ప్రతిబింబము

పూజ భావమునీవు పూజయును నీవు,

పూజందునది నీవు- పూజించునది నీవు,

లోపముల జేయగా నేనెంత వాడనయ,

లోచనాత్మక నీవు యోచించ వేల?

భావమూలము నీవు భావంబుయును నీవు,

భరియింపగా నీవె భువికరిగె ననియేరు,

ఏటికరిగితి వీవు ఏరూపు నమరేవు,

భువి వాస మనుదినము భారమమరేను!

వరద హస్తుడ వీవు వరదుడవు నీవు,

వరములొందెద వీవు ఒసగెదవు నీవు,

వచన వాల్మీకమున వైవిధ్యముందనుచు,

వీగి విడనాడేవ వైరి మోహనుడా!

తనువొక్క తొడుగనీ తొలగిపోయేననీ,

తగులు వైనములన్ని తలపోయలేననీ,

తీరికెగిన నాడు తలచి తెలిసేననీ,

మురిపెమున మనలొకటి మూటగట్టావు!

నేటికీ ఆమనసు నాటిమాటలు విడదు,

మనసులో మరియేదొ మరుగున్నదని నీవు,

మరుగు మరుగున మసలి మరుగునుండేవు,

ఆడితప్పని వాని మాటవైభవ మిదా?

ఆటలెరుగని నాకు ఆనతిగ నిమ్మా!

జగము నెరపితి వీవు జగదంబ తోడుగా,

అడుగు జాడన జగము నడువ నెంచి,

ఏటికీ జగడంబు – జంట మేనుల తప్పు,

మరకగా మనసందు మనుపనేలా?

శుకుని గాంచిన జగతి శృంగార మమరునా?

నిను గాంచినంతనే అమరు నేలా?

నీదు పుతృడ నేను వైరి వైనము వీడు,

వెలుగొందు మొకమారు వెన్నదొంగా!

తోడు

నీలి నింగిన పాదమూనక-పరుగు తీసే మబ్బు కన్నెను,

తుంటరిగ తా నందుకొనగా -వెంబడించెను గాలి తరగలు,

పరుగు పరుగున వచ్చి చేరెడి-నదుల వేగము నదుపుజేసి,

సంతరించిన రాజసంబున – సంతసము గొని నొప్పుచుండగ,

మబ్బు కన్నెల మోముఛాయను-మద్దు జేసెడి సవ్వడులతో,

కెరటమైతన యదన మొలిచిన-ఊహ నందగ సందడించెను!

 

అదుపు జేయగనలవిగానా-ప్రౌఢ ఊహల సందడులతో,

తీరమందున తళుకులీనే- తేట నురుగుల హోసములతో,

నింగినేలెడి సూర్య చంద్రులు- పంచి ఇచ్చెడి  చెలిమితో,

ఎంతగా తా పరుగు తీసిన -దాటలేనా తీర రేఖలు,

నియతి నియమము నెరుగు మంచూ-నిలిచె నచ్చట ఠీవిగా!

 

అంతరంగపు అంబుధందున ఆదమరువని అలల లీలలు,

యదల లోతులు తరచి తరచీ వెలికి లాగెను వెఱ్ఱి ఊహను!

కనులు గాంచగలేని జగమిట పరచి యుందట ఎచ్చటో!

మచ్చటగ ఒక మారు నా కిట గోచరించద దెందుకో!

 

మున్ను పలికిరి మునివరేణ్యలు మౌన వాణిన ఎందరో,

సాహసించిరి ఎరుక జేయగ మూల పురుషుని మోహమున్,

హాయిగొలిపెడి శేష పాన్పున సేవ లందెడి సురవరేణ్యడు,

ఊసుబోవక సరస మాడుచు పలికెనట ఈ జగములు!

 

క్లేశమెరుగని కేశవుని మది గాంచ గలిగిన కల్పనా,

మోహనుండని పేరు గాంచిన మాధవుని యద స్పందనా,

హాసమే తన ఉనికిగా గల నంద నందను భావనా,

ఎన్నగా నేనెంత వాడను  వాని రచనను రయమునా!

 

వాని అందెల సందడులనే నాలకింపక బోయినా,

ముద్దుగారెడి వాని మురిపెము ఎరుక గాంచక బోయినా!

ఆదరించెడి ప్రేమ దృక్కుల ఉనికి స్ప్రుహ నే వీడినా!

నమ్మియుందును తెరుపు మరపున వానినే నే తోడుగా!

