గడుసు గోపిక

గోవర్ధనగిరి పైకెత్తి గోపజనులను కాపాడిన తరువాత . – కిృష్ణుడు అవతార పురుషుడు అని తెలుసుకున్న ఒక గోపిక….

మనఇండ్ల నాడేటి గోపాల బాలుండు – వెన్న కుండల గొట్టి కుడుచువాడు,
ఇంటింటిలో దూరి – ఏమరవగా జూసి – కొంటె చేతలతోన తిరుగువాడు,
ఒకరింటిలో ముంత పొరిగింటిలో ఉంచి – జగడముల వేడుకలు జూచువాడు,
గోప బాలుర సాటి గోవులను గాచుచూ – చల్ది పంచుక తినెడి పిల్లవాడు,
గోవిందుడట వాడు మాలచ్చి పెనిమిటట – వెడలినాడట ఏదొ దొడ్డ పనికి!

లోకాలలో నున్న గోపాలురందరూ గోవిందునకు ఇచ్చు ముడుపులన్నీ,
పాలసంద్రంబాయె – పరమేశునిల్లాయె – లచ్చిపుట్టిన యట్టి లోగిలాయె!
ఆకడలిలో ఊగి ఉయ్యాల జంపాల – అలవాటు ఆయెనే పాల రుచులు,
మన చిట్టి కుండలో నిండున్న క్షీరములు – ఏ మూలతూగునా సాగరముకు!
అందువల్లనె ఏమో ఈ బాలుడందేను – వెన్నపాలను కొన్ని కడవలందు!

అలనాడు మడుగులో కాళీయు తలపైన తాండవంబుగ తాను ఆడినపుడు,
అచ్చరువునొంది నే ఘనముగా పొగిడాను – సాటి పిల్లల జూచి ఎరుగుడంచు,
నేడెరిగితిని నేను అసలైన కారణము – ఎరిగించెదను నేను ఎరకగొనరే!
పాము పడకట అచట – గొడుగుగా పడిగెనట – వాసముండగ పాము చుట్టయంట!
అలవాటు గనుకనే ఆనాడు దుడుకుగా దూకి ఎచ్చుల బోయె – వింతగాదె!
అంతంత దేవుండు ఈ పల్లెలో దూరి ఏమి పంచునో యంచు ఆశతగదు,
సేవ భాగ్యమనెంచి సేవించుటే గాని – ఫలము గోరెడి ఇరువు లెదుమనకి,
నేడరిగిరీ సురలు సేవింపగా వాని – మన్నికగు ముడుపులను ముట్టజెప్పి,
మంచి మాటలు జెప్పి మురిపించి మరిపించి మరలించ పోవరే నగరికిపుడు,
తరుగైన మెరుగైన తుంటరాలనైన తలచమే ఈ తీరు బ్రతుకులంతా!

తల్లి – యశోద

గోవింద పట్టాభిషేకం చెయ్యటానికి గోకులం సిధం అవుతున్న సమయంలో – తల్లి యశోద తన చిన్న కిృష్ణుడు భగవంతుడు – అని ఒప్పుకోలేక – ….

