అనంగము

మూగ మువ్వల నర్తనంబిది – హరుడు మరచిన పదమిది!

పంతమాడిన పర్వతాత్మజ -కరుణ జూడని రవమిది!

కాలుడొల్లని కాలమందున కలిని జేరిన కణమిది!

కాపుగా భవ పాశమమరిన కృష్ణ పింగళ పురమిది!

వసుదేవ పుత్రుని వైరి సంతతి-వెరపెరుంగని వని ఇది!

కాళింది విడిచిన శేషు సంతతి-శరణు బొందిన శరణిది!

హరుని జేరని మృతము నందిన – మహా మరుగగు మనసిది!

మనిషి మనిషిన మన్నికగ తా మసల నేర్చిన భగ మిది!

రతి వల్లభుని చితి శేషమందిన – శున్య కంబను పురమిది!

భండుసంతతి కుడిచి మసలెడు -భానుడెరుగని భువి ఇది!

భుజగ భూషణు కొలువు నొల్లని-ప్రమధ గణముల కొలుపిది!

కలి చరణ ఘాతపు ఘటనతో – ఘనకీర్తి నొందెడి రవమిది!

దైత్యులై ధర శాంతి ద్రుంచిన – దనుజ అహముల నణచుచూ,

యుగయుగంబున పోరులో   – పలు రూపులందిన విభునికై,

అలసటొందిన అమర నాధుని అలుపు మాపగ ముదముతో,

పాలకడలిన పాన్పు పరచెను – పదసేవ జేయగ శ్రీసతి!

రూపు మడియని దైత్యభావన – మరుగుగాదగ భవముగా,

ధాత గుర్చిన వింత మరుగిది – నరుని పురమున మనసుగా!

మూల పురుషుని మనుపగా – నరుడందుకొన్నీ మనసును,

గారవించెడి  తరిని తెలియగ – తెలివి నొల్లరె తనువాసులు!

కళ్ళెమెరుగని మనసు వేగము నదుపు జేయగ నెరుగరే!

వేదనంబుల వేడి ఊర్పుల వడలి బడలుటె గతిగనె!

అనునయంబున ఎరుక జేయుము తల్లిరో మా మొరలనూ!

అంగమెరుగని అసుర సంతును అదుపు జేయగ రమ్మనూ!

సాధుజన సంచారి

సాధుజన సంచారి సరసుడని ఎంచేవు – సావధానము నొందు మనసా!

సమయ సారధివాడు – సమవర్తి – అచలుండు – ఆనంద రూపుడట తెలుసా?

గోపకాంతల జేరి గోరుముద్దలు మొక్కి – రాధికామది దోచి ఆటలాడి,

మధుర కరిగెడినాడు మందహాసమె దక్క- ఊరడింపను మాట మరచినాడు!

ఆలమందలనాడు ఆడంగులను మనుప – ఉద్దవుండను వాని నంపినాడు,

ఉద్దరించెడివాని ఊహమరువని వనులు – బృందావనంబాయె  దారిగాయంగా!

సాధుజన సంచారి సరసుడని ఎంచేవు – సావధానము నొందు మనసా!

సమయ సారధివాడు – సమవర్తి – అచలుండు – ఆనంద రూపుడట తెలుసా?

రాచనగరిన ఆడు రాజీవ నేత్రుండు – జానకీపతి వాడు – రాఘవుండు,

భూపాలు వచనముల వన్నెనందగ జేయ – వనజీవనము జేయ తరలినాడు,

పురజనులు -పరిజనులు- పలుమారు వేడినా -ఉలుకు జూపని మేటి ఉనికివాడు,

కులసతిని ఎడబాసి దైత్య శిక్షణజేసి – ధరణి గాచినవాని ఏమనందు?

సాధుజన సంచారి సరసుడని ఎంచేవు – సావధానము నొందు మనసా!

సమయ  సారధివాడు – సమవర్తి – అచలుండు – ఆనంద రూపుడట తెలుసా?

కామించమనినంత కాముగాల్చిన వాడు – అంగనకు అరభాగ మిచ్చువాడు,

హరిమన్ననొందగా విసము మింగెడివాడు- బిచ్చమెత్తుకు తిరుగు భోగివాడు,

దేహియనుటే తడవు వల్లెయను దేవుండు – తన రక్షణకు హరిని తలచువాడు,

తుదిలేని మొదలందు మొలక అనరటవాడు – లయకారుడగువాడు కరుణ మూర్తి!

