శంభో శంకరా!

village morning 1

తెల్లవారక ముందె తనువు చేతన నొంది,

ప్రారబ్ధ శర వేట – తలపు భీతినిగొల్ప,

తగు తరిని ఎరిగించమని నిన్ను వేడుచూ,

మగత మనసును మనిపి కదిలి నాడ!

జన్మ జన్మల నుండి జమయైన కర్మంబు,

కబురు కబురున నన్నుకసరుచుండ,

గతి లేక గతియైన బ్రతుకు బాటలయందు,

మూగ వేదన తోనె గడచువాడ!

తీపి బంధములెన్నొ తీరున్న కలిలోన,

కలుగుదే నాకొక్క ఊరడింపు,

వారి వీరిని జూసి వేడెక్కి నా కళ్ళు,

కినుక గాంచును నిన్ను కనుక నేడు!

ఆనాటి కానాడు తరుగు ఓపిక తోడ,

తొందరాయెను మదిన చింత పెరిగి,

చెంత నుండిన నీవు చింతేల దీర్పవో,

ఎరుకగొనగా నాకు ఎరుక రాదు!

లోచూపు కరవైన లోలాక్షుడ నేను,

లలిత భావన మెరుపు ఎరుగలేను,

గోచరంబదిగాని  గోప్యరూపము వీడి,

విదితముగ వెలుగొందు వింధ్యవంద్యా!

bunch-of-grass-3d-model-objbunch-of-grass-3d-model-objbunch-of-grass-3d-model-obj

నీలకంఠా

shiva

కూరిమిగొని కూర్మముగా హరి నెరపెడి కార్యంబున

ఉరుముచు పొంగిన భీతికి భీభత్సము ముప్పిరిగొనె!

హరహర యని సురలసురులు ప్రాణార్తిన పరుగిడుతూ,

వైకుంఠుని విడనాడిక వేడితిరే శరణూ!

భరత శాస్త్రపు గతుల పదనర్తనలతో,

ప్రమధ గణములు కూర్చు వాద్యఘోషలతో,

వాగ్దేవి వివరించు స్వర సరంబులతో,

నందీశు విభుడచట విభవంబు నమరే!

సర్వమంగళ అమరు వామ భాగము గల్గి,

శశి శేఖరుని శిఖన పూవుగా గల్గీ,

సుర గంగ చిందేటి జటాజూటము గల్గి,

శోభించు శంకరుడు కరుణ గని జూసే!

పొంగు హాలాహలము అమల మట నీకు,

ముక్కంటి వేలుపా వేగ పడుమయ్యా,

పద్మాసనుని ప్రతిభ ముప్పు జిక్కెను నేడు,

ఆరగింపుము ‘దాని’ నాదుకొను మమ్ము!

ధవళ కాంతులు దేలు దేహమమరిన వాడు,

నల్ల నాగుల నగలు అమరున్నవాడు,

హరహరాయని నంత హరించు వాడు,

వల్లె యని తన సభను వీడి అరుదెంచె!

లయకారుడగు పతిని రక్షకుగ జూచీ,

లాలిత్య మమరించె భీభత్సమందూ!

జగదంబ ఆనగొని బీతి భీతిల్లి,

వశమాయె వరదునకు జగము లెరుగంగా!

దామోదరుని సాటి గురుతు లమరంగా,

మృతము గూర్చెడి సురభి కంఠ మమరేను!

వాత్సల్య మొలికించు ఫాలక్షు మనమునకు,

కేతువై కలకాల మమరమై వెలుగా!

ప్రమధ నాధుని ప్రణుతి పలుకు వారెల్లా,

పార్వతీ పతి పదము గొలుచు వారెల్లా,

శంభు సౌందర్యమును పొగడువారెల్లా,

నీలకంఠుడ అంచు నుతియింప రాదే!

సీమలెరుగని కరుణ కలిగున్న వాడు,

విధివిధానపు పూజ లెంచ నేర్వని వాడు,

విన నెంచరాదె నా విన్నపములెల్లా,

నా  తనూభవు   బ్రోవ తరలి రారాదా!       

! మురిపాన ఏలుకో!.

