ఒంటివాడవన నంటినా?

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

ఎల్ల లెరుగని ప్రేమ తత్వపు ఎరుక గరుపుమనంటిగానీ!

నే నొంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

నరునివై వానరుల గూర్చుక – వైరి మోహము మాపుచూ,

వాని తమ్ముని శరణు విన్నప మంది బ్రోచిన వాడవే!

సూర్య చంద్రులు తోడుగా – వన వనరులన్నిటి తోడుగా,

నిన్నె నమ్మిన జనక పుత్రిని – జేర సందియమేలయా?

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

ఎల్ల లెరుగని ప్రేమ తత్వపు ఎరుక గరుపుమనంటిగానీ!

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

ఏల రావని పంత మాడెటి దైత్య దనుజుల గావగా,

లంపటంబుల తగులు నాడే పంతమెరుగని వాడవే!

రాజభోగపు లాలసను విడి – ఆలిగా నీ సేవ జేయగ,

కోరి జేరిన కోమలాంగిని కొలుపు కంపగ పంతమా?

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

ఎల్ల లెరుగని ప్రేమ తత్వపు ఎరుక గరుపుమనంటిగానీ!

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

దారిజేసుక నిన్ను జేరెడి – రక్కసుల రవమణచగా,

మోహమెరుగని మధుర నగరినివాసివై కొలువుంటివే!

రేయిపగలని భేదమెంచక -తగు సమయమేదని వేచియుండక,

రెప్పపాటును ఒల్లకే- నిను తలచు గొల్లల జేరవేలనొ!

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

ఎల్ల లెరుగని ప్రేమ తత్వపు ఎరుక గరుపుమనంటిగానీ!

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

కోరి కొలిచెడి వారలను ఏ కారణంబుల నొల్లవో!

వైరి మనమున వెంట తగిలెడి వైనమేమని అందువో!

తేట తెలుపుము తీరుగా ఈ ప్రేమ తత్వపు  తీరునూ,

తారకంబగు భావ మోహము మరగు నొందక మనుపుమా!

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

ఎల్ల లెరుగని ప్రేమ తత్వపు ఎరుక గరుపుమనంటిగానీ!

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

భావరేఖ

మురళి మెచ్చిన రవమిదా? రేపల్లె నాడిన పదమిదా?

రాఘవుండై ధరణి నడచిన వాసుదేవుని ఉనికిదా?

ఏమరక నిత్యము ఉమా నాధుడు- తగిలి యుండెడి తలపిదా?

తారకంబని మునివరేణ్యులు – మునకలేసెడి మధువిదా?

రమ్యమని ఆ రమానాధుడు – మోదమొందెడి రసమిదా?

శారదై ఆ శ్యామలాంబిక – జగతికిచ్చిన సడి ఇదా?

రాధ కన్నుల జాలువారెడి – మధుర భావపు చినుకిదా?

గోపకాంతల గుండె సందడి గూర్చి పేర్చిన మాలిదా? (మాల ఇదా)

భూరి సంపద లీయగల ఈ భావరేఖల తెలుపగా,

తనువందు నిలచిన నెలత కెన్నడు – కరుణ గలుగునొ తెలుపుమా!

తారక నామ – శివా

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా,

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా!

పన్నగభూషణ పార్వతి వల్లభ – కైలాసాచల వాస -శివా,

కనికరమున మము కరుణన జూడుము – కాలంతక శ్రీసాంబ శివా!

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా,

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా!

శరణుకు శరణగు చరణ – శివా, తాండవ ప్రియ శ్రీసాంబ శివా,

సాలిగ్రామ నివాస శివా – నిను శరణని వేడెద – మనుపు -శివా!

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా,

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా!

హాలాహల హర పరమ శివా – హరి మానస వరదుడ సాంబశివా,

త్రిపురాంతక హర – త్రిపుర శివా – త్రిశూల ధారివి శరణు శివా!

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా,

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా!

నందీశాదుల వరద శివా – ఋషి యోచన లోచన – సాంబశివా,

యోగీశ్వర శ్రీ యోగ శివా – చండీశ్వరి ప్రియచరణ శివా!

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా,

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా!

గంగాధర – ధర జీవన పోషక – దాక్షిణ్యాలయ సాంబశివా,

దురిత దైత్యహర పరమశివా – దానవ పూజిత చరణ – శివా!

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా,

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా!

కామేశ్వరి ప్రియ పరమశివా – కరి కామిత వరదుడ – కరుణ శివా!

కామాంతక హర మోక్షశివా – హరి మోహము నొసగుము -మోహశివా!

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా,

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా!

నిగమాంతక నగ – వరద శివా – సాదర సాగర సాంబశివా,

పరచింతన చింతిత పరమశివా – గుణగణ వర్జిత వేద్యశివా!

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా,

భవ తారన తారక నామ – శివా, భవ తారన తారక నామ – శివా!

సంక్రాంతి-పొంగలి

సంక్రాంతి-పొంగలి

అంబుజోదరు దీవెనంది పొంగేటి బలిమి,

మీ ఇంటి లోగిళ్ళ నిండుగాక

హాసమే చెరకుగా చిందు బెల్లపు తీపి,

మీ ఇంట పొంగళ్ళ చేరుగాక

వాణి పలుకుల సరులు-గిరికన్య దేవెనలు,

కూర్చి అల్లిన తోర మమరుగాక,

లోకధినాధు నిల్లాలి కనుచూపు,

మీ ఇంట దీపమై వెలుగు గాక.

అన్వేషణ

అన్వేషణ

చల్ల కుండల నాడు గుమ్మడడిగేను,

అలుపు చెల్లక తిరుగు కవ్వమడిగేను,

కుదురు వీడక నిలచి తాడనము నోర్చేటి,

మట్టి కుండలు నీదు జాడలడిగేను!