 

సాధుజన సంచారి సరసుడని ఎంచేవు – సావధానము నొందు మనసా!

సమయ సారధివాడు – సమవర్తి – అచలుండు – ఆనంద రూపుడట తెలుసా?

హరిప్రియ

 

ప్రియురాలిగా హరిని కోరి కొలిచే తల్లి – పాల్కడలి కన్నియవు కనికరించమ్మా!

పలుమారు నీ చూపు కురిపించి కాపాడు-కలువ కన్నుల చలువ మము జేరునటుల!

కాలమంటని కొలను నెమ్మదించిన వేళ – నెలవంక నగుమోము ప్రతిఫలించిన వేళ,

అలవోకగా కదులు అలల కులుకుల లోన – వంక లెరుగని వెలుగు వసతిగొను వేళ!

విప్పారు కనులతో గగనపంచులదాక – చూపు తూపుల నంపి వేటాడి వెదకి,

నీ కనుల చలువలను చేదుకొని తేబోయి – తెల్లవారక మునుపె తెల్లబోయాయి!

పద్మాకరుని రాక పరచు వెలుగుల వెల్లి – వెదకి జేరిన కనులు తెప్పరిల్లి,

సుధారసముల సోన చిరు చినుకు సోకగా – కరుణ నీదని తలచి వెల్లివిరిసె!

ఏలనో ఈ తాటి నంటినీ పద్మములు- అందకున్నవి నీదు నయనరసము,

ఖిన్న వదనము వీడి సేవింపవేలనో – పదపద్మ కేసరపు పరమ విందు!

తనువులో ఎన్నెన్ని సారములు నింపినా – తలపులో పలు రుచులు తురుముకున్నా,

నదులలో మునిగినా-నామములు పలికినా-తగుల లేకుంటినీ తరుణ తూపు!

దరిజేర్చుకోతల్లి దయనేలుకోవమ్మ – దారి ఎరుగక నుంటి నిన్నుజేర!

జాలిగొని కురిపించు నీ కరుణ మధురిమను – మరులకుండుగ నేను ఒడిసిపట్టు!

కొలువు నీయుము రాఘవా!

రామరామని బోయ తలచిన – ఆలకింపను ఆలసిస్తివి,

రాౘబిడ్డగ రమ్మనంటె – రయమునొస్తి వదేలనో!

చల్లుగద నీవేమి జేసిన-చెల్లజేయుము కోరిక,

కొలుచువారల కొలువులో నా కొలువు నీయుము రాఘవా!

శంఖ చక్రము శేషపాన్పును వెంటగైకొని వస్తివే!

తక్కువేమని పాలసంద్రము నొల్లనైతివి దేవరా?

పులక భావపు పుంత చందము-పొదిగెనే నీ పడకను,

మేని నంటక తొలగియుందని కినుక గంటివ రాఘవా?

శ్రవణకుమరుని సేవ చెల్లిన ముసలి మిధునపు మాట నిలుపగ,

మన్దు గెల్చిన పుతపు పెద్దను వదలి వనముల కరిగినాడవు,

తులసి మాటను చెల్లజేయగ చెలిని వీడిన వన్నెకాడవు,

వైరి గూల్చగ కూర్చుసేనన సేవ భాగ్యము నీయరా!

గుహుని సేవలు, శబరి పూజలు, వాలి తమ్మని నెయ్యము,

దారి జేసుక జేరుకొనుచూ – వసతిగా నీ వందుకొంటివి!

తరుగు వారల పిలుపునందగ తరలిరావని తలుప తగదని,

ఉడుత సేవకు మన్ననిస్తివి-మహిన మహిమల చాటగా!

ఏలువాడవు – ఏలవాడవు – ఏటి నీ కీ పంతము?

మన్ననీయగ మహిమ గల్గియు మౌనమొందెద వేలయా?

రాయబారము సలుప నాకడ దూతలెవ్వరు లేరయా!

రాయినై నీ రాక కోరెడి ఓరిమొందగ లేనయా!

చిత్తమెరుగని పూజనాదని – మిన్నకుండకు రాఘవా,

చిత్తమందున చిగురుగా నీవంకురింపుము రయమునా!