నిర్మలుని సేవలో నిత్యముండెడివాని

ఘడియలును క్షణములును అక్షయంబగును,

అద్దాని నెరిగియే అలనాటి మునివరులు

శతశతంబుల ఆయువంది యున్నారు!

మూల ‘పురుషు’ని సేవ ముదమార జేసితే

కర్మ మర్మమము వలన క్షయమొంది బోవు

వింతయగు నీక్రమము నెరిగి నా నరులెల్ల

యగ్య యాగములందు బ్రతుకు గడిపారు!

అలనాటి ఆనీతి నేటికిని ఎరుకగొని

భావగీతములందు, భజన పాటలయందు

గోపాలు నిలుపుకొని – గోవిందు నమ్ముకొని

ఎందరో భక్తులిట ఫలము నొందేరు!

మోహనుని లీలలను కీర్తించు పదములను

ముదమారగా మదిని నెరపుకొను ఈ ‘మాయ’

మోహమున మైమరచి తన ఉనికినే మరచి,

ఆ’పదము’లకు ధ్వనుల జాడనీలేదు!

అంతరంగపు ధ్వనులు అలవోకగా కదిలి,

ఆది పురుషుని ఉనికి వయ్యారమున మోసి,

త్యాగయ్య గళములో కృతులుగా పలికినా,

పోతన్న కలములో కావ్యమై కదిలినా

వీనులందవి వింత విందులే జేసినా

జిహ్వయందెంతగా చిందులే వేసినా

కారుణ్యమూర్తి నవి కనిన యోగము వల్ల

కర్మ ఫలముల బాసి మసలు చున్నాయి!

వన్నెకాడవు నీవు- విరసుడవు నీవు,

ముక్తి పధమును నీవు- రక్తి యును నీవు,

పదము పదమున పలుకు ధ్వనులన్ని నీవు,

పలుక నేర్వని ధ్వనుల  మౌనంబు నీవు,

ఏల ఈ భేదములు – బహువింత వాదములు

పలుకు లన్నీనీకు పూజ లనుకొనినంత

నీ దివ్య నామముల కేమి తరుగౌను?

ధ్వనులన్నిటా నీవు నాదించు చుండగా,

నాదముల వనమాల నీకేల తగదు?

కనికరము గనవయ్య కలి కాననంబిది,

కర్మ కారణ మంచు ఎంచగా తగదింక,

పలు తెరంగుల నుండి తండోప తండముగ

చిత్రగతులన మాయ దాడి చేయుచు నుంది,

ఏలాగొ ఓలాగు సందు జేసుక నీవు,

ప్రతి మనసులో జేరి, నీజతను జేరుకో,

వేదనల వేసారు నాతనుయులను జేరి,

ఏమరక ముదమార మురిపమున ఏలుకో!

దామోదరా

కార్తీక మాసంలో కృష్ణభగవానుణ్ణి ‘దామోదరుడి’గా స్మరించాలని శ్రీ చాగంటి కోటేశ్వర రావుగారి ప్రవచనంలో విని…

భూభారము హరియింపగ – పాపడవై పుడమి మొలిచి,

ఎదుగుచు ఆడిన ఆటలు – మురిపెంబులు గావె మదికి – మోహనరూపా!
హరి హరి యని పదుగురాడ – హరియింపగ గోకులమున,

మెండుగ దొరికిన వెన్నను – ఎక్కువగా హరియించుట – వేడుకగాదే!

 

లాలించెడి మురిపెంబును – మోదింపగ మదిన దలచి,

భావంబులు పలికెడి నీ – కనుదోయికి భయము నద్ది,

ముప్పిరిగొను ముదిమిని ఆ – యదు కాంతకు ఒసగినావు – యాదవబాలా!

 

మూపురమున మంధరగిరి – ఓపిన తరి నేనాడూ,

ఒరియని నీ ఒదలు నేడు – చిక్కపు త్రాటికి చిక్కగ,

ఒరిపిడితో నలిగి నలిగి – గురుతులు మోసెను తనువున- తామస హరణా!

 

నిక్కంబిది నినుదలవగ – నందున కానంద మేమొ – నళిన దళాక్షా!

