తెప్పరిల్లు!

వాగ్దేవి వల్లాభా – అలుపేల కలుగదో!

నిను గన్న నీ తండ్రి జోలలూగే!

నిటలాక్షునిల్లాలు నీరసించెను జూడు,

సామ్యమెరుగని సంతు ధరణి నిండె!

అంగశోభల వాసి అంతరించిన మేను,

అంతరంగపు వెలుగు లెటులెరుగ నెంచు?

వసుమతికి భారమై నడయాడు జీవులను,

అంపగా నీకెటుల మనసు జెల్లు?

వేదనాదములన్ని వేదనల గొన్నాయి,

వ్యాసుడెరుగని శృతులు వదరుచున్నాయి,

వన్నె తరిగిన వసుధ వల్లకాటిగమారె,

నందీశు నాధునిక రయము నంపు!

దైత్య పాలనె గాని దైవ జాడలు లేవు,

నరులు వానరులన్న సీమ సమసే!

సస్యముల సారములు సన్నగిల్లెను జూడు,

పోషణన్నది కుడుప ధాత్రి అలసె!

ఆవలింతల నడుమ నడిపించు ఈ క్రతువు,

క్రమమ మరిపించినది  – వాణి నడుగు!

పొంతనెరుగని సొరుగు జొచ్చిమే మలసేము,

తొలగు దారుల తెలిపి తెప్పరిల్లు!

హరిహరులు యోగించి హరియింప లేనట్టి,

కాలకూటపు పొందు జగమెల్లనిండింది,

తొందరింపుము దేవ శివుని శక్తిని తలుప,

ఆ  వరద ఉప్పెనై నిను ముంచునేమో!

తోడు ఫలమేమి?

సహస్రాక్షుడు వాడు – జగమంత నిండెనట,

రెప్పపాటే లేక పరికించి చూచునట,

రేయనక పగలనక గమనింప దగినట్టి,

వింత సంబరమేమి అమరున్నదిచట?

బీజమందలి మొలక వింతలోకమనెంచి,

వన్నె చిన్నెల చిగురు చిగురింప జేయగా,

భాను కిరణపు తాప మోర్వలేనా చిగురు,

వడలి బడలుట జూడ మోదమేమగును?

సర్వసాక్షివి నీవు సహవాసముండగా,

తల్లడిల్లెడి జగతి నిన్నేమనెరుగు?

విధివిలాసపు శరము వేధించుచుండగా,

కాపుగారని తోడు ఫలమేమ నెరుగు?

దీవెన

ఆనందపంబుధిని  ఏలువాడే నీకు- తోడు నడువగ నడచి విజయమొందు!

మదనాంతకుని ఛాయ చేయూతగా గల్గి – చింతలెరుగని బాట బ్రతుకు గడుపు!

నారదాదులు గొల్వ మన్నించి పలికేటి – చిలుక పలుకుల తల్లి తీపి పలుకు,

వచనముగ వొదగంగ వేణుగానుని కొలిచి-వర్ధిల్లరా ధరణి వాసిగొనగా!

పాలసంద్రము విడిచి పన్నగపు శయ్యపై – శయనించు శీహరిని చేరి కొలిచెడి పడతి,

క్రీగంటి చూపులను పర్నశాలన నిలచి – పలు యశంబుల బడసి జయమునొందు!

కన్నతల్లుల తల్లి -తలపునేలెటివాడు-నెనరుంచి నీ మదిని ఏలుగాక!

కరుణ కావాసమగు కలువ కన్నులు నిన్ను- కనికరంబున గాచి మనుపుగాక!

దుర్గతి నాశిని దుర్గా

కాళి వైనా నీవె – కాలమైనా నీవె

కరుణించి కాపాడు కనకదుర్గంమ్మా!

ఏలనిక నీవిలను ఏలికైయుండగా

చింత లెందుకు మమ్ము చెంతజేరు

చింత మాపెడి అరకు కుడిపి మనుపుము తల్లి,

మడియగా మా చింత మొదలు దాకా!

వరదాయినివి నీవు అనురక్తి నొలికింప,

రక్తి వీడిన మదిని మాలిమెంచు,

వదరు భావపు గుంపు నీచూపుతో తాకి,

తారకంబగు దారి తరల జేయు!

