ఇది అత్యాశ కాదు!

ప్రణవ నాదము నుండి – ప్రమధ నాదము వరకు

నాదించు నాదమై – పరమేశు మౌనమై ,

ముజ్జగమ్ములయందు – ముల్లోకముల యందు

నిండున్నవాని నే ననుదినము అర్ధింతు.

పాండు నందను తల్లి, పూజలన్మన్నించి

పలు విమర్శలకోర్చి – పలుధర్మముల నడిపి,

పాండవుల వెన్నంటి – కారడవులన్నడచి

సంతసంబందైన – సంతాపమందైన

చెలుడవై చెలిమిచ్చి – సఖుడవై లాలించి

ఏ దారి నడచినా – ఏ క్రతువు జేసినా,

జన్మ కారణ కార్య సాఫల్య మెందింప

సారధ్య మందించి, వారలన్బ్రో చావు!

నేడు నా పూజలను – ఆరీతి మన్నించి,

కల్కి సహజంబైన లోపముల కనకనే,

దరిజేర్చు దారిలో నా సుతుల నడపించు

వారంతరంగంపు రంగమును విడబోకు

ఆనందరూపుడౌ  నీ దివ్య హాసంబు

వారిమోములనుండి – పలుతెరంగుల పంచు!

నా పూజ మన్నించు….

ప్రేమ వీచిక

మరియ తనయుని తలపుతో!

అహంభావపు అద్దరందిన – రాచకొలువుల రొంపిలో,

మానవత్వము మంటగలసిన-మూర్ఖమానస సీమలో,

కరుణ బీజము అంకురింపగ-అవనికరిగెను బాలుడై,

తూర్పు రాజుల దీవెనందుక-గొఱ్ఱె పాకల రాజుయై!

కరకు గుండెల కాననంబున-ప్రేమ మొలకల నారు బోయగ,

తెలిపెతా నెన్నెన్నొ ఘటనలు-దీన జీవుల జీవనంబున,

బదులు కోరని ప్రేమ పంచుము-అన్నబోధకు క్రోధమొందిన,

రాచవారల కౄర గతులకు-తనువు బాపెను శిలవపై!

నేటికీ ఆనాటి నీడలు-ఏటికో భువినేలుచున్నవి,

కరుణ పేరున కరకు దారులు-మనిషి మనుగడ నేలుచున్నవి,

సాటివానికి తోడునిలువని-షుష్కబోధలు సాగనంపిక,

ఎంచుకొండొక ప్రేమవీచిక-పంచి నడువగ జగతిలో!

ద్వైత శాంతి

చావు పుట్టుక లేక చాంచల్యమే లేక,

నిత్య చైతన్యమౌ నీయందు లీనమై,

నీసాటి వాడనని-నిను చిన్నజైలేను,

అండాండముల యందు అంకురపు రూపమై,

బ్రహ్మాండములలోన ఆబ్రహ్మతేజమై,

వ్యాపించు జగమందు వ్యాపించువాడవై,

చరియించు చరితలలొ చాంచల్య యోగమై,

వెలుగు జిమ్మెడి జగతి వెలుగు కారణమై,

అంధకారములోని అంధత్వ బీజమై,

వెలయు వాడవునీవు వెలుగొందు వాడవు!

తుదిలేని నీరూపు తనువుతో కనలేక,

కనులార నినుకనగ నేనెందు నెలవొందు?

ప్రేమాంతరంగుడవు-దాక్షిణ్య రూపుడవు,

నాచిన్ని ఊహలో అనునిత్యముదయించు,

అనురాగ రూపుడై నాసుతుల మది నిండు!

నిజరూప మెరిగించు!

చరాచర జగతిలో చాంచల్యమై నిండి ,

అచలత్వమును బోలు చలనమై వ్యాపించి,

మునిజనుల మానసము నటభూమి జేసికొని,

వింత సంకల్పముల రూపముల నెలకొల్పి,

ఏమెరింగింపగా ఆతురుత నొందేవు?

ఎవని కెరిగించుటకు కణకణము కదిలేవు?