తులసీ మాలల తోరణ మమరికగా అద్ది నీకు సేవలు జేతున్!

 

ఓరిమిగొని నాతప్పులు కూరిమితో కనికరించు,

కండలు కరుగంగ పూజ చేయగ లేదని తొలగకు,

సారము ఉడిగిన తనువిది-బేరము లెందుకు మనలో,

రయమున నా సంతు ఇడుము లీడ్పగ రారా!

మధుర చుక్కల రైక !

మధుర చుక్కల రైక- మనసుపడి అడిగింది,

మనువైన మరునాడు నా ఇంటి చిలక!

మోహాన పడకంచు పెద్దలంపిన మాట

చద్దిమూటన గట్టి నను పనికి పంపింది,

మాపటేలకు తాను మురిపాన అమరుటకు

మధుర చుక్కల రైక మరిమరీ తెమ్మంది!

నీల కంఠునికైన,  నిటలాక్షుకైనా,

గోపబాలునికైన, గోవిందుకైనా,

మాయ సరసన లేక మాధుర్య మేది?

నేనెంత అల్పుడను, ఈ తర్కమేల?

మయుని మగ్గము నుంచి పుట్టినీ తాను,

మోహమను రంగులను అద్దినీ తాను,

చురుకైన గుణరాశి అల్లినా ఆకృతులు,

అమరికగ గూర్చుకొని భాసించు తాను!

 

 

 

మాయ లేడిని బట్టి తెమ్మన్న ఇల్లాలు,

తన మాయ మోహాన ఎంతగా మునిగెనో!

కనక వర్ణపు శోభ సరిసాటి లేదంచు,

అమరున్న సభలన్ని వేనోళ్ళ పొగిడేను!

నిర్గుణుని ఇల్లాలు నిత్యశోభల తేల,

అలరారు కాంతులకు స్వర్ణ వర్ణము లాయె!

అట్టి ఆ ఇల్లాలి నిత్య పూజలు జేయు

ప్రతి ఇంటి లోగిళ్ళు పసిడి వర్ణము లాయె!

కలి పదంబును మోప అనువైన తావంచు,

భాగవతమును విన్న భూసురుడు వచియించె! (పరీక్షిత్తు మరణమునకు ముందు ‘భాగవత’మును     .      ….                                                        సప్తాహముగా శుకమహాయోగి వలన విన్నారు)

అట్టిఆ కనకమును మధుర చుక్కగ చెక్కి

వన్నెకెక్కిన తాను తళతళా మెరిసింది!

ఆ తానులో తాను తన సఖిని జూచి,

అందబోయెడి మధుర ఘడియలను తలచి,

మోదాన తన శ్రమను పణమునందించి,

తన చిలక కై రవిక నందుకొన్నాడు!

 

కలి పదంబుల ఘటన తన వెంట రాగా,

మోదమున దరిజేరు ఆ ముద్దు చిలకా,

రైక జోడుగ నుండ రంగైన రతనాలు,

అమరియున్నొక నగను వేగ తెమ్మంది!

మనసుపడి అడిగింది నా ఇంటి చిలకా!

రాత్రి

పగలు కానిది రాత్రి – వెలుగు లేనిది రాత్రి,

వేదనలు మదినుండి వెలుగు జూసెడి వేళ,

వేదాంతులందరూ అప్రమత్తత గాంచి,

నిద్రించు లోకమును ఎరుగ నేర్చే వేళ!

ఎంత భాగ్యము గొంది ఈ రాత్రి వేళ,

పరమేశు పాపడై భువికేగు వేళ,

ఆ పాదములు సోకి తరియింప తలపోసి,

యమున యద ఉప్పొంగి ఉరికేటి వేళ!

జగన్నాటకమందు తన తనువు మనుగడకు,

జగధీశుడే మరుగు కోరేటి వేళ,

యోగమాయకు హరుడు కనిపించు వేళ,

నందు నింటన జగము మురిసేటి వేళ!

రామ దూతకు మాత కనుపించు వేళ,

ధరణి సుత ముద్రికను కనుగొన్న వేళ,

సంజీవనిని హనుమ వెదికి పట్టిన వేళ,

కాలునికి పరమాత్మ వశమైన వేళ!