పొదుగు జేరిన లేగ కుడుపు తొందరలోన,

పూవు జేరక తిరుగు తుమ్మెదల లోనా,

నిలకెడెరుగక మెదలు మలయముల ,

నీ తోడు తగులగల తీరు గాలింపే!

నీలి మేఘము జూచి ఆడదే నెమలి,

వెదురు బొంగుల దూరి పాడదే గాలి,

విరిమొగ్గ కనువిప్పి చూడదే వనినీ,

ఎదమాటు భావనలు పంచవేపగిదీ!

తార తమకము వీడి తేటకన్నులు పరచి,

పొద పొదను వెదికేను శశిమౌళి శిఖపువ్వు!

కమలముల కనులలో కనలేని ఛాయలను,

కను తరుల పరికింప భానుండు తరలే!

ఏ గోపకాంతలను గారవించేవో!

గోపెమ్మ శిక్షణకు కట్టుబడినావో!

రాధమ్మ నిను ఎటుల మరగు పరచేనో!

ముని జనులు నీ పదమ వీడకున్నారో!

జగమేలు వాడవే! జగములకు ధాతవే!

ఏనాడొ ఒక నాడు నీజాడ దెలియునని,

వేచియున్నీ కనుల వేదనను దీర్పగా,

ఎరుక గొలుపగ రాద నీ పదము జాడ!

మొలనూలు

మొలనూలు

మదనాంతకుని మహిషి – ముజ్జగంబుల మాత,

అంగాంగముల నమరు భూషణంబుల శోభ,

ముదిమమరగా మదిన మాన్యులెంచేరు!

ముచ్చటింపవె మనస మొలనూలు సొగసు,

చిగురు పదముల గూర్చి చెలువంబు చింద!

కలహంస కదలికల వయ్యారముల నొలుకు,

సుకుమారమౌ నడిమి నలుగు నేమోయంచు,

చిట్టి చినుకుల బోలు చిరు మువ్వలను గూర్చి,

మెరుపు తీగల నల్లి అమరినా మొలనూలు,

 

మయుని ఊహన ఊహ మొలిపించు తీరుతో,

దేవ కాంతలు మొచ్చు అమరికల కూర్పుతో,

ఋుతువు కొక శోభగా భాసించు వైనమున,

కూర్పునమరిన మణుల వెలుగు కాంతులతో,

చేతనత్వపు రాణి చెలిమొంది చేతనము,

మీట మీటన నిండి నర్తించు మొలనూలు,

కాంచగల కల్పనను రూపుగట్టవె మనసా,

పుణ్య ఫలముల మూట నేడు పండంగా!

ముక్కోటి – ఏకాదశి

ముక్కోటి – ఏకాదశి

జీవ నాడుల యందు నడయాడు వాడు,

జేరునట ఈనాడు ఊర్ధ్వ ద్వారమును!

ఏలు వాడిని జేరి మన్నించు తరినీ,

మన్న నెంచరె జనులు మోహనుని దలచి!

ఇంద్రియము లన్నింట మనసు నమరించి,

మధుసూధనుని పూజ తీరుగా జేసి ,

లోక రక్షకు లీల నోరార నుడివి,

కోటి కొక నాడైన ప్రాణేశు గనరే!

తనువు తగిలిన వారు తుదిలేని వారు,

శాంతి సుఖముల సురను హరియించినారు,

అసుర భావన బాపు పరమేశు పదము,

ఉత్తరపు ద్వారమున తగులునట నేడు!

మధికైటభుల భిక్ష ముక్కోటి రోజు,

మాధవుడు మన్నించి మమ్మేలు రోజు,

లబ్ధ పుణ్యులు మోక్షమందగల రోజు,

ఉత్తరపు ద్వారంబు దారిచ్చు రోజు!

దానవులు, రక్కసులు, పేరేది యైనా,

మనుజ పురమున జేరి మోదించవారే!

సిరి జోల లాలనల మైమరచు వాడా!

మేలు కోరగ మాది – మేలుకొను మయ్యా!

 

తెప్పరిల్లు!

వాగ్దేవి వల్లాభా – అలుపేల కలుగదో!

నిను గన్న నీ తండ్రి జోలలూగే!

నిటలాక్షునిల్లాలు నీరసించెను జూడు,

సామ్యమెరుగని సంతు ధరణి నిండె!

అంగశోభల వాసి అంతరించిన మేను,

అంతరంగపు వెలుగు లెటులెరుగ నెంచు?

వసుమతికి భారమై నడయాడు జీవులను,

అంపగా నీకెటుల మనసు జెల్లు?

వేదనాదములన్ని వేదనల గొన్నాయి,

వ్యాసుడెరుగని శృతులు వదరుచున్నాయి,

వన్నె తరిగిన వసుధ వల్లకాటిగమారె,

నందీశు నాధునిక రయము నంపు!

దైత్య పాలనె గాని దైవ జాడలు లేవు,

నరులు వానరులన్న సీమ సమసే!

సస్యముల సారములు సన్నగిల్లెను జూడు,

పోషణన్నది కుడుప ధాత్రి అలసె!

ఆవలింతల నడుమ నడిపించు ఈ క్రతువు,

క్రమమ మరిపించినది  – వాణి నడుగు!

పొంతనెరుగని సొరుగు జొచ్చిమే మలసేము,

తొలగు దారుల తెలిపి తెప్పరిల్లు!

హరిహరులు యోగించి హరియింప లేనట్టి,

కాలకూటపు పొందు జగమెల్లనిండింది,

తొందరింపుము దేవ శివుని శక్తిని తలుప,

ఆ  వరద ఉప్పెనై నిను ముంచునేమో!