తుది తోడు

యమదండన నమలు జేయ – దూతలు ముంగిట నిలచిన,
మూగెడి వేదన వెరపున తెరపెరుగక పలుక లేక పలుకక యుంటే,
ముందటి పూజల పుంతలు అక్కర కొక్కటియురాక తరుగైపోతే,
తోడుగ నే నున్నానని నగుమోము జూపి నన్ను మనుపగరాదా!

నిండితివట లోకంబుల నిండుగ నీవెల్ల జగము నిండుగనుండ,
నిగిడిన తేజము గల్గిన నిర్మల నభ లోచనముల లోకముజూడా,
నిను నే నెరుగుట చోద్యము నీ వెరుగక పోవుట చోద్యము,
చోద్యపు చేష్టల మానుక చేరుము నా చెంతనీవు చింతలచిదుమ!

పున్నమి కిరణము సోకగ పులకించెడి పుడమి పైని మొలకవు గావె,
మొలచిన మొగ్గల బుగ్గన మురిపెముతో ముద్దాడెడి తెమ్మెర గావె,
తరలుచు మరలుచు జీవుల జీవంబును నిలువరించు ఊపిరిగావె,
ఎన్నగ నెరుకకు రానా ఎరిగింపగ నీవు దలుప వెరపును బాపా!

వాదము లాడగ తగునా తరుగగు పలు దాసజనుల తోడుగ నీకు,
వేదన బాపెడి దొరవని వెరపును మాపెడి సఖుడని వేడిరె నిన్ను,
మిన్నక యుండుట తగునా మిన్నగు యోచన తరుగని విశ్వుడ నీకు,
కన్నుల కనగల తీరున కనికరమున పొడగట్టుము భవభయ హరణా!

బాస

తరలు కాలంబాయె తరలింప వస్తిమని – దూతలిచ్చట వచ్చి నిలచినపుడు,
దొరుకదేమో నీదు తోడన్నభయముతో – నిగిడి నీరసమొంది మరుగునపుడు ,
గట్టిగా నా చేయి పట్టినడిపెద నంచు – ముచ్చటైనొక మాట చెప్పరాదా!

గొల్ల పల్లెల లోన పిల్లలాటల నాడి – పెక్కు రక్కసి మంద నణచినపుడు,
తోడు ఆడినవారు తరియించు తీరులను – తేట తెలుపక నీవు తొలగినావు!
తెలియగోరిన వారి తలపులందుదయించి – తపియింపగా జూసి మురిసినావు,
తుంటరాటలు నీకు – తగని వేదన మాకు – ఆదరింపుము మమ్ము అండజేరి!

నగుమోము కనులార గాంచు గోకులమంత – నారాయణా యంచు పిలువలేదు,
కంసుడంపగ వచ్చి మాటేసినసురుండు – మధవా యని నిన్ను పొగడలేదు,
రచ్చజేసెడి వారలేరీతి తగునంచు – రమ్యమగు నీ నెలవు నొసగినావు?
లీల మోదము నీకు – తగని వేదన మాకు – ఆదరింపుము మమ్ము అండజేరి!

అమ్ములెరుగని విల్లు అలవోకగా బట్టి – వెదురు నాదపు శరము యెదన నాటి,
మోహపాశము ద్రుంచి మోహాన ముంచితివి – మధుర కేగెడి నాడు పల్లెవిడిచి,
పాతకంబుల రొంపి హరియించు హరివంచు – పలుక నేర్వని మమ్ము పలుకరించి,
పలికించి నీ పలుకు -పురము ఒరిగెడి నాడు – ఆదరింపుము మమ్ము అండజేరి!

 

 

 

రుచిగల మందు

భవ బాధల హరియించెడి బహు రుచిగల మందు
భాగవతులు గొని మురిసెడి బహు వింతగు విందు
భాగ్యములుప్పొంగ పొంగి మది నేల పసందు,
సుందరుడా శ్రీనాధుని లీల నే విందు !

తగులగ నెన్నగ తగునది తలచిన ఎవరైనా
తొందరపడి తొలగించును తాపము లెనైనా
తరలించును తామసములు తుదినొందెడిదాకా
తనివొందగ తగిలుండరె తామస హరు విందు!
|| భవ బాధల హరియించెడి బహు రుచిగల మందు
భాగవతులు గొని మురిసెడి బహు వింతగు విందు ||

పంతంబుల తెగనడిపెడి పసగలిగిన మందు,
పసివాడగు ప్రహ్లాదుడు మదినమ్మిన పొందు,
పలుమారులు పలికగ పలు వీనుకది విందు,
పవనాత్మజు డాదరమున కొనియాడిన ఇమ్ము !
(ఇమ్ము – ఇంపు,సుఖము)
|| భవ బాధల హరియించెడి బహు రుచిగల మందు
భాగవతులు గొని మురిసెడి బహు వింతగు విందు ||

