వర సుందరా!

వర సుందరా ! ధర సుత వందనా!
దాసజనావన పాలన పోషక,
వైరి భావ భయ రిపు భజనా!

కూరిమి నొసగెడి కోమల కరములు,
లాలన నెంచెడి – కన్నుల వెలుగులు,
ఎన్నడు మాయని – అభయపు నగవులు,
యోచనగా గను భాగ్యమునీయర||
వర సుందరా! ధర సుత వందనా!!

విబుధులు తలచెడి చిన్మయ నాదము,
వేదము తెలిపెడి తారక నామము,
నాశమునెరుగని జీవపు నాదము,
వీనుల నిండెడి వరములు కురియర!||
వర సుందరా! ధర సుత వందనా!!

కామిత వరదుడ – కాలుని పాలక,
కనికర మెంచగ – జాగును సేయకు,
జాగెరుగని ఆ కాలుని దూతల,
చేతలు చిదుముచు చెంగట చేర్చర!

వర సుందరా! ధర సుత వందనా!
దాసజనావన పాలక పోషక,
వైరి భావ భయ రిపు భజనా!!

లక్ష్మీనరసింహా!

మము రక్షింపగా వేగమే రారా – లక్ష్మీనరసింహా!
దుందుడుకు దైత్యులను దునుమాడగ నిక జాగునుజేయకయా!!
నాడు స్తంభమున మాటుజేరి నీ భక్తుని గాచితివొ!
దైత్యుడైన నీ బంటును చేదగా జగమే నిండితివొ!!
స్వామి ! మము రక్షింపగ వేగమే రారా – లక్ష్మీనరసింహ !!

జయుని సన్తో మరి విజయుని సన్తో !
ధరణి జేరి ఇటు ధాటిగ నడచిరి !
హరియనువారల హరియించుట తమ
హక్కని చాటుతూ దునుముచుండిరిట!!
||మము రక్షింపగా వేగమే రారా – లక్ష్మీనరసింహా!||

శుమ్భనిశుమ్భలు సమిసిపోయిరని,
అలుపుదీర నివాదమరచితివో !
నాడు సంద్రమున మునిగినవారలు
నేడు ధరణిపై దాడులుచేసిరి!!
||మము రక్షింపగా వేగమే రారా – లక్ష్మీనరసింహా!||

అంకమందమరి నంబుజాక్షి తో,
పొంగి పొరలినా విషపు చిందులవి,
హరుని జేరకవి నగరిజొచ్చినవి,
పరిహరింపనిక దిక్కునివేగా !!
||మము రక్షింపగా వేగమే రారా – లక్ష్మీనరసింహా!

సురలను గావఁగ సుందరాంగి వై
వైరుల వంచన జేసినా దోషము ,
దుడుకు రూపియై దునుముచునున్నది,
దండధారివై దండనజేయరా !!
||మము రక్షింపగా వేగమే రారా – లక్ష్మీనరసింహా!||

శంకర గురువరు గాచిన వాడవు,
సకల శరణముల నొసగెడివాడవు,
లేనితావులిక లేనేలేవుయని ,
నిండిజగములను నడుపుచుండు హరి!!
||మము రక్షింపగా వేగమే రారా – లక్ష్మీనరసింహా!||

స్వామి !మము రక్షింపగా వేగమే రారా – లక్ష్మీనరసింహా!
దుందుడుకు దైత్యులను దునుమాడగ నిక జాగునుజేయకయా!!
నాడు స్తంభమున మాటుజేరి నీ భక్తుని గాచితివొ!
దైత్యుడైన నీ బంటును చేదగా జగమే నిండితివొ!!
స్వామి ! మము రక్షింపగ వేగమే రారా – లక్ష్మీనరసింహ !!

డోల డోల డోలా డోల

డోల డోల డోలా డోల – నందబాల డోల,
వసుధను వైకుంఠంబుగఁజేసెడి –
వరమందిన ఆ వనితామణిమది
డోల డోల డోలా డోల – నందబాల డోల!!

సురవైరులు తమ వైరిని కనుగొన,
వివిధగతుల మది విచలిత మొందగ!
డోల డోల డోలా డోల – నందబాల డోల!!

