బుజ్జిమామా స్తోత్రం💐

ప్రమీలా మాతయందత్యంత ప్రేమ గల,

వినయంపు రూపైన నటరాజ పుత్రుడవు,

‘బలభద్రపాతృని’కి వన్నె తెచ్చిన ఘనత,

మెండుగా గలిగున్న ధన్వంత్రి నీవు!

 

వయోవృద్ధుల పట్ల, బీద సాదల పట్ల,

వ్యాధి పీడను బడ్డ బడుగు వారల పట్ల,

బహు ఓరిమిని గల్గి నేర్పుతో మనగల్గు,

నియమ బద్ధంబైన మూర్తిమత్వము గల్గు..

 

ప్రమీలా పుత్రడవు  – నటరాజ తనయుడువు..

 

విప్రవృధ్ధుల పట్ల, విద్యార్ధి పట్ల,

మానసిక క్లేశముల మనువారి పట్ల,

దయను దాక్షిణ్యమును దండిగా గలిగి,

సేద తీర్చుటయందు సంతసము నొందేటి,

 

ప్రమీలా పుత్రడవు  – నటరాజ తనయుడువు..

 

తల్లి మాటను మదిన అనుదినము తలపోసి,

తోబుట్టినవారి అండ దండగ నిలచి,

తనకంటు ఒక తోడు ఎన్నకే జీవించు,

బ్రహ్మనిష్ఠాపరుడు, యోగ సాధకుడు,

 

ప్రమీలా పుత్రడవు  – నటరాజ తనయుడువు..

 

స్వార్ధచింతన లేక భేషజములేక,

మేన మామై విధుల నెరవేర్చువాడు,

చిన్నాన్నగా తాను అన్న పిల్లల పట్ల

అనురాగమును దెల్పి మోదించు వాడు,

 

ప్రమీలా పుత్రడవు  – నటరాజ తనయుడువు..

జోల

కన్నులారగ కనియరే ఈ కనులు మూయని పాపానూ –
చేతులారగ చేరదీసుక శౌరి కథలను పాడరే! ..
ధరణి మడియగ భువికి తరలిన దైత్య సంతును గావగా,
దయను మీరగ వన్నె చిన్నెల వింతరూపులనాడినా,
ఆనందరూపుని కథలు పాడరే – పసి మనంబున పండగా!
కన్నులారగ కనియరే ఈ కనులు మూయని పాపనూ-
చేతులారగ చేరదీసుక శౌరి కథలను పాడరే…
సాగరములుప్పొంగి సకలము లయమునొందు చునుండగా,
అనరు గావగ మత్స్యమై ఈ ధరణి గాచిన దేవునీ,
ఎరుక తెలిపెడి వింత కథలను కమ్మగా ఇక పాడరే-
కన్నులారగ కనియరే ఈ కనులు మూయని పాపనూ-
చేతులారగ చేరదీసుక శౌరి కథలను పాడరే…
సురల తోడుగ అసురులంతా సాగరంబును చిలికగా,
క్రుంగు కవ్వపు కాపుగా తా కూర్మమాయెను ఎరుగరే!
కరుణ అవధులు కద్దుయని తా పర్వతంబునె మోసెనే,
ఆ కథను నేడిక పలుకరే ఈ చిన్ని పాపకు జోలగా,
వీనులకు మోదంబు గలుగగ నాటి కథలను పాడరే!
అన్నదమ్ముల శ్రమకు ఫలమని అమృతంబే పొంగినా,
అమిత అహముకు తగదనంచు మోహినై మురిపించెనే!
నాటి మురిపెపు మూట పాటను మేటిగా ఇక పాడరే!
కన్నులారగ కనియరే ఈ కనులు మూయని పాపనూ-
చేతులారగ చేరదీసుక శౌరి కథలను పాడరే…

