విందు

రాలి పోయెను నాదు తనువని వేదనెందుకు జీవుడా,

రాలుటకె తా తగిలె గాదా నీకు మోదము సేయగా!

రంగరించిన రంగులతొ ఏ ఛాయలెరుగని తోటలో,

వాడుటెరుగని శోభలన రాజిల్లు రసమయ వనులలో,

వాసముండుట విసుకు గొని నీవరిగితివి ఈ విడిదికీ,

వాడు తనువుల తోపులో ఈ తాపమొందెడి ఇచ్ఛతో!

వాణి పలుకని పలుకులను విని మోదమొందెడి తావులో,

వాసుదేవుని ఊహ సవ్వడి అందె కట్టెడి నగరిలో,

వసతిగొను నీ ఉనికి విలువను ఎరుగు దారుల జూచుచూ,

వాదులాడుట మోదమని నీవెంచి నడచిన దారిదీ!

మాటపొంతన కుదరలేదని మాధవుని విడనాడకూ!

వాని వేడుక నాకు ఏదని వాదులాడుట వీడుమా!

తల్లి ఒడిలో జోలలూగుచు కలల దేలుట మోదమే!

ఒడిని విడితే కలలు కల్లలు- వెరపు మాపగ ఎవరురా?

ఎంతగా నీ ఉనికి తెలిపిన తెలియకుంటివి తీరుగా!

వెఱ్ఱి మోహపు వేటలో నీ ఉనికి మాటుగ మిగెలెరా!

ఉనికి మరచిన వెరపు నిను ఈ వల్లకాటికి జేర్చెరా!

వెరపు మానిక  మరలు గూటికి మధుర భక్ష్యము వేచెరా!

 

రామ రారా రామ

సూర్యవంశపు శేఖరుడు తా ఉషాపూజకు తరలిరాగా,

మగత జెందిన కలువ లన్నీ కనులు తెరచెను తేటగా,

తరలి పోయిన రేడు నేడెటు మరలి వచ్చెను ముందుగా,

తరగుటెరుగని తేట కళలను పుణికి పొందెను మేటిగా!

భాను తాపము నోర్వలేమని మరలి పోయెడి తారలు,

తొందరేమిక తరలగా నవ శేఖరుండిట నుండగా!

కన్నులారగ కాంచకుంటే కన్నులెందుకు దండుగా,

మరల ఎన్నడు గలుగునో కద ఇంత భాగ్యము తీరుగా!

సమయ పాలన తొలగుటెరుని కమల నాధుని దిక్కున,

భానుడెరుగని మోహకాంతులు నిండి యుండెను మెండుగా ,

కిరణ కరములు కదలకున్నవి కమల కొలనుల దిశలుగా ,

వందనముగా వంగి జేరగ  తానె కమలంబాయెగా!
ఏమి భాగ్యము ఏమి పుణ్యము ఏమి ఈ నవ తేజము?

ఎన్నడెరుగని మధుర భావము గమన గతులను నిలిపెనే!

ధరణీశు భాగ్యము ఎంత తరుగెనొ -ఇంత మోదము వీడగా!

వాడుటెరుగని వన్నెయన ఇదా? ఎంత కలిమిది గాంచగా!

తరళముల తెర తొలగ నొల్లవు కమల కులములు తీరుగా,

శేఖరుండిట కొలువు దీరగ కలలు వీడుట ధర్మామా?

ఏమి వింతిది కనుల గట్టెను కమల నాభుడు తీరుగా!

ఎవ్వడీ నవ యవ్వనుడు ఇట పూజకరిగెను ముందుగా!
తలపు మధురము పలుక మధురము మధురమన్నిదె ఎరుగుమా

నాటి ఊహలే నేటికీ రస సోన ఊటల గూర్చునే!

వారి భాగ్యపు అంబుదిన నా కొక్క మునకను ఈయవా!

ఊహలో కదలాడు ఛాయను కనుల గట్టగ జేయవా?