చన్నినా కిృష్ణుండు గాలిధూళీసోకి – గోవర్ధనమునెత్తి నిలచెగాని,
వెన్నముంతల విందు వేడుకొందెడివాడు – వాసుదేవుడు గాదు – వినరె జనులు!
చిన్ని నా కొమరుండు – చిలిపి చేష్ఠలవాడు – పొడజూపు పొంకంపు శతములెన్నో!
పుణికి ముద్దుల ముంచి – మంచి గంధముపూసి – రక్ష వచనము బలికి – శుద్ధి నిడరే!
గోమయము దిగదుడిచి – అగరు ధూపము వేసి – పసుపు సున్నపు నీరు దిష్ఠిదీసి,
గోధూళి నొసటిపై నామంబుగా పెట్టి – కటిక కన్నుల పీడ కడుగ గనరే!
ఎందరెందరొ జేరి ఎరిగించిరే ఏదొ – ఎరుగరే నా శిశువు పసితనంబు,
పంతాన నిలచుండి బడలి ఒడలినవాని – పరమేశుడని పొగడి పొరలుతారె!
చిన్ని పాపడు వీడు – కొంగు పట్టుక నన్ను – దద్ధిముంత దాచకే దయజూడవేనన్ను,
నీ మాట దాటనే – నిను వీడినే జనను – పొరుగు కాంతల మాట చెవినొగ్గి వినకే!
వారిండ్లలో నన్ను వంచించి యుంచేరు – చేరి నిన్నే నేను మురియు వాడ!
అనియంచు దరిజేరి చిన్ని చేతులు చుట్టి – నా బుగ్గపై చిట్తి ముద్దునిడునే!
చిరు ముత్యముల మాల దువ్విజుట్టిన కురులు – చెదరజేయుచు వాని చేరదీసి,
పడతులాడెడి మాట మన్నించి వినువాడు – మాయ మర్మము లెంచ మర్మమెరుగని వాడు!
ప్రతి ఇంటి లోగిళ్ళ పారాడు పసివాడు – పాలు వెన్నలు కుడిచి ఆడువాడు,
పగలైన రేయైన చిరునవ్వు చిందించు – చిన్ని నా శిశువితడు – విభుడుగాదు!
వెఱ్ఱిగొల్లలు మీరు – వెరపు ఎక్కువ మీకు – వెరపెరుంగని వాడు నాదు శిశువు,
ప్రేమ పంచుచునాడు పసితనంబేగాని – మహిమ మోహము లేమి లేనివాడు,
పరమేశుడనివాని పలుమారు పీడింప – బెదరి అదురును శిశువు – తొలగరే ఇంక!
అనుచు నందుని కాంత – బాలకృష్ణుని పట్టి – మందగాజేరున్న జనుల ప్రక్కకు నెట్టి,
తన శిశువు గొంపోయె ఇంటిలోకి!
అదుపు జేయగ తాను అలవినొల్లనివాడు – సురలోక శేఖరుల శాశించగల వాడు,
అచ్యుతుడు అవ్యయుడు వనమాలి వీడు – గోపకాంతకు చిక్కి మరలుచున్నాడు!
భక్తి బెత్తము చాలు బెదిరి యుండును వాడు – ప్రేమ పాశము చాలు బంధింపగా వాని,
కదలడే మెదలడే పలుకొకటి పలుకడే – పద్మనయనము లందు అరులు పొంగంగా!
మారుబల్కక గదిలి వెంట నడచుచు వాడు – తల్లి ప్రేమను త్రాగి తమకమొందెనొ ఏమొ,
కలువ కన్నుల కొలను పొంగి ఒలికెను చూడు – చెరగు సందున దూరి మరుగు పరచె!
(అరులు – ప్రేమ)

