడే!
||గోపాలబాలుడు గానలోలుడు – గోపమానస చోరుడు,
సురవైరి అన్నెపు చోరుడు – ఆ నంద గోపుని బాలుడు||

రంగడై భువినడిచి నడుగులు మరల సందడి జేయగా,
హత్తిరాముగ దాసు గాచిన వేంకటేశుడు పలుకగా,
రామదాసుని మొరల నెంచిన రాముడే భువి నడువగా,
ఎంచి ఏమని విన్నవింతును వాని కన్నులు వీడగా?
||గోపాలబాలుడు గానలోలుడు – గోపమానస చోరుడు,
సురవైరి అన్నెపు చోరుడు – ఆ నంద గోపుని బాలుడు||

గోపబాలా గానలోలా – గోపమానస చోరుడా,
సురవైరి అన్నెపు చోరుడా – ఆ నంద గోపుని బాలుడా!
తీరెరుంగని తరుణమిదియని కరుణ నెంచుమొ మాధవా,
కరుణ చిందెడి కనుల రెప్పలు విప్పి చూడుము దేవరా,
జగతి జాడ్జము మాపు ఊహలు ఊది ధరణిని గావరా,
మానవాళికి మురళి నాదపు మధుర పానము నీయరా!
గోపబాలా గానలోలా – గోపమానస చోరుడా,
సురవైరి అన్నెపు చోరుడా – ఆ నంద గోపుని బాలుడా!
*******

*

హరి హరణ

హరియించెడి వాడవంచు కడు కీర్తినిగొన్నవాడ,
హరియించెడి లాఘవంబు హెచ్చుగ గల్గినవాడ,
హరణన మోదమునొందుచు పలు లీలలదేలువాడ,
హరియింపగ నా కలిమిని అరుదెంచవె వడిగా!

మువ్వల రవ మణగించుచు ముంతల జేరెడి విద్యను,
సవ్వడి సుంతైన లేక అరి మూకల నార్చు విద్య,
అల్లన వేణువు నూదుచు మందల మరలించు విద్య,
కూర్చిన సుందర రూపుడ – నా పురి కేగెడిదెపుడో!

కుడిచెడి కుడుపుకు తోడుగ సంచితమును కుడుచు విద్య,
నెయ్యము కయ్యమునైనా కడతేర్చెడి గొప్ప విద్య,
జగడపు ఆటల మాటుగ మెలకువ వెలయించు విద్య,
కూరిమి నందిన గొల్లడ – నా దెస కేగెడిదెపుడో!

కన్నుల నూరెడి కలలకు జీవము నొనగూర్చు విద్య,
మన్నన నొందిన మనసున మనుగడ సాగించు విద్య,
కలిమికి లేమికి కలిమిని కూరిమితో నొసగు విద్య,
ఎన్నిక గొని గొన్నవాడ – నను ఎన్నుట ఎపుడో!

కాలము నీ చెలెయైనా ఓరిమి సుంతైనెంచదు,
అందపు అందెల సందడి అలుపెరుగక పలికించును,
దరి జేర్చెడి ఆదరణై లాలనతో ఒడిజేర్చును,
ఎంచిన పాలును పంచుచు తనపాలందుట మరువదు!

హరియింపగ తగిన తేరు తీరము దాటిన తరుగగు,
తామసహర హరియించెడి తరుణము నెంచగ తగునా,
తొందరపడి హరియింపుము సంచిత పాపపు దొంతులు,
దొరనీవని దయగొనమని మరిమరి వేడెద వినుమని!

హరియించెడి వాడవంచు కడు కీర్తినిగొన్నవాడ,
హరియించెడి లాఘవంబు హెచ్చుగ గల్గినవాడ,
హరణన మోదమునొందుచు పలు లీలలదేలువాడ,
హరియింపగ నా కలిమిని అరుదెంచవె వడిగా!

Happy Birthday

కనుచూపానెను తీరము – బహుదూరపు బాట తరిగి,
కన్నుల గట్టని నీడలు – కరములు జాచుమచు పిలిచెను,
కలచెదిరెడి కాలమాయె – కాలుని సడి వీనులానె,
కలవరమెంచక మీరిక – మరుగున నను మననిండు!

వాడని తలపుల ఊసులు – తలపున నిలుపగ మానుము,
వీడిన బాటలు మనవని – వీగిన సంగము మనదని,
మన్నన నెంచరె మనసున – మరలగ మీ బాటవెంట,
మరులన ముంచెడి మాయను – మది కావల నిలువరించి!
|| కనుచూపానెను తీరము – బహుదూరపు బాట తరిగి,
కన్నుల గట్టని నీడలు – కరములు జాచుమచు పిలిచెను||

వారిజ నయనుని వాకిట – వేచెద నే వెతలుమాని,
వనజాక్షుని కొసరి కొలువ – అరిగెడి దాసుల కొలుచుచు,
కోమలుడా పద్మాక్షుని – లీలల వీనుల నందుచు,
వరమౌనులు వరియించిన – వరదాత్ముని పిలుపుకోరి!
|| కనుచూపానెను తీరము – బహుదూరపు బాట తరిగి,
కన్నుల గట్టని నీడలు – కరములు జాచుమచు పిలిచెను||

పూజలు కొరవడి నేనట – కొలువందక మననున్నా,
మన్ననయే నా మనసుకు – మాధవు వాకిట నిలువగ,
మదనాంతకు మనోహరుడు – మానిని మానస చోరుడు,
ఆర్తుల మొరలాలింపగ – తరలెడి తరి నే నెరుగొందుదు!
|| కనుచూపానెను తీరము – బహుదూరపు బాట తరిగి,
కన్నుల గట్టని నీడలు – కరములు జాచుమచు పిలిచెను||

కనికొందరు – విని కొందరు – మనమున తలచుచు కొందరు,
వాదములాడుచు కొందరు – చెలిమిన చేరుచు కొందరు,
వైరము నందుచు కొందరు – వైకుంఠుని చేరు కధలు,
విడువక ఎరుగొందు దారి – విడువక నిలచుటె మేలగు!
|| కనుచూపానెను తీరము – బహుదూరపు బాట తరిగి,
కన్నుల గట్టని నీడలు – కరములు జాచుమచు పిలిచెను||

మరలిక నే రానంచు – వగవంగా తగదు మీరు,
మరలుటెరుగని దారి – పిలుచు మిమ్ముల గూడ,
వేచియుందును నేను – జత జేర మిమ్మచట,
పంచుకొందుము జతగ – పద్మాక్షు కథలెన్నో!

కనుచూపానెను తీరము – బహుదూరపు బాట తరిగి,
కన్నుల గట్టని నీడలు – కరములు జాచుమచు పిలిచెను,
కలచెదిరెడి కాలమాయె – కాలుని సడి వీనులానె,
కలవరమెంచక మీరిక – మరుగున నను మననిండు!
కలవరమెంచక మీరిక – మరుగున నను మననిండు!