







పూజించి సేవించి కీర్తించు వారలను,
భూరి కూరిమి నిచ్చి బ్రోవగా నెరుగుదుము!
ఇది ఏమి వింతయ్య – జోలెగట్టుక నీవు,
భిక్ష గొని భోగముల పట్ట గట్టేవు!
పెనిమిటని ప్రేమతో పిండి వంటల విందు,
ఆరగింపుగ నీకు అమరించి పిలిచితే,
ముష్టివాడిగ నీవు ముంగిటిన నిలచుండి,
అర్ధించి అందునా అన్న కబళపు బదులు,
‘అన్నపూర్ణ’గ తల్లి నెరిగింపు జేసితివి!
బుడత బాపడటంచు భూసురుడు కొనియాడి,
యాగశాలన నిన్ను పలురీతులర్చింప,
దాన మడిగిన అడుగు మడుగుగా ఉప్పొంగ,
నిత్యసాయిద్య మిడి – బ్రహ్మ పదవిచ్చీ,
దానవాగ్రజు దనుజు బ్రోచినావయ్యా!
పసితనము విడివడని శంకరునిగా నీవు,
పరశురాముని భూమి యశము గాంచంగా,
అమలకపు భిక్షగొని వైష్ణవిని కీర్తించి,
కనక వృష్టిని ఒసగి గాచితివి గాదా!
నందగోకుల మందు నటియించు కాలమున,
గోపకాంతల ఇండ్ల వెన్న ముంతల దోచి,
అమర వాసులు కనగ వేచియుండెది నగవు,
కొసరి కొసరందించి వారి కర్మల ద్రుంచి,
సామీప్య సౌరభము వెంటాడి గూర్చితివి!
ముడుపుగా అందీయ కట్టి నటుకుల మూట,
మారాముగా జేరి అడిగి అందిన నీవు,
సిరి ఆపు తరి వరకు కలిమినొడ్డితి వయ్య!
మదినెంచ వలెగాని – వెనుకంజ లేదాయె!
దేహి దేహీ యంచు ఇల్లిల్లు తిరుగుచూ,
పిడికెడైనా చాలు – పిన్నతన మది గాదు,
ఉన్నదానిలొ కొంత పంచీయ మని జెప్పి,
కాపు లేనీ కలిన కపుదల నొసగుచూ,
చేయూతగా నీవు షిరిడిలో వెలిశావు!
దీనత్వమున మునిగి – దిక్కుదోచని సుతుని,
సాధు వేషము గట్టి – దరి జేరి చైజాచి,
దక్షిణను గ్రహియించి – గీత చేతన బెట్టి,
మిన్నకుందువా సామి? మమ్ము మదినెంచు!


