నీవె దిక్కు

దిక్కు లన్నిటియందు నిండున్న దేవరా – దిక్కు తోచని నాకు దిక్కు నీవు!

పేరేది పిలిచినా పలుకువాడవటంచు – చాటి చెప్పెడి ఋషుల మాట నిలుపు!

పెదవి పిలిచే పిలుపు – పిలుపు కాదని ఎంచి – మిన్నకుండుట నీకు పాడిగాదు!

లోనున్న మహరాజు తెలుపకే పలుకులూ- పలుకనొల్లని తనువు- ఏల పిలుచు?

తోలు చేతులు జేర్చి- చేసేటి వందనము- వెనుక భావపు బలము కరవటంచు,

లోపాల నెంచగా తగునటయ్యా నీకు- బలము కలుగగజేయ ఎవరి తరము?

రవిచంద్రులై  నీవు-ఓషధీ రసమీవు- జీవనాడుల జేర్చు క్రతువు నీవు!

అంగమెరుగని మనసు ఏ అరకునొందెనో- వల్లమాలిన విధుల వివశమాయె!

సరి కుడుపు నందించి-తగు తరిన నడిపించి-భావ బలమందిచ నీకె తగును!

భవరోగ మణచగల జీవదుడ వట నీవు- మూలమెరిగెడి కిటుకు ఎరుగ  లేవే?

తనువు రోగము దీర్ప తగువారలెందరో – అవని అంచుల దాక అమరినారు!

లోనున్న చేతనకు చేయూతనీయగా – నీవె యని వినియుంటి విప్రువలన!

వందనంబిదె యంచు-పలికినీ పలుకులను-మన్నించి మదినెంచు మూలపురుషా!

తనువు కదలిక యందు తగులకుండెటి బలము- తగురీతి కలిగించి కనికరించు!

సరిక్రమములో నిన్ను సేవించగల రసము -కూర్చి ఏలిక జేయి మాన్యరూపా!

ఆధారమగు నీవె ఆదరింపగ వలయు – అన్య భావన వీడు అమరవంద్యా!

తల్లి తనము

తల్లితనమిదియేన? తాండవించును జగతి – ఓరిమొందు మటంచు జోలలూపు,

లోనదాగిన వాని ఏ జోలలూపెనో – యుగ గమనమును మరచి నిదుర నొరిగే!

గురుతెరుంగని దారి గమనింపు మని రవిని – వెన్నంటి నడువు మని శేఖరుడను,

వివిధ గతులను బొంది గమనించు గోళముల – వింత ఊయల కూర్చి పేర్చినావు,

ఉత్పన్న – నిమేషములు – ఉయ్యాల – జంపాల – ఊగి ఊరట నోద మనపినావు!

ఆద మరపేలమ్మ – ఆటయందలిశాము – జోల ఆటల యందు ధ్యాస ఉడిగే,

కాపు కాసెడి రెప్ప ఒల్లనని వేరుంది – చూపు ఆనక కనులు కలిగినాయి!

ఓరిమొందగ ఇపుడు ఒడిజేర్చుకోవమ్మ – కొత్త బొమ్మల కొలుపు కొంత ఆపు!

కొలువైన ప్రతి బొమ్మ కొత్తదనమును గోరి – వింత విధులన నిన్ను వెదుక జొచ్చె,

సమయ సంచారమన సమసి పోయెడి గురుతు- సావధానము నొంద దారి వెదకె!

ఆలాపనల రుచులు రసహీన మాయేను – క్రొత్త రాగపు పుంత సంతరించు!

ఓరిమొల్లని యుగము ఏలాగొ ఉదయించె – జోల పాటల విరుపు విఫలమాయె!

లోనున్న లోకేశు డులికి పడి మేల్కాంచు – మేలు కొలుపును నేడు ఆలపించు,

బొమ్మ భావము వీడి – తనయులై నడయాడు – తరిని తీరుగ మాకు తెలుపు తల్లీ!

సాధ్య – సాధన

సారధిగ నీవుండ సాధ్యంబదెటుగాదు – సాందీఫ సంతతిని కావలేదా?

శ్రీవత్సమై విజయ వక్షమందుడగా – వైరి మడియక మనపు మంత్రమేది?

నారసింహునివైన – నగకన్య పతివైన – నగరి నేలెడివాడ వీవెగాదా?