వారిజనయనులు హరి సంగతినొందగ,
పలు సేవల మది యోచన సేయగ!
డోల డోల డోలా డోల – నందబాల డోల!!

హరి పద స్పర్శకు మేదినిమురియుచు,
పులకితయై విరి విందులుసేయగ!
డోల డోల డోలా డోల – నందబాల డోలా!!

కాళియు పడగన నర్తన జేసేడి ,
హరి పదిమందిని పరిజనమదిసడి
డోల డోల డోలా డోల – నందబాల డోలా !!

గోవర్ధనగిరి గొడుగున నిలచిన ,
గోవులఁగాంచిన దేవరాజు మది ,
డోల డోల డోలా డోల – నందబాల డోలా !!

గొల్లల గోవుల రూపున నాడెడి,
గోవిందుని గన పద్మభవునిమది,
డోల డోల డోలా డోల – నందబాల డోలా !

రాసలీల గన గగనమునిండిన ,
సురసంతతిమది సంతసమందిన!
డోల డోల డోలా డోల – నందబాల డోలా!!

నందుని అంగన దండన వెఱపున,
పాదమువిడి హరి కనుల పొంగు సుధ!!
డోల డోల డోలా డోల – నందబాల డోల!!

లేగలు కుడువని పొదుగుల పాలను,
పంతమాడి హరి హరియింపఁగని,
డోల డోల డోలా డోల – నందబాలాడాలా !!

కంసునికై గొను చందన గంధము,
వాని వైరికిడు అతివంతరంగ గతి,
డోల డోల డోలా డోల – నందబాలడోలా!

అంతరంగమున అతిసుందరుడౌ,
హరిలీలలు గని సంతసించుమది ,
డోల డోల డోలా డోల – నందబాల డోల !!

డోల డోల డోలా డోల – నందబాల డోల !!

తనువు తొలిగేనాడు తగిలుండుమయ్యా !!

పాలు మీగడ వెన్న నీకు నైవేద్యమిడి,
పాతకము బాపునని పలుమారు కుడిచితిని,
పాశ ఘాతపు బాధ ఓపలేదీతనువు
పావనాకార నను ప్రేమతో కొనిపొమ్ము!!

పాయసాన్నము నీకు కుడుపలేదని నన్ను,
పాపకూపమునందు పడద్రోయగాబోకు,
పాపనాశివి నీవు పలుమారు నిను తలతు,
పాదదాసుని నన్ను పలుమారు మన్నించు!!

పొల్లుమాటలు నేను పలుమారు పలికినా,
పొల్లి నీమోహంబు పలుకులంటిన నాడు
పొగడగా నేనిన్ను పలికేటి పలుకులనే ,
పొల్లుపోవక నీవు పలుమారు ఆలించు!!

కూడబెట్టిన సిరులు కూడ మసలినవారు,
కునుకు తీరినయట్లు కరిగిపోయిన వేళ,
కూరిమెరిగిన నీవు కూడినను మన్నించి,
కుశలమడుగుచు నన్ను కొంపోవగా రారా !!

ఓరిమింతయులేక ఒరిగిపోయెడినాడు,,
ఒంటరై ఈ జగతి విడచి నే చనునాడు,
ఒరిగిపోయిన తనువు చితి చేరి చితుకంగ ,
ఒణికిపోయెడి నన్ను ఒడిచేర్చి ఓదార్చు!!

తనువు తొలిగేనాడు తోడుండమని నిన్ను,
తనువు మాటున ఒదిగి పలుమారు వేడెదను!
తోయజాక్షా నిన్ను తలుప ఓరిమిలేని ,
తరుణమున దయనొంది తగిలుండుమయ్యా !!

2024 బాటసారీ! మరలి చూడకు!!2025

బాటసారీ !! మరలి చూడకు!
మరుగుజేరెను నీదు అడుగులు!!
కాలమను కాపరిని మరువకు,
కరుణ నెరుగడు! తోడు వీడడు!!

గడచిపోయిన చేదు తీపులు
గడియనైనిక ఎంచబోవకు!
కాలుడందిన వింత విందది,
వాతాపి తోడుగ వెడలిపోయెను!!

బాటసారీ! మరలిచూడకు!
మరుగు జేరిన రుచులు వేదుకకు !!