 

చరసాల పాలైన తన భక్తునిన్ గావ,

బంటుయై శుంకమును చెల్లించు వేళ,

పాచికల నాడుటకు తన వైభవము వీడి,

ఇడుములోర్చుక సఖుని చేరేటి వేళ!

రక్కసుల పెను ఘాత మోర్చేటి రేయి,

ప్రమధ గణముల శక్తి కూర్చేటి రేయి,

గౌరీశు పద గతుల పులకించు రేయి,

తాపసులు అనుదినము వాంఛించు రేయి!

నందబాలుడు మురళి నూదేటి వేళ,

గోపకాంతలు హరిని కనుగొన్నవేళ,

రాసలీలల శోభ మోదాన అందుకొని,

రయమునురికే యమున ఆగినావేళ!

 

జ్ఞాన కణికల వెలుగు వ్యాపించు వేళ,

జ్ఞానార్తులకు మాయ దారినిడు వేళ,

వెన్న దొంగకు వన్నె నమరించు వేళ,

అల్పులకు మైమరపు నందించు వేళ!

వెతల వేసారేటి జంతు జాలము  నెల్ల,

లాలించి శ్రమ దీర్చి శక్తి కూర్చెడి రాత్రి,

ఏలాటి ఉనికైన తన యదన దాచుకొని,

అద్వైత పరమార్ధ మెరుక జేసెడు రాత్రి!

అమర వాసుల నెలవు లెరుగనీ రాత్రి,

అవని వాసుల పట్ల వరమైన రాత్రి,

సృష్ఠి సంచారమును స్పూర్తితో నడపుటకు,

పరమేశు డేర్పర్చెనీ దివ్య రాత్రి!

భువిలోన వరమైన ఈ దివ్య రాత్రులను,

వెఱ్ఱి ఊహల తోన వెలివేయ బోక,

ఆనందు నమరికగ మదిలోన నిల్పుకొని,

ప్రతి రాత్రి పంచేటి బోధలను గాంచు!

కాల గమనము నందు ఇలనైన కలనైన,

వెలుగు రేఖల కొరకు వెదుకగా బోకు,

అంతరంగపు వెలుగు నిండారగా వెలుగ,

రంగ రంగని ఉనికి నలుదిశల చూడు!

అద్దరి

భవసాగర పద్దరిన – మధుర మోహన రూపుడ..

ఆనంద అంబుధిన అమరి యున్నాడంచు,

వాని చేరిన చింత చినుకైన లేకుండ,

మనసు సుఖముల తేలి మన నేలునంచు,

నుడివి నారెందరో ఎన్నెన్నో గోళముల!

సుందరం బీ జగతి- సంచారమే సుఖము,

నవ్యమౌ ఈ తనువు- నవ స్పందనల నెలవు,

పంచభూతాత్మకము -ప్రభవించు ఈ జగము,

కారుణ్య వారాసి కనుదోయి జన్మించి ,

కార్య రూపముగొన్న బ్రహ్మాండ భువనాన,

ఎన్నగా ఒక కణము- నేనున్న ఈ ధరణి!

సత్యదూరంబైన మిధ్యకై మోహపడు,

పసి మానసములాడు – పంజరపు శోభలివి,

ఎన్నడో ఒక నాడు తనను జూడగవచ్చి,

దివ్యత్వ సామధ్య సార్వభౌమత్వమును,

చాటిజెప్పెటి చరిత చరియింపగా జేయు,

కలడన్న వాని గన యత్న మెరిపెడి వాడ!

తనువు నిచ్చిన తల్లి – తరము నిచ్చిన తండ్రి,

బ్రతుక నేర్పిన గురువు-తనువు పంచిన తరుణి,

వరుసలని వైరులని ఎందరెందరో గూర్చి,

సంఘమని సీమయని దేశమని గోళమని,

నా తనువు పలుదిశల వ్యూహరచనల జేసి,

ఆటఇది ఆడుమని నన్నిచట నాటెనట!