చేరదీయుము చెదరనీయకు నీదు స్మరణను మనమునా,

సాకువాడవు సాకులెన్నకు సావధానము నొందగా!

సంతసము

కాల గమనము కొలత చేరింది పై సంఖ్య,

మాంస దేహపు వయసు పెరిగింది ఒక సంఖ్య,

వనమందు చిందేటి మధుర ఋుతువుల ఛాయ,

ఒక్కటైనా నాదు దేహమున పండదే?

రేయి గడచిన నాడు వెలుగు చూచెదనంచు,

వేచున్న నా కన్ను కనకుంది ఏ వెలుగు,

వెలుగు వెల్లువ లన్ని ఏ చీకటులు మ్రింగె?

ఎన్నటికి ఈ రేయి నా బ్రతుకులో తీరు?

వటవృక్ష శాఖలకు ఉపశాఖ లుదయించె

మరల మరలా మావి చిగురు తొడిగె

చిరు వెలుగు కిరణమై చింత దీర్చెడివాడు

మినుకు మని నా గూట నెపుడు వెలుగు?

శ్రావణంబులు గడచి శరత్చంద్రడు మెరిసి

విధి విధానము నందు జగతి నడచే!

జడుడనై నే నేల ఈ జగతిలో నుంటి?

జగమేలు వానికిది తగని తలపు!

తనువు తూకము చెల్లి తూలిపోవక ముందు,

తరలిరమ్మని యముడు ముంగిటరుగక ముందు,

ముదమారగా నీదు మోము జూపగ రాద!

దేహ మందిన దేహి సంతసించంగా!

విద్య

కోటివిద్యల కలికివే – బహు కులుకు పలుకుల కొలికివే!

కారణముతో నెరుగ జేయుము – ‘విద్య’ యన నది ఏమనీ!

నేర్వదగినది విద్యయా? మరి కొలువు కోరెడి విద్యయా?

లోనున్న బడుతడి లోచనంబుల-బోధనంబది విద్యయా?

జిలుగు లోకపు తీరుతెన్నులు తెలియు తీరది విద్యయా?

జీవ నాడుల జీవమొసగెడి జీవి నెరుగుట విద్యయా?

చూపుకందని, చేతకందని, మనసు నెరుగుట విద్యయా?

మధుమాస కోయిల పలుకు భావన నెరుగు మతి అది విద్యయా?

భాగవతుల మది భావనలలో – నిండి యున్నది విద్యయా?

నింగి నేలలు నెలవు  తప్పక నిలుపు విధమది విద్యయా?

విధికి వంగిన మకుట మస్తక యోచనంబది విద్యయా?

అడవి బట్టిన తపోమూర్తుల తపోసారము విద్యయా?

ఎరుక జేయుము తల్లిరో ఏమెరుగ వలె నే విద్యచే?

విబుధజనులను వేడుకునినే నొందగల నే విద్యనూ?

వెలతి దారుల తరుగు బ్రతుకుల తారకంబే విద్యలూ?

తెలిపి మము తగు దారి నడుపుము సకలవిద్యల తల్లిరో!

దుర్గ మాయమ్మా

దురిత దూరిణి దుర్గ దయనేలవమ్మా!

అరుణ పదముల నెలవు ఎరుక జేయమ్మా!

ఆదరింపగ నీవె – అదిలింపగా నీవె,

అనురాగమును పంచి అక్కు జేర్చిన నీవె!

చిట్టినా పదములతొ – తరుగకున్నది త్రోవ,

కను చూపు కొస దాటి-పొరలున్నదీ దారి!

బ్రహ్మాండ రూపిణివి – బహుదొడ్డ దేవతవు,

దయజూపి – ఎత్తుకొని ఈ దారి దాటించరాదా!

దురిత దూరిణి దుర్గ- దయనేలవమ్మా!

అలసున్న నీ సుతుని – అదరించమ్మా!

సేవ-తెరవు

విష్ణునిగ నీవమరి యుంటే – పదసేవ పదవది గంగది!

శేషతల్పము నమరియుంటే- సిరికి చెల్లిన పదవది!

రాఘవునిగా ధరణి నడచిన-తరికి ఒక్కరు అమరిరే!

