నిశ్శబ్ద శబ్దం

వీనులెరుగని ఆలకింపుకు – విన్నపంబిదె వేడెదా,

పవను పల్లకి మెట్టి మెదలని-పలుకు నేనెటు పలికెదా?

భావ భవనపు బీజమందున-మెదలు వీచిక మొలకలో,

అంకురించిన అందమేదో – వాణి మన్నన నందదా?

ఆదిగా అమరున్న నాదము – లయల నేర్వగ కోరదా?

నగకన్య నాధుని ఆశ్రయించుక – నర్తనంబుల నేర్వదా?

అట్టి నర్తన అలజడైతే – అందు స్పందన బుట్టదా?

జగతి మూలంబైన స్పందన-చేరు వారిని కోరదా?

శంభుపద మంజీరనాదము – పలుకులైనవి ధాతలో,

వేదమై భువినేలు చున్నవి – నాటనుండవి మేటిగా!

వేదమల్లిన మాలలే – అమరేను ఆ హరి ఉరముపై,

సిరికి తెలియని చిద్విలాసపు ఉనికి తెలిపగ తీరుగా!

ఆదినాదనము పొందగలిగిన అవధి పరిధిని చెరుపగా,

చేరదే ఒక నాద బీజము నాదు మనసును మనపగా!

మురిపెమొందెడి మధుర భావపు సవ్వడుల నే పంచగా,

ఎంచనే ఒక నాద రూపము నాదు పెదవుల దాటగా!

వీనులెరుగని ఆలకింపుకు – విన్నపంబిదె వేడెదా,

పవను పల్లకి మెట్టి మెదలని-పలుకు నేనెటు పలికెదా?

నీ ప్రేమ లాలనను వాని కందించు

కూరిమితో కుచేలునకు కలిమి బలిమి నిచ్చినోడ

ప్రేమ కోరకు తులసి ఎత్తు తుాగిన ఓ తుంటరోడ

గోపెమ్మల కోక లెల్ల కొల్లగొట్టి ఒట్టుబెట్టి

గోప్యమైన జ్ఞానమిచ్చి వారందర బ్రోచినోడ!

యుగయగంబులు వేచి బహుఇడుములోర్చీ

కలికాలమున నీవు కల్పించు పధమందు

శీఘ్రముగ వైతరణి దాటగానెంచీ

వింత వింతగు దోవనెన్నుకున్నొక జీవి

కలియుగపు కలవరము కంటకంబై తోచి

జన్మకర్ధము తెలియ తడవుగానగలేక

తృణప్రాయపు తనువు చేజార్చునో ఏమొ

నా తనయుడని గాదు – మోహ బంధముగాదు,

సాటి జీవికి సేవ యనినిన్ను వేడితి

వింత వాదము మాని- నా సుతుని మది నిండు

విశ్వవ్యాపివినీవు- విశ్వైకనాధుడవు

విజ్ఞానమును నీవె – విజ్ఞతయు నీవె

వేయేల వేదముల కాధారమీవె

నా సుతుని బ్రతుకులో పూర్ణత్వమును నింపు

నీ సఖునిగా వాని సంగతంబును బెంచు,

నీ చరణముల ఘటన వాని చరితగ మలచు

నీ ప్రేమ లాలనను వాని కందించు

వాని వాక్కున నీవు పలుకువై పులకించు

వాని వీనుల నీవు నిత్యవాసమునుండు

వాని కనుపాపలో చూపువై నిండుండు

సర్వమున నిండున్న సర్వేశ్వరుడవీవు

వాని చిరుదేహమును విడనాడి మనబోకు..

నీ ప్రేమ లాలనను వాని కందించు

 

నీరాజనం!

కచ్ఛపిని పలికించు నఖము గలిగినయట్టి,

సురలోక సుందరికి – నీరాజనం!

ధవళ రాశులకుప్ప ఛాయ మించిన మణులు,

అమరున్న మకుటముకు – నీరాజనం!

కమలముకు కలువలకు – రాజైన రాయడుల,

అమరున్న కనులకిదె – నీరాజం!

అట్టి తాటంకములు తీరుగా గలిగున్న,

కర్ణశోభలకిదే – నీరాజనం!

వాసిగల నాసికను అశ్రయించిన నగకు,

మంచి కర్పూరంపు – నీరాజనం!

ధాత మోమున పండు నాదముల గ్రోలేటి,

వాక్సీమ వాకిలికి – నీరాజనం!

శ్యామలగ, శారదగ, మాతంగ కన్నియగ,

మము బ్రోచు భార్గవికి – నీరాజనం!

