రాత్రి

పగలు కానిది రాత్రి – వెలుగు లేనిది రాత్రి,

వేదనలు మదినుండి వెలుగు జూసెడి వేళ,

వేదాంతులందరూ అప్రమత్తత గాంచి,

నిద్రించు లోకమును ఎరుగ నేర్చే వేళ!

ఎంత భాగ్యము గొంది ఈ రాత్రి వేళ,

పరమేశు పాపడై భువికేగు వేళ,

ఆ పాదములు సోకి తరియింప తలపోసి,

యమున యద ఉప్పొంగి ఉరికేటి వేళ!

జగన్నాటకమందు తన తనువు మనుగడకు,

జగధీశుడే మరుగు కోరేటి వేళ,

యోగమాయకు హరుడు కనిపించు వేళ,

నందు నింటన జగము మురిసేటి వేళ!

రామ దూతకు మాత కనుపించు వేళ,

ధరణి సుత ముద్రికను కనుగొన్న వేళ,

సంజీవనిని హనుమ వెదికి పట్టిన వేళ,

కాలునికి పరమాత్మ వశమైన వేళ!

 

చరసాల పాలైన తన భక్తునిన్ గావ,

బంటుయై శుంకమును చెల్లించు వేళ,

పాచికల నాడుటకు తన వైభవము వీడి,

ఇడుములోర్చుక సఖుని చేరేటి వేళ!

రక్కసుల పెను ఘాత మోర్చేటి రేయి,

ప్రమధ గణముల శక్తి కూర్చేటి రేయి,

గౌరీశు పద గతుల పులకించు రేయి,

తాపసులు అనుదినము వాంఛించు రేయి!

నందబాలుడు మురళి నూదేటి వేళ,

గోపకాంతలు హరిని కనుగొన్నవేళ,

రాసలీలల శోభ మోదాన అందుకొని,

రయమునురికే యమున ఆగినావేళ!

 

జ్ఞాన కణికల వెలుగు వ్యాపించు వేళ,

జ్ఞానార్తులకు మాయ దారినిడు వేళ,

వెన్న దొంగకు వన్నె నమరించు వేళ,

అల్పులకు మైమరపు నందించు వేళ!

వెతల వేసారేటి జంతు జాలము  నెల్ల,

లాలించి శ్రమ దీర్చి శక్తి కూర్చెడి రాత్రి,

ఏలాటి ఉనికైన తన యదన దాచుకొని,

అద్వైత పరమార్ధ మెరుక జేసెడు రాత్రి!

అమర వాసుల నెలవు లెరుగనీ రాత్రి,

అవని వాసుల పట్ల వరమైన రాత్రి,

సృష్ఠి సంచారమును స్పూర్తితో నడపుటకు,

పరమేశు డేర్పర్చెనీ దివ్య రాత్రి!

భువిలోన వరమైన ఈ దివ్య రాత్రులను,

వెఱ్ఱి ఊహల తోన వెలివేయ బోక,

ఆనందు నమరికగ మదిలోన నిల్పుకొని,

ప్రతి రాత్రి పంచేటి బోధలను గాంచు!

కాల గమనము నందు ఇలనైన కలనైన,

వెలుగు రేఖల కొరకు వెదుకగా బోకు,

అంతరంగపు వెలుగు నిండారగా వెలుగ,

రంగ రంగని ఉనికి నలుదిశల చూడు!

అద్దరి

భవసాగర పద్దరిన – మధుర మోహన రూపుడ..

ఆనంద అంబుధిన అమరి యున్నాడంచు,

వాని చేరిన చింత చినుకైన లేకుండ,

మనసు సుఖముల తేలి మన నేలునంచు,

నుడివి నారెందరో ఎన్నెన్నో గోళముల!

సుందరం బీ జగతి- సంచారమే సుఖము,

నవ్యమౌ ఈ తనువు- నవ స్పందనల నెలవు,

పంచభూతాత్మకము -ప్రభవించు ఈ జగము,

కారుణ్య వారాసి కనుదోయి జన్మించి ,

కార్య రూపముగొన్న బ్రహ్మాండ భువనాన,

ఎన్నగా ఒక కణము- నేనున్న ఈ ధరణి!