అసురు లేరని? ఏమి పని ?యని నెమ్మదించకు రాఘవా!

మనసు మనసున నిండి యుండిన అసుర భావము దృంచగా!

కోదండ మందలి శరము చాలదు -కనుల కరుణను పూన్చరా!

మైధిలెరుగని మన్ననను మాకందజేయుము  తండ్రిగా!

సోహం

పొదరింటిలో చిలుక నేర్చెనొకటే పలుకు – నేర్వనొల్లదు వేరు పలుకు లెపుడూ!

ఆదికాలము నుండి అది ఒక్కటే పలుకు – పలుమారు పలికియూ వెగటు గనదు!

తారకంబగు పలుకు – తరియింపగల పలుకు – పలుకు లల్లెడితల్లి తెలుపు పలుకు!

పద్మనాభుని పడతి మన్ననందిన పలుకు – ఫణిరాజు అనవరత మందు పలుకు!

ఫాలాక్షు పలుకగా విస్తరించిన పలుకు – విష్ణు వీనుల జేరు విబుధ పలుకు !

వేదముల నాదిలో మూటగట్టిన పలుకు – నాల్గు ముఖములవాడు పలుకు పలుకు!

దైత్య దానవు గూల్చి ధరణి నేలెడివాని – దయనొంద ఋషి గణములందు పలుకు!

శృతులైన స్మ్రుతులైన శరణు బొందెడి పలుకు – పొందికగ ప్రతి ప్రాణి పొంది బ్రతికెడి పలుకు!

విదిత మిదె వినుడంచు మాన్యు లొసగెడి పలుకు – మంత్ర మర్మము లన్ని తెలుపు పలుకు!

నీరు క్షీరము నుండి వేరు జేసెడి పలుకు – గురుతెరిగి గురిగలిగి వినుడు నేడే!

పురము

ఆనతందితి నాడు ఆదిదేవుని నుండి,

కదలు ప్రతి ఊహకొక రూపు గట్టంగా !

నాటినుండీ నన్ను రూపమని ఎరుగొంది,

ఎరుగ దలచిన యట్టి వింత ఎరుక!

మాయ మన్నన నంది జగతి అమరించాను,

జడములై జీవులై జగతి నలరించాను,

సురలు అసురులు అన్న భేదమెంచను నేను,

భావమొక్కటె చాలు రూపు గట్టంగా!

వాయునందనుడైన-వైనతేయుండైన,

ఖగ రాజు సేవించు విష్ణువైనా,

పురములేకీ పురిన సంచరించగ లేరు,

పలు యశంబు బడయ నొల్ల నగును!

గగన మంతయు నిండు దివ్య గోళములైన

గగనాంతరంగుడగు శ్రీ లక్ష్మి పతియైన,

ధరణి నేలగ నెంచు రజోగుణ రూపైన,

నిత్య సంతుష్టు లగు సత్వ తేజములైన!

కల్లోలముల మాపు కారణంబును బట్టి,

కార్యరూపము గట్టు ఊహనంది,

కరుణ నేలెడివాని పురమైతి పలుమారు,

యుగయుగంబులు వాని గురుతు నెరుగ!

కాలగమనము బట్టి కరిగిపోయే కథలు,

కాలదోషము బట్టి కరుగ కుండా,

సరసమగు ఒక రూపు వసతొందగా జేసి,

వైనముగ వాని నే పదిల పరతు!

రూపమొందిన ఊహ కారణంబును ఎరుగ,

వసతైన వాసనల పొంద లేక,

రూపు భారంబనుచు రోదింపగా మాని,

మాన్యలెంచిన వసతి విధిని ఎరుగు!

