దాగున్న దొంగ

కంటి మాటున దాగి కలలు  రేపిన వాడ,

కనులు కంచికి పంపి కదలి ఓస్తిని నేడు

నాడు మరుగున నిలిచి మరులు  గొలిపినవాడ

మరుగేల నోయింక ముదమొంద గాను !!

సారహీనపు జగతి సంచారమున అలసి,

తోడు ఆడినవారు తొలగిపోయారంచు ,

మాట కలిపినవారు మౌనమొందారంచు

దిక్కు నివేయంచు దరిన  జేరినవారు ,

దిక్కు కొకరుగ తరలి వీడిపోయారంచు ,

విసిగి వేసారిటుగ వస్తినని అనుకోకు ,

దొంగాట వేటలో దొరకకుండిన నిన్ను

పట్టి పండెడు బాట పట్టి నేనిటువోస్తి!!

పలుకులో దాగుండి పలుమారు వినిపించి ,

వీనులందున కరిగి వివరములు నెఱిగించి ,

వీగిపోయేడి  నిన్ను వెదుక నేనిటువోస్తి!

మచ్చ మర్మము లేక ఒంపు ఒంకర లేక,

గుణము గురుతులు లేక ఆద్యంతములు లేక

కదలికల వంపులకు తగిన స్పందన యగుచు

సందేశ భావనకు తగిన వాహకమగుచు

పవన పల్లకి నెక్కి పలు వినులంజేరి

సందేశ భవనాలు కుశలతన ఎరిగించి

రూప రస గంధాల ఛాయనొల్లని నీవు ,

మాటు జేరిన చోటు ఎరిగి పండగ నేను

మాటు విడి వొస్తినిటు వేటాడగా నిన్ను!

పాలసంద్రపుటలల పెట్టె మంచము పైన,

కుదురెఱుంగని నాగు ఉరముపైన  ,

మాగన్ను మగతలో కలల తేలెడివాడు

కనుగొన్న కలలోన రూపుగట్టిన జగతి

కుమ్మరించెడి రంగు లెరిగించగా నీవు,

రెప్ప మాటునే  దాగి చిత్రముల నెఱిగించ ,

విస్తుబోతిని నాడు నీ  ఉనికి  ఏమంచు ,

రెప్ప వాలిననాడు వీగిపోయిన ఉనికి

కనికట్టు కథలన్ని ఎరుగ నేనిటు ఓస్తి !!

గురుతు  తెలియని  గుబులు  గుండె నాడుల నడువ

ఆటు పోటుల ఆట తనువంత ఆడంగ

వల్లమాలిన భావ పుంతలేవో పొంగి

చేతలై చేతనము బ్రతుకంత నింపంగ,

నిలువరించగ లేని నిస్సహాయత పొంగి

క్రుంగదీసిన నాడు చెల్లు చేతన నొంది ,

తొలగు వెలుగుల వెంట పరుగులందగ లేక ,

చేరు చీకటి పొరల పొరలి ఒరగక లేక ,                                               

తల్లడిల్లెడి ఊహ ఉయ్యాల ఊపులను ,

నిలువరింపగ లేని తనువు తూలిననాడు ,

తొందరొందిట నీదు గురుతు తెలియగ ఓస్తి !!

కంటి మాటున గుండె మాటున -మాట నడిచెడి బాట మాటున

మాటు వేసిటు ఆటలాడిన – వేట నీవని వెదుక ఓస్తిని !!

అలుపు అలసట నెరుగవైతివి – ఆట నియమము నొల్లనైతివి ,

ముసుగులో నను మూటగట్టిన నాటి బాసలు తెలియవైతివి ,

పిన్నవాడని గెలువారాదని తొండి బాటలు నడువరాదయ!

చూపే కన్నులుకగ – ఉనికే ఊపిరి కాగ-

నాదమై నా మాట దిశలు దిక్కులు మ్రోగ ,

రూపు బాసిన నాకు నీ రూపు నెరిగించు,

జతగట్టి జగమంత నీ ఉనికి నెరిగించు !!