సత్యదూరంబైన మిధ్యకై మోహపడు,

పసి మానసములాడు – పంజరపు శోభలివి,

ఎన్నడో ఒక నాడు తనను జూడగవచ్చి,

దివ్యత్వ సామధ్య సార్వభౌమత్వమును,

చాటిజెప్పెటి చరిత చరియింపగా జేయు,

కలడన్న వాని గన యత్న మెరిపెడి వాడ!

తనువు నిచ్చిన తల్లి – తరము నిచ్చిన తండ్రి,

బ్రతుక నేర్పిన గురువు-తనువు పంచిన తరుణి,

వరుసలని వైరులని ఎందరెందరో గూర్చి,

సంఘమని సీమయని దేశమని గోళమని,

నా తనువు పలుదిశల వ్యూహరచనల జేసి,

ఆటఇది ఆడుమని నన్నిచట నాటెనట!

ఆట నియమములన్ని ఆనాడె మరచేవు,

ఆదమరపున నీవు అలసత్వ మొందేవు,

వ్యూహరచనలొ నీవు దారినిడ మరచేవు,

భవ  భావ అంబుధిన నీవేల మనరాదు?

ఆటగాదిది నేడు వేటగా మారింది,

వేగపడుమోదేవ వేసారెనీ జగతి!

తనయుడేడని నీవు తలుపలేకున్నావొ,

నీ కల్పనల అలల తాకిడికి దడిచేవొ,

ఏకాంత సౌఖ్యమును ఛేధించు భేదమును,

ఎరుక జేసెడి వారలెందు దాచుంచావు?

ఎల్ల లెరుగని మురిపెమందించ గల నీవు,

ఏల ఈజగతిపై పెడమోములాయేవు?

ఆ దివ్య అంబుధిన ఈజగము కరిగించు,

జగమన్న చెరసాల చెలియలను సవరించు,

అద్దరన్నది నేడు ఇద్దరిగ నెలకొల్పు,

ఆర్తులని భక్తులని యోగులని వైరులని,

దీనులని హీనులని రాజులని యోధులని,

నీవు నాటిన తెరలు తొందరగ తరలించు!

నీదు ఊపిరి నుండి ఉదయించినీ జగతి,

నీదు ధిక్కారమును ఎటులోర్వగాగలదు?

ఏ నవ్య కల్పముల కల్పనల దేలేవో,

ఏ వైభవము తలచి ఈ రచన మరచేవు?

ఆదరము కరవైన ధరణి దుర్లభమాయె,

నీ సుఖము నందించు తరిని కనదాయె!

 

భ్రమ

శంభు పట్టపు రాణి పుట్టింటి జ్యోతి,

పాల్కడలి కన్నెగా పేరొంది నతివ

జనకునింటవ పెరిగి పురమేలు పడతి,

ఏమి తరుగని కనక కాంతి మెచ్చింది?

ఇంద్రియంబుల నొడిసి వైకుంఠు ధ్యాసలో,

తనువు కడదేర్చుకొను తపోధనులు,

ఇంద్రుడంపిన కాంత వంటి వొంపుల లోన

గోవిందు మించినే గుణము వలచారు?

రాగ రంజితమైన రసజగము నేలేటి,

అచ్చరల నర్తనల మునకలేసే వాడు,

నారచీరల నూను మునికాంత మోహమున,

మౌని వేషము నేల అమరినాడు?

భ్రమయె ఆధారముగ భ్రమియించు ఈ జగతి,

భ్రాంతి జాలపు ఒడుపు వింతగాదె!

విభవంబు వైభవము వెన్నంటు వారైన,

చలియించి విచలితులు అగుదు గాదె!

బుడత వాడను నేను బహు చిరుత వాడ,

బ్రతుకు బాటల నడచి బడలినాడ,

బహుదొడ్డ వారికే తరము గానీ భ్రమను,

గెలువగా నా తరమే తోయజాక్షా!