ఆహ్వానము

అంతరంగపు రంగమలికితి-భక్తి దీపము నందు బెట్టితి,

ఊహలల్లిన పట్టు పరుపులు-పరచి నీకై వేచియుంటిని,

భావ వీచిక విసనికఱ్ఱను – నీదు సేవకు సిద్ధపరచితి,

మునుపు నడిపిన మంద చేష్ఠలు-మనసుగా ఒక ఉనికి నెరపుక,

మాటిమాటికి నాటి ఊహలు-నేర్పుగా తలపందు చిలికెను,

వాటి వేడిని బాపుమంచు- వేడబోనని విన్నవింతును!

 

కరుణ కలిగిన వాడవంచు- మున్ను పలికితి రెందరెందరొ,

కారుణ్య భావపు ఛాయలందున- ఊర్పులను నే చేర్చబోవను!

సంచరించిన తావులెల్లన – సంతసంబును నింపువాడని,

సారహీనపు బ్రతుకు సీమన- సంచరింపగ నిన్ను వేడను!

ధర్మదేవత పాదమూనని- యుగమునందిట వాసముండగ,

పాలకడలిని వీడిరమ్మని- ఏనాడునేనిను కోరబోవను!

 

పుణ్యశీలుర పూర్వ పున్నెపు– పుంతగా భాసిల్లు వాడవు,

పుణికి పుచ్చుక నీదు పదములు-పంతమాడగ ఎంచ జాలను!

దుడుకు బాటల దిగుడు ఎగుడులు- మాకు నిక్కము బ్రతుకు బాటన,

నిర్మలంబౌ నీదు పదమును – ఏటికిట నే నూనగోరుదు?

ఎంద  రెందరొ ఎంచి ఎరిగిన – భావజాలపు భవ్య రూపము,

వేడ్కమీరగ మోదమొందుచు- సంచరింపగ నేను వేడెద,

నిక్కముగ నీ తేజరాసుల – లేశమేనా ఒడ్డ వేడను!

 

జగము నీదని నాడుపలికిన -పలుకులన్నీ ముద్దు పలుకులు,

కలియుగంబను కఠిన యుగమున-సంచరింపగ తలుప నేర్వకు,

వారిజాక్షికి వన్నె తరుగును- వరద హస్తము బడలిబోవును,

నెమ్మదించుము నీరజాక్షా- నిలకడెరుగుము నీదు తరిలో!

ఎన్నడైనా కరుణ గలిగిన- నీదు మన్నన మనుపు తీరుగ,

అంతరంగపు సీమలందున – అమరి నా జత నాదరింపుము!

రేరాజు తలపు

పగటి పరుగుల అలసి ఎరుపెక్కి సూరీడు,

పడమరను జేరాడు – సంధ్య సేవలనంద!

నీలి నీడలు పరచి కాషాయ చిలికించి

రేరాజు రాక కై అంబరము అమరింది!

కమలముల కొలనెల్ల కలల తేలుచునుండ

కలువ కన్నులనార్చి లోకమును జూసింది,

సందడిగ   హారతులు అర్పించు అర్చకులు,

మేళ తాళపు ధ్వనులు శుభము తెలిపాయి

 

మల్లెలును, జాజులును వింత సోయగమొంది

అత్తరుల పరిమళము తమసాటి రావంచు

కొలను జలముల పైన ఒరిగినా భారముకు,

అందంత పన్నీటి తరకలై తేలాయి!

హాయిగొలిపెడి వెలుగు నింగి అంచున నుండి,

పొంగి పొరలచు అవని యదపైన జారింది,

అలసటను మైమరచి జీవజాలములెల్ల

ఆ ఝరుల తేలుచూ ముదముగొన్నారు!

కొమ్మ కోనన నిలచి రేరాజు రాక కై

ఎదురు జూచెడి రేయి శృంగార మమరింది,

తళుకు చుక్కల రవికె తెలిమబ్బు పైట

శోభాన సవరించి అవని పై ఒరిగింది!

మంద గమనము మాని వేగరమ్మని పిలిచి,

నింగిపై తన చూపు స్థిరముగా నిలిపింది,

నెలవంక నగుమోము చిలికేటి సుధ కొరకు

ఎంతగా వేచెనో ఆ వింత పక్షి!                (చెకోర పక్షి)

మాధవుని వేణువును విడిచి సాగెడు గాలి

మధుర స్వరముల భార మెంత మోసెనొ గాని,

యమున అల లను అణచి అందణిగి యుండి,

కురియు సుధగ్రోలుటకు వేచి యుండేను!