కోసల నేలిన రాజని కొనియాడగ తగదూ,
కామిత వరదుడు వాడని నుతియింపగ తగదూ,
కౌస్తుభ మణి కలవాడని కామింపగ తగదూ,
కోరిక లణచెడి చెలుడని ప్రణుతింప పసందు!
|| భవ బాధల హరియించెడి బహు రుచిగల మందు
భాగవతులు గొని మురిసెడి బహు వింతగు విందు ||

వదలక వేడెడివారల వదలని పెను పరము,
వాసవ ముఖ్యలు వదలక కొనియాడెడి పురము,
నాదముగా నారదముని నాదించెడి నిగము
వ్యాసాదుల శోధనలో భాసించిన వరము
||భవ బాధల హరియించెడి బహు రుచిగల మందు
భాగవతులు గొని మురిసెడి బహు వింతగు విందు
భాగ్యములుప్పొంగ పొంగి మది నేల పసందు,
సుందరుడా శ్రీనాధుని లీల నే విందు !

హరి మనోహర

రమావినోది వల్లభా ఉమామహేశ దుర్లభా
సురేశ శ్రీశ సన్నుతా తమోమయా సదాశివా

సునాద మోద మానసా సునంద నంద మోదితా
అమోఘ లాస్య సేవితా సదా వసంత శోభితా
|| రమావినోది వల్లభా ఉమామహేశ దుర్లభా||

హిమాద్రి కన్య సేవితా ఉదార భవ్య మానసా
భవాబ్ధి బాధ నాశకా – కుమార ధాత శంకరా
|| రమావినోది వల్లభా ఉమామహేశ దుర్లభా||

మనోవికార నాశకా సుధాబ్ధి పాల మోదకా
అనంగ శోభనాశకా అనంత శేష సేవితా
|| రమావినోది వల్లభా ఉమామహేశ దుర్లభా||

హిమాద్రి కీల సుస్థిరా అపర్ణ చిత్త సంస్థుత
మహా గణేశ సేవితా – అనంత తాండవ ప్రియా
|| రమావినోది వల్లభా ఉమామహేశ దుర్లభా||

శివే ముకుంద మోదకా – మహా వినాశ కారకా,
సదా మునీశ సేవుతా – కరాళ అంగ భూషితా
|| రమావినోది వల్లభా ఉమామహేశ దుర్లభా
సురేశ శ్రీశ సన్నుతా తమోమయా సదాశివా ||

రారా బాల కిృష్ణా

దివ్యచరణ మంగళ కరణా – కనక మణిమయ మాలా భరణా
నూపురంబుల సందడి జేయగ – అడుగు లేయుచు రారా బాల కిృష్ణా – దివ్య చరణా మంగళ కరణా

పసిడి పుట్టము కటినమరింతును – మువ్వలమరిన మొల నూలుంతును,
మురిపెమున నీ ముద్దుమోమున – మౌక్తికమునీ నాసిక నుంచెద .
రారా బాల కిృష్ణా – దివ్య చరణా మంగళ కరణా

కస్తూరితొ నే తిలకము దిద్దెద – బొండుమల్లెలు సిగలో నుంచెద,
చిత్రమేఖల వాసిగ నొసగిన పింఛమును నీ కొప్పున నుంచెద –
రారా బాల కిృష్ణా – దివ్య చరణా మంగళ కరణా

మకరకుండల శోభను పెంచగ – వీనులందున వాసిగ నుంతును,
కుంతలంబులు కుదురుగ నుంచగ – అగరు గంధపు నూనెను ఉంతును ..
రారా బాల కిృష్ణా – దివ్య చరణా మంగళ కరణా

మేలి ముత్యపు సరులన పొదిగిన కౌస్తుభంబును మొడనమరింతును,
ముంజేతులపై మణులను పొదిగిన కడియమును నే నుంచెద …
రారా బాల కిృష్ణా – దివ్య చరణా మంగళ కరణా

సిరులు పొంగెడి చెందన గంధము చక్కనగు నీ మేనిన ఉంచెద,
దోరగాచిన పాల మీగడ కండ చక్కెర తోడుగ నిచ్చెద ..
రారా బాల కిృష్ణా – దివ్య చరణా మంగళ కరణా

వనములచ్చిన మిన్నగు విరులును తులసి దళములు జేర్చిన మాలను,
ముచ్చటగునీ ఉరము నాడగ – మదము మీరగ నే నమరింతును …
రారా బాల కిృష్ణా – దివ్య చరణా మంగళ కరణా

