విద్య

కోటివిద్యల కలికివే – బహు కులుకు పలుకుల కొలికివే!

కారణముతో నెరుగ జేయుము – ‘విద్య’ యన నది ఏమనీ!

నేర్వదగినది విద్యయా? మరి కొలువు కోరెడి విద్యయా?

లోనున్న బడుతడి లోచనంబుల-బోధనంబది విద్యయా?

జిలుగు లోకపు తీరుతెన్నులు తెలియు తీరది విద్యయా?

జీవ నాడుల జీవమొసగెడి జీవి నెరుగుట విద్యయా?

చూపుకందని, చేతకందని, మనసు నెరుగుట విద్యయా?

మధుమాస కోయిల పలుకు భావన నెరుగు మతి అది విద్యయా?

భాగవతుల మది భావనలలో – నిండి యున్నది విద్యయా?

నింగి నేలలు నెలవు  తప్పక నిలుపు విధమది విద్యయా?

విధికి వంగిన మకుట మస్తక యోచనంబది విద్యయా?

అడవి బట్టిన తపోమూర్తుల తపోసారము విద్యయా?

ఎరుక జేయుము తల్లిరో ఏమెరుగ వలె నే విద్యచే?

విబుధజనులను వేడుకునినే నొందగల నే విద్యనూ?

వెలతి దారుల తరుగు బ్రతుకుల తారకంబే విద్యలూ?

తెలిపి మము తగు దారి నడుపుము సకలవిద్యల తల్లిరో!

దుర్గ మాయమ్మా

దురిత దూరిణి దుర్గ దయనేలవమ్మా!

అరుణ పదముల నెలవు ఎరుక జేయమ్మా!

ఆదరింపగ నీవె – అదిలింపగా నీవె,

అనురాగమును పంచి అక్కు జేర్చిన నీవె!

చిట్టినా పదములతొ – తరుగకున్నది త్రోవ,

కను చూపు కొస దాటి-పొరలున్నదీ దారి!

బ్రహ్మాండ రూపిణివి – బహుదొడ్డ దేవతవు,

దయజూపి – ఎత్తుకొని ఈ దారి దాటించరాదా!

దురిత దూరిణి దుర్గ- దయనేలవమ్మా!

అలసున్న నీ సుతుని – అదరించమ్మా!

సేవ-తెరవు

విష్ణునిగ నీవమరి యుంటే – పదసేవ పదవది గంగది!

శేషతల్పము నమరియుంటే- సిరికి చెల్లిన పదవది!

రాఘవునిగా ధరణి నడచిన-తరికి ఒక్కరు అమరిరే!

భరత,లక్ష్మణ,వాయుపుత్రులు-వంతునొల్లరె పరులది!

గోధూళి నంటిన పదము నంటగ పొంచి యుంటిరె పరిజనుల్,

గోపకాంతలు, గోప బాలురు, గారవించెడి పలువురు!

పురములో నీ పాదసేవకు పులక నేత్రపు మోముతో,

వేచి యుండును రుక్మిణీసతి – తరుణమేదని ఎంచక!

వేళ ఏదని, వేషమేదని ఎంచి జూడరె దాసులు,

సందు జేసుక – సేవ జేయగ – తగిలియుందురె ప్రతితరి!

అంత పంతము నమరలేనయ – నలకంత కోరిక దీర్పవా!

ఎట్టులో నీ పొందు పొందెడు – సేవ తనువున నాటవా!

కుంతి పూజకు మెచ్చి ఇచ్చిన మాట సాకెడి తీరులో,

దారులెరుగని అడవి దారుల-దారి జేసుక నడువగా,

కలత చెందిన తరుణ పాదపు కొలుపు కొంతైనీయరా!

పాండు పుత్రుడు జేరులోపల-అనునయింతును ఎటులనో!

తరుగు ఇదియని-తగను నేనని తొలగజేయకు గిరిధరా!

తగులు దారుల తరిని తనువును-తగుల జేయుము కరుణతో!