కోరికలు చెల్లించు కోమలాంగివి నీవు,

కొలువుదీరుండగా కొరత తగునా?

కోరలేదని నిన్ను కినుకగాంచకు నన్ను,

కొల్లలుగ నీ కరుణ కురియ జేయు!

కాళి వైనా నీవె – కాలమైనా నీవె

కరుణించి కాపాడు కనకదుర్గంమ్మా!

నరుని నేస్తం

పార్థునకు సారధీ – వసుదేవ నందనా!

మదినమ్మెదను నిన్ను మధుకైట భంజనా!

పాలించు వాడవని మొరలనాలింతువని,

మునిజనులు పలుమారు నుడువగా వింటీ!

నరుడైన సురరాజ నందనుని తోడుగా,

సఖుడవై నడయాడు ఫలము ఏమయ్యా?

సుతుల బాసిన నాడు మిన్నకుంటివి నీవు,

కర్మ ఫలముల బాప తరుణ మిదియేనా?

సురకాంత శాపమును అనుభవించిన నాడు,

మశ్చయంత్రము గొట్టి గెలిచి తెచ్చిన సతిని,

పంచు మని కనతల్లి పొల్లు పలికిన నాడు,

సఖునిగా నీవేమి ఊరడిస్తివొగాని,

తగిన పనియా నీది తెలుపు గోపయ్యా!

కయ్యములు తగవంచు హితవు పలికెడి నీవు,

బంధుజన పోరునే నొల్లనను ఫల్గునుని,

కాల పురుషుడ నేను క్రతువంత నాదంచు,

జ్ఞాన ధారల తెలిపి వెరపు బాపితివే!

 

సవ్యసాచివి నీవ శరము విడువుమటంచు,

కురు వంశమును మట్టి గరిపించినావే!

అభిమన్యు సుతుగాచి వన్నెకెక్కిన వాడ,

సర్ప యజ్ఞ్యమునేల నడిపించినావు?

సర్పజాతులు సమశి పలుకు శాపపు పంక్తి,

కలికోరలన విషము మెండుగా నింపే,

వేయి పడగల వాడు – నీకు పరుపే గాని,

వాని సంతుల క్షోభ మమ్ము కుడిపే!

నీ లీల భావముల నెరుగు యోగ్యత లేదు,

మాభాగ్యముల భార మమర ఓపిక లేదు,

మా కర్మ మేరువున వహియించి మమ్మేలు,

గోవర్ధనుని ఛాయ మా బ్రతుకు నడిపించు!

నల్లనయ్య

నల్లనయ్యవు నీవు నన్నేలరాదా – అల్లనల్లన నాకు కొలువీయరాదా!

నగుబాటుగానట్టి పదవడుగబోను – నీసేవ నందినా నగుబాటు తగును!

తరుణమేదని నన్ను నిలదీయబోకు – తగు నేర్పు నెరుగనని వెనుకాడబోకు,

తనువు నిచ్చిన నీవు తీరెరుగలేవా –  తారకంబగు తోవ నెరిగించ లేవా?

తెలివి హీనుడనంచు వేరుంచబోకు – నిను తెలియ లేనట్టి తెలివేటికయ్యా?

ఎరుక గలిగెడియట్లు ఎరుగింపుమయ్యా- గురువు లందలి గురువ ఎరిగింపరాదా?

నీ పాదమూనెనని పులకించె నీ పుడమి – నీ చూపు సోకెనని పొంగె నా గగనంబు,

నీ ఊపిరందినా వగపేల పురుషునకు?  పురుషోత్తముడ వీవు ఎరిగింపుమయ్యా!

పలుక నేర్వని మనసు నిలుకడెరుగదు గాని- నిన్ను జేరెడి త్రోవ తగులగా నెంచు!

సోపాన పటములో పాములెరుగును గాని –   నిచ్చెనెక్కెడి తీరు తెలియదాయె!

పలు నిచ్చెనల పైన పవళించి యుంటివట – ఎన్నటికి నే నిన్ను చేరగలను?