ఆట నియమములన్ని ఆనాడె మరచేవు,

ఆదమరపున నీవు అలసత్వ మొందేవు,

వ్యూహరచనలొ నీవు దారినిడ మరచేవు,

భవ  భావ అంబుధిన నీవేల మనరాదు?

ఆటగాదిది నేడు వేటగా మారింది,

వేగపడుమోదేవ వేసారెనీ జగతి!

తనయుడేడని నీవు తలుపలేకున్నావొ,

నీ కల్పనల అలల తాకిడికి దడిచేవొ,

ఏకాంత సౌఖ్యమును ఛేధించు భేదమును,

ఎరుక జేసెడి వారలెందు దాచుంచావు?

ఎల్ల లెరుగని మురిపెమందించ గల నీవు,

ఏల ఈజగతిపై పెడమోములాయేవు?

ఆ దివ్య అంబుధిన ఈజగము కరిగించు,

జగమన్న చెరసాల చెలియలను సవరించు,

అద్దరన్నది నేడు ఇద్దరిగ నెలకొల్పు,

ఆర్తులని భక్తులని యోగులని వైరులని,

దీనులని హీనులని రాజులని యోధులని,

నీవు నాటిన తెరలు తొందరగ తరలించు!

నీదు ఊపిరి నుండి ఉదయించినీ జగతి,

నీదు ధిక్కారమును ఎటులోర్వగాగలదు?

ఏ నవ్య కల్పముల కల్పనల దేలేవో,

ఏ వైభవము తలచి ఈ రచన మరచేవు?

ఆదరము కరవైన ధరణి దుర్లభమాయె,

నీ సుఖము నందించు తరిని కనదాయె!

 

భ్రమ

శంభు పట్టపు రాణి పుట్టింటి జ్యోతి,

పాల్కడలి కన్నెగా పేరొంది నతివ

జనకునింటవ పెరిగి పురమేలు పడతి,

ఏమి తరుగని కనక కాంతి మెచ్చింది?

ఇంద్రియంబుల నొడిసి వైకుంఠు ధ్యాసలో,

తనువు కడదేర్చుకొను తపోధనులు,

ఇంద్రుడంపిన కాంత వంటి వొంపుల లోన

గోవిందు మించినే గుణము వలచారు?

రాగ రంజితమైన రసజగము నేలేటి,

అచ్చరల నర్తనల మునకలేసే వాడు,

నారచీరల నూను మునికాంత మోహమున,

మౌని వేషము నేల అమరినాడు?

భ్రమయె ఆధారముగ భ్రమియించు ఈ జగతి,

భ్రాంతి జాలపు ఒడుపు వింతగాదె!

విభవంబు వైభవము వెన్నంటు వారైన,

చలియించి విచలితులు అగుదు గాదె!

బుడత వాడను నేను బహు చిరుత వాడ,

బ్రతుకు బాటల నడచి బడలినాడ,

బహుదొడ్డ వారికే తరము గానీ భ్రమను,

గెలువగా నా తరమే తోయజాక్షా!

వైరభావన వీడి వెలిగించు నా యదను,

వైనముగ నీ మురళి మోహనముగా,

తనువు తీరము దాక తోడుండి కాపాడు,

భ్రమల భావన నన్ను బడయ కుండా!

సుందర కాండ – నా మాటల్లో

సుందర కాండ – నా మాటల్లో

శ్రీరామ భక్త హనుమాన్ కీ జై!

శ్రీరామచంద్ర ప్రభువుకీ జై!

శ్రీసీతా మాతాకీ  జై!

సుందరుండవు నీవు సుందరము చరితం!

శ్రీరామ కథమహిమ నెరిగించు చరితం!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

శీరామ భక్తుడ నీవు -అంజనా తనయా,

అవనిజను తనయుగా దరిజేరినావు!

సంకటము హరియింప సాటెవరు నీకు?

తప్పు లెన్నక నన్ను ఆదుకొను మయ్యా!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

వాలి వైరపు భీతి వెన్నాడుచున్నట్టి,

సూర్య నందను కొలువు నమ్మికగ జేసావు,

తగురీతి సమ్మతుల సమయమందిచ్చి,

పురుషోత్తముని పొందు నమరించినావు!