మదిజేరి మమ్మేలు హరి హృదయవాసినికి,

తళుకు చుక్కల నిండు- నీరాజనం!

నీల

అంతులే నాకశపు రంగు ‘నీలా’ గుంది,

దాని బింబము చూపు నీరు ‘నీలా’ గుంది,

అనుదినము వానితో నడయాడునా మేను,

నీ గురుతుగా ఆ రంగు ‘నీల’ మంది!

మణులు మాణిక్యములు రాసులగ నిలిచాయి,

వేయి వేల్పుల కొలుపు కోరి పిలువగ తరలి,

ఉనికి తెలుపుట కొరకు తమ రంగు నెంచగా,

సభతీరియున్న  ఆ దేవతల తలచాయి!

వాగీశ్వరిని మెచ్చి ఛాయపొందిన రాశి వజ్రమాయె,

సిరుల తల్లని జూచి మోహించినా రాశి పుష్యరాగమాయె,

దురిత దూరిణి దుర్గ రంగునందిన రాశి కెంపులాయె,

నీపాద సేవలో తరియింపగా నెంచి సామీప్యమందితే ‘నీల’ మాయె!

శశిమౌళి కలిగున్న – శర్వాణి తోడున్న,

నీఛాయ గురుతొంద తపియించి తపియించి,

తలచినదె తడవుగా క్షీర మధనపు తావు,

తరలి మృతమును   మిృంగి ‘నీల’కంఠుడాయె!

జగము నేలెడివారు – జగము నమరినవారు,

నీ గురుతు మోయచూ మురియగా గనుచుంటి,

మధురమగు నీ ఛాయ నెలవొందు తావొకటి,

దయమీరగా నాదు దరి జేయరాదా!

నే శరణన్న పదము

నారాయుణురముపై నడయాడు పదము,

గౌరీశు శిరముపై నర్తించు పదము,

అసురత్వమును బాప ముందు నడచిన పదము,

పరమ పావనమైన శ్రీ శక్తి పదము – నే శరణన్న పదము!

కఠిన శిలలో కరుణ నింపగల పదము,

ధరణీశు దానఫల మీయగల పదము,

తపియించు ప్రేమకై నర్తించు పదము,

శ్రీదేవి కరములందొదిగుండు పదము-  నే శరణన్న పదము!

దినదినము పలు పూజ లందుకొను పదము

మునిజనుల మానసము విడలేని పదము,

పదము పదమున కదలు కనరాని పదము,

సారధై నాసుతుల నడపించు పదము – నే శరణన్న పదము!

నేను

హిమనగంబులపైన – ఉరికేటి నదిపైన,

పంటపైరులపైన – ఎండుటాకుల పైన,

పురిటి పాపడిపైన – విగత జీవుల పైన,

అచ్చటని ఇచ్చటని ఎంపికే లేనట్టు,

కిరణ కరములు చాచి స్పృశియించువాడు,

నేర్చెనట ‘నిష్కామ యోగ’ ప్రకిృయను,

భగవానుడిచ్చెనట అతనికా యొగం!

యుగయుగంబుల నుండి ఓర్పుగా నేర్చి,

పంచభుతములందు ‘తేజ’మై ఒప్పు!

నగమైన నరుడైన – నగర వాసములైన,

పొంగు సాగరమైన – కృంగు లోయైనా,

జంతువులు, వృక్షములు, మరుభూములైనా,

తన యదన పదిలముగ నిలుపుకొను ధాత్రి,

‘నిష్కామ యోగ’మును బడసి సాధించీ,

పంచభూతములందు ‘పృధ్వి’యై ఒప్పు!

విష్ణు పాదము బుట్టి శివుని శిరమున మెట్టి,

చినుకు చినుకుగ నడచి- పసిడి పంటల నిచ్చి,

తరువులకు, తరుణులకు, వన చరంబులకు,

దాహాద్రి తీర్చుచూ సాగేటి సలిలములు,

‘నిష్కామ యోగ’మును ఎటు లెరుగునోగాని,

పంచభూతములందు ‘జలము’యై ఒప్పు!

మురికి వాడల లోన – పూల తోటల లోన,

ప్రేమ ఊపిరి లోన – పాము బుసలోన,

చిట్టెలుక యదనుండు మృగరాజు వరకు,

ప్రతిజీవి శ్వాసగా అనుదినము సాగి,

‘నిష్కమ యోగ’మును లెస్సగా సాధించి,

పంచభుతములందు ‘వాయు’వై జేరె!