చేతనున్నీ చిరుత కాలమె
ఊతనిచ్చును ఊహ నడకకు!
అడుగు మోపిన తరుణమందే,
అంకురించును తరుణ బాటలు!

బాటసారీ ! మరలిచూడకు!!
నాటి అడుగుల జాడ వేదుకకు!!

బాటచేరెడి గమ్య మేదని ,
అడుగనెంచకు – తెలుపరెవ్వరు!!
తోడు తోచెడివారలెవ్వరు ,
తోడుకాదను ఎరుక నెరుగుము!!

బాటసారీ! మరలిచూడకు!!
తోటివారల జాడ వేదుకకు!!

నాటి ఊసులు, నేటి ఊహలు,
కరిగి విందుగ కనుల నిండగ,
మనసు మౌనపు పొరలమాటున
నిదుర చెదరని కలను తలుపుము!!

బాటసారీ! మరలి చూడకు!!
చూడ నీకట నిలువదేమియు!!
చెదరిపోయెను అడుగు జాడలు!
చేరనున్నవి నేటి అడుగులు!!

         
        

ఉడిపి శ్రీకృష్ణుడు

ఉడిపి లో ఉన్న శ్రీకృష్ణ విగ్రహం గురించి ప్రచారంలో ఉన్న ఒక కథని ఆధారంగా ఈ చిన్న కవిత.
రుక్మిణి దేవి శ్రీకృష్ణ పరమాత్మ ని – అయన బాల్య రూపాన్ని చూపించమని కోరింది. అప్పుడు కృష్ణ పరమాత్మ ఆమెకి తన బాల్య రూపంలో ఉన్న ఒక విగ్రహాన్ని బహూకరించాడు . కొంతకాలానికి ఆ విగ్రహం బృందావనంలోని గోపీచందన మట్టిలో చేరి మరుగునపడింది. మరి కొంతకాలానికి మహా భక్తుడైన మధ్వాచార్యులను చేరి , వారి వలన ఉడిపిలో ప్రతిష్టించబడి – ఈరోజుకి మనందరి పూజలు అందుకుంటోంది .

అడుసు  ఆపగ కలద  ఆనతందక నీది  –

                               అంబుజోదర నీకు  మరుగేలనయ్య!!

నీవే  తోడని  ఎంచి – చేర వచ్చిన  చెలియ,

  మురిపాన  నిను జేరి  మనసు తెలిపిన వేళ,

  వల్లేయని    వరమిచ్చి  కూర్చి ఇచ్చిన ప్రతిమ,

  మరుగుజేసితి   వెపుడొ  మమునేడు బ్రోవంగ,

  మనసు  అడుసుల  మరుగు – మరుగు జేయుము  నేడే!!

 అడుసు  ఆపగగలద   ఆనతందక నీది – అంబుజోదర  నీకు  మాటేలనయ్య!!

 అడుసుమాటున దాగి  ఆదమరచినవాడ,

  పట్టి నావన పెట్టి  తరలిపోయేటినాడు,

  సురనాయకుని బంటు మింట సందడి చేసి,

  భీతి    గొలిపేడి  పిడుగు  ఉరుములై  వెంటాడ,

  ఉలికిపడి  బెదిరేవో!  ఉని కెరిగి  పిలిచేవో!!

  అడుసు ఆపగగ  కలద  ఆనతందక  నీది –  అంబుజోదర నీకు  మాటేలనయ్య!!

 మడుగులో పన్నగపు ఫణుల నాడిన వాడ,

  గోవర్ధనంబెత్తి   కులముగాచిన వాడ,

  గొల్ల రూపుల నాడి  పురము నిలిపిన వాడ,

  పసివార  కడతేర్చు  పడతి  చన్నును కుడిచి,

  పగలు   సెగలను  మరుగు – మరుగు చేసిన వాడ!

  అడుసు ఆపగగలద  ఆనతందక  నీది – అంబుజోదర నీకు   మాటేలనయ్య!!

కన్నులారగ  నిన్ను  కననెంచు కలనెంచి,

  కడలి  కెరటపు  ఊపు  నీ  ఊపిరిని ఎంచి,

  నీ  నామమే  కుడిచి  – నీ  చరితనే  తలచి,

  నిత్య  సంధ్యల  నిలచు  నీ దివ్య రూపమును,

  మనన     చేసెడివాని  మన్నింప  పిలచేవో!