శ్రీరామ కథయందు అంకురించావు!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

పవనాత్మ నందనుగ దీవెనల బడసి,

పలు అస్త్ర శస్త్రముల శక్తిగొన్నావు,

దినకరుని శిష్యుగా విద్యనేర్చిన నీవు,

వినయ వైనముదెలియ ఋషి శాపమంది,

యశము గొనగా రామ బంటువైనావు!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

ధరణిజను జేరుమను రామాజ్ఞనంది,

ముద్రికను శిఖదురిమి పయనమైనావు,

అట్టి ఆనతి బలము మదిని తాడింప,

లంఘించి లంక కై రయమునురికావు,

లవణ సంద్రపు ఉరము దాటి నడిచావు!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

మురిపించు మైనాక శిఖర వైభవ శోభ,

మహా బిలమును బోలు వదనయౌ సురస,

యుక్తిశక్తుల క్రీడ సింహికను దాటీ,

లంక కాపరియైన లంఖిణిని దృంచి,

స్వామి కార్యము నెరప జొచ్చితివి లంక!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

పుర వైన వైభవము ఏమరక ఎరిగి,

శయన శాలల దిరిగి కాంతలను గాంచి,

కమలాక్షియగు సతిని కానంగ లేక,

విగత మానసమంది మరలు భావనలో,

శేఖరుడు చిలికించె చిగురు దిక్కులనూ!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

వనచారి యగు నీవు శోకమెరుగని వనిన,

శోకమందణిగున్న శోభనాంగిని గాంచి,

ఆదిశక్తిగ నమరు క్షీరాబ్ధి పుత్రీమె,

లోకమాతగు తరుణి శ్రీరాము మహిషి,

గురుతెరిగి శ్రీరాము కథ పలికినావు!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

ప్రాణేశు గాధ విని జానకీసతి మనసు,

రక్కసుల పెను మాయ అని సంశయింపగా,

ముద్రికను అర్పించి నిజ రూపమెరిగించి,

నర రూపమున నలుగు గాయత్రి నోదార్చి,

దుఃఖ హరునిగ నీవు యశము గొన్నావు!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

కాకాసురుని కథను సింధూర వైభవము,

సందేశముగ బడసి స్పూర్తి గొన్నావు,

రామదూతరిగె నని రావణుని కెరిగింప,

వానరుని వలెనీవు వనిని దృంచావు,

శరములంటని నీవు స్వామికై కట్టుబడి,

లంకేశు సుతువెంట తరళెళ్ళినావు!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

విధిని వర్జించగల వన్నె గలిగిన వాని,

వికట భావన వెరపు వెన్నాడు వాని,

తనయు శోకము విడచి తెలివెరుగు మంచు,

హితవు తెలుపగ నీవు తలచినావయ్యా,

సందియంబెరుగనీ శ్రీరాము చరితమును,

అసుర వీనుల కంప నుడివినావయ్యా!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

వాగ్దేవి వైభవము- వనజాక్షి మన్ననలు,

దశరధాత్మజు రక్ష – సురకార్య స్పూర్తి,

సర్వభక్షకు జిహ్వ నీదేహ మంటకే,

స్వర్ణలంకను చుట్టి చరియించెనయ్యా,

మండోదరీ పతికి చితిఛాయ మదిదోయ,

వైభవంబుల లంక క్షయరూపమొందె!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

సాటి వానర సఖుల సౌఖ్యమలరింప,

తన ఏలికకు ఘనత హెచ్చుగమరింప,

కుశల వార్తను వినగ వేచున్న దేవరకు,

సందియము పొడసూప సందీయకుండా,

‘కంటి’ నని పలికితివి స్ఫూర్తితో నీవు!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

శత్రు భంజనుడైన శత్రుఘ్ను నగ్రజుకు,

భవ బంధ హారియగు భరతాగ్రజునకు,

సకల లక్షణరూప లక్ష్మణాగ్రజునకు,

శోభనంబుగ పడతి కుశల వైనమును,

వినయమున దెలిపితివి విన్నపముగాను!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

 

పురుషోత్తముని శోక మణగించగల నీవు,

సీతమ్మ చింతలను దీర్పగలనీవు,

రామాజ్ఞగా జగము నడచేటి నీవు,

సాధ్యమెరుగని కార్య మెరుగగా గలవే?