మరుగు జాడ

మించిపోయెను తరుణమని నను – తొలగియుండు మనందువా?
నిలకడెరుగని తరుణి తరుణము – తోడు నడువదు జగమున!!
జాణతనమున జాడ తెలుపదు తాను తరలెడి తీరులు !
ఒంటరైతిని ఎరుగనైతిని నీదు తెరువుల త్రోవను !

అలసి సోలిన లోకముల తన లాలనందున లయముజేయుచు ,

ఆదమరువగ జేసి అలసిన తనువులలసట తొలగ జేయుచు

మాటునే తన ఉనికి నుంచుచు మనుగడల గమనంబు కూర్చుచు ,

ఒంటి చక్రపు రథముపైనిటు చేరవచ్చెడి భానుతోడుగ,

ఆడుకోండని ఆదమరపును అదుపుజేసెడి అతివ ఉనికెపుడెరుగనైతిని!

లేత అరుణిమలద్ది అల్లిన మెరుపు నూలుల  వలువ సొంపులు ,

తళుకు తనువుకు తొలకరుల పులకింత పుంతల నూత్నశోభలు ,

అమరజేయగనల్లి – అమరుని ఆనతుల తన వెంట నిడుకొని ,

ఎంచి ఎంపికజేసి జీవుల యోచనల దిశ దశను తెలుపగా ,

తరలి వొచ్చెడి ఉషకు ఊపిరులూదు వారల నెరుగనైతిని !!

తల్లి తండ్రియు అన్న చెల్లియు ఆదరించిన బంధు బంధులు,

నిన్నే నమ్మితి నీవే తోడని జంటజేరిన ఆలీ సంతులు,

కూడబెట్టిన కూరిమంతయు కొల్లగొట్టిన సాటివారలు ,

తరుణమేదో తలచి తొలగిరి తగిన వాదము నందజేసిరి ,

తొలగు తలుపును జేరనీయని నీడ మూలము నెరుగనైతిని !

ఉలుకు పలుకులు వీడి వెంటనే జంటగా నీవుంటివందురు ,

పలుకు పలుకున నాదమై నా పలుకు పల్లకి వగుదువందురు,

కంటిపాపల కదిలికన కొలువుండి సకలము తెలుపువందురు,

దేహనాడుల స్పందనొందగ స్ఫూర్తినేదో కూర్తువందురు,

కుడిపి కూరిమి ఊరడించని నీదు నియతిని ఎరుగనైతిని ||

తొందరొందిటు తరలి ఓస్తిని తగిన త్రోవల నెరుగనైతిని ,

కటిక దారులు కాళ రాత్రులు కరుగకున్నవి తోలుగకున్నవి

భీతి భయములు భుజములై నను దీనదశలన మెలుగుమన్నవి,

దీనతే ఈ దేహ ఫలమని దుఃఖములు నను ముసురుచున్నవి,

ఏది దారని ఏది దిక్కని ఎరుక నెరుగగా ఎరుగనైతిని !

చతురడవు నీ చరిత చతురము చేరదీయుము నీదు ఊహను,

ఊరటెరుగక ఉలికి పడుచూ చెదిరి బెదిరిన నీదు ఊహను ,

మాట మాటున కంటి మాటున మనసు మాటున తొలగివుంటే

తెలిసికొని నిను తగిలి గెలిచెడి తెలివి లో నేనెరుగనైతిని

చెదిరి చితికిన  నీదు ఊహను చేదు నిజమిది తెలియుమా!

మాటు మరుగులు మాని రయమున మన్ననెంచర మోహనా

కనులు వీనులు కరములును నిను తనివితీరగ తెలియగా

తెలియజేయుము తేట తెరపిన నీదు తావుల  త్రోవను ,

తోడు నీవని తెలయు తెలివిని తనువు అణువుల నింపుమా,

తారకంబగు నీదు స్మరణను సోహమందగ  విందుగా !!

.

బదనిక

చెట్టుమీద మొలచునట్టి ఓషధి విశేషము. తమ మనుగడకు మరొకరిమీద ఆధార పడుతాయి

నిరాకరి అయినా ఆత్మ , లోకాన్ని అనుభవించటానికి దేహవాసం చేస్తుంది …

తనువు రాలిననాడు నీవిక ఏమిచేతువే బదనికా ?
తూగి ఊగుచు తుంటరాటాల తేలిపోదునె దేహమా!
కొమ్మనూగెద రెమ్మనూగెద కొలను అలపై తేలెదా ,
కోటి తుమ్మెద కోరి ఒరిగెడి పదముపై నేనొదిగెదా !!

