గణ నాయకా! గణేశా!

వక్రతుండము గల్గు కురుచ ఒజ్జవు నీవు,

కాణిపాకపు కొలుపు కనికరించయ్యా!

కామితంబులు కుడుప కడుదొడ్డ రాయుడవు,

కంటకంబులు గడిపి కూరిమొసగయ్యా!

కడదేర్చు జనకునకు-మృగరాజ వాహనికి,

కృత్తికలు లాలించు శిఖి వాహనునికీ,

కూరిమిని గురిపించి – శివ కుటుంబము పేర్చి,

ప్రధమ పూజలనందు విఘ్నహరుడవు నీవు!

ద్వైతమెరుగని తనువు నమరినావయ్యా,

వ్యాస వాణిని రచన జేసినావయ్యా,

పరిహాసముల పరిధి పలువురికి ఎరిగింప,

రోహిణీ పతి గర్వ మణచినావయ్యా!

పానకము వడపప్పు చెరకు బెల్లపు ముక్క,

కుడుము లర్పణ నీకు  మోదమయ్యేను,

గరిక పరకల పూజ జిల్లేడు పూదండ,

మెండు దండిగ  నెంచి ఆన తిచ్చేవు!

చిరుత పాపడి వంటి చిరునవ్వు గలవాడ,

చెరగ జేయుము మాదు ఇడుములెల్లా,

చెలువంబు చిగురింప చలువ జూడయ్యా!

చేత లెన్నకు తండ్రి- చిరుత వాడ!

కిరణం…………

చెట్ల కొమ్మలు కదిలి కదిలేటి కిరణములు

లేత ఆకుల తాకి ఆగలే కురికేను,

వేగపడి కదిలేను అందుకొనగా నేదొ!

వడి వీడి నిలిచేను తెలియ జేయగ నేదొ!

 

కంటి నుండుదయించు కిరణ రాసుల కలిసి,

ఎరుక జేయగ నెంచు ఎల్ల లొల్లని తనము!

చెలువారగా బిలిచి చెలిమి జేయుచు సాగి,

చూపు సాగిన కొలది కనువిందు జేసేను,

మాధవుని మాయలో మైమరచు మధువనులు,

మాటనేర్వని ధ్వనుల మురిపించు వనజములు,

ఒల్లనన్నా వినని పాండు పుత్రుల మైత్రి,

కడలేని వైభవము కురిపించి మురిపించు,

దేవ సభలను మించు అస్తినల్లిన పురము,

కణము కణమున కరము కాపుగా నుంచియూ,

కనరాక కదలాడు జలజాక్షి వల్లభుని,

వరద హస్తపు నునికి కనగలుగు యోచనను,

విస్తారమున దెలుపు వెలుగు బాటలు పరచి,

ఎరుగుమోయిక నీవు కరగి పోయెను వయసు,

యుగయుగంబుల నుండి చెరిత లల్లిన మనసు,

ఆనాటి కానాడు అందుకున్నొక బోధ,

సమిధలుగ సమకూర్చి ఆది గురువును తలచి,

అడుగు అడుగున నడచి తోడు రమ్మంచు,

కడలేని కాలమున కనలేని తీరముకు ,

తోందరెరుగని తరిన తరలిపోతోంది!

అడుగడుగునా నాకు తోడు తానంది!

కలగాని కలగోల

విజయు బ్రోచుట కొరకు వేంచేయు ముక్కంటి,

వెంట వెంటన నడచి వచ్చి చేరెను దుర్గ,

పాండు నందను ఉనికి పేరులో జేర్చుకొని,

విజయ దుర్గగ దేవి ఇంద్రకీలేలేను!

వ్యాస దేవుని పిలుపు అంది తరలిన దేవి,

అక్షరంబుల మాల కొల్లలుగ గైకొనుచు,

తన్ను తలచిన వారి బ్రోచు బాసను నిలుప,

బాసరన భారతిగ బహుపూజలందేను!