గొల్లభామల గుంపుల నాడుచు తగని మాటల చేటున జేరకు,
వెన్న దేలెడి చల్ల కడవలు దండి దండిగ ఉన్నవి ….
రారా బాల కిృష్ణా – దివ్య చరణా మంగళ కరణా

కరమునందున వేణువు నుంచెద – వేణువుకు నే కుచ్చులు గట్టెద,
నందబాలా తొందరింపుము – తోడు నీవని మందలు వేచెను …
రా రా కిృష్ణా – దివ్యచరణా మంగళ కరణా

 

 

 

 

 

స్నేహావతారం

భక్తుల కోసం ఏ రూపమైనా ధరించగల వాడవు,
దైత్యల కోసం వింత వింత రూపాలు ధరించగల వాడవు,
చెలుల కోసం మనోహర రూపాలు ఎనైనా ధరించగల వాడవు,
నేను పైన చెప్పినవి ఏవీ కాక పోయినా, నాలో నీవే కదలాడుతున్నావు,
దయతో నాకోసం ఒక సఖుని రూపం ధరించి నా తోడుగా ఉండు
నవ్వు తప్ప మరే స్నేహం ఆశించని అదుపు నువ్వె చెయ్యి
అదును చూసి నన్ను ఆదరంతో వశపరుచుకో,
అర్పణ అంటే తెలియని నాకు – ఆ ఆనందాన్ని ఎరిగించి -కలిగించు ….

పంతములాడెడి దైత్యల వింతగు కోరిక దీర్చగ,
పలు లీలల నల్లగ చెల్లును నీకే తామస హరణా,
పాలింపవె నను ప్రేమతొ చక్కని ఒక రూపునొంది,
చిలుకుచు నీ చిరునవ్వులు చింతల తొలగంగా!

దితి సంతును దునుమాడగ భువిజేరిన రూపంబులు,
ఘోరపు కోరలు కల్గియు కన్నుల దయ కురిసేనట,
కామిను లెంచని రూపము కామించిన నీ నెచ్చెలి,
ముప్పిరి గొను మోదంబున నీ అంకము నమరె!

కమలోద్భవు కన్నుగప్పి వేదంబులు హరియింపగ,
మునిగిన నాదము గావగ మీనంబై మునిగితివట,
మున్నీటాటల మోదము ఎంతెంతగ గలదొ గాని,
కూర్మంబై మందర గిరి మునుగకుండ మోసితివట!

వటువుగ సుర నాయకుణ్ణి యాచించితి వొకనాడు,
కపిలుడివై సాంఖ్యంబును బోధించితి వొకనాడు,
శరమందుక నృపులనెల్ల దునుమాడితివొకనాడు,
దశకంఠుని దునుమాడగ దశరధ సుతు వొకనాడు!

కరకగు రూపము చెలునిగ ఎన్నగ మనసోపనంది,
కరుణను చిలికెడి రూపము కామింప తగదన్నది,
కారణ రూపుల కార్యము తొందరపడి తొలగన్నది,
సఖునిగ తగు రూపొక్కటి నాకొసగిన తరుగా?

వెన్నలు మెండుగ మెక్కుచు వెన్నెల ఆటలు ఆడుచు,
వేణువు నూదుచు ముదితల మానంబులు కొల్లజేయు,
గొల్లని రూపమున నీవు నందుని ఇంటాడు నాడు,
అందరు అతివల సందున ఎన్నగలే నైతి నిన్ను!

అంగన కొక మాధవుగా మనగల అంబుజవిభునకు,
ఆనందాంబుధి నేలెడి అవధెరుగని నంద సుతకు,
మోహము కావల నెలకొని జీవన నోసగెడి వానికి,
లీలగ ఒక రూపమొంది చెలిమెచ్చిన తరుగా!

మది జేరెడి మాధవుగా ముచ్చట రూపొకటి పొంది,
మధురాధర మాధుర్యము వీనుల జేరెడి రీతిగ,
మంగళ వచనపు దొంతిని దయతో నాకొసగరాద,
జతవీడని జోడుగ నా జీవంబై మన రాదా!

మాయల మర్మంబెరుగని జారిణియౌ నా మనంబు
జేరెడి తెరవుల చెర నీ మోహంబున మరలజేసి,
చిక్కని స్నేహపు కౌగిట బిగియంగా బట్టినన్ను,
చిచ్చగు చీకటి తెరలను తొలగంగా జేయుమయ్య!

నమ్మిన వారికి తోడుగ నడిచే దేవుడనందురు,
తోడుగ నీవుండి నాకు తరగని నమ్మిక నేరుపు,
ఓరుపు నెరుగని నా మది వొల్లను పొమ్మన్నగాని,
పొందికగా చెంత నిలచి చెలిమిన నా చేయిపట్టు!