ఆదిశేషుని తోక నంది నిను చేరగల – వెసులుబాటును చూపి బ్రోవుమయ్యా!

అలసటెరుగని వారు అనునిత్య మర్చింప – అలుపెరుంగక వాని బ్రోచువాడా!

అక్షరంబుల మాల నల్లగా లేనట్టి – నాబోటి తనువులకు త్రోవ ఏది?

దారులన్నటి  దారి – దరిని జేర్చెడి దారి – మునిజంబులు ఎరిగి నడచు దారి,

దొరలించి నా తనువు దయనేలగా రాదా – దాస దాసుల దాస్య మీయరాదా!

దొంగాట

దొంగ దొరికిన గాని –దొంగాట ముగియదే!

ఆట నియమము నెరుగు మానసా!

వేటాడి పట్టగా జగమంత వెదికేవు,

వెదుకు ‘వాని’ని పట్టు మనసా! – వెదుకగా పనిలేదు మనసా!

కంటి వెలుగగు వాని – గురుతు లెన్నగ నీవు,

జగతి వెదికెద వేల మనసా?

కనురెప్ప తెరమూసి వెనుదిరుగు తరినెరుగు,

దొంగ దొరుకును నీకు మనసా! –ఆట ముగియును నేడె మనసా!

దొంగ గురుతులు గోరి –గుహలన్ని వెదికేవు,

లోనున్న గుహ  వెదుకు  మనసా!

గూడు చెదిరిననాడు గుహ వీడి జనువాని,

గుట్టు నెరుగుము నేడె మనసా! దొంగ గూటికి జేరు మనసా!

భాను వెలుగుల లోన భాసించు ఈ జగతి,

భావనెరుగుము నీవు మనసా!

వెలుగులో కనరాక వెలుగు వెనుకన దాగు,

తిరు రూపు నెరుగవే మనసా! వెలుగులకు గతి వాడె మనసా!

యుగ యుగంబుల నుండి ఎందరో వెదికారు,

ఓడి చరితన వారి ఓటమిని నింపారు!

ఓడి నమ్మిన వారె – వాని గెలిచిన వారు,

ఓడి నిలకడ నొందు మనసా! దొంగ దొరకును నీకు మనసా!

మినుకు చుక్కల నడుమ నిండుగా నవ్వేటి ,

గగన ఛాయను గనవె మనసా!

తళుకున్న లేకున్న తరియైన గతి వాడు,

పట్టి తలపున బట్టు మనసా! తలపోయగా వాని మనసా!

ఆటలో దొంగెవరె మనసా?ఆడి తెలుయుము నేడె మనసా!

నా సుతుల మది నిండు

ఆదిత్యునందలి సవితవై -ఆనందమందనుభూతివై

మమతలో మాధుర్యమై – మునిమనంబుల మధుపమై

అణువులో బ్రహ్మాండముంచిన ఆది శక్తికి శక్తివై

అసురులై చెరియించు వారల అంతరంగపు సురునివై

సాధుజన మనసీమలందలి సామరశ్యపు వీచికై

నామరూపము లలదలేనొక వింత భావపు భూమికై

కంటి చూపై మసలు నిన్నే చూపుతో నే చూడగలనో!

చేతనంబై చరియించు నిన్నే చేతనముచే చేరగలనో!

భావమునకాధారమౌ నిన్నే భావజాలమునంద గలనో!

ఘడియ ఘడియకు ఘోరకలినను వింతగా వేధించుచున్నది,,

సారహీనుడ నైతి మదినే సాధనంబును తోచకున్నది

సందుజూచుక నామనంబున సఖుడవై నువ్ సంచరింపుము

ప్రేమ రూపము సంతరించుక నా సుతుల మనముల నాక్రమింపుము

నా సుతుల మనముల నాక్రమింపుము

నా సుతుల సఖునిగా వర్ధిల్ల రాదా!

అస్తమించెడి వాడు అల్పుడగు దేహుండు

అమరుడై యున్నాడు అద్దేహ ధారుండు

అల్పబుద్ధిని గల్గి అలమటింపగ నేల?

దేహ బంధపు మోహమందగా నేల?

