మించిపోయెను తరుణమని నను – తొలగియుండు మనందువా?
నిలకడెరుగని తరుణి తరుణము – తోడు నడువదు జగమున!!
జాణతనమున జాడ తెలుపదు తాను తరలెడి తీరులు !
ఒంటరైతిని ఎరుగనైతిని నీదు తెరువుల త్రోవను !
అలసి సోలిన లోకముల తన లాలనందున లయముజేయుచు ,
ఆదమరువగ జేసి అలసిన తనువులలసట తొలగ జేయుచు
మాటునే తన ఉనికి నుంచుచు మనుగడల గమనంబు కూర్చుచు ,
ఒంటి చక్రపు రథముపైనిటు చేరవచ్చెడి భానుతోడుగ,
ఆడుకోండని ఆదమరపును అదుపుజేసెడి అతివ ఉనికెపుడెరుగనైతిని!
లేత అరుణిమలద్ది అల్లిన మెరుపు నూలుల వలువ సొంపులు ,
తళుకు తనువుకు తొలకరుల పులకింత పుంతల నూత్నశోభలు ,
అమరజేయగనల్లి – అమరుని ఆనతుల తన వెంట నిడుకొని ,
ఎంచి ఎంపికజేసి జీవుల యోచనల దిశ దశను తెలుపగా ,
తరలి వొచ్చెడి ఉషకు ఊపిరులూదు వారల నెరుగనైతిని !!
తల్లి తండ్రియు అన్న చెల్లియు ఆదరించిన బంధు బంధులు,
నిన్నే నమ్మితి నీవే తోడని జంటజేరిన ఆలీ సంతులు,
కూడబెట్టిన కూరిమంతయు కొల్లగొట్టిన సాటివారలు ,
తరుణమేదో తలచి తొలగిరి తగిన వాదము నందజేసిరి ,
తొలగు తలుపును జేరనీయని నీడ మూలము నెరుగనైతిని !
ఉలుకు పలుకులు వీడి వెంటనే జంటగా నీవుంటివందురు ,
పలుకు పలుకున నాదమై నా పలుకు పల్లకి వగుదువందురు,
కంటిపాపల కదిలికన కొలువుండి సకలము తెలుపువందురు,
దేహనాడుల స్పందనొందగ స్ఫూర్తినేదో కూర్తువందురు,
కుడిపి కూరిమి ఊరడించని నీదు నియతిని ఎరుగనైతిని ||
తొందరొందిటు తరలి ఓస్తిని తగిన త్రోవల నెరుగనైతిని ,
కటిక దారులు కాళ రాత్రులు కరుగకున్నవి తోలుగకున్నవి
భీతి భయములు భుజములై నను దీనదశలన మెలుగుమన్నవి,
దీనతే ఈ దేహ ఫలమని దుఃఖములు నను ముసురుచున్నవి,
ఏది దారని ఏది దిక్కని ఎరుక నెరుగగా ఎరుగనైతిని !
చతురడవు నీ చరిత చతురము చేరదీయుము నీదు ఊహను,
ఊరటెరుగక ఉలికి పడుచూ చెదిరి బెదిరిన నీదు ఊహను ,
మాట మాటున కంటి మాటున మనసు మాటున తొలగివుంటే
తెలిసికొని నిను తగిలి గెలిచెడి తెలివి లో నేనెరుగనైతిని
చెదిరి చితికిన నీదు ఊహను చేదు నిజమిది తెలియుమా!
మాటు మరుగులు మాని రయమున మన్ననెంచర మోహనా
కనులు వీనులు కరములును నిను తనివితీరగ తెలియగా
తెలియజేయుము తేట తెరపిన నీదు తావుల త్రోవను ,
తోడు నీవని తెలయు తెలివిని తనువు అణువుల నింపుమా,
తారకంబగు నీదు స్మరణను సోహమందగ విందుగా !!

.