వీడకు ఏనాడు నన్ను వెలిజేసితి నేనంచు,
పొంచిన మాయను మించగ తగునే ఎవ్వరికైనను,
బాయని నెయ్యంబు గుడిపి బంధంబుల తెగనడిపి,
బలుపగు నీ మోహంబును నించుము నిలువెల్లా!

భావనలో నిన్ను చూచు భాగ్యము నందెడి వారలు,
భాగ్యమన్న ఇదియేనని మోదంబున మునుగుతారు,
అంతటి మోదపు ముంపును నీతోడుగ అందజేసి,
వీడని జోడుగ గైకొని తరియింపవె ఈ తరణి!

నీరాజనం

శిఖిపింఛ ధారికిని శ్రీ మహా లక్షిమికీ – సన్న సంపెగపూల నీరాజనం,
శృంగారముల బొమ్మ మా యమ్మ కలికికీ – కనక కిరణపు దీప నీరాజనం!

వెదురు కొమ్మల పాట వలనల్లి నిలిచినా – వెన్నదొంగకు వచన నీరాజనం!
వాదులాడగ లేని వలపు జల్లుల తల్లి – మా తల్లి లచ్చికిదె నీరాజనం!

పీరాంబరు కట్టి పరాంచజన్యము బట్టి – పాలించు విభునకిదె నీరాజం!
హరి పాదపద్మమునె స్థిర వాసమని ఎంచు – అంబుజాసన కిదే నీరాజనం!

గొల్లభామల ఇండ్ల కొండియంబులనాడు -గోపాల బాలునకు నీరాజనం!
ఆబాలు మదినేలు అమరవాహిని యైన – రాధికా మాతకిదె నీరాజనం!

పాండునందనులింట వాసముండిన విభుడు – వాసుదేవునికిదె నీరాజనం!
వల్లభుని యదపైన వసియించు ఇంతికిదె – శ్రీచందనపు మంచి నీరాజనం!

రాధికా వల్లభుగ వాసికెక్కిన వాని – మానసంబున కదే నీరాజనం!
వాసుదేవుని వలచి కబురంపి మనువాడు – క్షీరాబ్ధి కన్నియకు నీరాజనం!

కర్మబంధ విముక్తి స్తోత్రం

పోతన భాగవతం నుండి – బ్రహ్మ శివునకు ఉపదేశించిన ‘కర్మబంధ విముక్తి స్తోత్రం’
ప్రాచీనబర్హి కుమారులకు పరమశివుడు ప్రత్యక్షమై – కర్మబంధ విముక్తి కలగడం కోసం – పూర్వం బ్రహ్మ తన సంతానం అయిన సనకసనందులకు మరియు శివాదిగా గల సకల దేవతలకు ఉపదేశించిన స్తోత్రాన్ని వారికి ఉపదేశించాడు. అది:
బ్రహ్మదేవుడు తన కుమారులైన సనకాదులను చూచి ఇలా అన్నాడు “కుమారులారా! వినండి. శుభప్రదమైన విష్ణు స్తోత్రాన్ని చెప్తాను”.అని హరి నుద్దేశించి వారలు విన నిట్లనియె “నో! యీశా! యాత్మవేదు లైన వారలకు భవదీయోత్కర్షంబు స్వానందలాభకరంబు గావున నట్టి స్వానందలాభంబు మాకుం గలుగ వలయు; నీవు పరిపూర్ణానంద స్వరూపుండవు; ఇట్టి సర్వాత్మకుండవైన నీకు నమస్కరింతు” నని వెండియు నిట్లనియె.