ఊహకందని వాడు – ఉమా నాధుడు వాడు,

ఉబికున్న ప్రతి రూపు నందువాడు,

ఉన్నదను దానిలో నిండియుండెడివాడు,

లేదన్న ప్రతి చోట నుండువాడు,

పురమున్న లేకున్న పులకించు తరి వాడు,

తారకంబగు త్రోవ జూపువాడు,

చూపు చూపున నిలచి చూచుచుండెడివాడు,

చూచు కన్నుల చూపు నందు వాడు!

మోదాన వసతొంది మోహనుని మోహించు!

రూపమొందిన విభుని విభవమెరుగు !

వాసనల విడనాడి వారిజాక్షుని తలచి,

ఊహలెరుగని పురము వేగజనుము!

అంతరం

చినుకు చినుకుకు మధ్య తగినంతగా ఒదిగి – సాగరంబుల చేర్చి పొంగువాడు,

వెలుగు పూసల దండ ఇంపారగా పేర్చి –  కిరణ తోరణమందు కదులువాడు!

కదలు పెదవుల మధ్య-పలుకు పదముల మధ్య – లయ బధ హృదయంపు లయల మధ్య,

ఉయ్యాల జంపాల ఉశ్వాస నిశ్వాస – కదలికల నమరుండు కీలు వాడు

పరుగుతీసెడి అడుగు కుడి ఎడమ నడిమిలో అంతరంబును గాచి బ్రోచువాడు

వందనంబుగ జేరు జంట కరముల నడుమ కాపుండి  వందనము నందువాడు

రెప్ప పాటున జేరి రేపగటి గతిబట్టి మూసి తెరిచెడి మేటి వసతి వాడు

నీవు నేనని దెలుపు దూరమందున నిలచి-  జగతి ఉనికిని నిలుపు వన్నెకాడు!

రూపుగట్టిన జగతి రూపు చెదరక నిలిపి- అంతరముగా తానమరువాడు,

ఉందన్న ప్రతి రూపునావరించుక యున్న-ఆవరణగా ఉనికి కలుగువాడు,

సాగు ఊహల తోపు వన్నె చిన్నెలయందు సందు సందున తానె తోచువాడు,

తోపు కన్నాతానె వికసించు యుండియూ-నక్కి నలుగురి కంట పడనివాడు!

పగలు రేయిల మధ్య ఉషాసంధ్యలు వాడు-నింగి నేలలమధ్య నెలవు వాడు,

ఊహ పదముగ మారు పథ రూపమగు వాడు – రూపు గట్టని గట్టి లంకె వాడు,

లయమొందు జగతిలో లీనమైయుండియూ – లయమొంద నెరుగనీ నెలవు వాడు,

వెన్నంటియుండి ఈ వెనుకబాటేలయ్యా- నీవొల్లనీ రూపు నాకు ముదమా?

సంశయింపకు మింక సాగించు నీ ఉనికి రూపులన్నీ మడిసి మురియుదాకా!

చిత్త మందున నిలచి చెలిమీయగా రాద-చెదరుటెరుగని నిన్ను చేరునటుల!

తమస్సు

ఆవరించున్నదిట అంధకారమనెంచి,

ఆదుకొనగా రాని అమరవాసుని కసిరి,

ఆయాసమొందినే అలమటించితిగాని,

ఆనవాలందగా లేనైతినే నేను -విభుని ఛాయ!

వెలుగు కిరణములన్ని వెలిసిపోయిన చోటు,

వెన్నెలలు వేకువలు అలసి కరిగెడి తావు,

వెదకగా నెవరికిని వెల్లడొందని వసతి,

వెలలేని నామమున వొదిగి యుండెడి నీడ!

పాలసంద్రము వంటి కంటి పాపకు వెలుగు,

నట్టనడుమన యున్న నల్లపాప!

ఫాలక్షు పసిమికే వన్నె తెచ్చిన గురుతు,

శ్రీవత్స మందినా మేలి రంగు!

కనగలుగు కనులిచ్చి కరుణ జూడుము తండ్రి,

తెరపెరుంగని నీదు మేని మెరుపు!