అంతరిక్షపు వింత రాజ్యమందంతా,

తారతారకు నడుమ  అంతరంబంతా,

జీవులస్థిక లందు – హృద్సీమ లందు,

నభోవీధుల నుండి – చిరుకణము వరకు,

తనయందె నిలుపుకొని – తన ఉనికి తెలుపకే,

‘నిష్కామ యోగ’మును తన ఉనికిలో నిలిపి,

పంచభూతములందు ‘ఆకశం’ బాయె!

ఇట్టి తన సృష్టి గని -మురిసె నా బ్రహ్మ!

ఏమి   సౌందర్యమిది – ఏమి సౌఖ్యంబు?

మూల ధాతువులన్ని మోదముగ నమరె!

వైకుంఠు సేవలో  దిన దినము మోదించి,

జగతి చందములందు చరియించు వారకై,

వేదములు వెదెకెనా – కమలా భవుండు!

ఈ పంచ ధాతువుల కుదురుగా కూర్చి,

ప్రతిదాని కింతంచు భాగములు ఎంచి,

చైతన్యమును చిలికి తన మేధ జేర్చీ,

జీవ జాలమునెల్ల నెలకొల్పినాడు,

తన సృష్టి అందాలు తనకె తెలియంగ,

ఆ బొమ్మలోతాను అమరి యున్నడు!

ఆవింత పొంతనల పోకడల మహిమో!

అందు నిండున్న ఆ దివ్యాత్మ మహిమో!

పంచభూతములన్ని తమ సాధనల మరచి,

‘నేన’న్న అహములో మోదమొందుచు నుండె!

పాడిగాదిది నీకు పాల్కడలి శయనా!

పాలింపగా రార – పవన సుత వంద్యా!

పట్టుమా – ఒడుపుగా

గురుతు ఎరుగగ జేయి గురుదేవ నేడు,

కాల గతులందు నీ పదము కదలికను!

వెరపు మాపుము సామి కరుణతో నేడు,

కాల విన్యాసముల బడలియున్నాను!

తిమిర తెరలన నలుగు నగర వీధులలోన,

గురుతు తెలియని జ్యోతి జాడ వెదికేను,

విద్యగానీ విద్య సమసి – నీ విద్య నే,

ఎన్నడెరుగుదు తండ్రి తెలుపు తొందరగా!

అంతరంగపు ధ్వనులు అదుపెరుగకున్నాయి,

నాడు నేడని లేక లంకె లెరుగని తరిన,

వింత సంధానముల కూర్పులను పేర్చుతూ,

నెమ్మదెరుగగ పారు ఝరణివలె యున్నాయి!

సుడిగుండముల సుడులు సుందరంబన్నాయి,

కొండ కోనలదారి కమనీయ మన్నాయి,

తనువు తాళగలేని తీక్షణపు శరములను,

మంత్రించి సంధింప తా సిద్దమన్నాయి!

సర్వ వ్యాపకుడైన సర్వేశు వీనులకు,

నీర సించిన నాదు స్వరము చేరగలేదు,

సర్వాంతరంగుడగు ఆర్త వత్సలు కన్ను,

అంగలార్చెటి నాదు యద ఘోష కనలేదు!

జ్ఞానజ్యోతుల జీవ మందిచగల వాడ!

జారచోరుని  జాడ తెలుపగల వాడా!

పట్టుమా నా చేయి పదిలమున ఒడుపుగా,

పరమేశు పురమునకు నే తరలు దాకా!

 

 

పదసా పదసా పదసా పదసా

ఇక  ఎరుగు మార్గమని – ఎవరినెరుగగ మందు

ముందు ఏమెరిగిస్తి వేమేమి తెలిపితివి?

గురువులకు గురువువే – గురుతెరుగ రాదా?

దండ భావన వీడి దయ నొంద రాదా?

నీవు తగులకె నేను తగులలేదీ తనువు,

నీజాడ దొరకునని దూరితీ కుహరంబు,

దూరి చీకటి పొరల పోగులో మునిగాను,

భీతిల్లి రోదింప సన్న సవ్వడి జేసి,

కను మిదే నాజాడ తెలియు మన్నావు!

భీతి భావన కదిలి నాడులన్నిట నిండ,

వింత భువనపు వెలుగు వెలిగించె నీ జగతి,

‘అది’ నేనే, ‘ఇది’ నేనే, అని నీవు బొధింప,

నీవు గానీ తనువు నేన నెంచితి సామి!

కొంటె వాడవు నీవు- కొలుపు నొప్పవు నీవు,

కంటి వెలుగగు నిన్ను- ఎటు నేను కనగలను?