ఏమరక ఈ ధరణి ప్రతి అణువునూ తాకి

తన ప్రేమ కిరణముల కణకణమునా నాటి

ఫాలాక్షు పలుకులను ప్రతి వారికందించి,

తార సరసన జేరు రేరాజు నుతియింతు!

బహు చంచలంబైన మనసు పగ్గములన్ని

ఒడిసి బట్టెడివాడు – ఓరిమెరుగని వాడు,

శంకరుని శిఖయందు ఒదిగి నిలచెడి వాడు

గౌరి శాపమునంది గ్రుంకేటి వాడు!

నేడింక గగనాన నడయాడగా వలెను

వేసారు మనసులన నీ సుధను చిలకించి,

వేద నాధుని సౌధ మమరింప వలెను,

వాణి తన వీణగొని భువికేగ వలెను!

శేఖరుని నుతియింప జగమాగ వలెను!

నీ జత

కలియుగంమ్ముల కాననంబులు

విచ్చు కత్తుల వింత పధములు

అడుగు అడుగున అంధకారము

ఆటంకమై దరి కానకుండిరి..

మోహజాలపు మెచ్చు మెరపులు

మదన వికృత మధువనంబులు

మరులు గొనినా మానసంబులు

మనుగడకు నోచక మరలుచుండిరి…

ఘోరకలియుగ ఘాతుకంబులు

మాయ జేసెడి ప్రమధ నాట్యము

ఘాతముల మనలేని మనసుల

నీ ఒడిన జేర్చుక ఊరడింపుము..

నా సుతుల నీ జత ఏమరింపకు…

చెలిమి జేయగరార !

ఆశలుడిగినవేళ ఆవేదనేగాని,

వేదసౌధపుజాడ తెలియనెరుగని వాడ

గమనమెరుగని కాల కఠిన కౌగిటచిక్కి,

కమలాక్షు కరముకై తలప నేర్వనివాడ

నిస్సహాయుడనైతి – నిన్నెందు కన నైతి,

ఏనాటికైన నేనోడ వలసినవాడ,

శరణంటి శరణంటి భద్రాద్రివాసా!

శరణు శరణనువారి – శరణు సాగర ఘోష

లజ్జతో అణగారు నా సన్న విన్నపము

నణచి వేయుచునుంది – అద్దరిని కనకుంది

కాలకుహరపు గతుల గనలేని వాడ

సోమశేఖరు నునికి ఊహకందని వాడ

శాంతి సౌధములోని శరద్చంద్రికమోము

కనులార గాంచగా పరితపించెడి వాడ!

భవబంధముల చెరన – యుగయుగంబులు గడచె

ఏనేరమున కిందు మసలు వాడనో ఎరుగ

అతిశయపు పంజరము – మోహమను సంకెళ్ళు

మాయధారొక ‘మనసు’ ఏమేమొ జేసెనని

చిత్రమౌ హింసలను – నా చరితలన్నాయి!

జగతి ప్రతి అంతరము నీ ఆనతౌతరిని

‘మనస’న్న దేరీతి – నీనెలవు గాకుంది?

ప్రేమరూపుడ వైన నీ చెలిమి చైలేక

నవరంధ్రముల నెలవు నేలాగొ నక్కినది,

వెర్రిదా ‘మనసే’దొ వింతపుంతల బోగ

నీ ఆనతదిగాద నేలాగు తలచేవు?

 

అన్యులను శరణంటినని కినుకనొందేవు

నీవుగాకన్యమీ జగమునెచ్చట గలదు?

వాసుదేవుడ వీవు వామనుడ వీవు

వైరియును నీవెగా విజయుండ వీవు

చిలిపి జెగడముమాని-మాయ ముసుగునువీడి

చెలిమి జేయగరార – మితిలేని వాడ!

నీమమత మైకమున నాసుతుల మరపించు

వారి మనముల మమతవై నీవు భాసించు!

చిరు పూజ మన్నించు

కడుపారడి బుచ్చు వాడు – కడు తెరగుల నడచువాడు

కంసునికై చరసాలన పసివాడై వెలసినాడు

సు-దర్శనమునా అసురుని బ్రోచి పుడమిగాచినాడు

తనువిచ్చిన తన తల్లికి సంతసంబు నొసగినాడు!

సురలోకపు సుఖములెల్ల తనయాజ్ఞను మీరకున్నా,

లోకాలన తన నామము త్రికాలముల విన నెంచి

నీనామము ద్రుంచనెంచు ఆ అసురుని బాపుటకై

స్తంభంబున వెలసినావు – సతీసుతుల బ్రోచినావు!