భరత,లక్ష్మణ,వాయుపుత్రులు-వంతునొల్లరె పరులది!

గోధూళి నంటిన పదము నంటగ పొంచి యుంటిరె పరిజనుల్,

గోపకాంతలు, గోప బాలురు, గారవించెడి పలువురు!

పురములో నీ పాదసేవకు పులక నేత్రపు మోముతో,

వేచి యుండును రుక్మిణీసతి – తరుణమేదని ఎంచక!

వేళ ఏదని, వేషమేదని ఎంచి జూడరె దాసులు,

సందు జేసుక – సేవ జేయగ – తగిలియుందురె ప్రతితరి!

అంత పంతము నమరలేనయ – నలకంత కోరిక దీర్పవా!

ఎట్టులో నీ పొందు పొందెడు – సేవ తనువున నాటవా!

కుంతి పూజకు మెచ్చి ఇచ్చిన మాట సాకెడి తీరులో,

దారులెరుగని అడవి దారుల-దారి జేసుక నడువగా,

కలత చెందిన తరుణ పాదపు కొలుపు కొంతైనీయరా!

పాండు పుత్రుడు జేరులోపల-అనునయింతును ఎటులనో!

తరుగు ఇదియని-తగను నేనని తొలగజేయకు గిరిధరా!

తగులు దారుల తరిని తనువును-తగుల జేయుము కరుణతో!

మందవిడిచిన మన్ద పశువును-వెరచి యుంటిని ఎచ్చటో!               (మన్ద:అల్పము; నిర్భాగ్యుఁడు; మూర్ఖుఁడు)

వెదకి జేరుము వెతలదీర్చుము-సేవగైకొను స్వామివై!

ఆనందమా?

అందమే ఆనందమా? ఆనందమే మరి అందమా?

నల్లమేఘము కదిలితే ఆ నల్ల గొల్లడు నవ్వెననుకొని,

పురిని విప్పిన పుంజు నెమలికి కానవచ్చిన దందమా?

ఏలరావని పంతమాడెడి గొల్లపిల్లల వాదనంబున,

పురమునేలెడి పుణ్యపురుషుడు ఎంచి చూసినదందమా?

కుడుపు మరచిన లేగదూడలు-ధరణి జారిన చంద్రకాంతులు,

విరగ బూసిన పొన్నపూవులు-పొదల వెదికెడి పిల్లగాలులు,

ఎవని పొందును పొందగలమని-పెదవి నెన్నని పదము నెంచుక,

పరవశంబును వశముజేసుక – పొందు తలపది అందమా?

అలుకగొని తన పొందు వీడిన-అతివ మనసును అనునయింపగ,

పడని పాట్లను పడుచు శ్రీహరి – పొందునది ఆనందమా?

సంతు పోరును మడియజేయగ – నెలతగా నడయాడు వానిని,

కొమ్మయని తా కోరినానను హరుని నటనానందమా?

తనువు సందడి తరుగు నప్పుడు – తలపు తలుపులు తెరచినప్పుడు,

పలుకు పల్లకి వాహకులు తామలసినామని తొలగినప్పుడు,

తీరికొందిన తమకమందున తారసిల్లెడి మధుర భావము,

ఆనందమని అది అందమా? అందమని ఆనందమా?

ఎదురు చూపు

ఎదురు చూపుకు బదులు ఎన్నడందేనో!

ఎంతలో నున్నావు సూర్య నందనుడా!

చెలులు నను దినదినము పరిహసించేరు,

చేర బిలువగరాద ఎదురు నేనొత్తు!

ఎడబాటు బాటలివి ఎరుగవే కంచ,

తరుగ కున్నవి జూడు పరుగు నేనిడినా!

వేడగా కరుగరే వేల్పు లొకరైనా,

వేసారితిని నేను వాని నుతియింప!

వేడబోవను నిన్ను అమర వాసమును,

గురుతు జేయను నీకు ఇహలోక సుఖము,

కాల గతులన కదిలి దయనేలు వాడా!

కాలు నర్చించగల తీరు నెరిగించు!

నీజాడ కనువరకు తాపమును వీడి,

తగిలియుందును నేను నీదు మన్ననన!

వెతల బాపెడి వాడ తరిని ఎరిగించు!

మోహమణగగ జేయు భవ పాశములన!