నిన్ను వైరిగ గొన్న రావణుని గావగా,
రాముడై కాననల బ్రతుకు గడిపావు,
బాలక్రీడల నిన్ను మురిపింపగా నెంచ,
దశరధుని ఇంట నువ్వ్ దోగాడినావు!
పూజలెరుగని మొసలి నీదరిని జేరుటకు,
భద్ర రాజునిపాద మాశ్రయించిన యంత,
నీ భక్తునింగావ వేగమే అరుదెంచి,
జలచెరంబుకు మోక్షమందించినావు!
సఖునిగా రంజింప వేడినా గోపికల,
రంజింపగానీవు గోకులంబున ఆడి,
నంద బాలుగ ఇంట దాగి పెరిగావు,
మురళి నూదుచునీవు మోదమొందావు!
రావణుని వైరంబు, దశరధుని మురిపెంబు,
మొసలి పన్నాగంబు, గోపికల విన్నపము,
సాటి చాటగ నేను ఏపాటికీ గాను!
దయామూర్తివి నీవు దాక్షిణ్యమూర్తి,
నామానసమునేల ఎన్నడరిగేవు?
పలుజన్మ కర్మలను కాననంబున చిక్కి,
అంతు తెలియని అహము దొంతరల క్రిందణిగి,
తుదిలేని మోహముల వాసనల దొర్లాడు,
నాపిలుపు నినుజేరు దారి మరచేను!
ఏలాగొ ఓలాగు నావంక నీవరుగు,
నీకంతరము గాని అంతరంగవు దారి,
ఎరుకగా నడయాడి ఎరుక నెరిగించు,
ఏలికౌ నీప్రతిభ నాకెరింగించు!