శాంతను స్వగతం

నేనెన్నడెరుగనే నా భాగ్యమీరీతి – మదన జనకుని రూపు గాంచునంచు,
బ్రహ్మాండముల ఉనికి శాసించు దేవుండు – నరుని ఆనతి నొంద వేచెనేడు!
మురళి పైనాడేటి చిగురంగులిక మిపుడు కరకు కళ్ళెపు త్రాడు పట్టెనెటులో,
ఆలమందమల తోన ఆటలాడే విభుడు చెండకోలను బట్టి నిలచె నేడు!
భక్తసులభుడటంచు వినియుంటినేగాని – కన్నులారగ నేడె గాంచుచుంటి,
తోడుగోరిన వాని తోడుండి ఈతీరు – జయము నందెడివరకు నడపు వాని!
చెలువారగా చెలులు సవరింప నొల్లనా ముంగురుల నేడెవరు ఆపగలరు?
తనివితీరగ కదిలి కస్తూరి కరుగగా ఫాలభాగంమంత ముద్దులాడె!
నగుమోము గనకున్న నాభాగ్యమేమందు – శంతనుని దీవెనలు చెల్లుగాదె!
దోషమేదో జేయ కలిగెనీతనువన్నవగపు నేటితొ తీరి తరలు గాదె!
వాస వాసమునందు వసియించు వాసుండు – వాసుదేవుడు వాడె వెడలెనేడు,
వన్నెతరుగని విందు కనులార కనియంగ – కడసారి కనువిందు కొనుడనంచు!
అస్త్రంబు పట్టనని కొంటె పలుకులు పలుక – నమ్మి నెమ్మదినొందె వెర్రివారు,
అరవింద నేత్రునికి అస్త్రశస్త్రములేల – ఉనికి గాచెడివాని ఉనికి తగదే!
అసురులణచగ తొల్లి అందినా రూపములు – నీ మోహమేరీతి మరువగలవు?
మోహమెరుగని నీవు మోహనాయని పిలువ – మోదాన మదిజేరి మనుపుగాదా!
మీనంబులో నున్న చపల చాంచెల్యంబు – కూర్మంబు కలిగించు కుదురు గుణము,
నారసింహము లోని అమిత ఆవేశంబు – వరహావతారమున పొంగు కరుణ,
వామనుని లో స్పూర్తి – పరశురాముని యుక్తి – సుగుణ భూషణుడైన రాము రూపు,
వాసిగా నిను జేరి వాసిపెంచిన రూపు – పూర్ణరూపము నీకు సంతరించె!
శిఖిపింఛమీనాడు శశిరేఖ యైవెలిగి – కాలరూపుని ఉనికి ఒలకబోసె,
లీలగా నీ లీల ఎరిగియూ ఎరుగకే – ఆయాసమొందరే సేనలన్నీ!
శ్రీవత్సమీనాడు మాటుగా ఒదిగుండి – నెమ్మదింపుమనంచు వేడునేమో!
దైత్యమర్దను రాణి దండనీతుల దొంతి – దరహాసమున వన్నె పెంచునేమో!
మురిపెంబుతో వసుధ వందనంబులు జేసి – వొడలంత గంధంబు అలదినట్లు,
ధూళి గప్పిన తనువు ఫాలక్షు మరిపించు – హరిచందనముకింత సొగసుగలదె!
పీతాంబరుముపైన మొలనూలు దట్టించి – లోనున్న భువనముల భద్రపరచి,
గడుసు దనుజులతోన క్రీడింప నురికేవు – దుడుకు లీలల ఉనికి ఎవరికెరుక!
శరఘాతముల నోర్చి ఉప్పొంగు తనువుతో – శ్రమనొందు ఈశునికి తోడుగాక,
ఆనతొందగ లేని ఆవేశమణగింప – చక్రాదులే పగిది మదన బడునో!
పట్టినా ముట్టినా – పేరొకటి తలచినా – మోక్షపథమును కట్టబెట్టువాడు,
పనిగట్టుకుని నేడు ఎల్లరెరిగెడి రీతి- తరలిరండని నిలచి పిలచుచుండ
మోహమొందిన మాయా ముందుగా తరలదే- ఎడబాటు తనకింక తగదనంచు!
గోకులంబున నీవు ఆడించినా ఆట – చవిచూచు భాగ్యంపు కరువునాకు,
దినదినంబును నిన్ను మదినెంచుటేగాని – పంతమాడెడి ఊహ ఎపుడులేదు,
నేడందినీ తెఱపి నాభాగ్యమని ఎంచి – విదితముగ నా విద్య ఎరుకచేతు!
పరశువందిన నీవు నాకు నేర్పిన విద్య – చెల్లునే నీ చెలుని వింటివడికి!
ఎదనున్న నీ ఉనికి ఎదటి రూపును మించి నన్నుగావగ ఉరికి విదితమగునో!
దుడుకు శిష్యని దృంచ నీలోని నా గురువు – శరమంది విదితమై కరుణగనునో!
చెల్లించు నాపూజ శరమంది ఈ నాడు చేవగలదేని నా యురమునందు,
వేడుకొందక యుంటె ఏటికీ తనువింక – వసుధపై నేనేల మసలుచుంటి!
నమ్మియుండెడివారి నగుబాటు గావంగ – నగుబాటుగాగలుగు గొల్లవాడా!
నేడు పార్ధని పాటు ఏరీతినోర్తువో – కన్నులారగ నేనె గాంచుగాదె!

కోదండ రామా

కోదండమందినా కోమలాకారుడా-తూణీరమున అన్ని అమ్ములేలా?

నా అహము నణచేటి అమ్మొకటి సంధింప ఆలసింపకు తండ్రి వేగమొందు!

తనువు రాలిన నాడు తగిలినా తరుగనీ వన్నె నేడే దృంచి ఆదరించు!

వన్నె  లన్నిటి వన్నె ఆవరించిన పదము శరణమని ఎంచగల వసతినిమ్ము!

తిరుగు టెరుగని శరము తీరుగా సంధించి అసుర సంతతి నేల అణనచినావు?

పలుమారు ధరణిపై నీపాద మూనుటకు కారణంబగు వారు అధములెటులా?

అంత సందడిజేయ శక్తి లేదయ నాకు – నీరసించితి నేను బ్రతుకు బాట!