1-పంకజనాభాయ సంకర్షణాయ శాం;
తాయ విశ్వప్రబోధాయ భూత
సూక్ష్మేంద్రియాత్మనే సూక్ష్మాయ వాసుదే;
వాయ పూర్ణాయ పుణ్యాయ నిర్వి
కారాయ కర్మవిస్తారకాయత్రయీ
పా; లాయ త్రైలోక్యపాలకాయ
సోమరూపాయ తేజోబలాఢ్యాయ స్వ;
యం జ్యోతిషే దురన్త్యాయ కర్మ
2-
సాధనాయ పురాపురుషాయ యజ్ఞ
రేతసే జీవతృప్తాయ పృథ్విరూప
కాయ లోకాయ నభసే న్తకాయ విశ్వ
యోనయే విష్ణవే జిష్ణవే నమోస్తు.
3-
స్వర్గాపవర్గ సుద్వారాయ సర్వ ర;
సాత్మనే పరమహంసాయ ధర్మ
పాలాయ సద్ధిత ఫలరూపకాయ కృ;
ష్ణాయ ధర్మాత్మనే సర్వశక్తి
యుక్తాయ ఘన సాంఖ్య యోగీశ్వరాయ హి;
రణ్య వీర్యాయ రుద్రాయ శిష్ట
నాథాయ దుష్ట వినాశాయ శూన్య ప్ర;
వృత్తాయ కర్మణే మృత్యవే వి
4-
రాట్ఛరీరాయ నిఖిల ధర్మాయ వాగ్వి
భూతయే నివృత్తాయ సత్పుణ్య భూరి
వర్చ సేఖిల ధర్మదేహాయ చాత్మ
నే నిరుద్ధాయ నిభృతాత్మనే నమోస్తు.
5-
సర్వ సత్త్వాయ దేవాయ సన్నియామ
కాయ బహిరన్తరాత్మనే కారణాత్మ
నే సమస్తార్థ లిఙ్గాయ నిర్గుణాయ
వేధసే జితాత్మక సాధవే నమోస్తు.
6-
అని మఱియుఁ “బ్రద్యుమ్నుండవును నంతరాత్మవును సమస్త శేష కారణుండవును చాతుర్హోత్రరూపుండవును నంతకుండవును సర్వజ్ఞుండవును జ్ఞానక్రియారూపుండవును నంతఃకరణవాసివియును నైన నీకు నమస్కరింతు” నని.
7-
అనఘా! దేవ! భవత్పద
వనరుహ సందర్శనేచ్ఛ వఱలిన మాకున్
విను వైష్ణవ సత్కృతమై
యెనయు భవద్దర్దర్శనంబు నీవె మహాత్మా!
8-
అది యెట్టి దనిన.
9-
అనఘ! సకలేంద్రియగుణాం
జనమును భక్తప్రియంబు జలదశ్యామం
బును సౌందర్య సమగ్రము
ననుపమమును నిఖిల మంగళావహ మగుచున్.
10-
మఱియును.
11-
అళికులోపమ లసదలక శోభిత మగు;
నమృతాంశు రేఖానిభాననమును
సమకర్ణ దివ్య భూషా ప్రభా కలితంబు;
సుందర భ్రూనాస సురుచిరంబు
సలలిత కుంద కుట్మల సన్నిభద్విజ;
పూరిత స్నిగ్ధ కపోల యుగము
పద్మ పలాశ శోభన లోచనంబును;
మందస్మితాపాంగ సుందరమును
12-
సస్మితాలోక సతత ప్రసన్న ముఖముఁ
గంబు సుందర రుచిర మంగళ గళంబు
హారమణి కుండలప్రభాపూర కలిత
చారు మృగరాజ సన్నిభ స్కంధ యుతము.
13-
వెండియు, శంఖ చక్ర గదా పద్మ కలితాయత బాహు చతుష్టయంబును, వైజయంతీ వనమాలికా కౌస్తుభమణి శ్రీవిరాజితంబును, నిత్యానపాయిని యయిన యిందిరాసుందరీరత్న పరిస్పందంబునం దనరి తిరస్కృత నికషోపలం బైన వక్షస్థ్సలంబును, యుచ్ఛ్వాస నిశ్శ్వాసంబులం జంచలంబులైన వళిత్రయ రుచిర ప్రకాశమాన దళోదరంబును, పూర్వ వినిర్గత నిఖిల విశ్వంబునుం బ్రవిష్టంబుఁజేయురీతి నొందు సలిలావర్త సన్నిభ గంభీర నాభివివరంబును, పంకజ కింజల్క విభా సిత దుకూలనిబద్ధ కనక మేఖలా కలాప శోభితశ్యామ పృథు నితంబ బింబంబును, నీలకదళీస్తంభరుచి రోరు యుగళంబును, సమచారు జంఘంబును, నిమ్నజాను యుగళంబును, బద్మపత్ర భాసుర పాదద్వయంబును, మదీయాంతరంగ తమోనివారక నిర్మల చంద్రశకల సన్నిభనఖంబును, గిరీట కుండల గ్రైవేయహార కేయూర వలయ ముద్రికా మణినూపురాది వివిధ భూషణ భూషితంబును, నిరస్త సమస్త నతజన సాధ్వసంబును, భక్తజన మనోహరంబును, సర్వ మంగళాకరంబును నైన భగవద్దివ్య రూపంబుఁ దామస జన సన్మార్గ ప్రదర్శకుండవైన నీవు మాకుం జూపి మమ్ముఁ గృతార్థులం జేయు” మని వెండియు నిట్లనియె.