మందవిడిచిన మన్ద పశువును-వెరచి యుంటిని ఎచ్చటో!               (మన్ద:అల్పము; నిర్భాగ్యుఁడు; మూర్ఖుఁడు)

వెదకి జేరుము వెతలదీర్చుము-సేవగైకొను స్వామివై!

ఆనందమా?

అందమే ఆనందమా? ఆనందమే మరి అందమా?

నల్లమేఘము కదిలితే ఆ నల్ల గొల్లడు నవ్వెననుకొని,

పురిని విప్పిన పుంజు నెమలికి కానవచ్చిన దందమా?

ఏలరావని పంతమాడెడి గొల్లపిల్లల వాదనంబున,

పురమునేలెడి పుణ్యపురుషుడు ఎంచి చూసినదందమా?

కుడుపు మరచిన లేగదూడలు-ధరణి జారిన చంద్రకాంతులు,

విరగ బూసిన పొన్నపూవులు-పొదల వెదికెడి పిల్లగాలులు,

ఎవని పొందును పొందగలమని-పెదవి నెన్నని పదము నెంచుక,

పరవశంబును వశముజేసుక – పొందు తలపది అందమా?

అలుకగొని తన పొందు వీడిన-అతివ మనసును అనునయింపగ,

పడని పాట్లను పడుచు శ్రీహరి – పొందునది ఆనందమా?

సంతు పోరును మడియజేయగ – నెలతగా నడయాడు వానిని,

కొమ్మయని తా కోరినానను హరుని నటనానందమా?

తనువు సందడి తరుగు నప్పుడు – తలపు తలుపులు తెరచినప్పుడు,

పలుకు పల్లకి వాహకులు తామలసినామని తొలగినప్పుడు,

తీరికొందిన తమకమందున తారసిల్లెడి మధుర భావము,

ఆనందమని అది అందమా? అందమని ఆనందమా?

ఎదురు చూపు

ఎదురు చూపుకు బదులు ఎన్నడందేనో!

ఎంతలో నున్నావు సూర్య నందనుడా!

చెలులు నను దినదినము పరిహసించేరు,

చేర బిలువగరాద ఎదురు నేనొత్తు!

ఎడబాటు బాటలివి ఎరుగవే కంచ,

తరుగ కున్నవి జూడు పరుగు నేనిడినా!

వేడగా కరుగరే వేల్పు లొకరైనా,

వేసారితిని నేను వాని నుతియింప!

వేడబోవను నిన్ను అమర వాసమును,

గురుతు జేయను నీకు ఇహలోక సుఖము,

కాల గతులన కదిలి దయనేలు వాడా!

కాలు నర్చించగల తీరు నెరిగించు!

నీజాడ కనువరకు తాపమును వీడి,

తగిలియుందును నేను నీదు మన్ననన!

వెతల బాపెడి వాడ తరిని ఎరిగించు!

మోహమణగగ జేయు భవ పాశములన!

ఉనికి

నీలి మేఘము విడిచి జారేటి చినుకులో,

నీరూపు జాడలను వెదికింది ఈ వసుధ!

భాను కిరణములోన నీ కరము కలదంచు,

లేత చెక్కిట సిగ్గు నమరించె నీ ధరణి!

నిలకడెరుగక మసలు గాలి తరకల లోన,

నీ మేని వాసనల వాసి గొన్నీ అదితి,

పరిమళంబుల విరులు విరివిగా బూసింది,

సౌరభంబుల చెరగు సవరించి నిలచింది!

 

అంతరిక్షపు రొదల అంతరంగములోన,

పదిల మొందిన నీదు పదమందగోరి,

నగములై మొలిచింది, నదములై పొంగింది,

వెఱ్ఱి వేదనతోన వేసారి అలసింది!

సార్వభౌముడ వీవు సాయిద్యమీయగా  –

భుజగశయనుడ వీవు భవము నొసగా,

ఆవరించుండియూ ఆదమరువగనేల?-

దొరతనంబునకిదియ అసలు వన్నె?