వన్నె చిన్నెల జగతి రంగులు కనెడి కన్నులు కరుగునే,
వివరమిదియని ఎరుక పరిచెడి వీనులిక నిను వీడులే,
కులుకు పలుకులు కుమ్మరించెడి పెదవులిక నీవెరుగవే,
ఏది దారిక నీకు జగతిని ఎరుక నెరుగగ బదనికా !!

పదము పలికెడి పెదవులే నను సెలవుయని విడనాడినా,
జగతి ఛాయల జేరవేసెడి నయనములె నను వీడినా ,
కనెడిదిదియని వినెడిదిదియని ఎరుకపరచెడి ఎరుకనే ,
వెంట జంటగ గొంటినని నీ వెరుగవైతివి దేహమా !!

అడుగు అడుగున తోడునడచిన చెలిమి లన్నియు చెల్లెనే ,
కూడబెట్టిన కూరిమంతయు పుడమి పొరలను చేరెనే ,
భవిత ఇదియని భావనెంచిన భువనములు మరుగాయెనే
ఏది దారిక నీకు భవితన కలిమి బలిమియు బదనికా !!

దేహ సీమల సీమ దాటుక సాగిపోయెడి ఊహనే ,
తరుగు మెరుగుల తలపు నెంచని నిండు కూరిమి కలశనే,
కాలములు కలబోసి కూర్చిన కాలు పదల రచననే,
నిస్సంగు సంగము నొందగా నే వీడితిని నిను దేహమా !!

నోము ఫలములు దాన ఫలములు ధారణందిన మంత్రం జపములు ,
మధుర స్నేహము కటిక వైరము కాముడెంచిన కొరత కొలతలు
నీటిమూటల నోటిబాసలు పగిలి పొంగిన ఉప్పు ఊటలు ,
మూటలై నావెంటె యుండగ మరుగు చింతన ఏలనే ?

ధరణి దాటని కొరత నీ కథ – నిలకడెరుగని నిజము నా కథ !!
కలసి నడచిన అడుగు చెదిరిన – జాడలను నే వీడబోవను,
కాలవాహిని కరుగజేయని కథల సారము సరకు జేయుచు ,
చేరవత్తును నిన్ను ఎన్నడొ – మారు రూపున మరువబోవను!

బదనికను నే భువిన మసలగ నీదు గూటిన చేరెదా,
యుగయుగంబుల కథల కూరుపు కొత్త పుంతలు కూడగా ,
నీరజాక్షుని పాదముల నే పదిలముగ కొలువుండినా ,
దేహినైనే ధరణి నడచెద కూరిమంతయు కరుగగా !!

గుణ గణం

అరుణ కిరణపు వెలుగు లమరి మెరయగ  నీవు ,

కటిక చీకటులన్ని కడుపులో దాచుకొని,

అణిగియుంటిని నీదు పాద పద్మము క్రింద !

వెలుగు వాకవు నీవు – తొలగు చీకటి నీవే!!

సుగుణాల రాశివని సన్నుతింపగ నిన్ను,

కానీగుణములనెల్ల కాజేసి కలబోసి ,

తనువంత నింపుకుని మసలుచుంటిని నేను,

నీకు ప్రతిరూపమును ప్రతిగుణములును నీవే!

పాలపుంతల పరుపు పవళించి ఆనాడు ,

ఉలుకుపలుకూ లేక జోలలూగుచునుండ,

తుంటరాటన  నిన్ను కవ్వించి కరిగినా ,

అసుర ఉనికినినేను – ఆ ఉనికియును నీదే  !

చక్కదనముల కుప్ప మామేటి రాయుడిని ,

కూడి కులములు నిన్ను కీర్తింపగానెంచి ,

మురికి మైలలనెల్ల నామేను చుట్టితిని,

తేట తెరపులు నీవు – మకిలి మైలయు నీవే !!

తలచి నిను పలుమారు తనువంత పులకించి,

మధుర భక్తిన నిన్ను కులమెల్ల కొలువగా,

వైర భావనాలన్ని భరియింపనెంచితిని ,

మధుర భక్తియు నీవే – వైరియైనను నీవే !!