వైరభావన వీడి వెలిగించు నా యదను,

వైనముగ నీ మురళి మోహనముగా,

తనువు తీరము దాక తోడుండి కాపాడు,

భ్రమల భావన నన్ను బడయ కుండా!

సుందర కాండ – నా మాటల్లో

సుందర కాండ – నా మాటల్లో

శ్రీరామ భక్త హనుమాన్ కీ జై!

శ్రీరామచంద్ర ప్రభువుకీ జై!

శ్రీసీతా మాతాకీ  జై!

సుందరుండవు నీవు సుందరము చరితం!

శ్రీరామ కథమహిమ నెరిగించు చరితం!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

శీరామ భక్తుడ నీవు -అంజనా తనయా,

అవనిజను తనయుగా దరిజేరినావు!

సంకటము హరియింప సాటెవరు నీకు?

తప్పు లెన్నక నన్ను ఆదుకొను మయ్యా!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

వాలి వైరపు భీతి వెన్నాడుచున్నట్టి,

సూర్య నందను కొలువు నమ్మికగ జేసావు,

తగురీతి సమ్మతుల సమయమందిచ్చి,

పురుషోత్తముని పొందు నమరించినావు!

శ్రీరామ కథయందు అంకురించావు!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

పవనాత్మ నందనుగ దీవెనల బడసి,

పలు అస్త్ర శస్త్రముల శక్తిగొన్నావు,

దినకరుని శిష్యుగా విద్యనేర్చిన నీవు,

వినయ వైనముదెలియ ఋషి శాపమంది,

యశము గొనగా రామ బంటువైనావు!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

ధరణిజను జేరుమను రామాజ్ఞనంది,

ముద్రికను శిఖదురిమి పయనమైనావు,

అట్టి ఆనతి బలము మదిని తాడింప,

లంఘించి లంక కై రయమునురికావు,

లవణ సంద్రపు ఉరము దాటి నడిచావు!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

మురిపించు మైనాక శిఖర వైభవ శోభ,

మహా బిలమును బోలు వదనయౌ సురస,

యుక్తిశక్తుల క్రీడ సింహికను దాటీ,

లంక కాపరియైన లంఖిణిని దృంచి,

స్వామి కార్యము నెరప జొచ్చితివి లంక!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

పుర వైన వైభవము ఏమరక ఎరిగి,

శయన శాలల దిరిగి కాంతలను గాంచి,

కమలాక్షియగు సతిని కానంగ లేక,

విగత మానసమంది మరలు భావనలో,

శేఖరుడు చిలికించె చిగురు దిక్కులనూ!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

వనచారి యగు నీవు శోకమెరుగని వనిన,

శోకమందణిగున్న శోభనాంగిని గాంచి,

ఆదిశక్తిగ నమరు క్షీరాబ్ధి పుత్రీమె,

లోకమాతగు తరుణి శ్రీరాము మహిషి,

గురుతెరిగి శ్రీరాము కథ పలికినావు!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

ప్రాణేశు గాధ విని జానకీసతి మనసు,

రక్కసుల పెను మాయ అని సంశయింపగా,

ముద్రికను అర్పించి నిజ రూపమెరిగించి,

నర రూపమున నలుగు గాయత్రి నోదార్చి,

దుఃఖ హరునిగ నీవు యశము గొన్నావు!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

కాకాసురుని కథను సింధూర వైభవము,

సందేశముగ బడసి స్పూర్తి గొన్నావు,

రామదూతరిగె నని రావణుని కెరిగింప,

వానరుని వలెనీవు వనిని దృంచావు,

శరములంటని నీవు స్వామికై కట్టుబడి,

లంకేశు సుతువెంట తరళెళ్ళినావు!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

విధిని వర్జించగల వన్నె గలిగిన వాని,

వికట భావన వెరపు వెన్నాడు వాని,

తనయు శోకము విడచి తెలివెరుగు మంచు,

హితవు తెలుపగ నీవు తలచినావయ్యా,

సందియంబెరుగనీ శ్రీరాము చరితమును,

అసుర వీనుల కంప నుడివినావయ్యా!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