భ్రమల తొలగ గజేయు భ్రమరాంబగాను,

వేల్పులకు వేల్పుగా అలమేలు మంగా,

అంబరంబంటేటి అమ్మ ఆదరణ నడతా,

అవని నడచిన గుర్తు లవధు లెన్నేనా!

కనుకొలనులో కరుణ కలువ రేకులు విచ్చ,

నునుపు చెక్కిలి వెలుగు వెన్నెలను మురిపింప,

మమకార మాధుర్య మొలికించు అధరములు,

నాకోసమే కదిలి నను పిలువ రాదా!

ఏలిక

నిన్ను వైరిగ గొన్న రావణుని గావగా,

రాముడై కాననల బ్రతుకు గడిపావు,

బాలక్రీడల నిన్ను మురిపింపగా నెంచ,

దశరధుని ఇంట నువ్వ్ దోగాడినావు!

పూజలెరుగని మొసలి నీదరిని జేరుటకు,

భద్ర రాజునిపాద మాశ్రయించిన యంత,

నీ భక్తునింగావ వేగమే అరుదెంచి,

జలచెరంబుకు మోక్షమందించినావు!

సఖునిగా రంజింప వేడినా గోపికల,

రంజింపగానీవు గోకులంబున ఆడి,

నంద బాలుగ ఇంట దాగి పెరిగావు,

మురళి నూదుచునీవు మోదమొందావు!

రావణుని వైరంబు, దశరధుని మురిపెంబు,

మొసలి పన్నాగంబు, గోపికల విన్నపము,

సాటి చాటగ నేను ఏపాటికీ గాను!

దయామూర్తివి నీవు దాక్షిణ్యమూర్తి,

నామానసమునేల ఎన్నడరిగేవు?

పలుజన్మ కర్మలను కాననంబున చిక్కి,

అంతు తెలియని అహము దొంతరల క్రిందణిగి,

తుదిలేని మోహముల వాసనల దొర్లాడు,

నాపిలుపు నినుజేరు దారి మరచేను!

ఏలాగొ ఓలాగు నావంక నీవరుగు,

నీకంతరము గాని అంతరంగవు దారి,

ఎరుకగా నడయాడి ఎరుక నెరిగించు,

ఏలికౌ నీప్రతిభ  నాకెరింగించు!

ఎరుకైన వాడా!

ఎరుక గాంచినయంత ఎరుగొందు వాడవట,

ఎమనెరుగుదు నిన్ను ఎరుకైన వాడా!

ఎరుక గరిపిన మేర కెరుగ గలనేగాని,

ఎరుగ తరమే నీదు ఎరుక విదితముగా!

ఎదమాటుగా మసలి ముదమార జగతిలో,

ప్రతిఫలించెడి సొగసు ఎరుగు మందువు నన్ను,

సొగసులో అమరున్న సొయగంపుల సొగసు,

సొంతమగు నీ సొగసు ఎరుగు రీతెరిగించు!

ఎరుక గరిపిన మేర కెరుగ గలనే గాని,

ఎరుగ తరమే నీదు ఎరుక విదితముగా!

బాల భానుని లేత కిరణ వైభవముందు,

పొంగారు కనకమును మకుటముగ జేసికొని,

మురిసిపోయెడి మొలక పచ్చికల పైటలో,

ఒదిగున్న ధరణి నీ మోహమెరిగించేను!

ఎరుక గరిపిన మేర కెరుగ గలనేగాని,

ఎరుగ తరమే నీదు ఎరుక విదిగముగా!

ఎదుగు భానుని వెంట ఎదిగేటి వెలుగులో,

మొలచి సాగెడు కరము కమలముల జేరి,

కలయైన ఈ జగతి కనులార గాంచుమని,

పలు శోభలన వెలుగు నీ శోభనెరిగించు!

