విలాస పుష్పం

గంగ పుట్టిన తావు నుండి తరలి వచ్చిన భావుకా!
తెలిపుమా మీ సీమలో మా సాటి వారల కుశలము!
ఉరుము కిరణపు భాస్కరునితో పంతమాడగ జాలకా,
కమిలి జాలిగ జూచునేమో ఆదుకొనగా వేడుచూ!
తరలి పోయే వెండి మబ్బులు మరలి ఎన్నడు వచ్చునో!
ధరణి దాహము బాపి ఎన్నడు సేదతీర్చగ నెంచునో!
పొంగిపోవకు పిచ్చి బాలా – అంత తొందర దేనికో!
పొంగులారెడి పరువమంతా పరచి పండుగ జేతువే!
కన్నులారగ నిన్ను మెచ్చెటి కన్నులెన్నడు గంటివో! కనికరంబున ఒక్కరైనా మెచ్చుకోలుగ గంటిరా!

నునుపు చెక్కిలి వాడకుండగ వెన్నమీగడ లిత్తురే!
పొటమరించెడి నీదు నగవును ఎన్నడైనా కందురా!
వన్నెతరుగక నిలచియుండగ మంచి అత్తరు నిత్తురే!
వేడుకగ నీ మనసు నిండుగ మన్ననెపుడైనిత్తురా?

ఎచటనుండిటు వస్తివో – ఏమి జూడగ వస్తివో!
మదనతాపము మాపుకొనుటే మేటి బాటనుకొంటివో!
తనువు కర్ధము అర్ధమేనని వగచు తనువుల తోపులో,
మలిగిపోయెడి నీదు పుట్టుక వ్యర్ధమే యనిఎంచవో!
వేకువైనా చీకటైనా వేచి పూచెడి పూవులూ,
తరికి యొక్కటి తరలి జేరును కామజనకుని సేవకు!
నింగి అరుణిమ చిన్నబోయే మందార గుత్తుల మోదమూ,
ముందుగా నన్నందుకొమ్మను వెన్నముద్దల గుత్తులు!
చిగురు చెక్కిలి సిగ్గు మొలకన పలుకరించే పూవులూ!
చనువుగా తా మమరుగాదా పూజ పూజన మేటిగా!
పూవులెకే పూజ చెల్లదు – పలుకడే ఆ సరసుడు!
పూవులున్నవి పూజకేగద పుణికి పూజల సేయరే!
వాని యోగము వీసమైనా వాసిగా నీకొరుగునా?
వేలకొలుపులు వేచియుందురు వారి పొందును పొందగా!
మన్ననొందగ మొలచెనే ఆ విరులు భారత మందునా!
వాని కుశలము కుశలమే మరి మీకు కుశలంబెక్కడా?
అంతమోదము నొందునా ఆ పుడమి మొలచిన పువ్వులు!
ఎంతలో నే నెంత తరుగని ఎరక జేస్తివి భావుకా!
ఎగిరి నేనెటు బోదునో ఆ అమర ధామపు అనరుకు!
నేటికెరిగితి నీటిమూటగు బ్రతుకు పండెడి మార్గము!
గగన దారుల నడచి పోయే సర్వసాక్షుని సాక్షిగా,
వెండివెన్నెల కుమ్మరించే నిండు చంద్రుని సాక్షిగా,
వసతిగా న యదన కదిలే గాలితరగ సాక్షిగా,
వేడుకొందును లోకనాధుని నన్ను ఆ దరి జేర్చగా!