శృక్కు శృవ వాక్సీమ గల్గిన ఆదిరూపమునెరుగరే-
జగతి నడిపెడి నియతి జాడలు – వెదకి పదిలము జేసెనే,
మూగబోయిన ధాత వాణికి జీవధారల గూర్చెనే-
ఆ కథను నేడిక పలుకరే ఈ చిన్ని పాపకు జోలగా,
వీనులకు మోదంబు గలుగగ నాటి కథలను పాడరే!
తనువు రూపముగట్టు తరినే మంత్రమందిన డింగరి,
పిలుపునందుక కంబవాసము వీడి రక్కసు దృంచెనే,
మృగము సగమై మమత పంచిన మోహనాంగుని లీలలూ
కథలు కథలుగ పాడరే ఈ చిన్నిపాపకు జోలగా!
చేతులారగ చేరదీసుక శౌరి కథలను పాడరే…
బుడత వటువై ధరణి గొలిచిన వామనును కథ తెలుపరే,
సురల గావగ అసురశేఖరు యాగశాలన నడచెనే,
సిరిని బట్టిన వరదహస్తము దానమందగ వంగెనే!
వాసుదేవుని వింతలీలలు కథలు కథలుగ పాడరే!
కనులు మూయని పాప మనసున కథల పాటలు నింపరే!
ధరణి భారము దీర్చగా ధరణీశుడై ధర మొలిచెనే,
ధరణిసుత చేయందగా తా హరుని వింటిని విరిచెనే,
భార్గవుని తేజంబుగైకొని శ్రీరాముడై ధర నడిచెనే !
మోహమున మునివరుల ముంచిన రూపశోభల పాడరే!
మోహమొందిన పాప కన్నులు నిదుర మోహము నొందగా!

నవమి!

              రాఘవుండై హరుడు, ధరణి సుతయై సిరి

               దశకంఠుకై వసుధ నవతరించిరనెరిగి,  

               అవతార కార్యమున కంకురార్పణ సల్ప

               కళ్యాణ మాడు ఆ నవమి వేడుక జూడ,

                      ధరణి తన రమణీయ రూపమును గైకొంది

                      సూర్యచంద్రులు మొదలు తళుకుతారల వరకు

                     తమ దివ్యతేజముల ల లదు కొన్నాయి

                     తపోభూముల వీడి మునిజనంబులు నెల్ల

                     మిధిల లో కొలువైరి – సంతసము మీర!

            ఆదివ్య ఘడియలందెందరో ఋషి వరులు,

            బహు పుణ్యములుగొన్న బహు భాగ్యవరులు,

            ధన్యులైనట్టి యా అపురూప వేడుకలు

            పలుమారు మదినెంచి – మైమరతుమీ నవమి!

అమ్మా ! ఆయీ! మాయీ! మా!

అమ్మా ! ఆయీ! మాయీ! మా!

అన్ని పదములయందు ఒదిగున్నదొకటే,

తొలినాటినుండి-మలినాటి వరకూ

తప్తహృదయపు పిలుపు – సరి లేని పిలుపు!

సప్తవర్ణపు సొగసు – సరిలేని ఋతుశోభ,

వింతనాదములీను సాగరుని ఘోష,

గగన మందెడి నగము లానందమగు వనులు,

కనగలగు తనువిచ్చినాతల్లి – అనురాగ వల్లి!

ఎగసిపడు కెరటాల తాకిడోర్వగలేక,

జటిలమగు జఠరునికి ఆపోసమీలేక,

సంఘమను సింగమున కెదురొడ్డిమనలేక,

తూలనాడినరోజు – ఒడిజేర్చి లాలించు – అనురాగ వల్లి!

గ్రీష్మమాజీవనఫు వనిని తాకిన వేళ,

నగవు ఆ కనుదోయి నంతరించిన వేళ,

అమరలోకపు దూతలానతిచ్చే వేళ,

తృటియైన ‘నిన్ను ‘ కనగలన యంచు-

ఉశ్వాస నిలుపుకొను ‘అనురాగ వల్లి’!   తల్ల

💐

ఇది పోటీ యుగం మరి!

పాలు పోసుక కంకులన్నీ వింతనాట్యము లాడుతుంటే

తొలకరప్పుడు తనువు చీల్చుక పుట్టినా పసి పరకలన్నీ

ఎంత ఎత్తుకు ఎదిగి యదపై సోయగంబులు నింపెనంచూ

మురిపెమున మురిసేను గాదా అణువు అణువున పుడమి తల్లి!

లేత కొమ్మల కొనన నిలిచిన వన్నెవన్నెల విరుల బంతులు

                                                పిల్ల తెమ్మెర చేరగానే- పరిమళంబుల కబురు పంపి

                                                         ఉన్న తావును తుమ్మెదకుతా నింపుగా తెలిపేటి తరిగని

                                                              ముచ్చటగ మురిసేనుగాదా- వనము వనమున తరువు తల్లి!

