This emotion is a reflex to the comment of Shri Chaganti Koteswara Rao, that Kuchela did not do any mistake in his childhood for Krishna to neglect him till he reached him with a small gift, even though Kuchela was a great devotee of Krishna.. …
చెలుడు – కు-చేలుడు!
తలపులోతా కదలినంతనే – ఎరుక నొందెడి గోపబాలుడు!
తన్ను’లో’ తలపోయు వానిని- ఏమరచి యుండుట నిక్కమా?
తనువులో తడి తరగిపోగా-ఆకలని తన ఆలుబిడ్డలు,
అలమటించుట ఎరిగియుండియు-
ద్రుపదు చందము తన సఖుండని- ఎన్న నేర్వని మధుర ప్రేమన,
రుక్మిణీపతి తనకు తోడని – తలపులే తన కంమృతంబని,
తలచు దీనుని తలపు తూపులు- ఏల నీమది అందకున్నది?
కలసి నడచిన బుడుత నడకలు- పంచుకున్నా పగలు రాత్రులు,
గురుకులంబున వాసముండగ- వన్నెకెక్కిన సహవాస సేవలు,
మరగు పరచుక మసలువాడా? ఓయన్న పలెకెడి మాధవుండు?
చల్లముంతలు కొల్లగొట్టగ -చెలువార బిలిచెడి గోపకాంతలు,
నీకు సాటిక నీవె యంచు – హేచ్చు జేసిన పల్లె వాసులు,
పూర్ణకాముడవంచు నిను తమ మదిన నిలిపెడి తపోధనులు,
దేహి దేహని అర్తులందరు నీదు హెచ్చును హెచ్చరింపగ,
ముజ్జగంబులు లోన నిలిపిన భేషజంబెటు మిన్నకుండును?
సఖుని బంధపు సీమనెరుగగ- సావకాశంబెచట జేరును?
విధి విధానపు చిత్రశరముల- వాడి వేటను నాటి వానిని,
శక్తి హీనపు కాననంబున కాల పాశపు ముడుల జుట్టి,
చేరదీయుట నీదులీలని మురియువారల ఘోషతో,
ఆర్తరక్షణ బధ్ధతన తామోదమొందెడి మోహ మోహన!
ఏటికీ అధికార దర్పము? ఎన్నడెరిగెద వభిమాన బావము?
భేదమెరుగక జీవజాలపు జీవమై నడయాడువాడవు,
అంతరంగపు రంగమందున ఆదిగా అమరున్నవాడవు,
ప్రేమ చినుకులు తొల్లి చల్లగ వెనుకబాటది ఏలనో?
యుగ యుగంబుల మాయమోహము ఉనికి తెలుపగ మరచెనో!
మేలుకునుమో మోహనాంగా సృష్ఠిలో ప్రతి అణువులో,
ఎరుకగా నీవందజేయగ నీదు ప్రేమను ముందుగా!