సాధుజన సంగుడని సత్వగుణ రూపుడని,

సకల జన సందోహంబు కొనియాడగా నిన్ను,

తామసోల్లసినై తామాసపు తనువైతి,

సాధు సత్వము నీవే – తామసంబును నీవే !

మధుర ఫలముల రుచులు నీవు చవిచూతువని,          

ఫలరాసులను నేను ఎంచి రుచిచూసితిని ,                                       

వగరు పాషాణములు నాయందే దాచితిని,

మధుర మైనను నీవే – అరకు అయినను నీవే !!

మోహనా యనినిన్ను ముదముతో కొలువంగ,

జగతి వికృతులెల్ల వింత వలువగ  నేసి,

సుంతైనా విడువకే శృంగార మమరితిని !

మోహనంబును నీవే – వెగటైనయును నీవే!!

నీ వైభవము కోరి దిన దినము అను దినము ,

తేట కళలన నిన్ను కొలువునమరించినా !

నీ నీడ జాడలను మోసి మలిగెడి నాకు,

సుంతైన  తెరపీయ తలుపవే ఎపుడూ!!  

                                             

హరి హరీ యని ఒకడు హర హరా యని ఒకడు,                                                                                   

ముదము తో నీ యశము పలుమారు పొగడగా,

మురిపాన నీ మోవి కురిపించు వెన్నెలలు ,

వెతల తుడుచుననంచు వేచి బడలితినయ్య!!

పగవారి కైన  నీ పరమ దయనే పంచు

కానీ గుణములనెల్ల కాలాన కరిగించు,

నీలోని వెలుగులను నీ జగతిలో నింపు,

నీరజాక్షా నన్ను గురుతెరిగి  పాలించు !!

తక్కెడ

తూనికెరుగని తక్కెడదిగో తుకామేయగ తరలిరండని ,

తూకమేసెడి మేటి సరకుల విలువ వివరము అడుగనన్నది !!

గుండె గుప్పెడు మనసు చారెడు బ్రతుకు మూరెడు ఆశ బారెడు ,

విసుగు వీశెడు వెరపు అడ్డెడు వంకలెరుగని వలపు తట్టెడు ,

భావభారపు మోపులెన్నో మోసి మోసిన మనసు అలసట ,

ఆదరంబున  తగిన తూనిక కొలతతో ఎరిగింతునన్నది !!

తల్లి ప్రేమను తరుణి ప్రేమను తూకమేసెడి వసతి కలదని,

తనయు ప్రేమకు తగిన అర్ధము అందజేసెడి  కొలత కలదని ,

పసుపు కుంకుమ కుమ్మరించెడి చెలుని ప్రేమను  తూచితెలిపెడి

వసతి వీలును కలిగి యుంటిని – అంది సంతసమొంద మన్నది !!

భారమెంచని  కడుపు తీపిన భాగమెంచని తోడు భారము ,

లోతు తెలియని గుండెలో ఏ లోతులో మరుగొంది ఉండెనో ,

బ్రతుకు భారము మోయు రెక్కల సారమెంతయో తెలియజేసెడి,

సాధనంబులు కుర్చీ వేచితి – చేరి తూనిక నెరుగుమన్నది !!

కాల గమనము కొల్లజేయని కునుకు మరచిన కంటి పాపలు,

తప్పటడుగుల తూలు తనువులు తీరుగా తగు దారులందగ,

విధి విధంబుల వీనులందున విన్నవించిన విన్నపంబుల ,

సారమంతయు తూచి తెలుపగ – తెలిసి తీరికనోందు మన్నది !!

నేటి నడతల నిలవరించెడి నాటి నీతుల ఊట తేనెలు ,

తేట తేనియ కుడిచి కడిమిది పంచి మురిసెడి దొడ్డతనములు ,

దోచి దాచిన కండ చక్కర గండు చీమలు కుడుచు తీరులు,

వాటముల నిట వివరమెంచుచు సరిగ తూచెద తెలియు మన్నది !!

