శ్రీకృష్ణుడి గురుకుల సఖుడైన సుదాముని రాకను విన్నవించడానికి అంతఃపుర మందిరం చేరిన భటుడు….
మైపూత లేపనము లెన్న డెరుగని వాడు ,
వనమాల హారముల నురము నెరగని వాడు,
శ్రీచందనపు గంధ మించుకైనను లేని,
చిన నాటి చెలికాడు చేరవచ్చెను నిన్ను!!
వసుధ గంధమునంది శోభించు వలువలొ,
గగన తారల మించు చిద్రముల కలబోసి,
మయుడు నేసిన యట్టి కటివస్త్రమును గట్టి,
చిన నాటి చెలికాడు చేరవచ్చెను నిన్ను!!
కలిమైన నీ చెలిమి కన్నులందున నిలిపి,
చెలిమి చిలికిన చిన్ని యోచనల తలపోసి,
నాటి నెయ్యపు నెనరు కాంతి కన్నుల నిండ,
చిన నాటి చెలికాడు చేరవచ్చెను నిన్ను!!
గురు పత్ని ఆనతిన సమిధె సంభారముల,
కూర్చగా తామపుడు అడవి దారుల నడువ,
నీదు పాదములలువ సేద దీర్చిన యట్టి ,
చిన నాటి చెలికాడు చేరవచ్చెను నిన్ను!!
జంట నీవైయుండ నాడాడినాట లలొ,
కరము జేరిన ధూళి కరిగి తరలననంచు ,
కలవరింతగ నిన్ను కలువ తొందర జేయ,
చిన నాటి చెలికాడు చేరవచ్చెను నిన్ను!!
కొసరి పంచుకు తిన్న చిట్టి సంభారాలు,
చాటు మాటుగ జేసి కుడిచినా చిరుకుడుపు,
చివరి కుడుపై నగియ నీ నగవె కుడుపంచు,
చిన నాటి చెలికాడు చేరవచ్చెను నిన్ను!!
నీ జంటగా నడచి ఉల్లసించిన తనువు,
జంట బాసిన తనకు నడక భారమనెంచ,
అడుగడుగుగా నడచి జతజేరి మురియగా,
చిన నాటి చెలికాడు చేరవచ్చెను నిన్ను!!
చలువ తిన్నెలపైన సొంపారగా నమరు,
అమర సౌఖ్యపు సొగసు లందుకొనుచు,
శ్రీలక్ష్మి కనుపాప కదలికల నలగుచూ,
నగియు నల్లనివాడ కబురు గొనుమయ్యా!!
కాల నర్తన నీది కామ పాశము నీది,
కమలాక్షి కరుణగొన ఆనతులు నీవి,
ఓటమెరుగని ఆట ఓరిమితొ ఆడేవు,
ఓటమోపని వారలనేలనో మరచేవు!!
నీవు మరచినవారి దేవియును మరచేను,
తనువు నెలవగు వారి నిలకడను దునిమేను,
వాసవార్చిత వినుము చెలికాని విన్నపము,
పలుక పలుకులు లేని ఆర్తజన అక్కరలు!!
అరమరికలెడబాసి అరుగ సమయంబాయె,
కడుపు కుడుపుల కుడుచు నీ కొలువు చినబోయె,
చిన్నబోయిన నిన్ను చేరి మచ్చిక నెరప ,
చేర వచ్చిన చెలుని చేరుమిక చైజాచి !!
భక్త వరదా నిన్నె భావించి నిలిచాడు,
భవ బాధలన నలిగి తన ఉనికె మరచాడు,
భక్తజన మందార మందార వని వీడి
శ్రీలక్ష్మి జత నడువ చెలునాదరించు!!
****