పగలు రేయొక పేట, ప్రతి ఊపిరొక పేట,

నేసి చేసిన జగము మరపు తెరపుల తాను,

భావముల రంగులను ఊహ విన్యాసముల,

యుగయుగంబుల నుండి జిలిబిలిగ నింపేవు,

ఏబొమ్మ నాశించి ఇంతశ్రమజేసేవు?

ఎవరి వేడుక కోరి ఈలీల జేసేవు?

అణువణువునొక బొమ్మ అందముగ అమరించి,

బొమ్మబొమ్మన నీవె జీవమై వ్యాపించి,

జీవి ప్రతి కదలికకు ఒక ఛాయ నందించి,

ఛాయ ఛాయకు జీవి ఛాయ తరుగగ జేసి,

ఏ తంత్రమును నీవు ఛేదించ నెంచేవు?

ఎవని కేమెరిగింప ఈ రచన జేసేవు?

నిర్మలుడవై నీవు నిశ్చలత్వము నొంది,

కల్పనల కదలికలు కనుదోయిలో నింపి ,

కల్పకల్పము లాయె కల్లోల జగమాయె,

నేటికిక నీ ఊహ వేటలను మానుకొని,

నిజరూప లావణ్య మొంది మనరాదా!

ఆట విడుపుగ ఆడ జగము జేరిన ఛాయ,

జగమందు ఛాయగొని తన ఉనికి మరచింది,

నందగోకులమందు విందు జేసెడి నిన్ను,

తన సాటిగా ఎంచి ఆటపాటల దేల,

మోదమొందుట నీకు పాడిగాదనెరుగు,

మాయమోహముబాపి నిజరూపమెరిగించు!

 

Master CVV… స్మరణతో

కుంభునభిషేకముల నెంతగా జేసితివొ- భూమి భారము నీవెంతగా నెంచితివొ,

భావమందిన పరమ గురువులు  –   వేగ పడగా నేల నెంచిరో,

తోక చుక్కను వాహనము గొని – తరలి వేగమే జేరినారు!

శక్తిపాతపు వేగమందిన వాణి వైనము తెలియగా,

పురములన్నీ చేరి చూచెను నీదు తనువట పొంగగా!

నాటి శంకరుడందుకొన్నా గంగ గతులను బోలుచూ,

భువికి తరలిన అమర వాహిని వైనమని వారెంచిరో!

అమర వాహిని నదుపు జేసి, మందిలో అది పంచు తలపున,

ఎన్నుకొంటివి ఉభయ సంధ్యల ఆరు గంటలు  వేళగా,

సులభమౌ మూడక్షరంబులు పలికినంతనె తీరుగా,

పంచి ఇత్తువు  పరమవాహిని పదిల మొందగ బొందిలో!

లాఘవంబుగ నీదు కరుణను-పొందిరెందరో ముందుగా,

ఈతి బాధల ఈదులాటన- నీదు తోడును మెండుగా!

అక్షరంబులు పలికినంతనె- అంది వచ్చెడి వైభవం,

ఎరుక జేసిరి ఎల్ల జనులకు- కొల్లగొట్టరె కుంభరాశని!

నియమపాలన నెరుగలేనొక-నీరసించిన నీచజీవిని,

కరుణతో నీ నియమ రేఖను – ఎల్ల లెంచక పెంచరాదా,

పిలచి నంతనే పలికి నంతనే – నీదు నీయమము చెల్లునా?

ఎటులనో ఒక దారిజూచిక –  నన్ను  నీ దరి  జేర్చరాదా?

శ్రీ శ్రీ రామకిృష్ణ పరమహంస స్మరణతో…

పుఱ్ఱెమాలలు రుధిర ధారలు – ఎన్నడెరుగని ఆయుధంబులు,

భీతిగొలిపెడి మేని ఛాయతొ – విచ్చుకున్నా కేశములతో,

నీకు రక్షగ వుంటి నేనక – బీతి చెందకు చిన్నకన్నా!

అన్న మాతకు ముద్దు బిడ్డడు – గదాధరుడట జన్మనామము!