వాగ్దేవి వైభవము- వనజాక్షి మన్ననలు,

దశరధాత్మజు రక్ష – సురకార్య స్పూర్తి,

సర్వభక్షకు జిహ్వ నీదేహ మంటకే,

స్వర్ణలంకను చుట్టి చరియించెనయ్యా,

మండోదరీ పతికి చితిఛాయ మదిదోయ,

వైభవంబుల లంక క్షయరూపమొందె!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

సాటి వానర సఖుల సౌఖ్యమలరింప,

తన ఏలికకు ఘనత హెచ్చుగమరింప,

కుశల వార్తను వినగ వేచున్న దేవరకు,

సందియము పొడసూప సందీయకుండా,

‘కంటి’ నని పలికితివి స్ఫూర్తితో నీవు!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

శత్రు భంజనుడైన శత్రుఘ్ను నగ్రజుకు,

భవ బంధ హారియగు భరతాగ్రజునకు,

సకల లక్షణరూప లక్ష్మణాగ్రజునకు,

శోభనంబుగ పడతి కుశల వైనమును,

వినయమున దెలిపితివి విన్నపముగాను!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

 

పురుషోత్తముని శోక మణగించగల నీవు,

సీతమ్మ చింతలను దీర్పగలనీవు,

రామాజ్ఞగా జగము నడచేటి నీవు,

సాధ్యమెరుగని కార్య మెరుగగా గలవే?

చేయూతనందించు చింతలణగించు,

శాంతి సౌఖ్యము లిచ్చి మమ్ము నడిపించు!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

సుందరుండవు నీవు – సుందరము చరితం,

రామ కార్యము నెరపు నీ దివ్య చెరితం,

అనినంత వినినంత భావించి నంతా,

శాంతి విజయములిచ్చి రాముదయ నిచ్చి,

ఋషి రచన నుడివినా పూర్ణఫలమిచ్చి,

తుదిదాల తోడుండి నడిపించు మయ్యా!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

నల్లనయ్యకు కొలుపు

 

 

 

!th

శిశిర ఛాయలు ఇచట చిత్రమమరాయి,

తరువు తరువును తాకి ముదిమిగొలిపాయి,

చిగురాకు కొక రంగు ముదురాకుకొక రంగు,

రంగవల్లులు జల్లి  చోద్యమొసగాయి!

ప్రతిరెమ్మ ప్రతిఆకు అమరున్నప్రతి నెలవు,

పసిమి ఛాయను పొంది పొంగిపోయేను,

వనకన్నె తనువుపై తనఉనికి తేజమును,

మణిహారముల మించి సొంపు గొలిపేను!

హరిత చేలము పైన మెరయు పసిమినిజూసి,

మోదమొందే కనుల వాకిళ్ళలో నడచి,

గురుతెరుంగనివారి మదినింపి మోదింప,

సరసుడని నీసతులు నుతియింపరని ఎరుగు!

పాలకడలిన బుట్టి పసిడి ఛాయనుగల్గి,

పదసేవతో నిన్ను మురిపించు సిరి ఛాయ,

మేనియందమరితే మురిసేవుగాబోలు,

నెమ్మదించిది గాంచు వనజాక్షి వంద్యా!

క్షీరసాగరపలల మధనమున విడివడిన,

వెన్నతరకలు కరిగి మేలిరంగుగ అమరి,

నీమేని వస్త్రమున అలదినా ఛాయలకు,

మెచ్చి మా ‘సిరి’ నిన్ను పీతాంబరుండనియె!

పాలసంద్రపు కన్నె వరుని కట్నంబైన,

ఛాయ మురిపెము నొసగ సహజ భావంబే!

నీవు మెచ్చిన పొడను మెచ్చు వారల యందు,

మన్ననను అమరుటయు నిక్క నియమంబే!