14-
ఆత్మకుఁ బరిశుద్ధి నర్థించు వారికి;
ధ్యేయ వస్తువు భవద్దివ్యమూర్తి;
యంచిత స్వర్గరాజ్యాభిషిక్తున కైన;
సమధిక స్పృహణీయతముఁడ వీవు;
సద్భక్తియుత భక్త జన సులభుండవు;
దుష్టాత్ములకుఁ గడు దుర్లభుండ;
వాత్మదర్శనులకు నరయ గమ్యుండవు;
నై యర్థి విలసిల్లు దనఘచరిత!
15-
యిట్టి నిఖిల దురారాధ్యు నీశు నిన్ను
నెఱయ సుజనుల కైన వర్ణింపరాదు;
వఱల నెవ్వఁడు పూజించు వాఁడు విడువఁ
జాలునే? పద్మదళనేత్ర! సచ్ఛరిత్ర!
16-
ఎనసిన భక్తియోగమున నే భవదీయపదాబ్జ మొందఁగా
ననయముఁ గోరువాఁడు చటులాగ్రహ భీషణ వీర్యశౌర్య త
ర్జనములచే ననూనగతి సర్వజగంబులు సంహరించు న
య్యనుపముఁడైన కాలునిభయంబును బొందఁడు సుమ్ము కావునన్.
17-
ఇట్టి నీ పాదమూలంబు లెవ్వఁడేని
బొంది ధన్యాత్ముఁడౌ నట్టి పుణ్యుఁ డొండు
మనము లోపలఁ గోరునే మఱచియైన?
నవ్యయానంద! గోవింద! హరి! ముకుంద!
18-
హరి! నీ భక్తులతోడను
నిరుపమగతిఁ జెలిమిచేయు నిమిషార్ధముతో
సరిగాదు మోక్ష మనిన న
చిరశుభ మగు మర్త్య సుఖముఁ జెప్పఁగ నేలా.
19-
దురిత వినాశక పదపం
కరుహ! భవత్కీర్తి తీర్థకణచయ బాహ్యాం
తర సేక ధూత కల్మష
పురుషులు ధరమీఁదఁ దీర్థభూతులు గారే?
20-
అట్టి భూతదయా సమేతులును రాగాది విరహిత చిత్తులును నార్జవాది గుణ యుక్తులును నయిన భాగవత జనుల సంగంబు మాకుం గలుగఁ జేయుము; ఇదియ మ మ్మనుగ్రహించుట” యని వెండియు నిట్లనియె.
21-
సరసిజనాభ! సత్పురుష సంగసమంచిత భక్తి యోగ వి
స్ఫురణ ననుగ్రహింపబడి శుద్ధము నొందినవాని చిత్తమ
స్థిర బహిరంగముం గనదు; చెందదు భూరితమస్స్వరూప సం
సరణ గుహం జిరంబు గనఁజాలు భవన్మహనీయ తత్త్వమున్.
22-
అది యెట్టి దనిన.
23-
అరయంగ నేమిటి యందు నీ విశ్వంబు;
విదితమై యుండు? నీ విశ్వమందు
నేది ప్రకాశించు? నెప్పుడు నట్టి స్వ;
యంజ్యోతి నిత్యంబు నవ్యయంబు
నాకాశమును బోలి యవిరళ వ్యాపక;
మగు నాత్మతత్త్వంబు నధిక మహిమ
నమరు పరబ్రహ్మ మగు నని పల్కి యి;
ట్లనియె నవిక్రియుండైన వాఁడు
24-
నెవ్వఁ డాతఁడు దనయందు నెపుడు నాత్మ
కార్యకరణ సమర్థంబు గాని భేద
బుద్ధి జనకంబు నాఁదగు భూరిమాయఁ
జేసి విశ్వంబు సత్యంబుగా సృజించె.
25-
మరలఁమరలఁ బెక్కుమాఱు లీ విశ్వంబు
జనన వృద్ధి విలయ సంగతులను
నందఁ జేయుచుండు నట్టి యీశ్వరుఁడవై
తనరు నిన్ను నాత్మ తత్త్వముగను.
26-
తెలియుదు” మని వెండియు నిట్లనియె “యోగపరాయణు లగువారు శ్రద్ధా సమన్వితులై క్రియాకలాపంబుల నంతఃకరణోపలక్షితం బయిన భవదీయ రూపంబు యజింతురు; వారు వేదాగమతత్త్వ జ్ఞానులు; నీ వాద్యుండవును ననాదియు నద్వితీయుండవును మాయాశక్తి యుక్తుండవును నై విలసిల్లు చుండుదు; వట్టి మాయాశక్తి చేత.
27-
చతురాత్మ! సత్త్వరజస్తమోగుణములు;
వరుస జనించెను; వానివలన
మహదహంకార తన్మాత్ర నభోమరు;