 

 

సేవకుడు

రాచ బిడ్డవు నీవు – రాలుగాయిని నేను – పొంతనేదని నన్ను వేరుంచబోకు,

పదసేవకుని పగిది పదవీయగా రాద – చెంత నుందును నీదు కూరిమొందంగా!

గోపబాలుల సాటి నడయాడ నే దగను – గోకులంబున నేను మనగ లేను,

అసుర ఆవాసినై ఆవరించగ లేను – కోరియూ ఏపగిది నిను జేర లేను,

పలుమారు నిను గాంచ పురమేలగా లేను-పొన్నపూవుల దండ నల్ల లేను,

వెన్నెలై, వేణువై, వన్నెకెక్కగ లేను – నీవె మోహమునొంది జేరునటుల!

గోపబాలుల వెంట పగలంత పరుగిడిచు – పడుచు గోపిక దారి నడ్డుకొనుచు,

రాధమ్మ జాడకై పొదపొదను వెదకుచూ – కాళీయు పడగపై నాడుకొనుచూ,

కాంతకొక రూపుగా రాసలీలల నాడి – యమున తీరములందు చెడుగుడాడి,

అలసి నలిగిన పదము గోపెమ్మగనకుండ-సేద దీర్తును నీదు సేవకునిగా!

ధర్మపక్షము నొంది -రాయబారముజేసి – రాచనగరుల దారి నడచి నడచి,

సారధిగ నడయాడి నరుని నడపించుచూ- అశ్వముల నదిలించి అలసినపుడు,

సేద దీర్చగ చెంత చెలులెవరు లేనపుడు- విశ్రమించెడి వసతి అమరనపుడు,

పలుమారు నీ పదము పంకిలంబగు నపుడు-సేవించి కొంతైన సేద దీర్తు!

ఒల్లనని అనబోకు – ఓరిమొందుమననకు- నమ్మజాలనిదయ్య నరుని బ్రతుకు,

తనువు తోలుకు పోవ తోడుండు నీబంటు – మీరజాలడు నీదు పలుకుసీమ!

లోనున్న ములుకొకటి మాలిమొల్లని దయ్య- మాయ మోహపు మునక మానదాయె!

ఏపున్నెములు పుచ్చి పుట్టెనో ఈ ఊహ- ఊపిరాగక ముందె మనుపు తండ్రీ!

వసు – దేవ

వసుధ నేలెడివాడ – వాసుదేవా, వసుదేవు నందనా – వాసుదేవా!

వాసి గలిగిన వాడ – వాసుదేవా, వాదనెందుకు మనుప – వాసుదేవా?

వాలి జంపిన వాడ – వాసుదేవా, వైరి తమ్మని బ్రోచు – వాసుదేవా!

వైర భావన మాపు – వాసుదేవా, వాదనెందుకు మనుప – వాసుదేవా?

వాణి వల్లభు ధాత – వాసుదేవా, వేదాంగముల నమరు వాసుదేవా!

వ్యాస వాణిన నమరు వాసుదేవా, వాదనెందుకు మనుప – వాసుదేవా?

వజిృగాచిన వాడ – వాసుదేవా, విజయునికి చెలికాడ – వాసుదేవా!

వనమాల ధారియగు – వాసుదేవా, వాదనెందుకు మనుప – వాసుదేవా?

వైనతేయుని వరద – వాసుదేవా, వాయునందను కొలుప – వాసుదేవా!

విధినందనుని వేల్ప – వాసుదేవా, వాదనెందుకు మనుప – వాసుదేవా?

వనజాక్షి వల్లభా – వాసుదేవా, వసులోక నాయకా – వాసుదేవా!

వన జనోద్ధార శ్రీ – వాసుదేవా, వాదనెందుకు మనుప – వాసుదేవా?

వన నాయకుని జనక – వాసుదేవా, వానరుల ఏలికా – వాసుదేవా!

వైదేహి వల్లభా – వాసుదేవా, వాదనెందుకు మనుప – వాసుదేవా?

వనిత మానస చోర – వాసుదేవా, వెదురు వేణువు నూదు – వాసుదేవా!

వాసుకిని ధరియించు- వాసుదేవా, వాదనెందుకు మనుప – వాసుదేవా?