పసిమనస్సును పదిల పరచుక – ప్రౌఢయైనా, ముదుసలైనా,

ఎన్నగా అది వాసమంచు – దేహ చింతన ఎంచనేర్వక,

చేరవచ్చిన ధర్మపత్నికి – దరి జేరు దారిని ఎరుకపరచి,

ఆలు మగలను బంధమునకో- అద్వైత భావమునెరుక జేసి,

వన్నెకెక్కిన సాధు సంతుడు!

నీరసించిన యువ మనస్సుల – నిస్తేజ భావపు నీలినీడలు,

నాస్తికత్వపు నాయకత్వము – నరికి వేసిన ఆత్మతత్వము,

నుద్ధరించగ భువికి తరలిన -రుద్రునంశకు తావునిచ్చిన,

నరేంద్రుడన్నొక ప్రౌఢ శక్తికి- రామ-కిృష్ణుల సాక్షి నిచ్చిన,

మాన్య మూర్తగు యోగి ఈతడు!

తనువు నెంతటి తాపమున్నా- తల్లి ప్రేమను పిన్న జేయక,

తల్లడిల్లెడి క్షణములన్నీ – తనువునొప్పుటె పాడియంచు,

నమ్మికందున నేర్వ వలసిన- తీరు తెన్నుల తెలియపరచిక,

అర్పణను తానెరుక జేసిన- గురు పద్ధంబున సాధుమూర్తి!

జన్మజన్మల గొలుసు దారులు-పేర్చి చేర్చిన మనోఛాయలు,

తొలగ జేయగ తరలు వారలు-తెలసి జేరిరి వాని దారులు,

అందిరెన్నో ఆత్మబోధలు – ఆతురుతగల నమ్రజీవులు,

వారలందరి మనోవీధుల – వైభవించెడి రామ-కిృష్ణుని,

వేడుకొందము నేటి నాడిక – తనువు కార్యము తీరగా!

ఆర్త రక్షకుడు

గురు సేవకై జనెడి శిష్యునాత్రత యందు – అమరున్న అర్పణను ఎరిగియా బహురూపి,

అడుగు అడుగున పద్మముదయింప జేసి – ఆర్త రక్షణ యందు తన నిష్ఠనెరిగించె!

 

అర్చకుని ఆనతులు వేద వాక్యమనెంచి – ఫాలాక్షు నర్చనకు గోక్షీరమును జేర్చ,

పరవళ్ళ నది అలన పాదమును మోపగా- సలిలముకు సమతుల్య తందించి వాడు

ఆర్త రక్షణ యందు తన నిష్ఠనెరిగించె!

 

ధరణీశు దేహమున జొచ్చి చెరియించి – శృంగార శాస్త్రమును నేర్చు తీరునయుండ,

సర్వభక్షుని వశము అగుచున్న దేహమును – కావుమంచూ వేడ విజయంబు జేసి,

ఆర్త రక్షణ యందు తన నిష్ఠనెరిగించె!

 

ముని మృకుండుడు ‘వాని’ మనసార వేడగా – మన్నించి ఇచ్చినా ముద్దు బాలుడు ‘వాని’,

కాలు జాలము నుండి కావుమని వేడగా- ఆ తప్త హృదయంపు స్పందనకు స్పందించి,

ఆర్త రక్షణ యందు తన నిష్ఠనెరిగించె!

 

పాండవులు ఒడ్డిరని, కౌరవులు గెలిచిరని – తన కేశములు బట్టి కురు సభకు ఈడ్వగా,

ధర్మసంకట మంచు తలను వాల్చిన పతులు- తన రక్షకులు గారు, కావుమీశ్వర యనగ,

నిత్యమౌ వలువలను కొల్లకొల్లగ నిచ్చి – ఆర్త రక్షణ యందు తన నిష్ఠనెరిగించె!

 

అతిధి సేవల కన్న వ్రతనియమమే మిన్న – అని ఎంచినా రాజు మదమణచగా నెంచి,

తపో మహిమను జూపు ఆవేశ మణచగా – ముల్లోకములు త్రిప్పి వెంటాడి వేధించి,

ఆర్త రక్షణ యందు తన నిష్ఠనెరిగించె!

 

అన్నార్తులంచు ‘తన’ భక్తునింటన జేరి – నగుబాటు జేయగా నెంచు వారల జూచి,

ఆత్మార్పణే కలిమి అది లేక లేమంచు – వాత్సల్యమున జేరి ఆహార మందించి,

ఆర్త రక్షణ యందు తన నిష్ఠనెరిగించె!