వెలుగు లేనొక కన్ను కలిగున్న ఫలమేమి?

వెలుగైన నిన్ను నే కనగలుగు కన్నీయి,

చూపు జాడల మసలి కనగలుగు వెలుగీయి!

ఆటపాటల దేలి ఆదమరచిన నాడు,

అదును చేసుక నీవు

గోపబాలుర కొరకు గోకులపు దారులలో,

ఇదె ‘నన్ను’ కనుడంచు ఆటలాడినవాడ,

కనికరంబున నీవు కనులదూరిన గాని,

కనలేని ఈ కనుల చపలత్వమేమందు?

భవ – భావ

చక్షురధ చాలనకు సారధివి నీవు,

గురుతు గలిగించగల గురుతైన నీవు,

ఎరుకగొను గురుతులో ఎరుకైన నీవు,,

తలుపవేలనొ మాప ఇట్టి ఎడబాటు?

చిగురు భావములందు భవమైన నీవు,

భవబంధముల బంధ మాధుర్యమీవు,

మరుగు నెరుగని బంధ భావనవు నీవు,

మరలింపవేనన్ను- నిన్నెరుగు నటులా!

కాంచీపురపు కరుణ-కైలాసగిరి నెలత,

కోల్హాపురిన కొలువు తీరున్న మమత,

కవుల కల్పనలందు కదలాడు నెనరు,

కొసరి కొంచెంబైన తగుల దెందులకో?

భువనము

భవ భువన భవనాన భీతి గొనియున్నాను,

భవ మూల పునికి నే కనలేక యున్నాను,

ముజ్జగుంబుల ధాత దయనెంచి ఉదయించు,

ఉనికెరిగి నేనిన్ను గురుతెరుగు నటులా!

గురు భావనల గురుతు గగన కుసుమంబాయె,

అహము నను అదిలించి అదుపుగొని మనిపేను,

అన్యమెరుగగ నాకు తెరపి తరుణము నీక,

అహము మించిన గురువు అవనిపై లేదంది!

అంతమెరుగని ఆది అగునీవె ఆనాడు,

మోహమొందేలనో అహమునొందిన ఫలము,

బీజ జాలము జల్లి మొలిపించెనీ జగతి,

మోదమమరగ ‘నీకు’, ‘నేను’ నిలిచాను!

తోడు మరువని నీవు తోడేల విడిచెదవు?

తోడుంటివను తెలివి మరుగేల జేసేవు?

తనువు తోరణతొవ తరుగు తరి నెరుగగా,

తోచకున్నది దారి- దయనెంచి ఎరిగించు!

కాలకాలుడ వీవు కాలాంతకుడ వీవు,

కాల నాగుల నగలు కోరి నిను జేరేను,

కాల వాహిని జోరు ఓపలేనీ మేను,

ఏల దూరితివయ్య ఎరిగింపుమిక నాకు!

నిను వీడిమనలేక వెంటాడి నడచితిని,

మేను దూరిని ‘నేను’, ‘నీ’ జాడ మరచితిని,

మరపు తెరపుల ఆట అలసటాయెను ఇంక,

మరపు మాపుము నీవె మరుగు విడచి!

నీవాడు ఆటలకు మోదించి మాతంగి,

బీజ బీజము నందు చేతనై వెలుగొంది,

వేల రూపములాయె క్రీడింప కామమున,

మోదించు మోహానా! నా మరపు తొలగించు!

క్రీడ రూపము నీది క్రీడించు కనకాంగి,

కారణంబుల రూప మేల నలుగును జగతి?

‘నీవు’ జూపక ‘నేను’ ఎరుగ గలనా గతులు?

గతి లేని గమనమున గతి నెరపి పాలించు!

జర చరించెడి నెలవు ఏలువాడివి నీవు,

ముదిమి కుడిపెడి జనుల మొరలెరుంగు!

చిద్విలాసపు చినుకు చింతామణుల నెలవు,

చేరి మురిసే మాత కృపను కుడుపు!

క్రీగంటి చూపుతో నెలవు నేలే తల్లి,

తరుణ వీక్షణ భాగ్య మనుపు మంచు,

ముద్దార ఎరిగించు మోదమొందెడి వేళ,

రసము రాజిల్లెండు గళము వాడా! –

హలుడు నెరపెడి నర్తన నుభవించెడివాడ,

చంద్రహాసుగ చెలిని చెలిమి జేసెడి వాడ,

చెల్లునయ్యానీకు హలుని హరియింపగా,

సాటివారల గాము సారంగ విభుడా!