ఎరుక గరిపిన మేర కెరుగ గలనేగాని,

ఎరుగ తరమే నీదు ఎరుక విదితముగా!

తరువులను పురములను పలు స్పందనలను,

భావ చలనమెగాని చలనమెరుగని గిరుల,

తన కిరణముల నాటి – నాటి క్రతువుల గరిపి,

కర్మ వైభవపెరుక ఎరిగించు కార్యములు!

ఎరుక గరిపిన మేర కెరుగ గలనేగాని,

ఎరుగ తరమే నీదు ఎరుక విదితముగా!

యుగయుగంబుల నుండి ఎడతెరిపి లేకనే,

పలుతెరంగుల వెలుగు పరచు భానుండు,

పలుమారు తాడించి ఎరుక గొనగానేదొ ,

యత్నించు యత్నముల గమ్యమేదను ఎరుక!

ఎరుక గరిపిన మేర కెరుగ గలనేగాని,

ఎరుగ తరమే నీదు ఎరుక విదితముగా!

పాంచభౌతిక పురపు మువ్వన్నె సౌధమున,

ఆగామి సంచితపు  నడుమలో నడయాడు,

బీజ ప్రాకారమును భేదించు తరి ఎరుక,

ఎరుకగొనకే అలసి ఎరిగించు నీ శక్తి!

ఎరుక గరిపిన మేర కెరుగ గలనేగాని,

ఎరుగ తరమే నీదు ఎరుక విదితముగా!

అవని వాసమునందు అలసటాయేను,

ఆదమరపే నేడు ఆనతాయేను,

నీ సంతు సంతుగా ధరణి కరిగాను,

నీదు పుత్రుడ నేను అల్పునెటులౌదు?

ఎరుక గరిపిన మేర కెరుగ గలనేగాని,

ఎరుగ తరమే నీదు ఎరుక విదితముగా!

అద్దరికి ఇద్దరికి ఆటగా పరుగిడుచు,

అంతరంగపు తలుపు తలుపలేనైతి,

సర్వమెరిగిన నీవు సరసుడవు నీవు,

ఉధ్ధతోందుమొ నీవు ముజ్జగము లెరుకగా!

ఎరుక గరిపిన మేర కెరుగ గలనేగాని,

ఎరుగ తరమే నీదు ఎరుక విదిగముగా!

ఎరుక గాంచిన యంత ఎరుగొందు వాడవట,

ఎమనెరుగుదు నిన్ను ఎరుకైన వాడా!

 

ఊఊఊహఆఆఆ

నా ఊహలో నీవు నంద బాలుడవు – నచ్చకుంటె నీవె పంది బాలుడవు,

నాటి కశ్యపు సుతుని దునుమాడగాను- పందినైనానంచు పంతమాడేవు!

 

ఉమాదేవికి నేను ప్రతిరూపమైతే – ఈశుడై నను జేర నడచివచ్చేవు!

హిరణికై కాన నన దిగులుతో నుంటే-కౌసల్య తనుయుడై కదలి వచ్చేవు!

మండోదరీ విభుని మనసు నేనైతే – మన్నింపగా నీవు మనువాడు జానకిని!

రాగములు పలికేటి మురళి నేనైతే- ఊపిరూదెడి దివ్య మోవివై మెదిలేవు!

 

పొల్లులేనొక గింజ పసుపు ముద్దనబెట్టి- రత్న సింహాసనమిదే రాజిల్లు మంటే,

ఒద్దికగ ఒదిగుండి ఒప్పుదెలిపేవు- నేనాడు ప్రతి పలుకు నాలకించేవు!

పాయసంబని ఫలము, ఫలమంచు ఒక దళము,దళమంచు ఒక దర్భ-నీకు చూపేను

ఊహలో ఉన్నదే నీకు నిక్కంబంచు- నిండుగా దీవించు అతిశయంబును బోకు!

