తొలి సంధ్య తల చెండు జారి చిందినయట్లు,
పులక పుష్పపు పోగు లమరి యుండిన వనిన,
నగరాజ కన్నియను కోరికొలిచిన ఫలము,
నయన భోగము నొందె మదను మహిషి!
సమ్మోహనంబైన సన్న నవ్వుల చిలికి,
ముజ్జగము లేలేటి మదన మోహనుని,
మదిలోనె బంధించి మోదించు మొనగాని,
తపము భంగము జేయ తరలి నా రతిరాజు,
జయము నొందెను ‘నాడు’ తనువు చెల్లించి!
సౌభాగ్య దాయివగు నిన్ను నమ్మన సతికి,
నీ మన్ననల ముడుపు ముచ్చట దీర్చి,
అవధి లేనంమృతము నొలికించగల చూపు,
వాని పురమున నాటి – రతిని రక్షించి,
ముక్కంటి చూపులకు బూడిదైనా తనువు,
ఇల్లాలి కనువిందు నమర జేసితివి!
నీ నయనాంమృతపు బలము-రతి పూజ వైభవము,
వెన్నుగావగ మదను మహాబలుడాయె!
మునిమానసము నుండి చిరుత జీవుల వరకు,
తారతమ్యము లేక తగు సమయమని లేక,
రూపులేనా ఉనికి బహు రూపములనొంది,
ప్రతివానిపై శరము సంధించు చుండే!
అహమన్న దెరుగకే ఆనందమున దేలు,
పూర్ణకాముని మదిన కామ బీజమునాటి,
కామింపజేయగల కామేశ్వరివి నీవు!
దగ్ధ దేహపు ఫలము నీ రక్షగా గొన్న,
రతి వల్లభుని వింటి రణ వైభవమును,
ఎరుక గొని ఎరిగించి శంభుదయ గూర్చు!
శాంభవివి, శాంకరివి, శర్వాణి నీవు!
శరము లందలి గతివి గాయత్రి నీవు!
నమ్మికొలిచెడి వారి నడిపించు నీవు!
ఎరుగవే దీవెనల బలము బడసిన వాని,
విస్త్రుతంబగు విజయ విగత వర్తనము!
వరదాయని వీవు – సీమ నెరపిక కావు!
మదన సేనల మధన భారమాయెను మహిన,
మట్టుబెట్టెగ వాని, మన్నించి మదినెంచు,
అంగరహితుని రచ్చ దమియింపగా నీవె,
దయబూని ఒక రూపు రయమునొందమ్మా!
పూజలేపాటివని పిన్నజేయకు మమ్ము,
నీ లోక వాసులము – నీ సుతుల మమ్మా!