లచ్చి మెచ్చిన ఛాయ ఎందెందు గలిగినా,

మురిపెమన ముద్దాడి మోదాన దేలేవు!

వక్షమందున అమరు అలివేణి అంతరము,

ఆదరముగా నెరుగ ఆదమరతువో ఏమొ!

అహమొంది దుర్వాసు పాదమాన్చిన యంత,

ఒల్ల లేకానాడు నినుబాసి వెడలగా,

సిరుల కుప్పను జేర పడినపాటెటు బోయె?

తల్లి దీవెన లేక తరియింపగా తరమె!

పసుపు గడపలులేక పలుకు పద్యము లేక,

ముత్యమంతగు నేతి దీపకళికలు లేక,

కడుపు కుడిచెడి కుడుపు కూడగట్టెడి ఎచ్చు,

అహమొంది మోదింప ఆదిలక్ష్మెటులోప్పు?

పాలెంత తెలుపైన పాలకుండలు నలుపు,

పండు వెన్నెల పంచు నిశిరేయి నలుపు,

మెరుపు తీగలు అమరు కారుమబ్బులు నలుపు,

వెలుగు శోభల నమర ఆధారమౌ నలుపు!

నల్లనయ్యవు నీవు నగకన్య సైదోడు,

సిరిమెచ్చి చోటడిగి చెంత జేరిన ఉరము,

శృంగార మమరగా పూజ లందుక నీవు,

కమలాక్షి కనులలో కాపురము నుండు !

ప్రతిబింబము

పూజ భావమునీవు పూజయును నీవు,

పూజందునది నీవు- పూజించునది నీవు,

లోపముల జేయగా నేనెంత వాడనయ,

లోచనాత్మక నీవు యోచించ వేల?

భావమూలము నీవు భావంబుయును నీవు,

భరియింపగా నీవె భువికరిగె ననియేరు,

ఏటికరిగితి వీవు ఏరూపు నమరేవు,

భువి వాస మనుదినము భారమమరేను!

వరద హస్తుడ వీవు వరదుడవు నీవు,

వరములొందెద వీవు ఒసగెదవు నీవు,

వచన వాల్మీకమున వైవిధ్యముందనుచు,

వీగి విడనాడేవ వైరి మోహనుడా!

తనువొక్క తొడుగనీ తొలగిపోయేననీ,

తగులు వైనములన్ని తలపోయలేననీ,

తీరికెగిన నాడు తలచి తెలిసేననీ,

మురిపెమున మనలొకటి మూటగట్టావు!

నేటికీ ఆమనసు నాటిమాటలు విడదు,

మనసులో మరియేదొ మరుగున్నదని నీవు,

మరుగు మరుగున మసలి మరుగునుండేవు,

ఆడితప్పని వాని మాటవైభవ మిదా?

ఆటలెరుగని నాకు ఆనతిగ నిమ్మా!

జగము నెరపితి వీవు జగదంబ తోడుగా,

అడుగు జాడన జగము నడువ నెంచి,

ఏటికీ జగడంబు – జంట మేనుల తప్పు,

మరకగా మనసందు మనుపనేలా?

శుకుని గాంచిన జగతి శృంగార మమరునా?

నిను గాంచినంతనే అమరు నేలా?

నీదు పుతృడ నేను వైరి వైనము వీడు,

వెలుగొందు మొకమారు వెన్నదొంగా!

తోడు

నీలి నింగిన పాదమూనక-పరుగు తీసే మబ్బు కన్నెను,

తుంటరిగ తా నందుకొనగా -వెంబడించెను గాలి తరగలు,

పరుగు పరుగున వచ్చి చేరెడి-నదుల వేగము నదుపుజేసి,

సంతరించిన రాజసంబున – సంతసము గొని నొప్పుచుండగ,

మబ్బు కన్నెల మోముఛాయను-మద్దు జేసెడి సవ్వడులతో,

కెరటమైతన యదన మొలిచిన-ఊహ నందగ సందడించెను!