విధి

విధి కలంబున జాలువారెడి వింత కధలివి – విందువా?
విగత మనముల జీవరాసుల బాధ గాధలు – విందువా?
వాణి ఎరుగని పదములల్లిన వింత కూర్పును విందువా?
వీనులున్నవి వినుటకేగద విన్నవించు మనందువా?
వ్యాధిబాధలు – వ్యధల విసురులు – చెదరు యోచన పుంతలూ,
కరుగు కాలపు కఠిన ఒరవడి తొలగి నిలచిన చరితలూ,
మన్నికైనవి మనుగడున్నవి మనసు మూలల నున్నవి,
హరిహరాదుల కదలజేసిన వైరి సంతతి ఊహలూ!
మనసు నడిచెడి దారిలో తా నడువ నొల్లని తనువులూ,
తనువు తాపపు తాకిడొల్లని నియమ వరుసల పేరులూ,
నియతి నియమము నెరుగజేసెడి తాళపత్రపు తునకలూ,
తాళలేమని తల్లడిల్లెడి మాయలోకపు మనుషులూ!
కలుష వర్తన ఫలము భోజ్యము -తరుగు దారిదె ఎరుగవే,
ఖేదమేలని ఊరడించెడి మునిగణంబుల హితవులూ,
మన్నికైనది మనసుకందక కలుగు చింతల చిందులూ,
కరుగు కాలపుహోరులో తా కరుగ నేర్వని ఊటలూ!
ఏది విందువు ఏది కందువు – కాలమెరుగని నాయకా!
ఏవగింపులు – ఆదరంబులు – ఎరుగ నొల్లని భావుకా!
ఏలికగు ఆ పరంధాముడు ఎంచి ఇచ్చిన నాటికా! (నాటికా – గ్రంధవిశేషము)
నడుపుటెరుగని బడుగు బొమ్మల దడుపు కధలను విందువా!

ఛాయ!

నల్లమబ్బులనాడు వెండి వెన్నెల వెలుగు – చినుకు చినుకుగ జారి మరులు గొల్పు!!
మనసు మూలల నుండి మదన జనకుని ఊహ – ఉల్లాసముగ పొంగి ఉరము నింపు!
నీలి మేఘపు ఛాయ శశిమౌళి శిఖ ఛాయ – శ్యామలాంగుని మేని మెరపు ఛాయ,
మాతంగి మనసార మెచ్చి అందిన ఛాయ – మమ్మేలు శివ పత్ని మేని ఛాయ!!
భాను తాపము నుండి తెరపినిచ్చే ఛాయ – భావ నగముల నగవు నందు ఛాయ!
ఉడుకు శిఖి ఊహలకు ఊపిరూదే ఛాయ – తెరపి నొల్లని మనసు మరగు ఛాయ!
రూపు గట్టిన మాయ నంటి నడిచెడి ఛాయ – వెలుగు గలిగిన యంత మలగు ఛాయ,
చూచాయిగా దెలుపు సూచనందిన చాలు – వెండి వెన్నెల పొంగు మనసు నిండు!
నగుబాటు అనందరే అందరూ ఈ ఛాయ – వెలుగు తొలగిన మిగులు వెలితి ఛాయ,
అలసటొందిన నాడు ఆదరంబున జేర్చి – అలుపు బాపెడి మమత నెలవు ఛాయ!
ఏ పొదల మాటునో రాధికా జడబట్టి – పంతమాడే గడుసు గొల్లకాపరి ఛాయ ,
ఆ ఛాయ నా ఛాయ ఛాయయై వెన్నంటి- పాండు నందను సాటి నన్ను జేసే!
ఎంత మోహము తండ్రి గురుతొందగా నాకు – నెలకొంటివీ జగతి జాడలందు,
పగలంత నీడయై వెన్నంటి నడిచేవు – పొద్దుగుంకిన నీవు నింగంత నిండేవు!
నేరమెన్నకు తండ్రి జాడెరుగగాలేక – మరుగేల విడవంచు మాటలంటి,
మందభాగ్యునికైన – మహరాజ సుతుకైన – ఛాయ నీదే తోడు ఎరుగమైతి!
ఆనాటికానాడు తరిగిపోయే తనువు – మాధవుని తోడన్న ఊహనొంది,
మోదాన మునుగదే ప్రతి మానవుని మనసు – మనుప ఇంతకు మించి మురిపెమేది?

కల్పవల్లీ

కామజనకుని ఇంతి కినుకేలనమ్మా ?- కరుణ జూడగ నాకు గతిఎవ్వరమ్మా?
కారణంబేమన్న కబురు లేకున్నా – మనసు విచలత నణచ అలవిగాకుంది!