  అడుసు ఆపగగలద   ఆనతందక నీది – అంబుజోదర   నీకు  మాటేలనయ్య!!

నాటి జనకుని భాగ్య మందీయ నెంచేవో,    

మరలి   మారాముతో మురిపాలు కుడిచేవో,

నాటి యమునను మించు కడలి అలలను వీడి,

కననెంచు కన్నులకు కరువు కొరతను దీర్చ,

ఆచార్యు  వొడిచేరి  ఉడిపికై  తరలేవొ!

అడుసు ఆపగగలద   ఆనతందక నీది – అంబుజోదర   నీకు  మాటేలనయ్య!!

  కనకదాసును కనగ కరుణ కలిగిన వాడ,

   కుంగు  భానుని  దిశకు  మరలి  నిలచినవాడ,

  భక్త  మందారమా ! మముగావగా   నెపుడు,

  మనసు  అడుసుల  మరుగు  కడతేర్చి  కదిలేవు!

  కరుణ  కాసారమా!   కరుణ కనగానెంచి, 

  కఠిన చరితలు  చెరిపి – చేరబిలువయ్యా !!!!!!!!!

అడుగు

సడి లేని అడుగులవి వడిలేక నడిచేను

అడుగడుగులో జతగ విడివడక నడిచేను

సడి లేని అడుగులవి వడి వడిగ నడచేను
తడబడని అడుగులవి మితినెరిగి నడచేను
అడుగడుగులో అడుగు జత కలిపి నడచేను
దుడుకు దారుల నడక అడలుడిగి నడిచేను (అడలు: భయము )

నడక నేర్పిన అడుగు అడుగు తోడగు అడుగు
తడబడడుగుల వెంట తొలగ కుండెడి అడుగు
బ్రతుకు బాటల వెంట జంట నడచే అడుగు
ఉనికి తొలగిన కూడా తొలగ కుండెడి అడుగు

తప్పటడుగులనాడు తూలనెంచని అడుగు,
తలపులెటు నడిచినా తోడు వీడని అడుగు,
తొందరని తూలినా తూలనెంచని అడుగు,
తోడు నడచునేగాని తోడుండనా అడుగు!!

కలిమిలేముల వెంట కరుగు సంధ్యల వెంట,
చిగురు ఊయల జంట చిటపటల చితి వెంట,
కలనైన ఇలనైన కలిసి నడిచేడి అడుగు
యుగము లలసిన కూడా అలసటేరుగని అడుగు!

 ఎన్నడెంచెనొ    తాను  జగతిదారుల నడువ,

 మారు  ఋతువు  వెంట  కరుగు  యుగముల  జంట,

   పాదపంబుల వెంట  పలు పాదముల  జంట,

 ధృతి నెరిగి సడి లేక  నడువ నేర్చిన  అడుగు!

రేడైన రైతైన దిగివచ్చు భవుడైన,
యజ్ఞ యాగములైన నరమేధ రణమైన,
తడబడదు విడివడదు వింతైనదీ అడుగు
వివరించగా నేదో జంటనుండెడి అడుగు!!

అడిగి తెలిసినవారు అడుగకేరిగినవారు,
అడుగడుగు జత నడిచి జంట నొందిన వారు,
అవని అనరుల సడుల లయల నెరిగినవారు,
“అడుగు’ భావము తెలిపి ముడిమడియరాదా!!

 

నిన్నే నమ్మినార నీరజాక్ష రార!

నిన్నే నమ్మినార నీరజాక్ష రార!

మనసు నిండ నిన్నే ఎంచ బూనినాను !!

నిన్నే నమ్మినాను నీరజాక్ష రార !!

                                   వింత జూతమంచు వెడలి లోకమందు ,      

                                   సుంత మోహామొంది బొంది దూరితిని!!

                                   బొంకు భావనేదో ముందు దారి జూప,

                                   దూరి జారీతిని – దారి మరల నైతి !!   

నిన్నే నమ్మినాను నీరజాక్ష రార !      