బ్రతుకు బాటన దిగుడు ఎచ్చుల ఉచ్చులో తా నలిగిపోతూ ,

ఆదుకొమ్మని చేదుకొమ్మని లోని గొంతుక గుల్లచేసుక ,

గోడు గోడును తల్లడిల్లెడి పుడమివాసుల భీతి భక్తిని ,

భవుడు మెచ్చెడి తూనికన తా తూచి  తెలిపెద తెలియు మన్నది !!

 కాటివాకిట రాలిపోవక తోడు నడిచెడి కర్మ దొంతులు,

కడుపు కట్టుక కావరమ్మని కోరి చేసిన పూజ మూటలు ,

విసిగి బడలిక బాపుకొనగా తూలనాడిన మాట తూటలు,

తూకమింతని  తెలిసి మసలగ  తెలియ రమ్మని తెలిపె తక్కెడ !!

ధర్మ దేవత ధారణందున మసలు తూనిక తూకమేమని ,

కాలగతులను కలుగజేసెడి కనుల కదలిక తాళమేమని ,

కాళీ కాలిన అణిగి నలిగెడి వైరి వైనపు వివరమేమని ,

తెలియ గోరిన తెలియజేసెద – తరలి రండని తెలిపె తక్కెడ !!

తూనికెరుగని తక్కెడదిగో తుకామేయగ తరలిరండని ,

తూకమేసెడి మేటి సరకుల విలువ వివరము అడుగనన్నది !!

రథ సప్తమి– 2024

ఏక చక్రపు రధము –  ఏడు శ్వేతాశ్వములు

నడువలేనొక  సాది  నడిపించు రథములో   ( సాది – సారథి)

దారి దిశలూ లేని ఒక వింత పయనమున                           

నమ్మి ఎవనిని వాడు దిన దినము కదిలేను?

వెలుగు వాకలు పొంగి తనువంత  పొల్లగా ,

          పొంకమెంచక వాడు అలుపు సొలుపూ లేక,

 చెలగు చీకటి పొరలు చిదిమి చెదరగ జేయ,

         నమ్మి ఎవనినివాడు ఒంటిగనె పయనించు ?

కలిమి లేములు కనక – కలుగు నెవరని కనక,

             కలిగి కలిగెడి ఫలము  కలిగించునది కనక ,

  కల్ల కపటము లేని కరుణ కిరణపు కరము ,

            నమ్మి ఎవనినివాడు దిశ దిశను ప్రసరించు ?

పొంగు వెలుగుల పుంత తరుగు తలపే లేక ,

         పంచి ఇచ్చిన తనకు తరుగు నని తలుపకే,                                            

పొందు వారలనుండి  బదులు కోరెడి తలపు,   

          నమ్మి ఎవనిని మరచి మరి మరీ పంచేను ?

కలుగు వెలుగులు కలుగ  కారణంబేదియని ,                               

           కలిగించు వాడెవడు ఏల కలిగించునని ,

కొరత కలిగిన నాడు ఉనికి జాడేమియని,

         నమ్మి ఎవనిని వాడు చింత చెందుట మరచు ?

తరుగుటెరుగని వెలుగు కలిగించు వాడెవడు?

      తరలి అలసట లేక పంచ ప్రేరణ ఎవరు?

బదులు కోరని వెలుగు కలిగించు వాడెవడు ? 

        నమ్మి ఎవనిని వాడు యుగ యుగము వెలిగేను?

ఎవని నమ్మిన  కలిమి నిలకడను కలిగించు ?

 ఎవని నమ్మిన జగము లోగుట్టు కనిపించు ?

 ఎవని నమ్మిన పురము పుణ్య పురముగ మెరయు ?

  ఎవని నమ్మిన దేహి భీతి భయములు మరియు ?

  అవ్వాని ఆదరము అవధులన్నియు దాటి ,

  అదును పదునును జూసి ఒడుపుగా నను పట్టి ,

  అమిత రాగపు రసము  తనియారగా పట్టి ,

  చెపల చెరితుని నన్ను చేదుకొన రాదా ?

వసంత పంచమి- 2024

నీ కరుణ కురిసిన నాదమందును – మధుర పదముల రూపము,
  నగవు సోకిన నాదమమరును – లలిత లాస్యపు సొంపుల !
  కరము కదలిక నాదనడతకు – జిలుగు సొగసుల కూర్చునే !
  అరుణ చరణపు తరుణ కాంతుల కొలనులో నన్నుంచావా!!