అరవిందముల సేవ అందించగాలేను – అగరుచందన గంధ మీయలేను,
పన్నీటి చినుకులను కొసరి కురిపించుచూ- నామ మాలల నేను నుడువలేను!
పసుపు పారాణితో శోభించు నీ పాద మంజీరముల ఉలుకు వినగ లేను!
కర్పూరవీటికా సమ్మోహ గంధమును శ్వాస దారుల నేను ఎంచ లేను!
మతిమాలినీ మనసు మునుగు గంధపు ఘోష మాపి ఏలుము తల్లి! మా కల్పవల్లీ!

మంచి జాజుల మాల మరువంబు జత జేసి తీరుగా అల్లి నే నొసగ లేను,
మందారు గన్నేరు ఎఱ్ఱమంకెన పూలు ఏరి ఎంపిక జేసి కూర్చ లేను,
ముద్దబంతులు చెండు చెంగావి చీరెపై సరిగంచు తోడుగా నుంచలేను,
మొగలి రేకులు ముడిచి కంఠహారపు శోభ ఇనుమడించే ఇరువు నాకులేదు!
సెగలు రగిలే మనసు సేదదీర్చుము తల్లి – సాదరంబున ఏల దరినిజేర్చి!

ఎంచి కుంకుమ పువ్వు ఏలకులు జతజేసి పాయసాన్నపు కలశముంచలేను,
భక్ష్యభోజ్యము లేహ్యచోష్యాదు లన్గూర్చి నైవేద్య సేవనే జేయలేను,
వీనులారగ నీకు వీణాది వాద్యముల తోడుగా నేపాడి మనుపలేను,
వట్టివేరుల కట్ట పరచి కట్టిన యట్టి వింజామరల బట్ఘి విసుర లేను,
విసిగి విరిగిన మనసు వివరమేమెరుగదే- వసతి నొందెడి దారినెరుజేయి!

నికడెరుగక నీల్గు మనసు మనుపు మటంచు విన్నవించెడి తీరు నెరుకజేసి,
మందగించిన మతికి మనసు మనిపెడి మేధ ఆదరముతో నొసగి ఆదరించి,
మందాకిని వంటి నీ చూపు పంజరము పలుదిశల నాకొరకె పరచి యుంచి,
ఎడ దారి పెడ దారి ఏ దారి నడచినా నీ గూటిగురిలోనె నన్ను నడిపి,
ఆదరించుము తల్లి ఆదుకోవమ్మా – మనసు దారులనుండి మరలించవమ్మా!

వనమాల

వైజయంతిని బోలు వనమాల నమరింప,

కొమ్మకొమ్మను అడిగి దళములేరితినయ్య,

పూల కూర్పును పేర్చ దారమేదీ లేక,

యోచనగ నిలచితిని సందేశమందగా!

పూల తేరుల లోన తుమ్మెదలు తగిలాయి,

మధువు గ్రోలక ఏవొ మంతనాలాడాయి!

ఊసు తెలుపుమటంచు మన్నించి అడుగగా,

తమ మాటగా తెలుప సందేశమన్నాయి!

లేత మొగ్గల బుగ్గ పొంగి విరిసిన తీరు,

పీయూషముల పుంత పోంగి పొరలినతీరు,

సుర సౌరభపు సాటి మేటినా తీరంచు,

మరుల దేలుచు మురియు నవల తీరు!

లోకాల భరింయించు ఉదరంపు సందడులు,

సుతిమెత్తగానాడు నాభి పురముకు  పైన,

సర్వజీవుల జీవనాడియౌ సర్వేశు,

హంస గమనపు శ్వాస మసలు చోట,

సిరి సాటి  నిలువగల తులసి దళముల వెంట,

శ్రీవత్స మమరున్న వక్ష సీమను జేర,

ఎన్నికైనా విరలు ఎంచవే ఎల్ల లను,

యవ్వనంబుల పుంత నందజేయంగా!

కూరిమే కూర్పుగా కూర్చి చేర్చమనంచు,

కనుసన్న తో పలుకు- లల్లి పలికాయి!

