జనక యోగము

వ్యాస పుత్రుని మన్ననందిన -యోగిపుంగవు యోగమేమని,

ఒప్పు భావపు భావపుంతలు – పలుక నొల్లనె బోయ కావ్యము!

సంతులేనీ జనకు నింటన – చిట్టి చేతల చేతనల తో,

నటనలాడిన ధరణి కన్నియ – పుత్రి కాయెను రాజ యోగికి!

ఆట పాటల మురిపెములతో – పిత్రు ప్రేమను తట్టి లేపగ,

కందుకము తానందుకొనగా – కదుప గలిగిన శిపుని వింటిని,

సంధింప గలిగిన సుందరుండని – అవని నేలెడు భార్గవుండని,

పుణ్య పుంతల భాగ్యమిదెయని – దశరధాత్మజు పదము కడిగెను!

వన్నెతరుగని వజ్రములతో – వన్నెకెక్కిన ముత్తెములతో,

మేలి బంగరు భూషణంబుల భారమొందిన మత్తగజములు,

బారులుగ తన బాలికకుతా సారెగా నిడి సంతసించుచు,

నీలమేఘుని జంటనుండగ మోహనాంగిని సాగనంపెను!

లేత మామిడి తోరములతొ – అరటి పూవుల స్తంభములతో,

విరుల గుత్తుల అమరికలతో – రంగవల్లుల రాచవీధుల,

ఆడి అలసిన  అతివ పాదపు అందె సందడి అణగు లోపలె,

నారలూనిన రామచంద్రుని తలచి భూపతి ఏమనెంచెనో!

పట్టుపరుపుల తూగుటూయల – పరిజనంబుల సేవ క్రతువులు,

నియమముగతా నిత్యమందుచు – తలుపడే తన ముద్దు కన్నెను?

అరమరెరుగని అడవి దారుల – అలసటెరుగని రాఘవునితో,

అడుగులో అడుగేని నడిచెడి భాగ్యమేమని ఎంచునో!

పాయసాన్నపు పాత్రలో – పూజ జేసెడి పూవులో,

కొలను అలపై తళుకు లీనుచు తరలి కదిలే అలలలో,

మద్దు పలుకులు కుమ్మరించే పంజరపు ఆ చిలుకలో,

పర్ణశాలన మసలుకొను – తన పాప జాడల జూడడే!

పూర్వపున్నెపు పూజ ఫలమో- మిగులు పాపపు నీలి నీడో,

రాజయోగుల రాచబాటల తీరు ఇదియని తెలుపుటో,

మనుజ దేహపు ఉనికియగు ఈ మనసు  ఏమని ఎంచెనో,

తెలియజేసెడి తేట పదములు పలుకువారెట నుంటిరో!

నిస్సంగు నిత్యము నమ్ముకుంటే- నిర్మోహి చింతన నియమమైతే,

మాయమోహము మాపుదారుల – మసలగా మనసను మతిస్తే,

ఏది మురిపెము? ఏది స్పందన?  జగతి నడిపెడు  నియమమో?

పాప పుణ్యపు పద్దు సర్దెడి – వెట్టి గాధల వైభవంబెది?

సకల మెరిగిన ఈశ్వరుడు- నా జనకుడని నే నెంచినా,

నాటి సుంకము చేర్చలేదని వీధి జూపెను ప్రేమతో!

తప్పుగాయని తల్లిదండ్రుల తగులడే ఏ లోకనాధుడు?

నీకులేనీ నియమ సుంకము దేహినగు నాకెందుకో?

కన్నకూనల కఠిన దినములు -కన గలుగు యోగము ఎందుకో?

మోహ నాశము కలుగజేసెడి దివ్య విధమిద – లోకపాలక?

ఎట నెరుక గొంటివి ఇట్టి పాఠము- గురువు పదమున చిచ్చుగా!

ఏమరపు విడుమిక ఏలువాడా  – ఏలుకొను నా కంటి వెలుగుల!

