ఊఊఊహఆఆఆ

నా ఊహలో నీవు నంద బాలుడవు – నచ్చకుంటె నీవె పంది బాలుడవు,

నాటి కశ్యపు సుతుని దునుమాడగాను- పందినైనానంచు పంతమాడేవు!

 

ఉమాదేవికి నేను ప్రతిరూపమైతే – ఈశుడై నను జేర నడచివచ్చేవు!

హిరణికై కాన నన దిగులుతో నుంటే-కౌసల్య తనుయుడై కదలి వచ్చేవు!

మండోదరీ విభుని మనసు నేనైతే – మన్నింపగా నీవు మనువాడు జానకిని!

రాగములు పలికేటి మురళి నేనైతే- ఊపిరూదెడి దివ్య మోవివై మెదిలేవు!

 

పొల్లులేనొక గింజ పసుపు ముద్దనబెట్టి- రత్న సింహాసనమిదే రాజిల్లు మంటే,

ఒద్దికగ ఒదిగుండి ఒప్పుదెలిపేవు- నేనాడు ప్రతి పలుకు నాలకించేవు!

పాయసంబని ఫలము, ఫలమంచు ఒక దళము,దళమంచు ఒక దర్భ-నీకు చూపేను

ఊహలో ఉన్నదే నీకు నిక్కంబంచు- నిండుగా దీవించు అతిశయంబును బోకు!

 

యోగ నిద్రన నీవు నడయాడు వేళ- పలుకు పలుకుమనంచు బాధించ కుండా,

లోకాన నీరూపు రమియించు నటుల-‘ఊహ’ యను ఒక కానుకందించినావు!

బ్రతుకు బాటల వేట వెన్నాడుచున్నా- నీఆట యను ‘ఊహ’ నూరడించేవు!

యుగయుగంబులు గడచి ఉడిగిపోయెను ఓర్పు- నేర్పుగా నన్నింక మరిపించబోకు!

ఎడబాటు బాటపై అడుగు అడుగున నీవు-తోడు నడిచెడి వైన మింక చాలించు!

 

ఊహలెరుగని రూపు ఊరించు నీరూపు-ఎద పండి ఎరిగిరట నాటి గోపికలు!

అడవి దారుల నడచి-అవని భారము గడచి-ఆర్తిగొని ఎరిగిరట మునిమానసములు!

కన్నులేనొక కురుశ్రేష్ఠుడు,కపటమెరుగని పిన్నబాలుడు,శరము వీడిన పాండుపుత్రుడు,

కంటిరే నీ దివ్య రూపము – నీవు కరుణన దెల్పగా!

 

వీడుమోయిక నీదు పంతము- ఎన్నగా నేనెంత వాడను,

ఆటబొమ్మకు ఆశపడినే వేరుపడి తానాడు నీతో!

నీవు మిన్నని శరణు వేడెద – దూర భావము బాపుమో!

 

Leave a comment