నాకమేలెడి వాడు లోని వాసము వీడి –
సంచారమెంచగా కదిలేటి పథము,
పులకరించే పలుకు పలుకరించే పథము –
పరమ పావనుడెంచి నడయాడు పథము !
భవదీయుడా విభుని భావించు భావుకుల –
నయన పథముల నంటి నడిచెటి చెలిమి!!
ముని నారదుని మదిన – నామ డోలల నూగి,
రసనామ పానమున రమియించు రాఘవుడు!!
పద్మసంభవు సుతుడు కనురెప్ప కదిలించి,
కననెంచినా పథము కనగనెంచగ నెంచి,
కదలి నడచిన పథము అందినా చెలిమి !!
గోపికా మదిలోని మధుర రసముల మరిగి,
మరుల మందిర మందె వసియించు వాసవుడు!
కంటి కలువలు విరియ కననేమి ఎంచిరని,
అంటి చూపుల జంట తుంటరై తోడుండు,
రాసలీలాలోలు డంది నడిచిన చెలిమి!!
సురవైరి సుతునందు కరుణ కలిగిన వాడు,
నిలచి యుల్లమునందె ఉల్లసించెడి వాడు!!
వాని చూపుల చెలిమి వీడనెంచగ నెంచి,
వాని కన్నుల వెల్గు కదలాడు పథమందె,
కాపుండి జతగట్టి జంటనుండెడి చెలిమి!
మధుర భక్తిన మునిగి పలుకు మీరా గళము,
కురిపించు సుధ నంది సంతసించెడి వాడు!
కురియు కన్నుల చినుకు చేరు దేశము నెరుగ,
పొంచి యా కన్నులన కొలువు నిండుగ నుండి,
సడిని సవ్వడి లేక జంట నంటిన చెలిమి!
ధరణి సొగసును గనెడి సావకాశము లేని,
నయనమందున నిలచి నగుమోము నెరిగించి,
వ్రజవాస వివరములు విస్తారమున తెలిపి,
స్వరసుధా నర్తనన మధుర లీలల నడిపి,
నడకెరుగనా కనుల నడిపించినా చెలిమి!!
చెలికాని నెయ్యమున మునిగి మురిసెటివాడు,
వీడి వానిని మురియ మనసు నొల్లని వాడు!
చేరి చెంతన నిలచి చింత దెలుపని వాని,
నయన పథములనంటి నన్నేల గనవంచు,
సిరిని మరుగున జేర్చి నడిపించు చెలిమి!!
కంటి చూపుల వెంట జంట నడచెడి వాడు,
చేరి చూపుల రధము నడిపి తెలిపెడి వాడు,
తెలియ జేసెడి తెలివి తెలియవలెనే గాని,
తెలియ నెంచగ గలవె తనువందినీ కనులు?
కమనీయ భావనల కరుణ కురియగజేసి,
కననెంచ నీయుమా నీ కరుణ పథము!!