 

అదుపు జేయగనలవిగానా-ప్రౌఢ ఊహల సందడులతో,

తీరమందున తళుకులీనే- తేట నురుగుల హోసములతో,

నింగినేలెడి సూర్య చంద్రులు- పంచి ఇచ్చెడి  చెలిమితో,

ఎంతగా తా పరుగు తీసిన -దాటలేనా తీర రేఖలు,

నియతి నియమము నెరుగు మంచూ-నిలిచె నచ్చట ఠీవిగా!

 

అంతరంగపు అంబుధందున ఆదమరువని అలల లీలలు,

యదల లోతులు తరచి తరచీ వెలికి లాగెను వెఱ్ఱి ఊహను!

కనులు గాంచగలేని జగమిట పరచి యుందట ఎచ్చటో!

మచ్చటగ ఒక మారు నా కిట గోచరించద దెందుకో!

 

మున్ను పలికిరి మునివరేణ్యలు మౌన వాణిన ఎందరో,

సాహసించిరి ఎరుక జేయగ మూల పురుషుని మోహమున్,

హాయిగొలిపెడి శేష పాన్పున సేవ లందెడి సురవరేణ్యడు,

ఊసుబోవక సరస మాడుచు పలికెనట ఈ జగములు!

 

క్లేశమెరుగని కేశవుని మది గాంచ గలిగిన కల్పనా,

మోహనుండని పేరు గాంచిన మాధవుని యద స్పందనా,

హాసమే తన ఉనికిగా గల నంద నందను భావనా,

ఎన్నగా నేనెంత వాడను  వాని రచనను రయమునా!

 

వాని అందెల సందడులనే నాలకింపక బోయినా,

ముద్దుగారెడి వాని మురిపెము ఎరుక గాంచక బోయినా!

ఆదరించెడి ప్రేమ దృక్కుల ఉనికి స్ప్రుహ నే వీడినా!

నమ్మియుందును తెరుపు మరపున వానినే నే తోడుగా!

ఆహ్వానము

అంతరంగపు రంగమలికితి-భక్తి దీపము నందు బెట్టితి,

ఊహలల్లిన పట్టు పరుపులు-పరచి నీకై వేచియుంటిని,

భావ వీచిక విసనికఱ్ఱను – నీదు సేవకు సిద్ధపరచితి,

మునుపు నడిపిన మంద చేష్ఠలు-మనసుగా ఒక ఉనికి నెరపుక,

మాటిమాటికి నాటి ఊహలు-నేర్పుగా తలపందు చిలికెను,

వాటి వేడిని బాపుమంచు- వేడబోనని విన్నవింతును!

 

కరుణ కలిగిన వాడవంచు- మున్ను పలికితి రెందరెందరొ,

కారుణ్య భావపు ఛాయలందున- ఊర్పులను నే చేర్చబోవను!

సంచరించిన తావులెల్లన – సంతసంబును నింపువాడని,

సారహీనపు బ్రతుకు సీమన- సంచరింపగ నిన్ను వేడను!

ధర్మదేవత పాదమూనని- యుగమునందిట వాసముండగ,

పాలకడలిని వీడిరమ్మని- ఏనాడునేనిను కోరబోవను!

 

పుణ్యశీలుర పూర్వ పున్నెపు– పుంతగా భాసిల్లు వాడవు,

పుణికి పుచ్చుక నీదు పదములు-పంతమాడగ ఎంచ జాలను!

దుడుకు బాటల దిగుడు ఎగుడులు- మాకు నిక్కము బ్రతుకు బాటన,

నిర్మలంబౌ నీదు పదమును – ఏటికిట నే నూనగోరుదు?

ఎంద  రెందరొ ఎంచి ఎరిగిన – భావజాలపు భవ్య రూపము,

వేడ్కమీరగ మోదమొందుచు- సంచరింపగ నేను వేడెద,

నిక్కముగ నీ తేజరాసుల – లేశమేనా ఒడ్డ వేడను!