నడచి చేరెద వనుచు నానుడొందిన వాడ-నా వంక నడువగా జాలమేలా?

నీ పాద పూజకై రాగమందిన శబరి – ఎంచి తెచ్చిన పూల పున్నేమేమో!

నీ రుచిన జేరగల రేగిపండును పొంద – పొంగి పొరలిన గుబురు భాగ్యమేమో!

అలనాటి నీ గురుతూ మోయుచూ తిరిగేటి – చిరు ఉడుత బ్రతుకెంత ఉధరాయె!

పలుమారు నీ పూజ మరి మరీ జేయంగ మందగించితి నంచు మరలబోకు!

దండకారణ్య మది ఏ పూజ జేసెనో – నీ వసతి గాగలిగె వనిత తోడు!

కటిక నేలన నడచి కందు పదముల సేవ- ఎంతగా జేసెనో నాడు ధరణి!

అట్టి భాగ్యము నొందు యోగ్యతొందగ నాకు-తపియింప తగినంత అలవి లేదు,

సోమరిని  నేనంచు వేరుంచబోకయా-   సాకనాకింకెవరు   నీవు గాక!

గణపతి

గణముల కధిపతి – గుణముల గణపతి – గౌరీ నందనుడే !

గజముఖ బాలుడు – గుజ్జు శరీరుడు –  మూషిక వాహనుడే!

వీడు –   గున గున నడచుచు – గబగబ కదులుచు,

గడముల దీర్చుగదా ! గణపతి – గడముల గడుపుగదా!                      (గడములు=ఆటంకములు)

గణగణ గంటలు మ్రోగగ కదలుచు – గానము కాడుగదా! గణపతి!                                                                                                                                                                                                         గణముల తోడుగ గుణనిక వరుసల మోదమునొందుగాదా!గణపతి!

గరిటెడు అటుకులు  – గుప్పెడు గరికెకు –  పొంగుల నొందుగదా!

గణపతి – గజ్జెల లయలకు గిరిజా సుందరి గారవమొందుగదా!

గబగబ బరికెడు –ఘంటము గలిగిన – గట్టి వినాయకుడే!

వీడు – గురిగాగొల్చిన గొలుసుగ చదువులు గుడిపెటి నాయకుడే!

గిరగిర తిరుగుచు గౌరీశంకరు గొల్చిన నందనుడే – గణపతి !

గగనము నెగిరెడి తమ్ముని  గెల్చిన – గడుసరి గజముఖుడే!

గాన వినోదుడు – నాగాభరణుడు – నానా గణపతి యే!

గంధపు ఘుమ ఘుమ – గోమయ హోమము – ఘనముగ నందుగదా!

గండము గడిపెడి ఒజ్జవు నీవని – గురిగా నమ్మితెనే – గణపతి!

ఆగిడి గడుపగ పరుగున గదలర – గణపతి గురురాయా !

కొంచెము

నింగి నేలెడి పూర్ణచంద్రుడు – కలువ జేరితె కొంచెమా?

గాలి అల్లరి నదుపు జేయుచు –కడలి నిలిచితె కొంచెమా?

అద్దమున తా నిమిడియుంటే – కొండ కేమది కొంచెమా?

కొండ కోనల కనులు మూసుక తొలగియుండుట కొంచెమా?

బీజమందును ముడుచుకుంటే –వట శాఖలకు అది కొంచెమా?

అదుపెరుంగని గాలి –  చిరు తనువు దూరుట కొంచెమా?

పసుపు ముద్దను పార్వతంటే – పరమేశు పత్నికి కొంచెమా?

మాధవుడు గోపాలుడైతే – మద్ధుకైట హారికి కొంచెమా?

జీవి జీవికి  తోడు నిలచితే – ధరణి కేమది కొంచెమా?

దోర పండిన పండు బరువుకు – కొమ్మ వంగుట కొంచెమా?

నీటి చుక్కల భారమోర్వక – మబ్బు వంగితె కొంచెమా?

తీరు తెన్నులు తెలియకుండుటె – మాయ జగమున కొంచెమా?

అలవి నొల్లని ఘోరదుఃఖము – మదిన నిల్పుటె కొంచెమా?

ఏలు వానికి మోదమొసగగ – నెమ్మదించుట కొంచెమా?

గడుసు సమయపు కాటులో నీ కరుణ జూచుట కొంచెమా?