కోరబోవను అమర ధామము- వేడ బోవను మెచ్చ మెరపులు,

తల్లితనమున తగిలి ఎరిగితి – మోహ మెంతటి మధురమో!

ఎరుగ గల తరి ఎరుకయైతే – ఎరుగు మోయది వేగమే!

అర్తలోకపు అర్తిగాదది ఏమరుపు నీదని ఎరుకనొందుము!

సాటి జీవుల వేదనలలో వ్యధను జూదని మనుజుడెందుకు?

ప్రేమ మూర్తగు పరంధాముని వారసునికది తగిన తీరా?

కన్నవారెటు తీసిపోదురు సాటిమానవ కులముతో?

కరుణ మూర్తివి – కఠిన క్రతువుల అమరజేయకు దేవరా!

నిలకడెరుగని మనసు తీరును – తప్పు పట్టుట నీకు చెల్లును,

మనసు ఒప్పని యోగమార్గపు సాధనెంచగ నాకు చెల్లదు,

నియమమిదె యని నిక్కు జేయకు – నీజాడనేని ఎరుకమానకు,

తల్లిమనసుకు తాపమొసగెడు తీరు తనయుల కొసగజేయకు!

దొడ్డమాటల మూటతొనిను ముంచి పొగడగ భాషజాలదు,

మణులు మాణిక్యముల రాసుల మొక్కగా నా తాహతొల్లదు,

పలుమారు పలికెద నీదు నామము – ఎరుక గలిగిన తీరులో,

లోపమేదో ఎంచజూడక ఆదరముగొని తనయు నాదుకో!

గోవిందా! వాసుదేవా! దామోదరా! ఆదుకో!

తనువు

శంభు నిల్లాలి పతి మనసు నేలెటివాడా!

హరి మనసు హరియించి భాసించువాడా!

ముజ్జగంబుల మూల శక్తి  కారణమా!

తేట తెలుపుము నేడు – తనువు కారణము!

తనువు తగిలిన తొలి తరుణంబు నుండి,

తెలియ వలయును తనువు తనది కాదంచు,

తనది కానీ తనువు తగులగా నేలా?

తగిలి తెగు దారులను తెలియగా నేలా?

లోనున్న లోకాల లోతెరుగు నపుడు,

అంత రంగపు సీమ నమరించునపుడు,

వెలుగు లెరుగని వెలుగు ఎరుకగొను నపుడు,

పనికిరానీ తనువు తగులేల వలెను?

పలు పురంబుల వింత పుంత ఈ తనువు,

పురము పురమున అసుర వాసమీ తనువు,

వైరవాసన నెలవు నడయాడు తనువు,

తగులేల వలెనేను నిన్ను దెలియంగా?

కల్లోల లోకముల కారణము నెరుగు,

నక్కి నడచెటివారి నడవడిని ఎరుగు,

నామ రూపములేని నీ ఉనికి ఛాయలము,

నలగు చున్నాము ఈ తనువులన్ తగిలి!

ఆసాములగువారు అలసినారని ఎంచి,

ఆపసోపము దీర్ప అనువైన తరినెంచి,

తనువన్న ఒక సొరుగు దీర్చి అసురుల బేర్చి,

వాసులుగ మము వ్యధల వ్రేల్చు చున్నారు!

అసుర సంహారమది మావంతు కాదు!

వైర భావన నణచ మా వశము కాదు!

జగమేలు వార లట జోల లూగంగా,

జీవ జాలము నేల తనువు జొప్పేవు?

కర్తకారణ మీవు కర్తయున్నీవు,

కనుమమ్మ ఒక మారు కఠిన కార్యమును,

కనికరము గను మింక తనువు తొలగించు,

తొల్లి తగిలిన వాని తప్పు మన్నించు!

తల్లి వినతి

తలిదండ్రులై మీరు తోడుండవలె గాని – తనువిచ్చినీ తల్లి ఎంత తోడు?

ప్రేమ మీరగ మనిపి – తగు సమ్మతుల గరిపి – తారకంబగు తరిని తగులనిండు!

కంటి వెలుగును గావ కనికరము గనుమంచు- విన్నవించెద నిదే వినుము తండ్రీ!