కినుకగొన కారణము కొల్లలైయున్ననూ – సందుజేసుక కరుణ జూపలేవా?

రాక్షసాంతకుడ వీవు – రక్షకుడ నీవు – రమరమించెడు రమ్య లోచనుడ నీవు!

భూరి మన్నన లీయ నీ తరము గాకున్న- మన్నింపగల రెవరు మహిన మమ్ము?

తగువాడనని ఎంచి తగిలితీ తనువందు – తరముగాకున్నదిక తారకంబు!

దినము గడపుటకైన దిక్కు తోచకయుంది – దేహ యాత్రను నడుప తోడునిమ్ము!

ఆదుకో అమ్మా!

దుఃఖ మెందుకు గల్గు గిరిరాజ కన్యా?

దేహ భాగములన్ని నీ వశమునుండా!

మనసు కోదండమట నీ కరములందూ,

పంచెంద్రియముల జ్ఞాన మంబు అట నీకు!

భవ బంధముల బాప పాశమెందులకు?

బహుపాశముల దునుమ కరవాలమేది?

అంకుశము ఏలమ్మ నీ కరములందు?

దిక్కుదోచని దీన దశను నేనుంటి!

భీతిగొని బడలితిని మతిమాలి యుంటి!

గత వైభవపు ఛాయ మరుగు నొందినది!

బహు పిన్నవాడనే – భ్రాంతి చెందాను

జన్మదారుల నడచి నిన్ను మరచాను,

సకల మందున నిండి సంచరించెడి నీవు,

మరువ తగునా నన్ను క్షణమొక్కటైనా?

మంద బుద్ధిని నేను మరచితిని నిన్ను,

మోహతిమిరపు వనుల వాసమెంచాను,

కార్చిచ్చు చుట్టినది నలు దిశలనుండి,

దారి జేసుక నన్ను దరిజేరు మమ్మా!

ఎన్నడో ఆ నాడు సృష్టి నెరపెడినాడు,

జలతారు నీకొంగు పట్టి ఆడిన ఆట,

ఒడి జేరి మురిపెమున ఆడి కుడిచిన కుడుపు!

ఎటుల మరచితి వమ్మ! తగువాడ నే గాన?

కరుణ కురిసెడి కనుల కాఠిన్య కాటుకను,

కడిగి జూడుము తల్లి – నీవాడనే నేను!

మతిమాలి, గతిమాలి, మరలి కృంగిన వాడ,

చేదుకొని చనుకుడుపు బడలి యున్నాడ!

సప్తగిరి వాసా

గోవింద నామమున నడయాడువాడు,

నామ మాలల పూజ నందుకొను వాడు,

అగరు చందన అత్తరు లమరున్నవాడు,

ఆనంద గపురపు ధాముడగువాడు!

సప్త గిరులను నడచి ఆలి జేరెడివాడు,

కాసు రాసుల రవము నలరారు వాడు,

కేశముల మారుగా కామితార్ధము దీర్చి,

భాగ్యవంతుని కైన – కడుపేద కైనా,

కడతేరు దారులను ఎరిగించు వాడు!

కలిమి గలిగిన వాడు కడతేర్చు వాడు,

కలి వేల్పుగా ఇలన వెలుగొందువాడు,

కాపు గాసెడివాడు కనతండ్రి వాడు,

కలిగించడే మాకు వరద భావమును!

సాధుజన సంచారి

సాధుజన సంచారి సరసుడని ఎంచేవు – సావధానము నొందు మనసా!

సమయ సారధి వాడు – సమవర్తి – అచలుండు – ఆనందరూపుడట తెలుసా?

గోపకాంతల జేరి గోరుముద్దలు మెక్కి – రాధికా మది దోచి ఆటలాడి,

మధరుకరిగెడినాడు మధుర హాసమె దక్క- ఊరడించెడి మాట మరచినాడు!

నగకన్య చై బట్టి నగరి నేలెడి వాని – నటవైభవపు తీరు తెలియరాదే!

అర్ధ దేహము బొంది అర్ధాంగి యగు అంబ – భక్తవరదుని ఇడుము లీడ్చుగాదే!

కోరికొలిచెడివాని కామితము చెల్లింప – తనయు తల తృంచగల తండ్రి వాడు!