వరుస వరుసన అమరు వన్నెవైనములన్ని,

సరసముగు వాసనల సరులు తెలిపాయి!

వైజయంతిని వీడి వనమాల ధరియింప,

వసుధ జేరిన వాడ – వాసుదేవా!

వన్నె తరుగక ముందే మన్నించి ఏలరా,

వసివాడునేమొ ఈ పురపు విరులు!                                                                                                                                                      వరదుడవు నీ తోడు వరదాయినుండగా!

మాధవుడవట నీవు రాధ తోడు!

వసుమతిని చేపట్ట శ్రీరామడైనావు!

నేటికే రూపమున బ్రోతువయ్యా?

వారి వీరిని అడిగి ఎరుక గొంటిని గాని,

ఎరుగనే నీ రూపు తీరు తెన్ను!

మరుగు మాపుక నీవె ఎరుకగా దరిజేరు,

ఏలికవు నీవన్న ఎరుక గరుపు!

విద్య

 

కడుపు కుడుపుకు కొలువు నిచ్చెడి – చదువు చదువగ తగినదా?

తనువు తగిలిన తరిని తెలియగ – తగిన విద్యలు తగినవా?

రాలి తగిలెడి తనువు నిలుపగ తగిన చదువులు చదివినా,

కొలువు కొలుపును తగిలి యుండుటె చదువుకర్ధము గూర్చునా?

అర్ధమందిన అమరుసుఖములు అమర పధమును తెలుపునా?

తనువు సారము ఉడుగు వరకూ అర్ధసాధనే సాధనా?

అర్ధమొల్లక కుడుపు గడువదు- కుడుపు నొల్లక తనువు నిలువదు,

తనువు చెల్లిన తరిని ఎరుగగ తారకంబగు ఓడ మిగులదు!

తనువు నిలుపను సారమంతా అర్ధసాధన కుడిగితే,

తనువు కారణ విద్య దెలియగ తరుణమెన్నడు గలుగును?

సంచితంబాగామి తక్కెడ మిగులు అంశపు చెల్లుబాటుకు,

తగిన విద్యను తెలియుటె ఈ తనువు తగిలిన కారణంబట!

కుడుపు చదువుల సాధనందే తనువు వన్నెలు తరిగిపోతే,

జీవజాలపు ముఖ్య కాలమా విద్య సేవలో చెల్లిపోవును!

వివిధ విద్యల విజిత రూపము వెల్లడించున దేమనీ?

వన్నె   తరిగెడి తనువు వన్నెను తగిలి యుండుట ఏటికీ?

తనువు తాపము తీరు విద్యలు-తెలియు తరి ఇక ఎన్నడో!

సారముడిగిన నాడు ఈ తనువాసుడందున ఆ తరిన్?

వేటగాడు!

వెన్నంటి  నడిచేటి వేదాద్రి వాసుండు,

విల్లు నంబులు లేని వేటగాడు!

వారిజాక్షిని విడిచి వైనతేయుని మరచి,

బంటు మాటను నిలుప ఉరుకు వాడు!

తుంబురుడు నారదుడు పలుకు పల్లవికీ,

యక్షకిన్నెర సురలు వాజ్యములు జేర్చ,

గంధర్వ గణములను గూడి ఋషులెల్లా,

మంద్ర నాదముతోడ నుతియించు చుండ,

పాల్కడలి అలలమరు చిగురు నర్తన డోల,

ఫణిరాజు పానుపును సనసన్నగా నూప,

పదపంకజపు సేవ సిరి కరము లందీయ,

జగము లేలెడి రేడు- పరమాత్మ వాడు!

కాల గమనపు గురుతు మోసేటి మేను,

ధరణి గుండెన శిలగ మొలచినా మేను,

సమ్మెటలు ఉలి పోటులెన్నిటినో ఓర్చి,

శిల్పశాస్త్రపు సీమ సొంతమమరించీ,

అసురాధిపు సభన అమరినా స్తంభంబు,

ఏపగిది నీ నెలవు కాగలిగె సామీ?