ఇడుములెన్నిటి నోర్చి తరియింపగా నెంచి – కలితాండవించెడీ సమయమందు,

తపియింపగా తగిన తనువిదేనని ఎంచి -తగిలినాడొక జీవి తనువు నందు,

మర్మమగు జగతిలో మనుగడొందగ కోరి మార్గమొకటెంచుకొని తరలి నాడు,

అడుగు అడుగున తగులు తుమ్మతోపుల మోపు-దాటువైనపు ఎరుక తరిగినడు,

కాయకష్టమె గాక కరుణించు వారెవరు? – కనరాని ఉనికి నే నొల్లనంచు,

మరుగు దారుల జొచ్చి – మచ్చికన్నది మరచి – బహులంపటములందు తగిలినాడు,

తుదిలేని రహదారి జేరు భవనపు ఉనికి – ఊహకందని దారి జేరి నాడు,

మడుగైన మనసులో తిరుగాడు సుడులలో- మునకలేయగ లేక అలసినాడు,

చేయూతగా నిలవ చెలిమైన చెలిలేక – చింత చెంతనె నిలచి చితికినాడు,

ఆదరము నందించి అద్దరికి నడిపించి – ఆదుకొనుమో తండ్రి అవనినాధా!

తనువిచ్చినీ తల్లి తల్లడిల్లుట దక్క – దిక్కు తెలిపెడి తెలివి నెరుగ లేదు,

తల్లితనమున తగులు తాపమెరిగిన మీరె – జాలిగొని మాలిమిన మునుప వలెను!

 

తీర్థము

కాలమందున కరుగకున్నది – కర్మశిల ఇది కఠినమైనది,

కరుణతో నీ పాదమూనర – జాడ విడిఅది మాయగా!

వెన్నుగాచెడి వాడవని నిను – సన్నుతింతురు సాధుసంఘులు,

ఎదట నున్నీ ఎదను గావగ – ఎన్నడొత్తువు మాధవా?

కంటి వెలుగుల వెంట నడిచెడి – నీదు పదముల కడుగగా,

పొంగి పొరలెను కనుల వెంటన – నీటి చినుకులు ధారగా!

చూపు ఆనక పోయినా – నీ రూప మెరుగక పోయినా,

కంటి మాటున కదలు నీవే – ఎద ఎరుకవని వినియుంటి నే!

లోని లోకము లెరుగ నేర్వను – జగములో నీ జాడ తెలియను,

మన్ననన నే పూజ సేయగ – మన్నికగు ఒక తరిని ఎరుగను!

నిస్సహాయపు ఊర్పునుండి – ఉబికి వచ్చిన కంటి నేరె,

అర్చనగ నీ వందుకొనుమా – లోన నిలిచిన లోకనాధా!

వేడి ఆరని వెచ్చ నీరది – తనువు సత్తువ సారమైనది,

రుచికి లోపమనెంచ బోకయ- నీపాద తీర్ధము నాకు రుచియే!

అనరులో అమరున్నవాడవు – మరగులో మురిపించు వాడవు,

ఊహ ఊపిరి ఉనికి ఎరుకను – ఎదముందు కనుతరి ఎన్నడో!

తెప్పరిల్లు!

వాగ్దేవి వల్లాభా – అలుపేల కలుగదో!

నిను గన్న నీ తండ్రి జోలలూగే!

నిటలాక్షునిల్లాలు నీరసించెను జూడు,

సామ్యమెరుగని సంతు ధరణి నిండె!

అంగశోభల వాసి అంతరించిన మేను,

అంతరంగపు వెలుగు లెటులెరుగ నెంచు?

వసుమతికి భారమై నడయాడు జీవులను,

అంపగా నీకెటుల మనసు జెల్లు?

వేదనాదములన్ని వేదనల గొన్నాయి,

వ్యాసుడెరుగని శృతులు వదరుచున్నాయి,

వన్నె తరిగిన వసుధ వల్లకాటిగమారె,

నందీశు నాధునిక రయము నంపు!