వెలియావులను మేపు – వాసుదేవా, వెన్న దొంగవు నీవు – వాసుదేవా!

వెన్నెలల నాడేవు – వాసుదేవా, వాదనెందుకు మనుప – వాసుదేవా?

వెలి మబ్బు తరకవై – వాసుదేవా, వెలుగొందు గగనాన – వాసుదేవా!

వెరపు మపగ రార – వాసుదేవా, వాదనెందుకు మనుప – వాసుదేవా?

బొంది- దొంతి

బొంది నొందకు బాబయా!  ఇది లంపటంబుల దొంతయా!

దొరలనైనా దొరల జేయును – దొరతనంబిదె ఎరుగయా!

దాగియున్నది – దరినె యున్నది – మిత్తి మాన్పెడి మందనీ,

మున్నెంద రందరి మునుల మాటలు – నీటి మూటల పోటయా!

నగము లెక్కిన – నదులు దాటినా – జాడ దెలియగరాదయా!

తెలయు తరి తెలియంగజేయగ – తగిన వారిట లేరయా!

బొంది నొందకు బాబయా!

అడుగు అడుగున అందముందని అవని జేరకు జీవుడా,

అడుగునున్నది అంధకారము అదుపు నొల్లదు వినుమయా!

ఆట ఇది నే నాడువాడను – నటన నీదని నమ్మబలికియు,

నాక వాసుడు – వావివరుసలు – మరచి మరుగును బొందయా!

బొంది నొందకు బాబయా!

పుణ్యమున్నది – పాపమున్నది – పొందగా పలుదారులున్నవి,

తక్కెడందున తూగగా సరి భాగమొందగ భారమన్నది,

తక్కువేదని ఎక్కువేదని వాదులాడగ లాభమేమని?

తగిలున్నవాడికి తగులువాడికి సంధి గొను తరి లేదయా!

బొంది నొందకు బాబయా!

 

ఫలము లున్నవి -వ్రతము లున్నవి- లెక్కమించిన క్రతువులున్నవి,

అంగములతో ఆచరింపగ –  అవధెరుంగని వసతులున్నవి,

తోలెరుంగని కొండి యొక్కటి తగిలియుందీ తనువులో,

జాడవీడదు – జాలిజూడదు – తెగని తెగులది తెలియరా!             బొంది నొందకు బాబయా!

కన్ను

కాము చంపినవాని – కామకారణ మగు కనులు,

జగము అనవరతంబు వీక్షించు కనులు,

లో లోచనంబున్న మునిగణము లనుదినము,

భావనగ కనగలుగు కమనీయ మగు కనులు!

క్షయవృధి కరువైన అపురూప చంద్రికగ,

దహర గగనపు సీమ నమరుండు కనులు!

పాలించి, లాలించి, పోషించగల కనులు,

రతి వల్లభుని నమరు జేసినీ కనులు!

దేవరధు దైన్యతను కడదేర్చినీ కనులు,

కలికి రుక్మిణి మనసు దోచినీ కనులు,

భామకొక వల్లభుగ మురిపించినీ కనులు,

గోపెమ్మ కనుసన్న మీరజాలని కనులు!

సుధారస సాగరపు అంకురంబగు కనులు,

పొటమరించెడి జీవ చేతనీ కనులు!

అట్టి కన్నుల చూపు వెన్నాడి నడిపింప,

నడచు వారల భాగ్య మేమంచు దెలిపేను?

ఎరుకగొన వలెగాని – ఎంత మధురము తలపు!

తనువు అణువుల తగిలి తరలించు నా చూపు!

తన ఉనికి తెలుపకే తేట తెలిపెడి చూపు,

తోడు తెలుపుటకేలొ తొలగియుండు!

అట్టి చూపుల వెలుగు వెలిగించు దారులలొ,

ఆ కనులు కరిపించు సుధారస పానముతొ,

ఆ కంటి కాపులో అలుపెరుంగక ఆడి,

తనువు తారక మొంద తరలుటెన్నటికో!