దనల జలావని ముని సుపర్వ
భూతగణాత్మక స్ఫురణ నీ విశ్వంబు;
భిన్న రూపమున నుత్పన్న మయ్యె;
దేవ! యీ గతి భవదీయ మాయను జేసి;
రూఢిఁ జతుర్విధ రూపమైన
28-
పురము నాత్మాంశమునఁ జెందు పురుషుఁ డింద్రి
యములచే విషయ సుఖము లనుభవించు;
మహిని మధుమక్షికాకృత మధువుఁ బోలి
యతనిఁ బురవర్తి యగు జీవుఁ డండ్రు మఱియు.
29-
ఇట్టి జగత్సర్జకుండవైన నీవు.
30-
భూతగణంబుల చేతనె
భూతగణంబు లను మేఘపుంజంబుల ని
ర్ధూతముగఁ జేయు ననిలుని
భాతిని జరియింపఁ జేసి పౌరుష మొప్పన్.
31-
రూఢిఁ దత్తత్క్రియాలబ్ధ రూపుడవును
సుమహితస్ఫురదమిత తేజుఁడవుఁ జండ
వేగుఁడవు నయి ఘన భుజా విపుల మహిమ
విశ్వసంహార మర్థిఁగావింతు వీశ!
32-
అది యెట్లనిన.
33-
ఇతి కర్తవ్య విచారక
మతిచేఁ దగ నెప్పుడుం బ్రమత్తంబును సం
చిత విషయ లాలసము నూ
ర్జిత లోభము నైన యట్టి సృష్టి గడంకన్.
34-
అప్రమత్తుండ వగుచుఁ బద్మాక్ష! నీవు
మ్రింగుదువు చాల నాఁకట మ్రేఁగు చుండి
నాలుకలు గ్రోయు భూరిపన్నగము వాతఁ
బడిన యెలుకను భక్షించు పగిది ననఘ!
35-
అనిశము నస్మదీయగురుఁడైన సరోరుహ సంభవుండు న
మ్మనువులు నాత్మసంశయము మాని భజించు భవత్పదాబ్జముల్
మనమున నిల్పి యుష్మదవమాన మహావ్యధఁ జెందునట్టి స
జ్జనుఁడు పరిత్యజించునె? భుజంగమతల్పక! భక్తకల్పకా!
36-
కావున నాకును సూరి జ
నావళికిని సర్వసంశయంబులు వాపం
గావను బ్రోవను దగు గతి
నీ వని వినుతించి నట్టి యీ స్తవ మెలమిన్.
37-
రుద్రుండు ప్రచేతసుల కెఱిగించి వెండియు నిట్లనియె “ప్రచేతసులారా! యిట్టి యోగాదేశ నామకంబైన యీ స్తోత్రంబు బహువారావృత్తిచేఁ బఠించి మనంబున ధరియించి సమాహిత చిత్తులై మీరందఱు నాదరంబున విశ్వాసయుక్తులును, స్వధర్మాచారవంతులును, భగవదర్పితాశయులును నై జపియించుచు సర్వభూతావస్థితుండు నాత్మారాముండు నైన సర్వేశ్వరుని నుతించుచు ధ్యానంబు చేయుచుఁ బూజించుచుండుఁడు; తొల్లి యీ స్తోత్రంబు భగవంతుండైన పద్మసంభవుండు సిసృక్షు వగుచు నాత్మజులమైన మాకును సృజియింప నిచ్ఛగించు భృగ్వాదులకును నెఱింగించె; మేము నా భృగ్వాదులును బ్రజాసర్గంబు నందు బ్రహ్మచోదితులమై యీ స్తోత్రంబునం జేసి విధ్వస్త సమస్త తమోగుణులమై వివిధ ప్రజాసర్గంబు గావించితిమి; కావున నీ స్తోత్రంబు నెల్లప్పుడు నేకాగ్రచిత్తుండును వాసుదేవ పరాయణుండు నై యెవ్వండు జపియించు, వాఁడు వేగంబె శ్రేయస్సును బొంది తదీయ జ్ఞాన ప్లవంబున వ్యసనార్ణవ రూపంబయిన సంసారంబును సుఖతరంబుగఁ దరియించు; అట్టి మదుపదిష్టం బయిన యీ శ్రీహరి స్తవంబు నెవ్వండు చదువుచు దురారాధ్యుం డైన శ్రీహరిం బూజించు, వాఁడు మదుక్త స్తోత్ర గాన సంతుష్టుండును శ్రేయస్సులకు నేకాశ్రయ భూతుం డును నగు; శ్రీమన్నారాయణుని వలన సమస్తాభీష్టంబులం బొందు; ఎవ్వండేనిఁ బ్రభాతంబున లేచి ప్రాంజలియు శ్రద్ధాసమన్వితుండు నై యీ మంగళస్తవరాజంబును వినిన వినిపించినం గర్మబంధ విముక్తుం డగును;” అని మఱియు నిట్లనియె.