ఆటపాటల అలసి సొలసీ – ధూళితో తనువెల్ల నిండగ

చిలిపిగా చిందేసి దుమికీ- జలక్రీడల మురిసిపోయే

ఆలమందలు, గోప బాలురు, అలసి పోయిన నగర వాసులు

నీటి మడుగున సేద దీరగ మురియదా గాంగేయు తల్లి!

పగటి వెలుగుల బాట నడచీ – ఎంతగా తానలసి యున్నా

తనువులో తూకానికై ఒక కండయైనా మిగులకున్నా

కడుపు చించుక పుట్టినా కన్న కూనను గాంచగానే

వెఱ్ఱిమోహము ముసిరి మురిపెము పొంగునేలో తల్లిలో!

జగము ఛాయని, నమ్మ వాద్దని, అందురే వేదాంతులంతా

ఛాయలో గనిపించు ఈ రుచి, అసలులో ఎంతెంత గలదో!

మచ్చుకైనా ఒక్క చినుకీ ‘తల్లిప్రేమ’ను వీచికుంటే

ఇన్ని ఉర్పులు సోకికూడా కరుగ కుండుట వింతగాదా?

అసురులను దునుమాడి నీవట విశ్రమించుట పాడిగాదు

పుడమిపై నీ పదము సోకక యుగము లాయెను మేలుకో

వేగమే నీవవతరించిక నీదు మహిమను చాటుకో

జాగుజేసిన నీదు ప్రేమను తల్లులే మరిపింతురేమో!

ఇది పోటీ యుగం మరి!

కొండంత దేవరా

తోడు నడిచెడి వాడ తుహిన గిరివాసా!  మమ్మేలు మారాజ మలయగిరి వాసా!

భద్రగిరి, శేషగిరి, అరుణగిరి యంచు –   గిరి కొమ్ముపై నేల కొలువుందు వయ్యా?

గోకులంబున ఆడి గోవర్ధనుని మోసి – గోపజనులను గాచి యశము గొనువాడా!

మందరను మోయగా కూర్మరూపము నొంది-ఓరిమిన మధనమును నడిపించువాడా!

అలనాడు గిరి పాదు – ఈ నాడు గిరి కొప్పు – గిరినేల తగిలుందు వెరిగింపుమయ్యా!

||తోడు నడిచెడి వాడ తుహిన గిరివాసా!  మమ్మేలు మారాజ మలయగిరి వాసా!||

రూపమెరుగని తల్లి తోడు నడువగనెంచి – గిరిరాజు నింట తా రూపమొందేను!

కొలువు గోరెడివారు కొండ కోనల జేరి –  రేపగలు తగిలిరే నీదు తలపులను!

కొండంత దేవరా – కొండేల కొలువయ్య?  తగులగా నీకు తగు తెరపిగనలేవా?

||తోడు నడిచెడి వాడ తుహిన గిరివాసా!  మమ్మేలు మారాజ మలయగిరి వాసా!||

అడుగడుగుగా నడచి చేరలేనా చోటు – ఎంచి నిలచుట నీకెటుల  చెల్లు?

కొలువ జేరుడు వారి దారి ఇడుముల ద్రుంప – తలుప నొల్లగ నేల తలుతువయ్యా?

కొండ కొలువగు వాడ – కొండంత కరుణగను – జగతి నిండిన దంత నీదు సంతు!

||తోడు నడిచెడి వాడ తుహిన గిరివాసా!  మమ్మేలు మారాజ మలయగిరి వాసా!||

 

గిరి కన్య పూజ

ఉదయ భానుని అరుణ కిరణము- లల్లి నేసిన పుట్టము,

జిలుగు తారల వెలుగు రేఖల- చిత్రవర్ణపు అంచుతో,

దివ్యాంగ నంగముల అమరినామని – మురిపెమున మునకేయగా,

కుచ్చిళ్ళ మడతలొ ఒదుగు చిరు -మిణుకు మిణుకుల తళుకులు,

అడుగు అడుగుకు ఉనికి తెలుపుచు – మెరిసి మురిపెము నొందగా!