  మనసు నిండ నిన్నే ఎంచ నెంచితిని !!

                                  వారు వీరు నడచి దారి జెసిరంచు ,

                                  సొంత యోచనెంచి జోరు నెంచితిని,

                                  పొంత నెంచలేని వింత నడత జూసి,

                                   బేలనైతి నయ్యా – తోడు నీవయ్యా !!

       నిన్నే నమ్మినాను నీరజాక్ష రార !

       మనసు లోన నిన్నే ఎంచ బూనితిని !!

                                 మనసు పంకమంచు తొలగి యుండబోకు,

                                  నీదు పాదమూన పంకజంబు నుంచు!!

                                  పరుల పంచ జేరి జారినానానకు,

                                  చేరదీసి నీవే – చీడ లన్ని బాపు !!

      నిన్నే నమ్మినాను నీరజాక్ష రార!

       మనసు లోన నిలిచి నన్ను కావుమైయ్యా!

                                    నిలువ నీడ లేని నిండు జగము నీది,

                                     నిలకడెన్చు మంచు – ఆన నిడుత  తగునా !

                                     నేరకెంచితిని ఘోర నేర పధము,

                                     తల్లి తండ్రి నీవే – తొలగి యుండ తగునా !

      నిన్నే నమ్మితిని నీరజాక్ష రార !

      మనసు జేరి నాది చేరదీయ వైయ్య !!

                                      వాదులాడి నీతో ఒడి గెలిచారు ,

                                         గెలిజేసి  నిన్ను – ఆడి ఓడినారు !

                                        కావరమ్మానంచు కొలిచి గెలిచారు ,

                                         వారి వారసులమే మమ్ము మరువకైయా!! 

       నిన్నే నమ్మితిని నీరజాక్ష రార!

      మనసు మరుగు జేసి మమ్ము బ్రోవుమైయ్యా !!

పాప ఫలం

ఫలియించి పాపాలు పుడమి జేరితినయ్య 

పెను దుఃఖముల దారి కోరి  దూరితినయ్య

దురిత దూరుడవీవు దిక్కంచు ఎరిగింప ,  

ఎరుక కలిగెనే కానీ సన్నుతియింపగ తెలియ !!

పలువీధులం తిరిగి పలు నామముల నెంచి,  

పలికితిని పలుమారు పెదవులలిసే దాక ,

పుణ్య నదులను మునిగి తనువంత తడిపితిని,

తనువలసెనేగాని తెరపి నే గననైతి !!

గుడి మెట్లపై నేను పలుమారు మ్రొక్కితిని ,

మెట్టు మెట్టుకు వంగి వందనము జేసితిని ,

వేవేల భక్తులను దరిజేర్చు దారియని ,

అలుపెరుంగక వేడి వొడిలి నే నలిగితిని !

అర్చనలు వేవేలు అందజేసెడివారు ,

అందు నందనవనము నేనాస గోనబోను,

గోవింద యనినిన్ను కొలుచువారలు పొందు ,

గోధూళి ధామంబు నేనడుగగా బోను,!

 పద్మాక్షి శ్రీలక్ష్మి పట్టు పదముల నీడ,

సుంతైన  కొంతైన నే వేడుకొనబోను  !

వల్లభా యని నిన్ను వలచు వనితలుకొరు ,

వక్ష సీమను నేను ఎన్నడడుగగబోను !    

దురిత హారిణి దుర్గ మదినేలు మహారాజు ,

మదినేలు నీ ఛాయ చేరనెన్నగబోను !        

అంబుజోదర నీదు అరవింద నయనాలు,

ఆని మురిసెడి తావు తగిలుండు తెరవిమ్ము!!

నీ నయనములు కురియు చంద్రికల చిరుజల్లు ,

ఎంచి కురిసెడి తావు తగిలుండు తలపిమ్ము  ,

నాడు నేడని లేక  ఏనాడు ఎపుడైనా ,    

ఎరుక గొని నీ ఉనికి ఎరిగుండు ఎరుకిమ్ము!!

ఎరుక జారిననాడు ఏమరక ఎరిగించి ,

ఏలుకొనవైయ్య  యని వేడుకొందును నేడే !!