గురుని బోధల తేట చినుకులు దారిచేసుకు మనసు చేరిన ,
కరుణ నీదది కలుగకుండిన కూడదే ఒక లేశమైనను !
జాగుచేయక జనని భారతి పాదమూనవె నాదు శిరమున ,
చరణ కమలపు మధువు మధురిమ సకల కులమున సోకగా !!

పురము నేలెడి పుణ్య చరితవు – అంకురించవె నాదు మనమున ,
నాదమందిన భావ రూపము నీదు కరుణను కూడి కదులగ!
తేటతెల్లని తరుణ కాంతుల కొలనువై ఇట కొలువుదీరవె ,
మాటిమాటికి మకిలి మైలల మెలగు పలుకుల మునకలేయగ!

మెరుపు తీగల మూలమందున మెరయు చల్లని తల్లివే ,
భావ నడతన అదుపునొల్లని దుడుకు ఉరుముల నూర్చవా!
కుదురు జేసుక ఆర్త బాంధవు నురములో వసియింతువే ,
వసతి జేసుక విస్తరింపవె నాదు వినతుల ఆర్తిలో!!

భావనందున అందజాలని అమర భాగ్యపు రేఖావే ,
ఆదరంబున అవధరింతువ అనరు భావపు నాదము !
లేశమైనా నీదు లీలల లాస్యమును నేనెరుగనే ,
లాలనెంచవె తల్లివై నీ లోకమెరుగని తనయను !!

(కులము : నాడి) ( అనరు : సంకటము )

.

తగిన పదము

రామ దాసులు త్యాగరాజులు – కోరి కొలిచిరి దశధాత్ముని ,
కన్న తండ్రని గారవించుచు – కొలిచిరెందరొ గానలోలుని ,
పదము పదమున వారి వినతిని – పొదిగి పలికిరి విభుడు మెచ్చగ,
విన్నవించిరి విబుధులెల్లరు వీనులన్దగ రఘుకులేశుకు!!

భావనందున చిగురు తొడిగిన విన్నపంబులు విన్నవించగ,
పదములేవిక కూడవాయెను – మూగదాయెను నాదు గానము!!

కండచక్కెర తొడుగులోపల ఒదిగి కరిగిన పదములెన్నో,
ఊట తేనియ చినుకులందున ఊరి మాగిన మాటలెన్నో ,
వారి భావపు భారమందున మునిగి మురిసెడి పదములెన్నో ,
సొంపుగా ఆ సార్వభౌముని వీనులందెను వివరమెంచగ !!

భాష భావము పలుకులన్నీ వారి ఊహల ఉనికి ఆయెను,
పేదనైతిని పలుకులెంచగ – నాదు భావన విన్నవించగ !!

తండ్రినీవని తెలిసినా నా పిన్నతనమున చిన్నబోయితి ,
భావ పుంతల మంతనాలను భాషలెరుగని భావ గతులను,
అంతరంగపు శంఖి మధనము నంకురించిన చిగురు ఊహలు,
ఆలకించర అమరవంద్యా – మూగదాయెను నాదు గానము !!

అరమరెరుగని అక్షరంబులు రుచుల పొందును ఏల వీడును?
అంబుజోదర ఆలకింతువ అనరునొరగిన నాదు వినతిని ||

అత్రి పుత్రుని భాష రూపపు భావనందిరి ఋషి గణంబులు ,
ఉషా సంధ్యల ఉనికిలో నీ ఆనతందును అఖిల జగములు,
పలుకులెరుగని పదముతో నీ శాసనము లందించు అజుడవు ,
అందలేవా ఆదిఅలికిడి ఆవరించని భావపు ఝరులను !!

పొదల దూరిన గాలితరకలు – కొమ్మనూగెడి పక్షి గణములు,
మధుర భావము నందజేసెటి పదములెన్నో పంచి ఇచ్చినా ,
పొందనైతిని తగిన పదమును పొదగగా నా విన్నపంబును,
సుధాసాగర సార్వభౌమా కరుణగొందువా నాదు మనవిని!!