 

సూర్యవంశపు కీర్తి గ్రహణ మందును యంచు – వంశాంకురము నిచ్చు వనిత నడవికి పంప,

ఖిన్నయైనా పడతి ఆత్మఘోషకు కదలి – తపోవనముల జేర్చి, ధరణి సుతనోదార్చి,

ఆర్త రక్షణ యందు తన నిష్ఠనెరిగించె!

 

నోరార ‘రంగ’యని ఆలపించిన వాని – ఇడుము లన్నియు ‘తాను’ రక్తితో భోగించి,

ఎన్నెన్నొ రూపముల పలు నటనములనాడి- భక్త వత్సలు డన్న ఒక కీర్తి బడయుటకు,

ఆర్త రక్షణ యందు తన నిష్ఠనెరిగించె!

 

పలు నామముల యందు, పలు రూపముల యందు- భావములు ఉదయించు ఆత్మ ధామము నందు,

పంచ భూతములందు, ప్రతి అణువు నందూ – పొంచుండి పలుకుటకు పాటు పడనేలా?

 

 

ఆర్త రక్షకుడ వీవు, ఆర్తుడవు నీవు – ధూర్తులకు, ఆర్తులకు, చలన రహితులకూ,

కర్తయును భర్తయును భోక్తయును గావా?- కల్మషంబును నీవు, కరుణయును నీవు,

ఎరుగు వాడవు నీవు, ఎరికయును నీవు – ఎవరి మురిపెము గోరి నిష్ఠనెరిగించేవు?

స్తుతి యందు సంతసము నేల నొందేవు?

 

నందు నింటన ఆడి, గోప బాలుర బ్రోచి – సూర్య వంశము బుట్టి, వనములన్ చరియించి,

మశ్చమై, కూర్మమై, మరి ఎన్నొ రూపముల – యుగమునందొక మారు మసిలితే ఏమౌను?

ఎవని ఆనతులెంచి ఈ వ్యధలు ఉదయించె?- నీవెరుగగా లేని ఆధామ మెటనుండె?

ఎందుకీ నాటకము? ఏటికీ బూటకము? – నీదివ్య సంగమును ఎంచేల కూర్చేవు?

 

యగ ధర్మమున నలిగి మనలేని మనసులను – యుగయుగంబులు గడచి ఉనికి మరచిన వాని,

ప్రేమ మీరగ జేరి లాలించి బ్రోచితే – చిన్నతనమది గాదు ఫాలాక్ష వంద్యా!

రామా-శ్యామా

దశరధింటన రాకుమారుగ- పొందినా వైభవము లేదని,

వెంట నడచెడి మంగళాక్షికి- వసతియౌ వనసీమ లేదని,

బంటుగా నీ ఆనతందగ- పవన పుత్రుని జాడ లేదని,

కలియుగం బను కాననంబున నీకు దీటగు తావు లేదని,

కినుకగాంచకు మంగళాంగా-నెమ్మదించిట చూపు నాటుము!

చింకిపాతల పరుపువైచెద-లాలి పాటల లాలనిచ్చెద

నీదు కల్పిత జవమునందున- కల్పనకు లోటేమి లేదిట,

కంప్యూటరన్నొక యంత్రమున్నది-నీకు నచ్చినవన్ని జూపును,

నీదు దీవెన మన్ననలచే- బంటు ఆయెను వన చరంబు,

అట్టి కరుణను చిలకరించిట- నన్నునీకొక బంటుజేసుకొ!

నందునింటన అందుకున్నా- గోపకాంతల ప్రేమలేదని,

అవధులెరుగని గోపబాలుర- అటపాటల సందడేదని,

చాటుమాటుగ సరసమాడగ- చల్ల చిలికెడి వనితలేరని,

నాదినాదని వాదులాడే వెఱ్ఱిమూకల వాసమందున,

జొచ్చగా ఒక సాకులేదని – దూరమేగకు దారిజూడుము!