 

యోగ నిద్రన నీవు నడయాడు వేళ- పలుకు పలుకుమనంచు బాధించ కుండా,

లోకాన నీరూపు రమియించు నటుల-‘ఊహ’ యను ఒక కానుకందించినావు!

బ్రతుకు బాటల వేట వెన్నాడుచున్నా- నీఆట యను ‘ఊహ’ నూరడించేవు!

యుగయుగంబులు గడచి ఉడిగిపోయెను ఓర్పు- నేర్పుగా నన్నింక మరిపించబోకు!

ఎడబాటు బాటపై అడుగు అడుగున నీవు-తోడు నడిచెడి వైన మింక చాలించు!

 

ఊహలెరుగని రూపు ఊరించు నీరూపు-ఎద పండి ఎరిగిరట నాటి గోపికలు!

అడవి దారుల నడచి-అవని భారము గడచి-ఆర్తిగొని ఎరిగిరట మునిమానసములు!

కన్నులేనొక కురుశ్రేష్ఠుడు,కపటమెరుగని పిన్నబాలుడు,శరము వీడిన పాండుపుత్రుడు,

కంటిరే నీ దివ్య రూపము – నీవు కరుణన దెల్పగా!

 

వీడుమోయిక నీదు పంతము- ఎన్నగా నేనెంత వాడను,

ఆటబొమ్మకు ఆశపడినే వేరుపడి తానాడు నీతో!

నీవు మిన్నని శరణు వేడెద – దూర భావము బాపుమో!

 

ఉదయం

నిన్న కరిగిక నేడు  తొలకరించేను,

రేరాజు కళ తరిగి తరలి పోయేను,

తరుణ వెలుగుల పాద మవనినూనేను,

చిగురు చేతన చెలిమి ధరణి జేసేను!

 

తొలిపూజ తొందరల తరలు మనుజుల మంద,

విష్ణుపాదపు నతివ మరుల మునిగేరు!

లేగదూడల కుడుప పొదుగు పొంగేను,

గమ్మపాలను త్రావ పాపడురికేను!

మాధవుని మురళిలో మరుగున్న మార్దవము,

మదిని గ్రోలెడివారు కలత చెందేరు,

కరుణలేనీ రేయి కఠిన కార్యమదేల?

కినుక గొని పడమటికి ఉరికి వెడలేను!

వేణుగానపు గమకమంద లేదని దిగులో!

గోపాలకుని చెలిమి అమర లేదని కినుకో!

సాటి వారలుగాని గోపకాంతల పొందు,

నొల్ల నేర్వక మరులు మరుగు పరచేనో!

ఎల్లవారల నేలు ఎల్ల లెరుగని కరుణ,

రేపవలు రెప్పలుగ పొంగారు చుండా!

రేయి రమణీయమని తరగుటేలంచూ,

నేడు నిన్నాయెనని దిగులొంద నేల?

గమన మెరుగని కాల గమన మెరుగంగా,

మిధున మెరుగని వాని ఉనికి నెరుగంగా,

మిన్నకుండని మనసు మర్మమెరుగంగా,

వల్లభుని వాత్సల్య వసతు లమరంగా!

వామ భాగమునమరి మురిసేటి రాణీ,

పద్మనాభుని ఇంటాడ పడుచైన రాణీ,

చిలికించుమో నీదు చిగురు చేతనము,

నెమ్మదింపగ మాదు మది మత్సరములు!

ఉదయ ఉపచారం

తొలి వెలుగు ఛాయలట ఉదయాద్రి నంటాయి,

తెలి మబ్బు తరలితా ముసుగుగా అమరింది,

నిదుర కన్నుల మాటు కలల వైభవ మందు,

నినుగూడి మురిసేటి జగము దయగనమంది!

మయుడు కల్పన మరచి మైమరచు రీతిలో,

తరువు తరువున విరులు వన్నెలమరాయి,

దివి గంగ చినుకులను హిమబిందు జల్లులో,

క్రీడించి తమ శోభ నినుమడించాయి!