దైత్య పాలనె గాని దైవ జాడలు లేవు,

నరులు వానరులన్న సీమ సమసే!

సస్యముల సారములు సన్నగిల్లెను జూడు,

పోషణన్నది కుడుప ధాత్రి అలసె!

ఆవలింతల నడుమ నడిపించు ఈ క్రతువు,

క్రమమ మరిపించినది  – వాణి నడుగు!

పొంతనెరుగని సొరుగు జొచ్చిమే మలసేము,

తొలగు దారుల తెలిపి తెప్పరిల్లు!

హరిహరులు యోగించి హరియింప లేనట్టి,

కాలకూటపు పొందు జగమెల్లనిండింది,

తొందరింపుము దేవ శివుని శక్తిని తలుప,

ఆ  వరద ఉప్పెనై నిను ముంచునేమో!

తోడు ఫలమేమి?

సహస్రాక్షుడు వాడు – జగమంత నిండెనట,

రెప్పపాటే లేక పరికించి చూచునట,

రేయనక పగలనక గమనింప దగినట్టి,

వింత సంబరమేమి అమరున్నదిచట?

బీజమందలి మొలక వింతలోకమనెంచి,

వన్నె చిన్నెల చిగురు చిగురింప జేయగా,

భాను కిరణపు తాప మోర్వలేనా చిగురు,

వడలి బడలుట జూడ మోదమేమగును?

సర్వసాక్షివి నీవు సహవాసముండగా,

తల్లడిల్లెడి జగతి నిన్నేమనెరుగు?

విధివిలాసపు శరము వేధించుచుండగా,

కాపుగారని తోడు ఫలమేమ నెరుగు?

దీవెన

ఆనందపంబుధిని  ఏలువాడే నీకు- తోడు నడువగ నడచి విజయమొందు!

మదనాంతకుని ఛాయ చేయూతగా గల్గి – చింతలెరుగని బాట బ్రతుకు గడుపు!

నారదాదులు గొల్వ మన్నించి పలికేటి – చిలుక పలుకుల తల్లి తీపి పలుకు,

వచనముగ వొదగంగ వేణుగానుని కొలిచి-వర్ధిల్లరా ధరణి వాసిగొనగా!

పాలసంద్రము విడిచి పన్నగపు శయ్యపై – శయనించు శీహరిని చేరి కొలిచెడి పడతి,

క్రీగంటి చూపులను పర్నశాలన నిలచి – పలు యశంబుల బడసి జయమునొందు!

కన్నతల్లుల తల్లి -తలపునేలెటివాడు-నెనరుంచి నీ మదిని ఏలుగాక!

కరుణ కావాసమగు కలువ కన్నులు నిన్ను- కనికరంబున గాచి మనుపుగాక!

దుర్గతి నాశిని దుర్గా

కాళి వైనా నీవె – కాలమైనా నీవె

కరుణించి కాపాడు కనకదుర్గంమ్మా!

ఏలనిక నీవిలను ఏలికైయుండగా

చింత లెందుకు మమ్ము చెంతజేరు

చింత మాపెడి అరకు కుడిపి మనుపుము తల్లి,

మడియగా మా చింత మొదలు దాకా!

వరదాయినివి నీవు అనురక్తి నొలికింప,

రక్తి వీడిన మదిని మాలిమెంచు,

వదరు భావపు గుంపు నీచూపుతో తాకి,

తారకంబగు దారి తరల జేయు!

కోరికలు చెల్లించు కోమలాంగివి నీవు,

కొలువుదీరుండగా కొరత తగునా?

కోరలేదని నిన్ను కినుకగాంచకు నన్ను,

కొల్లలుగ నీ కరుణ కురియ జేయు!

కాళి వైనా నీవె – కాలమైనా నీవె

కరుణించి కాపాడు కనకదుర్గంమ్మా!

నరుని నేస్తం

పార్థునకు సారధీ – వసుదేవ నందనా!

మదినమ్మెదను నిన్ను మధుకైట భంజనా!

