చిరు పూజ మన్నించు

కడుపారడి బుచ్చు వాడు – కడు తెరగుల నడచువాడు

కంసునికై చరసాలన పసివాడై వెలసినాడు

సు-దర్శనమునా అసురుని బ్రోచి పుడమిగాచినాడు

తనువిచ్చిన తన తల్లికి సంతసంబు నొసగినాడు!

సురలోకపు సుఖములెల్ల తనయాజ్ఞను మీరకున్నా,

లోకాలన తన నామము త్రికాలముల విన నెంచి

నీనామము ద్రుంచనెంచు ఆ అసురుని బాపుటకై

స్తంభంబున వెలసినావు – సతీసుతుల బ్రోచినావు!

కైకశి పూజల బ్రోవగ – శ్రీరాముని వైనావు

గజాననుని తల్లికొరకు – పరమేశుని వైనావు

పరీక్షిత్తుని గాచి పాండు పక్షము నిలచి

పరమ ప్రేమను పంచి యశము గొన్నావు!

ఆ తల్లులకు సాటి నా పూజ లేపాటి,

ప్రేమ మూర్తివి నీవు, ప్రతి తల్లి మదినీవు

నాసుతుల స్మ్రుతిసీమ నేనాడు విడబోకు,

చైతన్యమూర్తివై  వారి  రూపున మసలు!

చిరు పూజ మన్నించు …చిద్విలాసా

 

కరుణ కురిపించుమో అచలాద్రి వాసా

పురిటికందును పరుల పంౘకంపిన తల్లి

పలు రక్కసుల బారి పడనున్న పసివాని

కావుమని వేడినా వసుదేవునిల్లాలి

కన్నీటి పూజలను కరుణగాచినవాడ!

కాననకు పయనమౌ పాండు పుత్రులజూచి

తల్లడిల్లిన తల్లి దిక్కుగానగ లేక

అలమటించుచు నిన్ను రక్షకై వేడగా

అడుగడుగునా వారి కండవై నిలిచావు!

నరాయణాయన్న నేరమునకా తండ్రి

పసివాని ప్రహ్లాదు పలు ఇడుములిడగా

లీలావతీ దేవి శోక విన్నపమంది

అణువణువునా వేచి ఆతల్లి గాచావు!

ఎందరో తల్లులను-ఎన్నెన్నొ వైనాల

యుగయుగంబులనుండి గాచు చున్నావు

వారందరికి నే సాటి గాకున్నా

తల్లినే నేగూడ- నను గావగా రారా!

నాతనయు రక్షించి-నీ ఉనికి జూపరా…

నిను వేడగా నాకు వేదాలురావాయె,

ఏదివ్య యజ్ఞములు నేజేయలేను,

నా కంటిలో నీరు నీపూజగా నెంచి,

కరుణ కురిపించుమో అచలాద్రి వాసా!

కూన

మన్నునాడిన పిన్నవాడిని- ప్రేమ మీరగ జేరదీసి,

మురిపెమున ముద్దాడు తల్లిని-ధరణి నిల్పిన వాడవే!

మార్దవంబును మరగు పరచుక మసలనేర్తువు ఏలనో!

పంకజంబున పదము మోపిన పరమ ప్రేమను మరతువా?

మోదమున నీవానతీయగ నీదు జాడను వీడి నే,

అరగినానిట నీదు మహిమను విన్నవింపగ ఇంపుగా,

వన్నెతరగని నీదు ఛాయల ఛాయనొందిట మసలగా,

ఆదమరచితి ఆటయందెటొ దారిమరచితి మరలగా!

కర్మ పంకపు కొలనులోనే పొరలుచుంటిని ప్రీతిగా,

ఎన్నగా నే నెరుగనైతిని కొలను సీమను దాటగా,

అందగా నే నెంచ నేర్వను మానసంబున ఏటికో,

తలపులో నీతోడు తలచిన దరిని జేరుదు నేటితో!

ఆటచాలని అక్కుజేర్చెడి తల్లిప్రేమను జూపగా,

కర్మ పంకిల మంటెనని నను జన్మదారుల త్రోయకే,

ఒడిని జేర్చుక ఆదరింపుము-మరలగా నే నేర్పుగా!

నిన్ను కానగ లేని కూనను- కరుణ గని నన్నేలుకో!

ఈశ్వరానుగ్రహ పాత్ర-మార్తాండ పుత్రా!

ప్రజలెల్ల సంతతని భావించినా రాజు

నియతి నియమమయ మార్చి వర్తింపగా పోర

దయగనా దశరధుని కృపజూచినావే!

బహు ఇడుములన్నలుని కావగా నెంచి,

రూపమే మరపించి – వాని చరితనుగాచి

విన్నవారికి నీదు కృప నిత్తునంటివే!

ఇది కలియుగంబనీ కడగండ్లయుగమనీ

నిలకడన్నది మదిని దరిజేర లేదనీ

ఎరుగున్న ఏలికవు రౌద్ర నేతృడవు!