 

జగము నీదని నాడుపలికిన -పలుకులన్నీ ముద్దు పలుకులు,

కలియుగంబను కఠిన యుగమున-సంచరింపగ తలుప నేర్వకు,

వారిజాక్షికి వన్నె తరుగును- వరద హస్తము బడలిబోవును,

నెమ్మదించుము నీరజాక్షా- నిలకడెరుగుము నీదు తరిలో!

ఎన్నడైనా కరుణ గలిగిన- నీదు మన్నన మనుపు తీరుగ,

అంతరంగపు సీమలందున – అమరి నా జత నాదరింపుము!

రేరాజు తలపు

పగటి పరుగుల అలసి ఎరుపెక్కి సూరీడు,

పడమరను జేరాడు – సంధ్య సేవలనంద!

నీలి నీడలు పరచి కాషాయ చిలికించి

రేరాజు రాక కై అంబరము అమరింది!

కమలముల కొలనెల్ల కలల తేలుచునుండ

కలువ కన్నులనార్చి లోకమును జూసింది,

సందడిగ   హారతులు అర్పించు అర్చకులు,

మేళ తాళపు ధ్వనులు శుభము తెలిపాయి

 

మల్లెలును, జాజులును వింత సోయగమొంది

అత్తరుల పరిమళము తమసాటి రావంచు

కొలను జలముల పైన ఒరిగినా భారముకు,

అందంత పన్నీటి తరకలై తేలాయి!

హాయిగొలిపెడి వెలుగు నింగి అంచున నుండి,

పొంగి పొరలచు అవని యదపైన జారింది,

అలసటను మైమరచి జీవజాలములెల్ల

ఆ ఝరుల తేలుచూ ముదముగొన్నారు!

కొమ్మ కోనన నిలచి రేరాజు రాక కై

ఎదురు జూచెడి రేయి శృంగార మమరింది,

తళుకు చుక్కల రవికె తెలిమబ్బు పైట

శోభాన సవరించి అవని పై ఒరిగింది!

మంద గమనము మాని వేగరమ్మని పిలిచి,

నింగిపై తన చూపు స్థిరముగా నిలిపింది,

నెలవంక నగుమోము చిలికేటి సుధ కొరకు

ఎంతగా వేచెనో ఆ వింత పక్షి!                (చెకోర పక్షి)

మాధవుని వేణువును విడిచి సాగెడు గాలి

మధుర స్వరముల భార మెంత మోసెనొ గాని,

యమున అల లను అణచి అందణిగి యుండి,

కురియు సుధగ్రోలుటకు వేచి యుండేను!

ఏమరక ఈ ధరణి ప్రతి అణువునూ తాకి

తన ప్రేమ కిరణముల కణకణమునా నాటి

ఫాలాక్షు పలుకులను ప్రతి వారికందించి,

తార సరసన జేరు రేరాజు నుతియింతు!

బహు చంచలంబైన మనసు పగ్గములన్ని

ఒడిసి బట్టెడివాడు – ఓరిమెరుగని వాడు,

శంకరుని శిఖయందు ఒదిగి నిలచెడి వాడు

గౌరి శాపమునంది గ్రుంకేటి వాడు!

నేడింక గగనాన నడయాడగా వలెను

వేసారు మనసులన నీ సుధను చిలకించి,

వేద నాధుని సౌధ మమరింప వలెను,

వాణి తన వీణగొని భువికేగ వలెను!

శేఖరుని నుతియింప జగమాగ వలెను!

నీ జత

కలియుగంమ్ముల కాననంబులు

విచ్చు కత్తుల వింత పధములు

అడుగు అడుగున అంధకారము

ఆటంకమై దరి కానకుండిరి..

మోహజాలపు మెచ్చు మెరపులు

మదన వికృత మధువనంబులు

మరులు గొనినా మానసంబులు

మనుగడకు నోచక మరలుచుండిరి…

ఘోరకలియుగ ఘాతుకంబులు

మాయ జేసెడి ప్రమధ నాట్యము

ఘాతముల మనలేని మనసుల

నీ ఒడిన జేర్చుక ఊరడింపుము..

నా సుతుల నీ జత ఏమరింపకు…