పాలించు వాడవని మొరలనాలింతువని,

మునిజనులు పలుమారు నుడువగా వింటీ!

నరుడైన సురరాజ నందనుని తోడుగా,

సఖుడవై నడయాడు ఫలము ఏమయ్యా?

సుతుల బాసిన నాడు మిన్నకుంటివి నీవు,

కర్మ ఫలముల బాప తరుణ మిదియేనా?

సురకాంత శాపమును అనుభవించిన నాడు,

మశ్చయంత్రము గొట్టి గెలిచి తెచ్చిన సతిని,

పంచు మని కనతల్లి పొల్లు పలికిన నాడు,

సఖునిగా నీవేమి ఊరడిస్తివొగాని,

తగిన పనియా నీది తెలుపు గోపయ్యా!

కయ్యములు తగవంచు హితవు పలికెడి నీవు,

బంధుజన పోరునే నొల్లనను ఫల్గునుని,

కాల పురుషుడ నేను క్రతువంత నాదంచు,

జ్ఞాన ధారల తెలిపి వెరపు బాపితివే!

 

సవ్యసాచివి నీవ శరము విడువుమటంచు,

కురు వంశమును మట్టి గరిపించినావే!

అభిమన్యు సుతుగాచి వన్నెకెక్కిన వాడ,

సర్ప యజ్ఞ్యమునేల నడిపించినావు?

సర్పజాతులు సమశి పలుకు శాపపు పంక్తి,

కలికోరలన విషము మెండుగా నింపే,

వేయి పడగల వాడు – నీకు పరుపే గాని,

వాని సంతుల క్షోభ మమ్ము కుడిపే!

నీ లీల భావముల నెరుగు యోగ్యత లేదు,

మాభాగ్యముల భార మమర ఓపిక లేదు,

మా కర్మ మేరువున వహియించి మమ్మేలు,

గోవర్ధనుని ఛాయ మా బ్రతుకు నడిపించు!

నల్లనయ్య

నల్లనయ్యవు నీవు నన్నేలరాదా – అల్లనల్లన నాకు కొలువీయరాదా!

నగుబాటుగానట్టి పదవడుగబోను – నీసేవ నందినా నగుబాటు తగును!

తరుణమేదని నన్ను నిలదీయబోకు – తగు నేర్పు నెరుగనని వెనుకాడబోకు,

తనువు నిచ్చిన నీవు తీరెరుగలేవా –  తారకంబగు తోవ నెరిగించ లేవా?

తెలివి హీనుడనంచు వేరుంచబోకు – నిను తెలియ లేనట్టి తెలివేటికయ్యా?

ఎరుక గలిగెడియట్లు ఎరుగింపుమయ్యా- గురువు లందలి గురువ ఎరిగింపరాదా?

నీ పాదమూనెనని పులకించె నీ పుడమి – నీ చూపు సోకెనని పొంగె నా గగనంబు,

నీ ఊపిరందినా వగపేల పురుషునకు?  పురుషోత్తముడ వీవు ఎరిగింపుమయ్యా!

పలుక నేర్వని మనసు నిలుకడెరుగదు గాని- నిన్ను జేరెడి త్రోవ తగులగా నెంచు!

సోపాన పటములో పాములెరుగును గాని –   నిచ్చెనెక్కెడి తీరు తెలియదాయె!

పలు నిచ్చెనల పైన పవళించి యుంటివట – ఎన్నటికి నే నిన్ను చేరగలను?

ఆదిశేషుని తోక నంది నిను చేరగల – వెసులుబాటును చూపి బ్రోవుమయ్యా!

అలసటెరుగని వారు అనునిత్య మర్చింప – అలుపెరుంగక వాని బ్రోచువాడా!

అక్షరంబుల మాల నల్లగా లేనట్టి – నాబోటి తనువులకు త్రోవ ఏది?

దారులన్నటి  దారి – దరిని జేర్చెడి దారి – మునిజంబులు ఎరిగి నడచు దారి,

దొరలించి నా తనువు దయనేలగా రాదా – దాస దాసుల దాస్య మీయరాదా!