దయతోన నీ దృష్టినేలాగొ సంధించి

నా తనయులన్నీవు కృపజూచి బ్రోవమో

ఈశ్వరానుగ్రహ పాత్ర-మార్తాండ పుత్రా!

ఇది అత్యాశ కాదు!

ప్రణవ నాదము నుండి – ప్రమధ నాదము వరకు

నాదించు నాదమై – పరమేశు మౌనమై ,

ముజ్జగమ్ములయందు – ముల్లోకముల యందు

నిండున్నవాని నే ననుదినము అర్ధింతు.

పాండు నందను తల్లి, పూజలన్మన్నించి

పలు విమర్శలకోర్చి – పలుధర్మముల నడిపి,

పాండవుల వెన్నంటి – కారడవులన్నడచి

సంతసంబందైన – సంతాపమందైన

చెలుడవై చెలిమిచ్చి – సఖుడవై లాలించి

ఏ దారి నడచినా – ఏ క్రతువు జేసినా,

జన్మ కారణ కార్య సాఫల్య మెందింప

సారధ్య మందించి, వారలన్బ్రో చావు!

నేడు నా పూజలను – ఆరీతి మన్నించి,

కల్కి సహజంబైన లోపముల కనకనే,

దరిజేర్చు దారిలో నా సుతుల నడపించు

వారంతరంగంపు రంగమును విడబోకు

ఆనందరూపుడౌ  నీ దివ్య హాసంబు

వారిమోములనుండి – పలుతెరంగుల పంచు!

నా పూజ మన్నించు….

ప్రేమ వీచిక

మరియ తనయుని తలపుతో!

అహంభావపు అద్దరందిన – రాచకొలువుల రొంపిలో,

మానవత్వము మంటగలసిన-మూర్ఖమానస సీమలో,

కరుణ బీజము అంకురింపగ-అవనికరిగెను బాలుడై,

తూర్పు రాజుల దీవెనందుక-గొఱ్ఱె పాకల రాజుయై!

కరకు గుండెల కాననంబున-ప్రేమ మొలకల నారు బోయగ,

తెలిపెతా నెన్నెన్నొ ఘటనలు-దీన జీవుల జీవనంబున,

బదులు కోరని ప్రేమ పంచుము-అన్నబోధకు క్రోధమొందిన,

రాచవారల కౄర గతులకు-తనువు బాపెను శిలవపై!

నేటికీ ఆనాటి నీడలు-ఏటికో భువినేలుచున్నవి,

కరుణ పేరున కరకు దారులు-మనిషి మనుగడ నేలుచున్నవి,

సాటివానికి తోడునిలువని-షుష్కబోధలు సాగనంపిక,

ఎంచుకొండొక ప్రేమవీచిక-పంచి నడువగ జగతిలో!

ద్వైత శాంతి

చావు పుట్టుక లేక చాంచల్యమే లేక,

నిత్య చైతన్యమౌ నీయందు లీనమై,

నీసాటి వాడనని-నిను చిన్నజైలేను,

అండాండముల యందు అంకురపు రూపమై,

బ్రహ్మాండములలోన ఆబ్రహ్మతేజమై,

వ్యాపించు జగమందు వ్యాపించువాడవై,

చరియించు చరితలలొ చాంచల్య యోగమై,

వెలుగు జిమ్మెడి జగతి వెలుగు కారణమై,

అంధకారములోని అంధత్వ బీజమై,

వెలయు వాడవునీవు వెలుగొందు వాడవు!

తుదిలేని నీరూపు తనువుతో కనలేక,

కనులార నినుకనగ నేనెందు నెలవొందు?

ప్రేమాంతరంగుడవు-దాక్షిణ్య రూపుడవు,

నాచిన్ని ఊహలో అనునిత్యముదయించు,

అనురాగ రూపుడై నాసుతుల మది నిండు!

నిజరూప మెరిగించు!

చరాచర జగతిలో చాంచల్యమై నిండి ,

అచలత్వమును బోలు చలనమై వ్యాపించి,

మునిజనుల మానసము నటభూమి జేసికొని,

వింత సంకల్పముల రూపముల నెలకొల్పి,

ఏమెరింగింపగా ఆతురుత నొందేవు?

ఎవని కెరిగించుటకు కణకణము కదిలేవు?

పగలు రేయొక పేట, ప్రతి ఊపిరొక పేట,

నేసి చేసిన జగము మరపు తెరపుల తాను,

భావముల రంగులను ఊహ విన్యాసముల,

యుగయుగంబుల నుండి జిలిబిలిగ నింపేవు,

ఏబొమ్మ నాశించి ఇంతశ్రమజేసేవు?

ఎవరి వేడుక కోరి ఈలీల జేసేవు?

అణువణువునొక బొమ్మ అందముగ అమరించి,

బొమ్మబొమ్మన నీవె జీవమై వ్యాపించి,

జీవి ప్రతి కదలికకు ఒక ఛాయ నందించి,

ఛాయ ఛాయకు జీవి ఛాయ తరుగగ జేసి,

ఏ తంత్రమును నీవు ఛేదించ నెంచేవు?

ఎవని కేమెరిగింప ఈ రచన జేసేవు?