కాము దేహము గాల్చి – కామించగల వాడు – కార్యకారణ సంధి దృంచువాడు!

నలవిసము నందుకొని కంఠమందున నిల్పి – లోకాల నిలుపగల ఒజ్జవాడు!

కాలి గజ్జెను కదిపి -డమరుకము మ్రోగించి – విలయ విన్యాసముల నెరపువాడు!

ప్రమధాధిపత్యముకు పందెమేసిన వాడు – తనయు సామర్ధ్యంబు నెరుగ లేడా?

శరణన్న గణపతికి ఉపదేశమందించి – విజయు జేసిన వాని వైనమెరుగు!

హరి మోహమున మునిగి మోహమొందెడి వాడు- మదను మాపినవాడు క్రోధి వాడు!

కామాక్షి కట్టడికి సర్వ మొడ్డిన వాడు – వల్లకాటిన వసతి నొందువాడు!

విష్ణు పాదపు వరద – తలను తాందవమాడ – తమక మొందెడివాడు అజుడు వాడు!  (అజుడు = ఋషి)

విషధరుడు – విజ్ఞాని – వైద్యనాధుడు వాడు – రూప రసముల తీరు లేనివాడు!

సాధుజన సంచారి సరసుడని ఎంచేవు – సావధానము నొందు మనసా!

సమయ సారధి వాడు – సమవర్తి – అచలుండు – ఆనందరూపుడట తెలుసా?

దేహము

నను- బొందియందురు, తనువనందురు, దేహముగ నన్నెరుక గొందురు,

అంగమెరుగని జీవి కంగమై అమరేను- ఆ అనంగుని సేవ నందజేయంగా!

పదములై నడచేను – కరములై కొలిచేను – కన్నులై కమలాక్షు ఛాయ చూపేను!

సన్నుతించెడి పలుకు పలుకగల రీతిగా – స్వరపేటికను కలిగి సహరించేను!

రుచులెరుంగని నేను జీవి మోదముగోరి – పలురసంబుల రుచుల నందగోరేను,

ఎగుడు దిగుడుల బాధ – వ్యాధి బాధ – వ్యాయామముల బాధ-వ్యధల బాధ,

ఎన్నగా నొల్లలేనెనెన్నొ బాధలను – జీవి సాంత్వనగోరి అంగమమరు!

కనరాని విందులను కనగోరు జీవికై – రెప్పపాటును ఆపి కనులు నిలిపి,

అలసటొందిన నాడు అరకు సేవన జేసి- నలిగి నడయాడుచూ మనుపు వాడ!

కాయకష్టము నాది – కడగండ్లు నావి – కామితంబుల కొలుపు కలిగున్న జీవునిది!

నాకవాసము గోరి – ఉపవాసముల నలుగ – జీవి ఆనతులంది నడచువాడ,

అది ఏమి చిత్రమో – మోహమెరుగని వాడు – వానినే మన్నించు- నన్నుగాదు!

నిర్మోహియగు వాని మోహమందున మునిగి – మన్ననెరుగని జీవి మరులు మరచి,

మరుభూమిలో నన్ను మడియంగ గాజేసి – మరలి పోవును మనగ మాధవునితో!

సాధుజన సంచారి

సాధుజన సంచారి సరసుడని ఎంచేవు – సావధానము నొందు మనసా!

సమయ సారధి వాడు – సమవర్తి – అచలుండు – ఆనందరూపుడట తెలుసా?

నగకన్య చై బట్టి నగరి నేలెడి వాని – నటవైభవపు తీరు తెలియరాదే!

అర్ధ దేహము బొంది అర్ధాంగి యగు అంబ – భక్తవరదుని ఇడుము లీడ్చుగాదే!

కోరికొలిచెడివాని కామితము చెల్లింప – తనయు తల తృంచగల తండ్రి వాడు!

కాము దేహము గాల్చి – కామించగల వాడు – కార్యకారణ సంధి దృంచువాడు!

నలవిసము నందుకొని కంఠమందున నిల్పి – లోకాల నిలుపగల ఒజ్జవాడు!

కాలి గజ్జెను కదిపి -డమరుకము మ్రోగించి – విలయ విన్యాసముల నెరపువాడు!

ప్రమధాధిపత్యముకు పందెమేసిన వాడు – తనయు సామర్ధ్యంబు నెరుగ లేడా?