జగతి ఛాయలు కరిగి అంతరించెడి ఛాయ,

అంధకారమనెంచు మతిని మాపు!

వగపు

తనువు కలిగిన నాడు – తొలగగా వగచితిని,

తనువు తొలిగిన నాడు – తగులగా వగచితిని,

తనువున్న లేకున్న – వగపొక్కటే గలదు,

వగపు మాపుట నెరుగు మనసా!

తగుదారి వెదుకవే మనసా!

సంతుగలగక యున్న – సంతుకై వగచితిని,

సంతుగలిగిన దాని – సాకగా వగచిరిని,

సంతున్న లేకున్న  – వగపొక్కటే గలదు,

వగపు మాపుట నెరుగు మనసా!

తగుదారి వెదుకవే మనసా!

కఠిన కాలము నందు – కలిమి కై వగచితిని,

కలిమి కలిగిన నాడు – కాపు కై వగచిరిని,

కలిమున్న లేకున్న – వగపొక్కటే గలదు,

వగపు మాపుట నెరుగు మనసా!

తగుదారి వెదుకవే మనసా!

జగతి దారుల నడువ -తోడుకై వగచితిని,

తోడుగలిగిన నాడు – చెలిమి కై వగచితిని,

చెలిమి గలిగిన నాడు – ఏటికై వగచెదనో,

వగపు మాపుట నెరుగు మనసా!

తగుదారి వెదుకవే మనసా!

వన్నెతరగని వాని – పొందుకై చింతించు,

పొంతనెరుగని వాని – తోడుకై చింతించు,

ఆటు పోటుల వెంట ఆటలాడెడి జగతి,

ఆట గాదని ఎరుగు మనసా!

నిలకడని ఎరుగుమో మనసా!

విడుచు ఊపిరి తుదిన – అంకురించే దారి,

సాదరంబుగ జగము నడిపించు దారి,

వగపు వీడెడి దారి – దోబూచులందగిలి,

వెంటనుందని ఎరుగు మనసా!

వేగపడి ఎరుగొందు మనసా!  ఎరుగొందు వేగమే మనసా!

అంపకం

నందీశు నాధుడా పాలింపగా రారా – నగ కన్య తోడుగా నడచి రారా!

నీరసించిన తనువు అంపకంబులు బెట్టె-అందజేయుము నీదు ఆదరంబు!

కరువు దీరగనేను ఏనాడు కనలేదు – కమనీయమగు నీదు జగతి శోభ,

ఓరిమొందేనాడు భిక్ష మానగలేదు – బ్రతుకు గడుపగ శక్తి చాలదంచు,

రవి చంద్రులకు తోడు అనుదినము నడిచాను- అలసత్వ మెన్నడూ కూడదంచూ,

ఒడ్డగా నాదంటు ఏదిలేదను ఎరుక ఏనాడు నాయదన కలుగలేదు!

బంధనలు బంధువులు భావరహితములాయె – బదులు పలికెడి తీరు హీనమాయె ,

మన్ననలు, దూషణలు మదిని జేరకపోయె – భారమందిన మనసు మరుగుచెందె,

చెమట చినుకులు కూర్చి కూడబెట్టిన కలిమి- కొరగాని కొరివాయె కనుల ఎదుట!

వెంట నడచెటి నిధిని వెనకేయ లోభిస్తి – లోపమెన్నక నన్ను ఆదరించు!

ఒజ్జనేర్పిన చదువు కుడుపుకే సరిపోయె – తల్లి నేర్పిన చదువు బ్రతుకు నడిపె,

తండ్రి శిక్షణ నంది తగిలుంటి సంఘమున- తోడ బుట్టిన వారి  తోడు నడువ!

అట్టి విద్యల లేని విద్య తెలియగ జేయు- వేలుపెవ్వరు నన్ను జేరలేదు!

వల్లకాటిన నేను ఏ విద్యనెరుగొందు – మన్నించి ఏలుకో ఫాలనయన!