కైకశి పూజల బ్రోవగ – శ్రీరాముని వైనావు

గజాననుని తల్లికొరకు – పరమేశుని వైనావు

పరీక్షిత్తుని గాచి పాండు పక్షము నిలచి

పరమ ప్రేమను పంచి యశము గొన్నావు!

ఆ తల్లులకు సాటి నా పూజ లేపాటి,

ప్రేమ మూర్తివి నీవు, ప్రతి తల్లి మదినీవు

నాసుతుల స్మ్రుతిసీమ నేనాడు విడబోకు,

చైతన్యమూర్తివై  వారి  రూపున మసలు!

చిరు పూజ మన్నించు …చిద్విలాసా

 

కరుణ కురిపించుమో అచలాద్రి వాసా

పురిటికందును పరుల పంౘకంపిన తల్లి

పలు రక్కసుల బారి పడనున్న పసివాని

కావుమని వేడినా వసుదేవునిల్లాలి

కన్నీటి పూజలను కరుణగాచినవాడ!

కాననకు పయనమౌ పాండు పుత్రులజూచి

తల్లడిల్లిన తల్లి దిక్కుగానగ లేక

అలమటించుచు నిన్ను రక్షకై వేడగా

అడుగడుగునా వారి కండవై నిలిచావు!

నరాయణాయన్న నేరమునకా తండ్రి

పసివాని ప్రహ్లాదు పలు ఇడుములిడగా

లీలావతీ దేవి శోక విన్నపమంది

అణువణువునా వేచి ఆతల్లి గాచావు!

ఎందరో తల్లులను-ఎన్నెన్నొ వైనాల

యుగయుగంబులనుండి గాచు చున్నావు

వారందరికి నే సాటి గాకున్నా

తల్లినే నేగూడ- నను గావగా రారా!

నాతనయు రక్షించి-నీ ఉనికి జూపరా…

నిను వేడగా నాకు వేదాలురావాయె,

ఏదివ్య యజ్ఞములు నేజేయలేను,

నా కంటిలో నీరు నీపూజగా నెంచి,

కరుణ కురిపించుమో అచలాద్రి వాసా!

కూన

మన్నునాడిన పిన్నవాడిని- ప్రేమ మీరగ జేరదీసి,

మురిపెమున ముద్దాడు తల్లిని-ధరణి నిల్పిన వాడవే!

మార్దవంబును మరగు పరచుక మసలనేర్తువు ఏలనో!

పంకజంబున పదము మోపిన పరమ ప్రేమను మరతువా?

మోదమున నీవానతీయగ నీదు జాడను వీడి నే,

అరగినానిట నీదు మహిమను విన్నవింపగ ఇంపుగా,

వన్నెతరగని నీదు ఛాయల ఛాయనొందిట మసలగా,

ఆదమరచితి ఆటయందెటొ దారిమరచితి మరలగా!

కర్మ పంకపు కొలనులోనే పొరలుచుంటిని ప్రీతిగా,

ఎన్నగా నే నెరుగనైతిని కొలను సీమను దాటగా,

అందగా నే నెంచ నేర్వను మానసంబున ఏటికో,

తలపులో నీతోడు తలచిన దరిని జేరుదు నేటితో!

ఆటచాలని అక్కుజేర్చెడి తల్లిప్రేమను జూపగా,

కర్మ పంకిల మంటెనని నను జన్మదారుల త్రోయకే,

ఒడిని జేర్చుక ఆదరింపుము-మరలగా నే నేర్పుగా!

నిన్ను కానగ లేని కూనను- కరుణ గని నన్నేలుకో!

ఈశ్వరానుగ్రహ పాత్ర-మార్తాండ పుత్రా!

ప్రజలెల్ల సంతతని భావించినా రాజు

నియతి నియమమయ మార్చి వర్తింపగా పోర

దయగనా దశరధుని కృపజూచినావే!

బహు ఇడుములన్నలుని కావగా నెంచి,

రూపమే మరపించి – వాని చరితనుగాచి

విన్నవారికి నీదు కృప నిత్తునంటివే!

ఇది కలియుగంబనీ కడగండ్లయుగమనీ

నిలకడన్నది మదిని దరిజేర లేదనీ

ఎరుగున్న ఏలికవు రౌద్ర నేతృడవు!

దయతోన నీ దృష్టినేలాగొ సంధించి

నా తనయులన్నీవు కృపజూచి బ్రోవమో

ఈశ్వరానుగ్రహ పాత్ర-మార్తాండ పుత్రా!