వన్నెవన్నెల ఊహలతొ నీకందమగు వనమాలనిచ్చెద,

కలికవాతుకు సోలిపోయిన పసిమనస్సుల తోడునిచ్చెద,

నీదు లీల లు  నెరపగా నా  మానసంబను కాన నిచ్చెద,

ఎన్నగా ఎన్నెన్నొ మృగములు యుగములై అట ఏలుచున్నవి,

మురళితో లాలించి వానిని నీదు వనిలో మెలగ జేయుము!

ఎన్నడో నీవాడినట్టీ చింకి మనసిట వేచియున్నది,

నీవు పంపిన వారమంటూ ఎందరో ఇటజేరినారు,

వారి వారల వారి ఛాయలు నింపి నామది నేలినారు,

నీలినీడల మందలై  పలు వ్యాపకంబుల వ్రేల్చినారు,

బూటకంబగు నాటకంబుల నడిపి నన్నిట జేర్చినారు!

వెలుగు కిరణపు వాహనముపై- వేగమే నా మదిని జేరు,

ధూర్తమగు నా మనసునేలెడి వారినికనువ్వ్ మట్టుబెట్టు,

వైరి వైరుల వైరివౌనీ విశ్వరూపపు మధుర ఛాయలు,

వ్యాపించువైనము వెలుగు జూసెడి జాడ నాయెద కుమ్మరించు,

ఎల్ల లెరుగని మౌనమధురిమ మానసంబున అక్షయించు!

రమణ మహర్షి

మౌనముని రమణునికి- ఒక పలుకు మాల!

రమా రమణ యని రమణుని తలపరె-రమ్యమైన ఆ మర్మము తెలియరె!

వేంకటరమణను దేహము జొచ్చిన – దివ్యతేజమును మదిలో నెంచరె!

అచలమౌ అరుణగిరి నెరపినా చేతనకు – స్పందించి ఇలు విడచి ఆ వొడిని చేరుకుని,

తనలోని ఈశ్వరుని సాన్నిధ్య సౌఖ్యమున- తనువు మరచిన బాలుడాయె రమణుండు!

రమా రమణ యని రమణుని తలపరె-రమ్యమైన ఆ మర్మము తెలియరె!

వేంకటరమణను దేహము జొచ్చిన – దివ్యతేజమును మదిలో నెంచరె!

తనువులో నెలకొన్న తరళాక్షు సన్నిధిన – మౌనధ్యానమెగాని మంత్ర నాదము తప్పు,

ప్రతి యోచనకు రూపు పరమాత్ముడని ఎంచి- బ్రతుకు బాటన పెదవి కదిలించనా యోగి!

రమా రమణ యని రమణుని తలపరె-రమ్యమైన ఆ మర్మము తెలియరె!

వేంకటరమణను దేహము జొచ్చిన – దివ్యతేజమును మదిలో నెంచరె!

దత్తాత్రెయుని బోలు మౌన భాష్యములు – పిన్న వారల కొరకు చేవ్రాత బోధలు,

అనుదినము క్రమమైన గిరి ప్రదక్షిణలు – అందవచ్చిన వారి ఆకలిని దీర్చెనట!

రమా రమణ యని రమణుని తలపరె-రమ్యమైన ఆ మర్మము తెలియరె!

వేంకటరమణను దేహము జొచ్చిన – దివ్యతేజమును మదిలో నెంచరె!

చిన్న నాడే తనువు క్రిమిమీటకము కిచ్చి- నేనన్న నేనులో మోదించినా మూర్తి,

తనువుపై శ స్త్రమును గుర్తెరుగకే మసలి- తాను నేనేగాని తనువుగాదని తెలిపె!

రమా రమణ యని రమణుని తలపరె-రమ్యమైన ఆ మర్మము తెలియరె!

వేంకటరమణను దేహము జొచ్చిన – దివ్యతేజమును మదిలో నెంచరె!

విశ్వమందీ ఆట ఆడితే అది వేట – మౌనమొందుటె మేలు పలుకుతో పనిలేదు,

నేనన్న ప్రతినేను ఎలుగెత్తి చాటేటి – ఎరుక నెరుగుట కొరకు మాట విడుమన్నాడు!

రమా రమణ యని రమణుని తలపరె-రమ్యమైన ఆ మర్మము తెలియరె!