ఏనాడు ఏతెలివి ఎటులుండొనో తెలియ ,

నేటి శోకము నందే  నీ దయను అర్ధింతు !!    

శోధించి శోధించి ఏమెరుగ  నెంతువయ,

 నీ నిదుర ఉహలన చిందినొక చినుకునయ,

నిలుచు తావేలేక నిలకడెరుగక  లేక ,  

నలిగి మలిగే చిన్న చెరిత చినుకును నేను!

నిదురమానికనైనా నీ కల్పనల కనుము ,
మా కన్నులూరేటి నీటి మడుగుల కనుము
మురిపాల నిను ముంచి మురిపించు నీ ఊహ ,
ఊరడింపులు మాకు నీజతగ అందించు !!

జనకుడను నేనంచు ఎరుక పరచితివెపుడో ,   

జనని నీ ఊహ యని పలుమారు పలికితివి ,

మీరెరుగనీ చినుకు ఏటికుదయించెనో ,

ఎరిగి చెంతను జేర్చి చింత తొలగగజేయు !!                               

 భక్త వత్సలుడు

నిన్నె  నమ్మినవారి నగుబాటు నోర్వవని ,

వింత వింతలు జేయ వింతగాదయ మాకు !

తులసి దళముల తళుకు మణుల మించేనంచు,

తూగి తరుణుల మోహమణగించి మెప్పించి,

మురిసి మురిపెమునొందు కథలు వినియున్నాము!!

అసురు గూల్చిన నాడు అలుపేరుంగని నీవు,

గొల్లలాటల అలసి సేదదీరిన కథలు,

క్రీగంట భువనముల శాసించగల కనులు ,

నంద కాంతకు దడిసి భీతిచెందిన కథలు,

జోల పాటల విన్న రామకథలో  కరిగి ,

ధనువు నందగ ఉరికి తెల్లబోయిన కథలు,

విన్నకొలదీ విందు వినులండేది విందు ,

చెలుల సంగపు రుచులు పట్టి కుడిపెడి  కధలు !!

చిటికెడటుకులె చాలు చెలుని కటకట దీర్ప ,

ఒక్క మెతుకే చాలు ద్రుపదు పట్టిని బ్రోవ ,

యుగము గడచిన నేమి- నిదుర మునిగిన నేమి,

బ్రోవనీవే యన్న చేరి చెలువము కుడుప!

శరణు నివేయంచు చరణమంటిన వారి ,

చేరి చెరితను మర్చి మన్ననెంచిన కధలు,

తరుగు నొల్లని కథలు నీ లీల సంగతులు ,

చెల్లు కాలము లేని చేవగల్గిన కథలు !!

రంగ రంగా యన్న ఇల్లాలి బ్రోవగా ,

అత్త ఆరళ్ళతో నలిగి నడిపిన కథలు,

పాచికలు పంచుకొని ఆటాడు సఖునికై ,

చెరకు కుప్పలు నమిలి ఘింకరించిన కథలు ,

వైశ్వానరుని సేవ వదలనొల్లని ఇంతి ,

వంటశాలను నింపి విందుజేసిన కధలు!!

కొల్ల కొల్లలు కధలు కొరతలేనీ కధలు ,

మనసు మోహము నొందు మధురమైనీ కధలు!!

చెరిత  నేలినవారి చేవ నెరుగను నేను,

వందనంబని నీకు వినయమొందను నేను,

అహము నిండిన మనసు అదుపు నొల్లదు నాది,

అదునుజూసిక  నీవే హరియించు అహమెల్ల,

కటిక కార్యములెన్నొ పలుమారు జేసినా ,

కారణము నీవెయని పలుకు పంతము నాది,

వాదులాడగ వలదు జీవజనకుడ వీవు,

ఆదరించిక నన్ను ఆదుకోను కథ నడుపు||

నేడైన రేపైనా  మాపెప్పుడోయైన  ,

నీకు తప్పని లీల – యోచనేలయ ఇంక ?

కోటాను కోట్లలో ఒక్కడని  తలచేవొ ,

ఏటికీ పంతమని ఏమరచి యుండేవొ ,

ఎడబాటు ఆటలిక ఆడి అలసితిననెంచి,                                                 

చెరిపి ఈ చేరితమును చేదుకోవయ్యా !!