వేడుక

మొలనూలమరిన మువ్వలు ఘల్లని మోగంగా,
పదిలపు అడుగుకు అందెలు సవ్వడి చేయంగా,
మాటున దాగిన వానిని ఎరిగు న్నా ఎరుగనట్లు,
చల్లను చిలికెడి గోపిక వేచిన దెందులకో!

కురులను దువ్విన నూనెలు – ఫాలపు కస్తూరి బొట్టు,
తనువున కద్దిన చక్కని శ్రీచందన  గంధంమ్మును ,
దాగున్నది ఎవరన్నది దాచక చెబుతూ ఉన్నా ,
దూడను విడువని గోపిక వేచిన దెందులకో!

కొప్పున విరిసే మల్లెలు దాచక చాటే తావిని,
వనమాలన నేనున్నానని పొంగే పరిమళంబు,
గురుతెరిగీ ఎరగనట్లు నెమ్మది నొందే గోపిక,
ఏమర పాటును చాటుచు వేచిన దెందులకో!

ఏమర పాటే అదునుగ ఎదురొచ్చే వానిగోరి,
వేచిన వేళలు ఎన్నని వివరంబెరుగని గోపిక,
మాటుగ జగములు నడిపే మాయలకవ్వలి వానికి,
మర్మము లెంచని తన మది తేటని తెలిసేనా?

వేచిన వానికి చిక్కక వేడని వారిని పట్టుచు,
ముచ్చట గొని మురియువాడు ముల్లోకపు రేడువాడు,
దొరకని దొంగగ తిరుగుచు జగమందాటల నాడగ,
వేడుక ఆ వేదాంతికి – వేదన మనకిలలో!

వేచిన వానికి చిక్కక వేడని వారిని పట్టుట,
వేడుక ఆ వేదాంతికి – వేదన మనకిలలో!

పృథుమహారాజు – విష్ణు వైభవం

పృథుమహారాజు దీర్ఘ సత్రయాగం చేయ సంకంల్పించినప్పుడు, తన పాలనలో ఉన్న ప్రజలకు శ్రీమహా విష్ణుని వైభవం
వివరిస్తూ ఈ విధంగా చెప్పాడు:
4-576-ఉ.
భూరి తపోభిరామ ముని పూజన మెవ్వని పాదపద్మ సే
వారతి వృద్ధిఁ బొంది యనివారణఁ బూర్వభవానుసార సం
సార మహోగ్రతాపము భృశంబుగఁ బాపఁగ నోపుఁ దత్పదాం
భోరుహజాత దేవనదిఁ బోలి యశేష మనోఘ హారియై.
భావము:
గొప్ప తపస్సంపన్నులైన మహర్షులను పూజించటం వల్ల ప్రాప్తించిన శ్రీహరి పాదసేవ ఆయన పాదపద్మాల నుండి పుట్టిన పవిత్ర గంగానది వలె జన్మ జన్మాంతరాలలో చేసిన పాపాలను, సంసార తాపాలను పూర్తిగా పోగొడుతుంది. అది సమస్త మనోమాలిన్యాలను తుడిచి పెడుతుంది.
4-577-వ.
మఱియు.
4-578-చ.
అనుపమ భక్తి నెవ్వని పదాంబుజమూలము మందిరంబుగా
ననయముఁ బొందు వాఁడు నిహతాఖిల భూరి మనోమలుండు స
ద్వినుత విరక్తి బోధ ధృతి వీర్య విశేష సమన్వితుండు దా
ననఁ దగి భూరి సంసృతి మహత్తర దుఃఖము నందఁ డెన్నఁడున్.
భావము:
సాటిలేని భక్తితో భగవంతుడైన నారాయణుని పాదపద్మాలను అనవరతం ఆశ్రయించిన వానికి సమస్త మనోదోషాలు తొలగిపోతాయి. గొప్ప వైరాగ్యం ప్రాప్తిస్తుంది. విజ్ఞానం, ధైర్యం, శక్తి లభిస్తాయి. అటువంటివాడు ఏనాడూ అపారమైన సంసార దుఃఖాన్ని పొందడు.
4-579-క.
నారాయణుండు జగదా
ధారుండగు నీశ్వరుండు; దలఁప నతనికిన్
లేరెందు సములు నధికులు
ధీరోత్తముఁ డతఁడు నద్వితీయుం డగుటన్.
భావము:
నారాయణుడు జగత్తుకు ఆధారమైన భగవంతుడు. ఆయనతో సమానులు కాని, ఆయన కంటె అధికులైనవారు కాని లేరు. ఆయన మహాధీరుడు, అద్వితీయుడు.