విరుల నెరుగని తరువు పత్రగుఛ్చపు శోభ,

దివి రాజు ధనుసుతో సరితూగుచుంది,

కెంపు మాలల గుంపు ఉదయాద్రి పైజారి,

తరళముల చెక్కిళ్ళ నొదిగిపోతోంది!

మాతృస్తన్యము వీడి మనలేని పసి పగిది,

ఊహ దొంతరలందు అమరున్న నీతలపు,

రెప్పమాటున మసలి మరిపెమొసగు ననంచు,

మంచు దుప్పటి క్రింద పసి పచ్చికమరింది!

తొందరెందుకు నీకు వెలుగు కిరణమునమర?

తొలుత తొలుగగ జేయు తిమిర వైభవమును,

విభుని వైభవ మెరుగు ధరణిచందము నేడు,

మనసు ఊర్పుల కూర్పు కూరిమమరించు!

వన్నెతరగని వెలుగు వైభవపు వెలుగు,

జీవమిచ్చే వెలుగు జగమేలు వెలుగు,

వాడిశరముగ విధిని వేటాడు వెలుగు,

నాటుమో నాతనువు తరియించునటుల!

ఇంద్రియ- శోభ

ఇంద్రియంబుల శోభ ఇందీవరాక్షీ – విదితముగ వివరించు విధి వైభవమును,

వీనులందున జేరి వినుమమ్మ తల్లీ – స్పురియింప జేయుమా శుద్ధ సారమును!

వదనమందలి వాక్కు – వాక్కులో భావంబు – భావమందలి బోధ – మూలమగు జననీ,

కలుగ జేయుము నీదు కమనీయ కల్పనల – కలుగజేసెడి రవళి – నందు భాగ్యమును!

కంటి పాపన వెలుగు – చూపులో గమనింపు – గమనమందలి గురుతు నీవె తల్లీ!

గురుతులో నీ జాడ నిలకడగ నిలుపుకొని – నీ ఉనికినెరుగ గల గురుతునిమ్ము!

తనువు చేశ్టలయందు చేతనత్వము నీవు – చేతనత్వములోని కారణము నీవు,

కారణపు కుదురులో కూడున్న విధిఛాయ – నీ ఛాయగా నెరుగు భాగ్యమిమ్మమ్మా!

శరదిందు శేఖరుని శుద్ధకౌముది యందు – తేలియాడెడి తేట తళుకు తారా!

తెలియజేయుము నేడు నీ నాధు కాంతులకు- కారణంబౌ విభుని వెలుగు కారణము!

కారణంబుల మూల కారణంబైనట్టి – కారణము నెరుగనో కారణంబా!

ఏతీరు నెరుగొందు మీ వింత కారణము- విధి వర్తనముకేది కారణంబు?

ఆరగింపుము అంబతోడుగ

సన్నబియ్యము చెరకు బెల్లము -గుమ్మపాలను జేర్చి వండితి,

ఆవుపిడకల దాలిబేర్చితి నేతి చుక్కల తోడుగా,

సరి పాకమొందగ పాయసంబును వండినానయ తీరుగా!

ఏలకులు కర్పూర పొడులను – మంచి కుంకుమ పువ్వునూ,

దోరవేగిన జీడిపప్పులు – తీపి ద్రాక్షల ఫలములూ,

జేర్చి వండిన మధుర పొంగలి – వెండి కలశమునుంచితీ,

ఆరగింపుము అంబతోడుగ – ఆదరింపుము మమ్ములా!

దీనుడను నే హీనుడంచు – వేడబోవను శంకరా!

తుంటరిని నే తగులుకుంటిని తెగని దారుల ఎన్నడో,

ఏలువాడ వనెరుక మరచితి మాయ మోహపు మత్తులో,

మరలించి మనుపుము ధాతగా – నన్నొడిన జేర్చుము తల్లిగా!