పగలు రేయని పొరలు కాలపు జడిన ఒదుగుట  కొంచెమా?

వెల్లువంటిది నీదు కరుణని ఎంచి చాటుటె కొంచెమా?

అడుగు అడుగున ఆదరింపగ ఉంటివనుటే కొంచెమా?

భావ భవనపు భోగమును విడి – కనికరించుగ నెంచవా?

కొల్లయేయగు గాని నీకది కొంచెమెందుల కగునయా?

వల్లీప్రియ

కలికి వల్లిని గూడి కులికేటి సామీ – ఒలికించు నీ కరుణ పులకింపజేయ!

మెలిక గలిగిన దారి మెదల కున్నాను- గురి దారి నెరిగించి మరలింపుమయ్యా!

తలుపు లెరుగని వాకిలమరున్న కోటలో-    కొలువు దీరిన సామి కదలిరావయ్యా

ఆరు ముఖములు గల్గు అందగాడవు నీవు –  అదును గాదిది నీకు ఆదమరవంగా

నిలకడెరుగని మనసు నెమ్మదింపంగా – మందలింపగ రారా   సురసేన విభుడా ! ||కలికి||

బిల్వార్చనకు  మురియు పరమేశు తేజమా- బిలవాసమును వీడి కదలిరావయ్యా!

బిగి సంకటపు ముడిని విడదీసి మమ్మేలు –అగ్గిచూలివి నిన్నె శరణంటిమయ్యా!

శక్తిపాశము నీది – శత బాహువులు నీవి – శమ దమంబులు తెరిపి నెరిగింపుమయ్యా!||కలికి||

అంతరంగపు హోరు అణగార్చు అరకిచ్చి – తనువు తారణ తరిని మదినింపుమయ్యా!

బ్రతుకు బాటన తోడు – ఇంట నాడెడి పాప – కొలువుకూటమి నందు రగిలేటి శగలు,

ఇంతింత గానట్టి ఇరకాటముల బాధ – బాపు కొలుపువు నీవె కనికరించయ్యా! ||కలికి||

 

 

అగ్గిచూలి: అగ్నిదేవుని కొడుకు- కుమారస్వామి

తల్లి అంటే …

తరుముకొచ్చేఅడవి మంటల తాప మోర్వని కూనకై

తరుగుయైనా తగిన పనియని రెక్కకప్పుటే తల్లియా?

వేటగా తా చిక్కినా తన చిరుత కడుపును కుడుపగా,

మరలుటకే తా మందజేరిన గోవు మనసది తల్లిదా?

కాలవాహిని దుడుకు ఒరవడి తోలుకెళ్ళిన మమతను,

చేరనేర్వక చితికి వగచెటి లోకమెరుగని పాపను,

సొంతముకు ఏ సుఖమునెంచకె బుజ్జగించెడి మనసులో,

పొంగు  పుంతన నిండు భావము మార్దవంబది తల్లియా?

కాపుగాయగ పిండి బొమ్మకు ఊపిరూదితె తల్లియా!

వల్లభుని తేజంపు మొలకను గారవించెతె తల్లియా!

బూడిదైనా మన్మధునిపై చూపు చిలికితె తల్లియా!

భూరి సంతతి సేవలందుచు సేదదీరితె తల్లియా!

కన్నకడుపుల కడుపు చలువకు పొరుగు కడుపుల కుడుపుచూ,

తనువు డొల్లగా తరిగినా తన తనయుగాచుట తల్లియా!

తోడునిమ్మని వేడుకొనుచూ పొంతనెరుగని పనుల మునిగే,

సంతు గొంతులు పలుకు పదముల పొల్లులెన్నుట తల్లియా?

తప్పులెన్నని పరమ ప్రేమకు మారు పేరది ‘తల్లి’యా?

తనయు తప్పులు చెల్లజేసెడి గారవంబది ‘తల్లి’యా?

మన్ననడిగిన చేరదీసెడి మమత రూపము ‘తల్లి’యా?

తప్పటగుల ఊతగా తానొల్లకుండుటె ‘తల్లి’యా?

ఏమనెంచుచు నెలపినావో ‘తల్లి’ తనమీ జగమునా!

తరుణులందలి తరుణ భావము ‘తల్లి’ తనమున నలిగెను!

జగమునేలెడి ‘తల్లి’ నీవె తారకంబును జూపుమా!

