నిజం – సహజం – ప్రకృతి మనకి ఎన్నో అక్షయంగా ఇస్తున్నా, ఉన్నది జారిపోతే భరించలేము. అందుకే
జారిపోకుండా, వాడిపోకుండా ఉండే – శాశ్వతత్వాన్ని అసహజమైనా, కోరుకుంటూ – మనిషి తనను తాను మోసం చేసుకుంటూ, నిజం నుంచీ పారిపోతున్నాడా ?
నవనీత చోరుడా నారాయణుని మరచి,
నిలకడెరుగని జగతి నిత్యమని తలపోసి,
చిగురు టాకుల చెలిమి కంచెకెళ్ళగ జేసి,
పాడు ప్లాస్టుకు ఆకు సొగసెంచ తగునా!
జీవముండిన పూవు వాడి పోవని ఎంచి,
చిగురు మామిడి ఆకు వడలి పోవని ఎంచి,
జీవముండిన మనిషి తన కాసు పొదుపుకై,
జీవ మెరుగని పూలు ఇంటనిడ తగునా!
తనువు పోషణ కొరకు తిండి గింజల నెంచు,
ఉరము ఊపిరి నొంద పవన సంగము నెంచు,
సుచి శుభ్ర మెంచగా నీటి స్నానము నెంచు,
కన్నేమి తరుగాయె ప్లాస్టిక్కు కని మురియ!
పురిటి నెప్పుల కోర్వ వెనుకాడి ఏ తల్లీ,
ప్లాస్టీకు పసివాని ముద్దాడ బోదు,
జవరాలి యవ్వనము తరుగ తలచెవ్వడూ,
జతజేర నెంచడే ప్లాస్టీకు పడతిని!
పొద్దు పొడుపున విరిసి వొయ్యార మొలికించి,
తనదైన తేనియను తుమ్మెదల కందించి,
తరలు తెమ్మెర పైన తన తావి తరలించి,
తరియించ నెంచేటి నీ పూజ లో నిలచి,
వాలు పొద్దుల వెంట తనువొడ్డు పూబాల,
జగతి నియతిని నీకు అనుదినము నెరిగించు!
దిన దినము నొక శోభ భాసించు జగతి లో,
మలుగురటెరుగని విరుల వైభవంబేమగును,
మహనీయుడా విభుడు దిన దినము దీవించి
నూత్న శోభలనెన్నొ కరిపించు చుండగా,
రెప్ప పాటుకు వగచి జగతి పరిణితి నెరుగు,
జడమైన ప్లాస్టీకు జతజేరుటిక మాను. !!!