నిర్మలుడవై నీవు నిశ్చలత్వము నొంది,

కల్పనల కదలికలు కనుదోయిలో నింపి ,

కల్పకల్పము లాయె కల్లోల జగమాయె,

నేటికిక నీ ఊహ వేటలను మానుకొని,

నిజరూప లావణ్య మొంది మనరాదా!

ఆట విడుపుగ ఆడ జగము జేరిన ఛాయ,

జగమందు ఛాయగొని తన ఉనికి మరచింది,

నందగోకులమందు విందు జేసెడి నిన్ను,

తన సాటిగా ఎంచి ఆటపాటల దేల,

మోదమొందుట నీకు పాడిగాదనెరుగు,

మాయమోహముబాపి నిజరూపమెరిగించు!

 

Master CVV… స్మరణతో

కుంభునభిషేకముల నెంతగా జేసితివొ- భూమి భారము నీవెంతగా నెంచితివొ,

భావమందిన పరమ గురువులు  –   వేగ పడగా నేల నెంచిరో,

తోక చుక్కను వాహనము గొని – తరలి వేగమే జేరినారు!

శక్తిపాతపు వేగమందిన వాణి వైనము తెలియగా,

పురములన్నీ చేరి చూచెను నీదు తనువట పొంగగా!

నాటి శంకరుడందుకొన్నా గంగ గతులను బోలుచూ,

భువికి తరలిన అమర వాహిని వైనమని వారెంచిరో!

అమర వాహిని నదుపు జేసి, మందిలో అది పంచు తలపున,

ఎన్నుకొంటివి ఉభయ సంధ్యల ఆరు గంటలు  వేళగా,

సులభమౌ మూడక్షరంబులు పలికినంతనె తీరుగా,

పంచి ఇత్తువు  పరమవాహిని పదిల మొందగ బొందిలో!

లాఘవంబుగ నీదు కరుణను-పొందిరెందరో ముందుగా,

ఈతి బాధల ఈదులాటన- నీదు తోడును మెండుగా!

అక్షరంబులు పలికినంతనె- అంది వచ్చెడి వైభవం,

ఎరుక జేసిరి ఎల్ల జనులకు- కొల్లగొట్టరె కుంభరాశని!

నియమపాలన నెరుగలేనొక-నీరసించిన నీచజీవిని,

కరుణతో నీ నియమ రేఖను – ఎల్ల లెంచక పెంచరాదా,

పిలచి నంతనే పలికి నంతనే – నీదు నీయమము చెల్లునా?

ఎటులనో ఒక దారిజూచిక –  నన్ను  నీ దరి  జేర్చరాదా?

శ్రీ శ్రీ రామకిృష్ణ పరమహంస స్మరణతో…

పుఱ్ఱెమాలలు రుధిర ధారలు – ఎన్నడెరుగని ఆయుధంబులు,

భీతిగొలిపెడి మేని ఛాయతొ – విచ్చుకున్నా కేశములతో,

నీకు రక్షగ వుంటి నేనక – బీతి చెందకు చిన్నకన్నా!

అన్న మాతకు ముద్దు బిడ్డడు – గదాధరుడట జన్మనామము!

పసిమనస్సును పదిల పరచుక – ప్రౌఢయైనా, ముదుసలైనా,

ఎన్నగా అది వాసమంచు – దేహ చింతన ఎంచనేర్వక,

చేరవచ్చిన ధర్మపత్నికి – దరి జేరు దారిని ఎరుకపరచి,

ఆలు మగలను బంధమునకో- అద్వైత భావమునెరుక జేసి,

వన్నెకెక్కిన సాధు సంతుడు!

నీరసించిన యువ మనస్సుల – నిస్తేజ భావపు నీలినీడలు,

నాస్తికత్వపు నాయకత్వము – నరికి వేసిన ఆత్మతత్వము,

నుద్ధరించగ భువికి తరలిన -రుద్రునంశకు తావునిచ్చిన,

నరేంద్రుడన్నొక ప్రౌఢ శక్తికి- రామ-కిృష్ణుల సాక్షి నిచ్చిన,

మాన్య మూర్తగు యోగి ఈతడు!

తనువు నెంతటి తాపమున్నా- తల్లి ప్రేమను పిన్న జేయక,

తల్లడిల్లెడి క్షణములన్నీ – తనువునొప్పుటె పాడియంచు,

నమ్మికందున నేర్వ వలసిన- తీరు తెన్నుల తెలియపరచిక,

అర్పణను తానెరుక జేసిన- గురు పద్ధంబున సాధుమూర్తి!

జన్మజన్మల గొలుసు దారులు-పేర్చి చేర్చిన మనోఛాయలు,

తొలగ జేయగ తరలు వారలు-తెలసి జేరిరి వాని దారులు,

అందిరెన్నో ఆత్మబోధలు – ఆతురుతగల నమ్రజీవులు,

వారలందరి మనోవీధుల – వైభవించెడి రామ-కిృష్ణుని,

వేడుకొందము నేటి నాడిక – తనువు కార్యము తీరగా!