వేంకటరమణను దేహము జొచ్చిన – దివ్యతేజమును మదిలో నెంచరె!

ఆదివ్య సందేశ మెరిగి మనలెడివారు – స్థిరమైన చిత్తమున రమణుగాంచెడి వారు,

జగన్నాటకమందు సాక్షులై వర్తించి- నేనెవరననువారి తోడీయగలవారు!

అట్టి రమణుల మీరు ఎంచి చేరండి – రమ్యమైనామర్మ మెరిగి మసలండి!

రమా రమణ యని రమణుని తలపరె-రమ్యమైన ఆ మర్మము తెలియరె!

వేంకటరమణను దేహము జొచ్చిన – దివ్యతేజమును మదిలో నెంచరె!

గురుపూర్ణిమ కొక పువ్వు

పరమహంస యోగానంద పాదములకు భక్తితో…………..

ముకుందుడుగా ధరణి జేరిన యోగబాలుని కధను వినరే!

వేగవేగమె మీదు సంచిత గ్రహణ వైనము తెలసికొనరే!

లాహిరీగురు శిష్యులకు తా ముద్దుపాపగ మొలచినాడు,

                  మంచు కొండల వాసమందున వెదకబోయిన దివ్య సారధి,

                  యుగయుగంబుల ఎడము దాటుక యుక్తేశుడై దరి జేరినాడు!

ముకుందుడుగా ధరణి జేరిన యోగబాలుని కధను వినరే!

వేగవేగమె మీదు సంచిత గ్రహణ వైనము తెలసికొనరే!

వాసనలతో, వన చరమతో మోదమొందెడి వారి వైనము,

                జోడు మేనుల తపోమూర్తులు-ఆకలెరుగని జీవ మూర్తులు,

               తలచినంతనె తరలిపోగల శక్తి యుక్తుల సార్వభౌములు,

               సాధకులమని చాటిచెప్పిన వారలందరి సరస జేరి,

               వారెరింగిన వేదమూలము వెన్నులో తా పదిల పరచె!

ముకుందుడుగా ధరణి జేరిన యోగబాలుని కధను వినరే!

వేగవేగమె మీదు సంచిత గ్రహణ వైనము తెలసికొనరే!

జగన్మాతను తల్లిగా గని – తోటి యోగుల తోడుగా గొని,

                జగన్నాధుని సిరులరాశికి వారసుడనని-బడసెతా నన్న అజ్ఞను,

                గురు పదంబే ఆశ్రయముగా కఠిన పధముల నడచినాడు!

ముకుందుడుగా ధరణి జేరిన యోగబాలుని కధను వినరే!

వేగవేగమె మీదు సంచిత గ్రహణ వైనము తెలసికొనరే!

సన్యాసినైనా న్యాసినేనని- తోడబుట్టిన సంతతికి తా,

                వెలుగు బాటను తెలియజేయుచు- తల్లి ఋణమును చెల్లజేసి,

                బహుళ యోగుల ఆనతులచే -గంగ నడచిన తావు విడచి,

               యోగక్రియ నెరిగించు తరిలో ఖండాంతరమ్ముల బ్రతుకు గడిపి,

               తనువు రాలేవరకు తా- తన విధులు నెరిపిన మాన్యమూర్తి!

ముకుందుడుగా ధరణి జేరిన యోగబాలుని కధను వినరే!

వేగవేగమె మీదు సంచిత గ్రహణ వైనము తెలసికొనరే!

నేటివారల భాగ్యమేమో అందుకొంటిరి ‘ఆత్మకధ’ను,

                 వేల జన్మల కఠిన శ్రమలను సునిశితముగా మరువజేసే,

                 క్రియను బొందిన పుణ్యమూర్తులు-యోగిమానస శిష్యసంతతి,

                 వారు నడెచెడి వనములందున- నడచువారలె భాగ్యరాసులు,

                 వేగపడి మీ మానసంబున – వారి చెలిమిని చేరనిండు!

ముకుందుడుగా ధరణి జేరిన యోగబాలుని కధను వినరే!

వేగవేగమె మీదు సంచిత గ్రహణ వైనము తెలసికొనరే!