పుడమి నడిచిరి భక్తులెందరో భావ వైభవమంద జేయగ,
కూరిమొందగ కూర్చినారిట కవిత కావ్యపు రాసులెన్నో !
వింతగాదే విడువకుండిరి మధుర పదముల నొక్కటైనా,
ఏమిసేతును బేలనైతిని నాదు వినతికి పలుకులద్దగ !!

                        

నేను నాది

నేను నేనను మాట ప్రతివారలంటారు ,
నేనెవ్వరో నీకు తెలుసా?
నాదమందిన పలుకు ‘నాది’ నాదని పలుకు,
‘నాది’ ఎచటున్నాడొ తెలుసా ?
నాదెవ్వడో నీకు తెలుసా?

నాడు పుట్టిన ఉనికి ఉప్పెనై పొంగేను,
ఉరిమి లోకములెల్ల ఉల్లాస పరచేను,
ఉదయించు వైభవము ఉనికిలొ పొదిగుంచి,
జగమెల్ల నిండెనట తెలుసా ?
ఉనికెవ్వరో నీకు తెలుసా ?

పంచతత్వపు జగతి పలుమారు తిరగేసి ,
పొందనెంచెడి దేది తెలుసా?
పాంచజన్యము పట్టి పుడమి నడిచిన వాడు,
పంచి ఇచ్చినదేది తెలుసా?
పొంది తెలిసినదేదొ తెలుసా?

మూడు కన్నులవాడు మూడేసి భావాల,
వేగపడి విడదీసి వెదజల్లినాగాని ,
ముదిమితో ఆ మూడు పంతాన కలబోసి ,
అమిరినా ముంతేదొ తెలుసా?
ముంతలో నేముందొ తెలుసా ?

చెలన మెరుగని నాడు చెలిమి తప్పని మూడు ,
చెదర జేసినదెవరొ తెలుసా?
చెదిరినా సంగమును సవరించ తలపోసి ,
నడిమి నిలచినదెవరొ తెలుసా?
నటన నడిపెడిదెవరొ తెలుసా?

నాది పలికెడి పలుకు తెలుసా?
నేనె నాదని నీకు తెలుసా?
నాది నేనే యనుచు తెలుసా?
తెలియగా తెలివేదొ తెలుసా?

శ్రీ రామ ప్రాణ ప్రతిష్ట – అయోధ్య

22nd January 2024

శ్రీ రామచంద్ర మూర్తి భారత భూఖండం మీద త్రేతాయుగం లో అయోధ్య రాజధానిగా రాజ్యమేలుతున్న దశరధ మహారాజుకి పుత్రకామేష్టి యజ్ఞ ప్రసాదంగా ముగ్గురు సోదరులతో లభించాడు. శోకం తానూ గ్రహించి ప్రజలకు సుభిక్షమైన పాలన అందించాడు. కలి ప్రవేశించిన ఐదు వేల సంవత్సరాల తర్వాత , అదే అయోధ్య లోని శ్రీ రామ జన్మ భూమిలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట చేసి రామ రాజ్య వైభవం తో ఈ కలియుగాన్ని ప్రకాశింప చేయాలని, మానవులు పడే ఆరాటం …. జై శ్రీ రామ్

శ్రీ రాముడుద్భవించినాడు భరత భూమిలో ,
కలి బాధలు కడతేర్చగ – కనువిందుగ కదలి నేడు !!
శ్రీ రాముడుద్భవించినాడు భరత సీమలో !!

యుగ ధర్మము బోధ చేయ కాలమెంత నేర్చినా ,
మానవతను మదిన నిలిపి వసుధనె వైకుంఠమును జేయ !
శ్రీ రాముడుద్భవించినాడు భరత భూమిలో !!

సకల జీవ సౌభాగ్యమే పురుష భావ సారంబని ,
వసుధ జనులు జీవులన్నీ ఏకైక కుటుంబమంచు ,
సాటి రాని స్నేహంబున వసుధ వైభవించ నేడు-
శ్రీ రాముడుద్భవించినాడు భరత సీమలో !

శ్రీ రాముడుద్భవించినాడు భరత భూమిలో ,
కలి బాధలు కడతేర్చగ – కనువిందుగ కదలి నేడు !!
శ్రీ రాముడుద్భవించినాడు భరత సీమలో !!