శృతి స్వరంబుల మువ్వలమరిన నూలు కటియందమరగా,

రవి చంద్రులమరిన కర్ణశోభలు దిశల నిండుగ నిండగా,

లావణ్యవతి పద ఘటన సందడి కదుపు మరచిన మువ్వలు,

బీజనాదపు కులుకు సన్నగ కురియ జేయుచు కదలగా,

శివ పదంబుల అర్చనకు గిరికన్య అరిగెను ముదముతో!

సాదరంబుగ ఆదరింపగ – రాగమెరుగని పెనిమిటి,

మదన జనకుని మోహపానపు మత్తు మరగిన కన్నులు,

లజ్జభావము వీడి విరియవు – వారిజాక్షిని జూడగా!

ప్రమధపతి మది నదుపు జేసిన మాధవుని కళ ఏదది?

గానలోలుని గారవించెడి గడుసు గోపిక పలుకులా?

రక్మిణీ సతి అందజేసెడి అవధెరుంగని అందమా?

జాలువారెడి జీవధారల జలకమాడెడి రాధయా?

ఒల్లమని నిను మడియ జూసెడి అసుర సంతుల సందడా?

భావమేమని మోదమొందెనొ నంద బాలుడు అంతగా!

ఆమోదమైనది అంబ మెచ్చిన జంగమయ్యకు మేటిగా!

అలమటించెను జగములన్నీ అంబ సన్నిధి గోరుచూ,

జాగుసేయక జాలిజూపుము మోహనాశము జేయగా,

నయన కౌముది నాదరింపుము కామవర్జిత కన్నుల,

పుష్టినొసగుము పూజలందుక పుణ్యభావన పండగా!

చిన్న శిశువు

ఐరావతముకైన ఆది దేవునికైన – ఆనతీయగలట్టి చిన్న శిశువు!

పూతనంతటి అసురి -కుడిచి కూల్చిన వాడు-పలురక్కసుల పీచ మణచువాడు,

గోపెమ్మ ఒడిలోన ఒదిగి కొంగునదూరి- కుడుచు కుడుపున ఏమి కుడుచుచుండు?

గుమ్మపాలను త్రాగి-వెన్నముంతలు దోచి, ఆలమందల తోలు -గొల్లవాడు,

దేవకీసతి నేంచి చరసాలలో మొలిచి – వసుదేవు తో పల్లెజేరినాడు,

నందకాంతను బ్రోవ నడచిరాగల వాడు – వల్లమాలిన రాది నెన్ననేల?

ధనుర్బాణము వీడి -సిరి సేవలను వీడి- తీరైన తల్పమగు శేషు వీడి,

వెదురు బొంగును బట్టి -నెమలి పింఛము బెట్టి -లేగ సాటిగ నాడు బుడత వీడు,

వటపత్ర శాయిగా నెలవు నిలిపెడివాడు – గోపకాంతకు ఏల బాలుడాయె?

అదిలించి, బెదిరించి, అనునయంబున బిలచి, ఆదరించెడి ప్రేమ ననుభవింప,

పూర్వపుణ్యము లేమి గోపెమ్మజేసెనో – గోవిందుడా ఇంతి ఇంట జేరె!

అడుగు వెంటన అడుగు మారాముగా నడిచి- ముద్దుమురిపెము దీర్చి మోదమొసగె!

భాగ్యమేమని అందు -రేపల్లె వాసులది – రేయిపగులూ వాని తోడు నడువ!

దండనైనా గాని – పండగైనా గాని – పంతమాడగ వాని సాటనెంచి!

సావాసగాళ్ళతో చల్ది పంచుక తిన్చు- హరియించినా ఫలము ఎవరికెరుక?

చిటికెడటుల నంది సిరులు మొప్పెడివాడు-వెన్న ముద్దల కేల చేయిజాచె?

ఆదమరపుననైన తులసి వీడని పదము-గొల్ల బాలరు వెంట ఏల నడచె?

పూర్ణకాముని నెరుగ తగువాలెరయ్య? తరుగు నేనని ఏల ఎంచివగతు?
అట్టి ఆ బాలుండు- అనునయంబున నన్ను అనుదినంబును జేరి మనుపుగాక!

మన్ననెరుగని మనసు మాయ మోహము వీడి-వాని మోహమునందు మునుగుగాక!

తనువులో అణువణువు తారకంబగునట్టి నామ నాదమునంది ఆడుగాక!