సత్య దర్శన భాగ్యమొందించు విభునకై

ఏ దివ్య పదములను నే నాశ్రయింతు?

కలి కోరలంబడి ధర్మ ముడిగిన వేళ

ఆర్తి దీర్చెడి వాని నే రూపమున కందు?

ఆకలికి శృతినొంది అలమటించెడి పేగు

కలి ఘోర కరములన్ నలిగేటి నరుడు

మోహ కుహరము నందు శోకించు జనులు

తుది లేని వైతరణి దరి గాంచగాలేక

వికృతపు విధి చేతి వేదనల వేసారి

తనువు తనువున యున్న నీ ఉనికి కన రాయె!

మూల పురుషుడ వీవు – ప్రతి మూర్తిలో నీవు

చావు పుట్టుక లందు తగుల కుండెడి నీవు

ఆకలెరుగని నీవు – ఆర్తి నెరుగని నీవు,

ఆనంద సాగరపు అమర వాసుడ వీవు,

ఆది శక్తిని మదిన అమరున్న నీవు

భువి భావముల నెల్ల నెలవొందు వంటారు!

జీవ మిచ్చెటి చిచ్చు కణిక కణికన నీవు

భువిలోన, దివిలోన, చిందేటి నదిలోన,

ఉనికితో తెలిపేటి తెమ్మెరల యదలోన

జేర్చి జేసినబొమ్మ – పలు సొరుగలీ బొమ్మ

ఎటనుండి వచ్చెనో- ఏటికై వచ్చెనో

ఎరుక నెరుగక భువిన భీతిగొనియుంది!

పాల కడలిన బుట్టి హరి యురంబున మెట్టి,

అమృతపు ఆద్యముల నందుకొను శ్రీవల్లి!

మంచు కొండకు బుట్టి పరమేశు చేబట్టి,

ప్రమధ గణముల పూజ నందేటి తల్లి!

వింత చరితలు వ్రాసి అలసేటి పతిసేవ

ఏమరక సలిపేటి చిలుక పలుకుల రాణి!

 

 

అంతరంగపు హరుడు హరియించి నాడంచు

అవని వాసులు వాని ఉనికి వెదికేరంచు,

ఆర్తులను ఆదుకొను సమయమాయగ నంచు,

వేద నాధుని వేగ భువి కంప రాదా?

అణువు అణువున వాని మేల్కొల్ప రాదా?

భావ బంధపు మోహ మంతమొందించీ

భవ బంధముల జాడ నింపుగా తెలిపీ,

ధరణి సుతులను తాను మరిమరీ లాలించి,

నా సుతుల సఖునిగా వర్ధిల్ల  రాదా!

నారదుని గానమున నాదించు పండు!

వెదికితే దొరకనిది – వెల లేని పండు,

వెఱ్ఱిసన్నాసులకు మనసైన పండు,

ఎన్నగా నేలికలు కొనలేని పండు,

ఎండు కోరిక బీడునందుండు పండు!

అస్తి అంతరమందు అమరున్నపండు,

అవని అంచులవరకు ఎదిగున్న పండు,

అంజనీపుత్రునకు రామునిచ్చిన పండు,

శబరి చూపులయందు నిలిచినా పండు!

హత్తిరాముని తోడ ఆడినా పండు,

రామదాసుని మందిని పండినా పండు,

సక్కుబాయికి సఖుని అండనిచ్చే పండు,

జయదేవు పదములలో పలికేటి పండు!

గోపకాంతల కనుల వెలిగేటి పండు,

దేవతలసురులన్న భేదమెరుగని పండు,

నందీశు ననుదినము నడపించు పండు,

ప్రేమచిరు చినుకులకు చిగురించి పండు!

 

 

 

వుధ్ధవుని వేదనలో మొలిచినా పండు,

పోతన్న పలుకులలో కులికేటి పండు,

త్యాగరాజుకు రక్తి నందించు పండు,

నారదుని గానమున నాదించు పండు!

రాధా మనోహరును జాడెరిగినా పండు,

రుక్మిణీసతి చెంత తేలియాడెడి పండు,

పంజరము నొదిగున్న నాచిట్టి చిలుకలను,

చెలువారగా  బిలిచి అందించ రాదా!