‘తల్లి’తనముకు తగిన ఫలమని చాటు నిక్కము చెప్పవా!

 

విందు

రాలి పోయెను నాదు తనువని వేదనెందుకు జీవుడా,

రాలుటకె తా తగిలె గాదా నీకు మోదము సేయగా!

రంగరించిన రంగులతొ ఏ ఛాయలెరుగని తోటలో,

వాడుటెరుగని శోభలన రాజిల్లు రసమయ వనులలో,

వాసముండుట విసుకు గొని నీవరిగితివి ఈ విడిదికీ,

వాడు తనువుల తోపులో ఈ తాపమొందెడి ఇచ్ఛతో!

వాణి పలుకని పలుకులను విని మోదమొందెడి తావులో,

వాసుదేవుని ఊహ సవ్వడి అందె కట్టెడి నగరిలో,

వసతిగొను నీ ఉనికి విలువను ఎరుగు దారుల జూచుచూ,

వాదులాడుట మోదమని నీవెంచి నడచిన దారిదీ!

మాటపొంతన కుదరలేదని మాధవుని విడనాడకూ!

వాని వేడుక నాకు ఏదని వాదులాడుట వీడుమా!

తల్లి ఒడిలో జోలలూగుచు కలల దేలుట మోదమే!

ఒడిని విడితే కలలు కల్లలు- వెరపు మాపగ ఎవరురా?

ఎంతగా నీ ఉనికి తెలిపిన తెలియకుంటివి తీరుగా!

వెఱ్ఱి మోహపు వేటలో నీ ఉనికి మాటుగ మిగెలెరా!

ఉనికి మరచిన వెరపు నిను ఈ వల్లకాటికి జేర్చెరా!

వెరపు మానిక  మరలు గూటికి మధుర భక్ష్యము వేచెరా!

 

రామ రారా రామ

సూర్యవంశపు శేఖరుడు తా ఉషాపూజకు తరలిరాగా,

మగత జెందిన కలువ లన్నీ కనులు తెరచెను తేటగా,

తరలి పోయిన రేడు నేడెటు మరలి వచ్చెను ముందుగా,

తరగుటెరుగని తేట కళలను పుణికి పొందెను మేటిగా!

భాను తాపము నోర్వలేమని మరలి పోయెడి తారలు,

తొందరేమిక తరలగా నవ శేఖరుండిట నుండగా!

కన్నులారగ కాంచకుంటే కన్నులెందుకు దండుగా,

మరల ఎన్నడు గలుగునో కద ఇంత భాగ్యము తీరుగా!

సమయ పాలన తొలగుటెరుని కమల నాధుని దిక్కున,

భానుడెరుగని మోహకాంతులు నిండి యుండెను మెండుగా ,

కిరణ కరములు కదలకున్నవి కమల కొలనుల దిశలుగా ,

వందనముగా వంగి జేరగ  తానె కమలంబాయెగా!
ఏమి భాగ్యము ఏమి పుణ్యము ఏమి ఈ నవ తేజము?

ఎన్నడెరుగని మధుర భావము గమన గతులను నిలిపెనే!

ధరణీశు భాగ్యము ఎంత తరుగెనొ -ఇంత మోదము వీడగా!

వాడుటెరుగని వన్నెయన ఇదా? ఎంత కలిమిది గాంచగా!

తరళముల తెర తొలగ నొల్లవు కమల కులములు తీరుగా,

శేఖరుండిట కొలువు దీరగ కలలు వీడుట ధర్మామా?

ఏమి వింతిది కనుల గట్టెను కమల నాభుడు తీరుగా!

ఎవ్వడీ నవ యవ్వనుడు ఇట పూజకరిగెను ముందుగా!
తలపు మధురము పలుక మధురము మధురమన్నిదె ఎరుగుమా

నాటి ఊహలే నేటికీ రస సోన ఊటల గూర్చునే!

వారి భాగ్యపు అంబుదిన నా కొక్క మునకను ఈయవా!

ఊహలో కదలాడు ఛాయను కనుల గట్టగ జేయవా?

అసురు లేరని? ఏమి పని ?యని నెమ్మదించకు రాఘవా!

మనసు మనసున నిండి యుండిన అసుర భావము దృంచగా!

కోదండ మందలి శరము చాలదు -కనుల కరుణను పూన్చరా!

మైధిలెరుగని మన్ననను మాకందజేయుము  తండ్రిగా!