అణువు అణువున నిలచి – కలవంచు ఎరిగించి,

ఏలికైతివి నాడు – దయజూసీ ఏలుమిక నన్ను ఈనాడు!

 

 

శంకరా! శంకరా!

సలిల కేశమువాడు – నిప్పు కన్నుల వాడు

నిక్కముగ కిసలయపు – జంట బాయని వాడు,

తామసుల తపములను – కరుణ గాంచెడి వాడు

వాసుదేవుని స్మరణ – మరువ నేర్వని వాడు!      ! శంకరా!

 

మధువనుల మారుగా – మరుభూమి నెంచుకొని,

తరలిపోయెడి వారి – తోడు నిలచెడి వాడు,

భూషణంబులు హరికి – బూడిదే తనదంచు,

కాష్ఠశేషమునందు – శయనించు వాడు!          !శంకరా!

 

యడబాయలేనంచు – దరిజేరు జవ్వనికి

మణులు మాణిక్యములు – మందిరము లీక,

దేహియని చైజాచి – భిక్ష నడిగాడు,

తనదైన దేహమును – పంచి ఇచ్చాడు!       !శంకరా!

 

విశ్వేశు ధ్యానమున – మై మరచు వాడు,

విశ్వ కార్యమునందు – మోదించు వాడు,

నిస్సంగులకు తాను – సాంగత్య మందించి,

మోదమున నగముపై – నర్తించు వాడు!     !శంకరా!

 

మోహమెరుగని వాడు – ముక్కోపి వాడు,

సరస మెరుగని వాడు – సన్యాసి వాడు,

మదును జంపినవాడు – నిర్మోహి వాడు,

ప్రియురాలి నెడబాసి – తపియించి నాడు!   !శంకరా!

 

ప్రమధ గణముల యందు – కరుణ గలవాడు,

చైతన్యమై జగము – వ్యాపించు వాడు,

నారాయణునాజ్ఞ గోని – నడయాడు వాడు,

పార్వతీసుతు శిరము – ఛేదించినాడు!       !శంకరా!

 

కాలకూటపు ఛాయ – జీవరాసుల వ్రేల్చ,

దాక్షిణ్యమును దాల్చి – దక్షిణా మూర్తియై,

యజుర్వేదము నిచ్చి – యజ్ఞముల నిచ్చి,

మాధవుని మహిమలకు – వన్నె నిచ్చాడు!  !శంకరా!

 

మంత్రమెరుగని వాని – తంత్రమెరుగని వాని,

పూజ లెరుగని వాని – పుణ్య హీనుడ గూడ,

ఎరుక లేనొక క్రతువు – పూజగా తలపోసి,

దరిని జేర్చెడు వాడు – వెఱ్ఱి శంకరుడు!     !శంకరా!

 

రూప లావణ్యమును మోహించనారూపు,

ఛాయగా నామదిని స్పృశియించెనేమో!

పలుక నేర్వని మనసు – పలు పల్కులన్పేర్చి,

పరమేశు పదఘటన భావించు చుంది!    !శంకరా!

 

ఏమరక ఏపూజ – నేజేయగా లేను,

మోహబంధము నుండి – మరలగా లేను,

నా మానసంబంచు – నా పలుకు లంచు,

అహమునందెడి నన్ను – ఏలుకోవయ్యా!  !శంకరా!

హరి – కరుణ

కస్తూరి జవ్వాది అగరు అత్తరు లలద,

కుబ్జ వంకర దీర్చి సుందరిని జేశావు,

కూరిమొసగ తలుప సాటెవ్వరయ నీకు,

కురిపించు నీ కరుణ కమల నయన

గుప్పెడటుకుల తోన చేరవచ్చిన సఖుని,

ప్రేమ మీరగ పిలిచి అతిధి సేవలు జేసి,

తరుగుటెరుగని నిధుల ఇచ్చి బ్రోచితివయ్య,

సాటెవరు నీ కిలన కూరిమొసగంగా!

శరణనన్న గజరాజు ఏపూజ జేసెనని,

ఉన్నపాటున ఉరికి అభయంబు దయజేసి,

మకర దేహుకు ముక్తి రయము నందిస్తివే,

నిన్ను మించిన వరదుడెచట గలడు?