నందీశు నాధుడా పాలింపగా రారా – నగ కన్య తోడుగా నడచి రారా!

నీరసించిన తనువు అంపకంబులు బెట్టె-అందజేయుము నీదు ఆదరంబు!

పొంతన

కంటిపాపన చూపు చిగురించు వాడవట,

బొంది నాడెటి నాడి నడిపించు నీవెనట

కాపుగాయని కడిమి కాపుగాయగ నేల?

తొలుగ జేయగరాద తొడుగు తొలగ!

రాకాసి లోయలో నిదురించు తామసుల,

తమకమును మెలకువగ మలచు వైనమున,

రంగరింపగ రాద రమణీయ నాదమును,

వాణి మన్నన నందు మధుర నామములో!

తెలివెరుంగని నాడు తగులగా నెంచితిని,

నీవున్న ఈ పురము ఆటగా నెంచితిని,

ఏపాటి వాడనయ నీ సాటి నేనాడ?

పొడసూపి పొంతనను పొందించరాదా?

వన్నెకెక్కినవారి పలుకు మాలల మోపు,

నుతియింపుగా నందు పరమ పురుషా!

రాయంచ వలె నిన్ను రంజింపగా లేను,

రాలుగాయిని నేను  వదర జాల!

ఓపలేనీ తనువు ఓరిమొందక యుంది,

అంతరంగపు దారి ఒల్ల లేనంది!

తప్పుగాయుమటంచు తపియింపగా లేక,

నిస్సార సారమున కరుగగా నుంది!

పాప పున్నెపు పద్దు పదిలమని ఎంచేవు,

తరుగ జేయుము నాదు పొదుపు రాశి!

ఒడుపుగా ననుబట్టి అద్దరికి నడిపించు,

ఒల్లగానిది నాకు జగతి దారి!

మన్నించు

తొల్లిజేసిన తప్పు తల్లివలె మన్నించు – నీవు కాకింకెవరు తోడునాకు?

కారు చీకటి బాట – కాపుగాయుము నన్ను – వెరపు మాపుము తండ్రి వెలుగు జూపి!

వెన్నముద్దలు కుడిపి – వెన్నెలందున ఆడి – మురిపింపగా నేను రాధగాదు!

రాలుగాయిని నేను రాగమెరుగని వాడ – రవళించు నీ మురళి అలుపు నేను!

అలుపెరుగనీ జగతి నటరంగ వైభవము – ఆటగా ఎంచినే నరగినాడ!

నిలకడెరుగక నడచు చరిత చెరగును బట్టి- దిశ ఎరుంగని దిశన తరలినాడ!

దివిజేంద్ర వంద్య నీ దివ్య లీలల తలుప-తరముగానీ తనువు తొందరొంది,

తీరికొందుదు నంచు మగతగొని బిగిసింది – బింకమొందక నన్నుచేరి మనుపు!

గరువుగా గురుతెరుగ – గుణరహితుడట నీవు – వెలుగు వన్నెల వెనుక వన్నె నీవు!

వైన మెరుగని వైర భావనల భవనంబు – వెంట జంటగ నేల పంపినావు?

వైరి వైరుల వైరి – వైరంబు విడి మనుపు – వైర భవనపు భూమి నుద్ధరించు,

నీ నీడనే నేను – వైరమెందుకు మనకు –  మోదమెందుకు నన్ను వెతల బెట్టి!

అర్చించగా నీవు ఆదరింతువటంచు –  అమర నాదము లెన్నొ పలుకు నిచట,

అర్పింప నాదన్న చిహ్నమీయగ మరచి – సంకటంబుల సాక తగున నీకు?

సార్వభౌముడ వీవు – సర్వేశ్వరుడనీవు –  సుతుని ఇడుముల బెట్ట దొడ్డతనమే!

దారి జేసుక నీవె దరిజేరి లాలించు – అంధ అంబుధి యందు వెలుగు నింపు!