శరణన్న గణపతికి ఉపదేశమందించి – విజయు జేసిన వాని వైనమెరుగు!

హరి మోహమున మునిగి మోహమొందెడి వాడు- మదను మాపినవాడు క్రోధి వాడు!

కామాక్షి కట్టడికి సర్వ మొడ్డిన వాడు – వల్లకాటిన వసతి నొందువాడు!

విష్ణు పాదపు వరద – తలను తాందవమాడ – తమక మొందెడివాడు అజుడు వాడు!  (అజుడు = ఋషి)

విషధరుడు – విజ్ఞాని – వైద్యనాధుడు వాడు – రూప రసముల తీరు లేనివాడు!

సాధుజన సంచారి సరసుడని ఎంచేవు – సావధానము నొందు మనసా!

సమయ సారధి వాడు – సమవర్తి – అచలుండు – ఆనందరూపుడట తెలుసా?

అందజేయుము – అంబ కరుణ

కరుణ వారాసివట – సర్వముకు సాక్షివట,

ఉచిత పధకము లెన్నొ కూర్చి పేర్చిన జగతి,

ఉనికొందినా నాడు – ఊహ బొందిన నాడు,

తొందరొందితి వేమొ తమక మొందితివేమొ,

జగదంబ కనుసన్న మోహ వాసనయందు,

వీసమైనా బాసి మననెంచ న నెంచితివొ!

ప్రాణమూదెడి నాడు పగవాడ నెంచితివొ,

పాల్కడలి పోటులకు పలుమారు ఉలికిపడి,

ఇడుము కారకుడంచు కినుక నొందేవో,

పన్నగుని పడగలకు అలుపు తోచిన నాడు,

విడచు ఊపిరి తూపు తాపమొసగిన నాడు,

విసుగొంది ఈ బొంది నందించినావో!

పలు ఫలంబులు గలిగి ఫలమేమి తండ్రీ

వాని నందెడి ఇచ్ఛ ఇగిరిపోయె!

రవి కిరణములు సోకి వికసించు కమలములు,

సహజ ధర్మము మరచి సొమ్మసిల్లె!

అనలమందిన హుతము అందరే దేవతలు,

కర్య కారణ క్రమము గతిని మరచే!

వీసమైనా లేని శాంతి నొందగ నేంచి,

వీధులంబడి తిరిగి విసిగినాడ!

వెలుగైన, రేయైన, ఉభయ సంధ్యలనైన,

సెగలు సోకెడి బ్రతుకు తగిలియుంటి!

అక్కరకు అందనీ ఆదరంబది ఏల?

అందజేయుము నాకు అంబ కరుణ!

దొంగవా?

దొంగవా

గొల్లపల్లెల దొంగవా? నువ్వ్ వెన్న ముంతల దొంగవా?

చల్లచిలికెడి గోపకాంతల – చెలువ మందెడి దొంగవా?

నీ పాద పీఠిక మదిన నిలుపుక – నిత్యపూజల జేయుచూ,

దినము గడిపెడి పుణ్యజీవుల – పుణ్యవర్జిత దొంగవా?   (పుణ్యవర్జితము = పాపము)

దివిజేంద్ర వంద్యుని వామభాగము – దొంగిలించిన దొంగవా?

దొరవు నీవని నమ్మిజేరెడి – విజిత మనసుల దొంగవా?

చేర రమ్మని, చేదుకొమ్మని, పిలువ నేర్వని షుష్క జీవుల,

మనసు నేలిడి వికట వెరపును – దోపిడెన్నడు జేతువో !

దోచుకొన దగినేది లేదని – దూరముంచకు గిరిధారా!

లేమియందున కలిగి యుండెడి – కలి కుత్సితంబుల దోచుమా!

దోపిడెందుకు దొరతనంబున – ఉన్న దారిన రావయా,

ఆయసము నీవొందబోకిక – పట్టు నన్నిక గట్టిగా!

విడువబోకిక ఎన్నడూ నను – చెరన జేర్చుము చెలునిగా!

చేవలేదని, చేతకాదని, చింత నొందకు చిన్మయా!

గురువు నీవై గురుతు దెలుపగ – ఎరుగ కుండుట సాధ్యమే!

అసాధ్య సాధన నెరుగువాడవు – సాకునన్నిక సామిగా!