వికట భావననైన స్తన్యమిచ్చిన ఇంతి,

పొందెనే నీవల పరమ పథ పదవి!

తగువార మేమన్న మల్లయోధుల గూడ,

హరియించి బ్రోచితివి క్రీడ క్రమమందు!

ప్రేమతో,  చెలిమితో,  వైర భావనతో,

తీరుతెన్నేదైన తలుపె తగునంచూ

చేరి చెలిమిని పంచి చేరదీసితివే,

కలి కాలమున ఏల కాఠిన్య మొందితివి?

కూరిమొసగగ ఏల జాగు నొందేవు?

మందగించిన మనసు, మసక బారిన ఊహ,

లాలలెరుని బ్రతుకు –  కటిక బాట,

ఒల్లనన్నవి  జూడు  పిలువగా నిన్ను ,

దారిజేసుకు జేరి వెతల హరియించుమయ్యా !

హరివి నీవని ఎరిగి నేను మురియంగా!

 

హరి – కరుణ

కస్తూరి జవ్వాది అగరు అత్తరు లలద,

కుబ్జ వంకర దీర్చి సుందరిని జేశావు,

కూరిమొసగ తలుప సాటెవ్వరయ నీకు,

కురిపించు నీ కరుణ కమల నయన

గుప్పెడటుకుల తోన చేరవచ్చిన సఖుని,

ప్రేమ మీరగ పిలిచి అతిధి సేవలు జేసి,

తరుగుటెరుగని నిధుల ఇచ్చి బ్రోచితివయ్య,

సాటెవరు నీ కిలన కూరిమొసగంగా!

శరణనన్న గజరాజు ఏపూజ జేసెనని,

ఉన్నపాటున ఉరికి అభయంబు దయజేసి,

మకర దేహుకు ముక్తి రయము నందిస్తివే,

నిన్ను మించిన వరదుడెచట గలడు?

వికట భావననైన స్తన్యమిచ్చిన ఇంతి,

పొందెనే నీవల పరమ పథ పదవి!

తగువార మేమన్న మల్లయోధుల గూడ,

హరియించి బ్రోచితివి క్రీడ క్రమమందు!

 

 

ప్రేమతో,  చెలిమితో,  వైర భావనతో,

తీరుతెన్నేదైన తలుపె తగునంచూ

చేరి చెలిమిని పంచి చేరదీసితివే,

కలి కాలమున ఏల కాఠిన్య మొందితివి?

కూరిమొసగగ ఏల జాగు నొందేవు?

మందగించిన మనసు, మసక బారిన ఊహ,

లాలలెరుని బ్రతుకు –  కటిక బాట,

ఒల్లనన్నవి  జూడు  పిలువగా నిన్ను ,

దారిజేసుకు జేరి వెతల హరియించుమయ్యా !

హరివి నీవని ఎరిగి నేను మురియంగా!

 

ఆవాహనము

రార మాధవ – రార కేశవ – రార రాధిక వల్లభా!
రార గిరిజా సుందరా – నా మానసంబున నుండగా!
నారికేళపు సలిలమై – నా మనసులో ఉప్పొంగరా!
పారుజాతపు తావివై – నా తనువు నంతను నిండరా!
పండు మామిడి తీపివై – నా పలుకులో కొలువుండరా!
తగిలి తూరుపు తలుపు తెరచే తలపువై వెలుగొందరా!
రార మాధవ – రార కేశవ – రార రాధిక వల్లభా!
రార గిరిజా సుందరా – నా మానసంబున నుండగా!
చినుకు నందలి ఇంద్రధనువై – కొసరి అందము నుంచరా!
రాగమందిన అంబరంబై మనసు మన్నన నొందగా!
అడుసు మనసని అలవి గాదని ఆవలుండకు దేవరా!
ప్రీతి సలుపగ పంకజంబుల పాదు నా మనసాయెరా!
రార మాధవ – రార కేశవ – రార రాధిక వల్లభా!
రార గిరిజా సుందరా – నా మానసంబున నుండగా!