చేయూతనందించు చింతలణగించు,

శాంతి సౌఖ్యము లిచ్చి మమ్ము నడిపించు!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

సుందరుండవు నీవు – సుందరము చరితం,

రామ కార్యము నెరపు నీ దివ్య చెరితం,

అనినంత వినినంత భావించి నంతా,

శాంతి విజయములిచ్చి రాముదయ నిచ్చి,

ఋషి రచన నుడివినా పూర్ణఫలమిచ్చి,

తుదిదాల తోడుండి నడిపించు మయ్యా!

శ్రీరామ జయ రామ – జయజయా రామా!

జయ జానకీ రమణ సాకేత ధామా!

నల్లనయ్యకు కొలుపు

 

 

 

!th

శిశిర ఛాయలు ఇచట చిత్రమమరాయి,

తరువు తరువును తాకి ముదిమిగొలిపాయి,

చిగురాకు కొక రంగు ముదురాకుకొక రంగు,

రంగవల్లులు జల్లి  చోద్యమొసగాయి!

ప్రతిరెమ్మ ప్రతిఆకు అమరున్నప్రతి నెలవు,

పసిమి ఛాయను పొంది పొంగిపోయేను,

వనకన్నె తనువుపై తనఉనికి తేజమును,

మణిహారముల మించి సొంపు గొలిపేను!

హరిత చేలము పైన మెరయు పసిమినిజూసి,

మోదమొందే కనుల వాకిళ్ళలో నడచి,

గురుతెరుంగనివారి మదినింపి మోదింప,

సరసుడని నీసతులు నుతియింపరని ఎరుగు!

పాలకడలిన బుట్టి పసిడి ఛాయనుగల్గి,

పదసేవతో నిన్ను మురిపించు సిరి ఛాయ,

మేనియందమరితే మురిసేవుగాబోలు,

నెమ్మదించిది గాంచు వనజాక్షి వంద్యా!

క్షీరసాగరపలల మధనమున విడివడిన,

వెన్నతరకలు కరిగి మేలిరంగుగ అమరి,

నీమేని వస్త్రమున అలదినా ఛాయలకు,

మెచ్చి మా ‘సిరి’ నిన్ను పీతాంబరుండనియె!

పాలసంద్రపు కన్నె వరుని కట్నంబైన,

ఛాయ మురిపెము నొసగ సహజ భావంబే!

నీవు మెచ్చిన పొడను మెచ్చు వారల యందు,

మన్ననను అమరుటయు నిక్క నియమంబే!

లచ్చి మెచ్చిన ఛాయ ఎందెందు గలిగినా,

మురిపెమన ముద్దాడి మోదాన దేలేవు!

వక్షమందున అమరు అలివేణి అంతరము,

ఆదరముగా నెరుగ ఆదమరతువో ఏమొ!

అహమొంది దుర్వాసు పాదమాన్చిన యంత,

ఒల్ల లేకానాడు నినుబాసి వెడలగా,

సిరుల కుప్పను జేర పడినపాటెటు బోయె?

తల్లి దీవెన లేక తరియింపగా తరమె!

పసుపు గడపలులేక పలుకు పద్యము లేక,

ముత్యమంతగు నేతి దీపకళికలు లేక,

కడుపు కుడిచెడి కుడుపు కూడగట్టెడి ఎచ్చు,

అహమొంది మోదింప ఆదిలక్ష్మెటులోప్పు?

పాలెంత తెలుపైన పాలకుండలు నలుపు,

పండు వెన్నెల పంచు నిశిరేయి నలుపు,

మెరుపు తీగలు అమరు కారుమబ్బులు నలుపు,

వెలుగు శోభల నమర ఆధారమౌ నలుపు!

నల్లనయ్యవు నీవు నగకన్య సైదోడు,

సిరిమెచ్చి చోటడిగి చెంత జేరిన ఉరము,

శృంగార మమరగా పూజ లందుక నీవు,

కమలాక్షి కనులలో కాపురము నుండు !