ఎరుక గాంచినయంత ఎరుగొందు వాడవట,
ఎమనెరుగుదు నిన్ను ఎరుకైన వాడా!
ఎరుక గరిపిన మేర కెరుగ గలనేగాని,
ఎరుగ తరమే నీదు ఎరుక విదితముగా!
ఎదమాటుగా మసలి ముదమార జగతిలో,
ప్రతిఫలించెడి సొగసు ఎరుగు మందువు నన్ను,
సొగసులో అమరున్న సొయగంపుల సొగసు,
సొంతమగు నీ సొగసు ఎరుగు రీతెరిగించు!
ఎరుక గరిపిన మేర కెరుగ గలనే గాని,
ఎరుగ తరమే నీదు ఎరుక విదితముగా!
బాల భానుని లేత కిరణ వైభవముందు,
పొంగారు కనకమును మకుటముగ జేసికొని,
మురిసిపోయెడి మొలక పచ్చికల పైటలో,
ఒదిగున్న ధరణి నీ మోహమెరిగించేను!
ఎరుక గరిపిన మేర కెరుగ గలనేగాని,
ఎరుగ తరమే నీదు ఎరుక విదిగముగా!
ఎదుగు భానుని వెంట ఎదిగేటి వెలుగులో,
మొలచి సాగెడు కరము కమలముల జేరి,
కలయైన ఈ జగతి కనులార గాంచుమని,
పలు శోభలన వెలుగు నీ శోభనెరిగించు!
ఎరుక గరిపిన మేర కెరుగ గలనేగాని,
ఎరుగ తరమే నీదు ఎరుక విదితముగా!
తరువులను పురములను పలు స్పందనలను,
భావ చలనమెగాని చలనమెరుగని గిరుల,
తన కిరణముల నాటి – నాటి క్రతువుల గరిపి,
కర్మ వైభవపెరుక ఎరిగించు కార్యములు!
ఎరుక గరిపిన మేర కెరుగ గలనేగాని,
ఎరుగ తరమే నీదు ఎరుక విదితముగా!
యుగయుగంబుల నుండి ఎడతెరిపి లేకనే,
పలుతెరంగుల వెలుగు పరచు భానుండు,
పలుమారు తాడించి ఎరుక గొనగానేదొ ,
యత్నించు యత్నముల గమ్యమేదను ఎరుక!
ఎరుక గరిపిన మేర కెరుగ గలనేగాని,
ఎరుగ తరమే నీదు ఎరుక విదితముగా!
పాంచభౌతిక పురపు మువ్వన్నె సౌధమున,
ఆగామి సంచితపు నడుమలో నడయాడు,
బీజ ప్రాకారమును భేదించు తరి ఎరుక,
ఎరుకగొనకే అలసి ఎరిగించు నీ శక్తి!
ఎరుక గరిపిన మేర కెరుగ గలనేగాని,
ఎరుగ తరమే నీదు ఎరుక విదితముగా!
అవని వాసమునందు అలసటాయేను,
ఆదమరపే నేడు ఆనతాయేను,
నీ సంతు సంతుగా ధరణి కరిగాను,
నీదు పుత్రుడ నేను అల్పునెటులౌదు?
ఎరుక గరిపిన మేర కెరుగ గలనేగాని,
ఎరుగ తరమే నీదు ఎరుక విదితముగా!
అద్దరికి ఇద్దరికి ఆటగా పరుగిడుచు,
అంతరంగపు తలుపు తలుపలేనైతి,
సర్వమెరిగిన నీవు సరసుడవు నీవు,
ఉధ్ధతోందుమొ నీవు ముజ్జగము లెరుకగా!
ఎరుక గరిపిన మేర కెరుగ గలనేగాని,
ఎరుగ తరమే నీదు ఎరుక విదిగముగా!
ఎరుక గాంచిన యంత ఎరుగొందు వాడవట,
ఎమనెరుగుదు నిన్ను ఎరుకైన వాడా!